న్యూఢిల్లీ: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టి(అజిత్ పవార్) అధ్యక్షుడు అజిత్ పవార్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గడియారం గుర్తును అజిత్ పవార్ వాడుకోవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే, ఈ గుర్తు వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉన్నట్లు ప్రచార సామగ్రిపై ముద్రించాలని సూచించింది.
ఈ మేరకు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గడియారం గుర్తుపై అజిత్ పవార్ వర్గం, శరద్ పవార్ వర్గం మధ్య మొదలైన వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ఎన్నికల ప్రచారంలో ఈ గుర్తును అజిత్ పవార్ వర్గం ఉపయోగించుకోకుండా ఆదేశించాలని కోరుతూ శరద్ పవార్ వర్గం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గడియారం గుర్తుతో శరద్ పవార్‌కు ఎంతో అనుబంధం ఉంది.
గుర్తు విషయంలో ప్రజల్లో గందరగోళానికి తావు లేకుండా అజిత్ పవార్ వర్గానికి కొత్త గుర్తు కేటాయించాలని శరద్ పవార్ వర్గం సూచించింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం గడియారం గుర్తును అజిత్ పవార్ వర్గం ఎన్నికల ప్రచారంలో వాడుకోవచ్చంటూ తేలి్చచెప్పింది. అయితే, ఎన్నికల ప్రచారంలో శరద్ పవార్ వర్గానికి నష్టం కలుగకుండా హామీ పత్రం సమర్పించాలని అజిత్ పవార్ వర్గాన్ని కోర్టు ఆదేశించింది. తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే తదుపరి చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పింది. తదుపరి విచారణను నవంబర్ 6వ తేదీకి వాయిదా వేసింది. ఎన్సీపీ రెండుగా చీలిపోగా అజిత్ వర్గానికి గడియారం గుర్తును ఈసీ కేటాయించింది.
Comments
Please login to add a commentAdd a comment