ముంబై: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మహాయుతి శ్రేణులు సంబురాల్లో మునిగిపోయాయి. ఫలితాలు వన్‌సైడెడ్ కావడంతో.. ఇక ప్రభుత్వ ఏర్పాటుపైకి అందరి దృష్టి మళ్లింది. మహారాష్ట్ర శాసనసభ గడువు నవంబర్ 26వ తేదీతో ముగియనుంది. దీంతో ఆలోపు ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అయితే.. ఇంతలోపే సీఎం పీఠం ఎవరికి దక్కబోతుందనే చర్చ మొదలైంది.
మహారాష్ట్రలో షిండే వారసుడి ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. కూటమికి సంబంధించిన మూడు పార్టీల నుంచి.. ముగ్గురు కీలక నేతలు రేసులో ఉన్నారు. ఏక్‌నాథ్ షిండేనే కొనసాగిస్తారా? లేదంటే దేవేంద్ర ఫడ్నవిస్‌ను చేస్తారా? ఇవేవీ కాకుంటే.. ‘మహా’కు సీఎం కావాలన్న అజిత్ పవార్ ఆశయం నెరవేరుతుందా? అనే చర్చ నడుస్తోంది. అయితే..
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటునకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 145. సోలోగానే బీజేపీ 100కిపైగా సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో ఆ పార్టీ తరఫున దేవేంద్ర ఫడ్నవిస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ అంచనాకు తగ్గట్లు.. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్ బాధ్యతలు స్వీకరిస్తారని బీజేపీ నేత ప్రవీణ్ ధరేకర్ చెబుతున్నారు. రేపు మహారాష్ట్ర బీజేఎల్పీ సమావేశం జరగనుందని చెప్పారాయన. ఆ ప్రకటన వెలువడిన వెంటనే.. ఫడ్నవిస్ అనుచరులు టపాసులు కాల్చి.. మిఠాయిలు పంచుకుని సంబురాలు చేసుకున్నారు.
మరోవైపు.. షిండే ఫిటింగ్ మొదలైంది. గెలుపు సంబురాల్లో మీడియాతో సీఎం ఏక్‌నాథ్ షిండే మాట్లాడారు. అతిపెద్ద పార్టీకి సీఎం పదవి ఇవ్వాలనే రూల్ ఏం లేదు కదా అన్నారు. సీఎం పదవికి, సీట్లకు ఏం సంబంధం అన్నారు. అలాగే.. కూర్చుని మాట్లాడుకుని సీఎంను నిర్ణయిస్తామని అన్నారాయన. మరోవైపు ఆయన తనయుడు శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ.. గెలుపులో శివసేన పాత్రే సింహభాగం ఉందని, తన తండ్రే సీఎం కావాలని అంటున్నాడు.
అదే టైంలో.. అజిత్ పవార్ వర్గం కూడా తమ నేతకే సీఎం పదవి ఇవ్వాలని అంటోంది. ప్రజలు అజిత్ పవార్‌ను సీఎంగా చూడాలని అనుకుంటున్నారని ఆయన భార్య సునేత్ర అంటున్నారు. ప్రభుత్వ ఏర్పాటునకు సమయం పెద్దగా లేకపోవడంతో మహారాష్ట్ర సీఎం ఎవరనేది హైడ్రామాను తలపించే అవకాశమూ లేకపోలేదు.
ఇదీ చదవండి: మహారాష్ట్రలో ఎన్డీయే గెలుపునకు అసలు కారణం అదేనా?
Comments
Please login to add a commentAdd a comment