ఉద్దవ్ ఠాక్రేకే పీఠం..
ముంబై: మహారాష్ట్ర రాజకీయ డ్రామా క్లైమాక్స్‌కు చేరుకుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేకు మార్గం సుగమమైంది. ఠాక్రే కుటుంబ తొలి సీఎంగా నవంబర్ 28న శివాజీ పార్క్‌లో ఉద్ధవ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దాదాపు నెల రోజులుగా అనూహ్య, ఉత్కంఠ భరిత మలుపులతో సాగుతున్న ‘మహా’నాటకంలో మంగళవారం మరిన్ని కీలక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఫడ్నవీస్ ప్రభుత్వం బుధవారం సాయంత్రంలోగా అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలని మంగళవారం ఉదయం సుప్రీంకోర్టు ఆదేశించడంతో ప్రారంభమైన కీలక ఎపిసోడ్.. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల కూటమి ‘మహారాష్ట్ర వికాస్ అఘాడి’సేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేను తమ నేతగా, తదుపరి సీఎంగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో ముగిసింది. ఆ తరువాత ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతుతో తన నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమంటూ గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీకి ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. ఈ మధ్యలో పలు ముఖ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన కాసేపటికి డిప్యూటీ సీఎం పదవికి ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్ పవార్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఆ తరువాత సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు మధ్యాహ్నం 3 గంటల సమయంలో దేవేంద్ర ఫడ్నవీస్ విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఎన్సీపీ శాసనసభా పక్ష నేతగా తనకు 54 మంది ఎమ్మెల్యేల మద్దతుందని అజిత్ పవార్ చెప్పడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని, అయితే, అజిత్ రాజీనామా చేయడంతో మెజారిటీకి అవసరమైన సంఖ్యాబలం తమవద్ద లేకపోయిందని, అందువల్ల రాజీనామా చేస్తున్నానని బీజేపీ నేత ఫడ్నవీస్ వివరించారు. అనంతరం, రాజ్‌భవన్‌కు వెళ్లి, గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీకి రాజీనామా లేఖను అందించారు. ఈ లోపు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బీజేపీ ఎమ్మెల్యే కాళీదాస్ కొలాంబ్కర్‌ను గవర్నర్ ప్రొటెం స్పీకర్‌గా నియమించారు.
కాళీదాస్ కొత్తగా ఎన్నికైన 288 ఎమ్మెల్యేలతో బుధవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఫడ్నవీస్ రాజీనామా అనంతరం, శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ముంబై శివార్లలోని ట్రైడెంట్ హోటల్‌కు చేరుకున్నారు. అక్కడ సేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు ఆయా పార్టీల శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అక్కడ జరిగిన కార్యక్రమంలో మూడు పార్టీల కూటమి ‘మహా వికాస్ అఘాడి’నేతగా ఉద్ధవ్ ఠాక్రేను ఎన్నుకున్నారు. దాంతో, మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఆయనే కానున్నారు. ఉద్ధవ్ తండ్రి, శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే హయాం నుంచి ఠాక్రే కుటుంబం దశాబ్దాలుగా మహారాష్ట్రలో చక్రం తిప్పుతున్నా.. ప్రభుత్వ పదవిని ఠాక్రే కుటుంబం చేపట్టడం ఇదే ప్రథమం కానుంది.
ఎన్సీపీ నేత జయంత్ పాటిల్, కాంగ్రెస్ నాయకుడు బాలాసాహెబ్ తోరట్ ఉప ముఖ్యమంత్రులుగా నియమితులయ్యే అవకాశముందని ఆయా పార్టీల అంతర్గత సమాచారం. ఉద్ధవ్ ఠాక్రే సీఎం కానుండటంతో రాష్ట్రవ్యాప్తంగా శివసేన కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ముంబైలోని బీజేపీ ప్రధాన కార్యాలయం ముందు కూడా సేన శ్రేణులు బాణాసంచా కాల్చి, ఠాక్రే అనుకూల నినాదాలతో హోరెత్తించారు. కాగా, మూడు పార్టీలు ప్రభుత్వ విధానాన్ని ప్రతిబింబించే కనీస ఉమ్మడ ప్రణాళిక(కామన్ మినిమమ్ ప్రొగ్రామ్)పై కూడా ఒక అంగీకారానికి వచ్చారని సేన వర్గాలు తెలిపాయి. కూటమి పేరును ‘మహారాష్ట్ర వికాస్ అఘాడీ’గా నిర్ణయించారని పేర్కొన్నాయి.
కక్ష సాధింపు ఉండదు
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఢిల్లీ వెళ్లి పెద్దన్నయ్యను కలుసుకుంటానని, ప్రధాని నరేంద్రమోదీ పేరును నేరుగా ప్రస్తావించకుండా, ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఉద్ధవ్ ఠాక్రేను తన చిన్న తమ్ముడిగా మోదీ అభివర్ణించిన విషయం తెలిసిందే. అలాగే, తమ ప్రభుత్వానికి ఎవరిపైనా పగ, ప్రతీకారం లేవని ఎవరిపై కక్షసాధింపు చేపట్టబోమని స్పష్టం చేశారు. ట్రైడెంట్ హోటల్లో జరిగిన కూటమి ఎమ్మెల్యేల భేటీలో ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీకి ఉద్ధవ్ ఠాక్రే కృతజ్ఞతలు తెలిపారు. ‘వేర్వేరు సిద్ధాంతాలున్న పార్టీలు నేడు కలిశాయి. 30 ఏళ్లు స్నేహితులుగా ఉన్నవారు మమ్మల్ని నమ్మలేదు. ఎవరికి వ్యతిరేకంగా 30 ఏళ్లు పోరాడామో వారు మమ్మల్ని విశ్వసించారు. ఈ ప్రభుత్వం మాదని ప్రతీ సామాన్యుడు అనుకునేలా పాలన సాగిస్తాం’అన్నారు. ఈ సందర్భంగా శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రేను శరద్ పవార్ గుర్తు చేశారు. ‘రాజకీయంగా ప్రత్యర్థులమైనా.. వ్యక్తిగతంగా మేమిద్దరం మంచి స్నేహితులం’అన్నారు.
నవంబర్ 28న శివాజీ పార్క్‌లో
కూటమి నేతగా ఉద్ధవ్ ఠాక్రేను ఎన్నుకున్న అనంతరం కూటమి నేతలు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీని కలుసుకున్నారు. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని పేర్కొంటూ, కూటమి పార్టీలతో పాటు, ఇతర ఎమ్మెల్యేల మద్దతు పత్రాలను అందించారు. మెజారిటీ నిరూపించుకునేందుకు అవసరమైన లేఖలను సమర్పించేందుకు గవర్నర్ ఉద్ధవ్ ఠాక్రేకు డిసెంబర్ 3వ తేదీ వరకు సమయమిచ్చారు.
గవర్నర్‌ను కలిసిన వారిలో శివసేన నేత ఎక్నాథ్ షిండే, కాంగ్రెస్ నేత బాలాసాహెబ్ తోరట్, ఎన్సీపీ నేత జయంత్ పాటిల్, ఎస్పీ నేత అబూ అజం తదితరులున్నారు. అనంతరం, ఈ నెల 28న శివాజీ పార్క్ గ్రౌండ్లో ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేస్తారని శివసేన నేత ఒకరు వెల్లడించారు. మిగతా కేబినెట్ ప్రమాణ స్వీకారం త్వరలో ఉంటుందన్నారు. ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణస్వీకారం నవంబర్ 28వ తేదీన ఉంటుందని కాంగ్రెస్ నేత బాలా సాహెబ్ తోరట్ సైతం స్పష్టం చేశారు. అయితే, అంతకుముందు, కూటమి భేటీలో.. ప్రమాణ స్వీకారం డిసెంబర్ 1న ఉంటుందని శరద్ పవార్ ప్రకటించారు. కానీ గవర్నర్‌ను కలిసిన అనంతరం ప్రమాణ స్వీకార తేదీలో మార్పు చోటు చేసుకుంది.
కుటుంబ సెంటిమెంట్
అజిత్‌పవార్‌ను మళ్లీ ఎన్సీపీలోకి తీసుకువచ్చేందుకు పవార్ కుటుంబం తీవ్రంగా కృషి చేసిందని, అజిత్ తిరిగి ఎన్సీపీలోకి వచ్చేందుకు వీలుగానే శరద్ పవార్ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదని ఎన్సీపీ వర్గాలు తెలిపాయి. నవంబర్ 23న బీజేపీతో చేతులు కలిపి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి అజిత్ పవార్‌ను మళ్లీ వెనక్కు తీసుకువచ్చేందుకు ఎన్సీపీ నేతలు, పవార్ కుటుంబం అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అజిత్‌ను వెనక్కు రావాల్సిందిగా ట్వీటర్ వేదికగా పవార్ కుటుంబ సభ్యులు విజ్ఙప్తి చేసిన విషయం తెలిసిందే.
ప్రజలు మాకే అధికారం ఇచ్చారు
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమకే అధికారం అప్పగించారని, అయితే, కలిసి పోటీ చేసిన శివసేన అధికారం కోసం తమకు దూరమైందని రాజీనామా ప్రకటన సందర్భంగా దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శించారు. ఇకపై బాధ్యతాయుత ప్రతిపక్షంగా, అసెంబ్లీలో ప్రజా వాణిని వినిపిస్తామని అన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే స్థాయికి దిగజారలేమని వ్యాఖ్యానించారు. ‘అజిత్ పవార్ మీకు మద్దతివ్వడం శరద్ పవార్ వ్యూహంలో భాగమనుకుంటున్నారా?’అని ప్రశ్నించగా, ‘ఆ ప్రశ్న శరద్ పవార్‌ను అడగండి. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నానని అజిత్ పవార్ నాతో చెప్పారు’అని స్పందించారు.
ఈ సందర్భంగా శివసేనపై ఫడ్నవీస్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘ఎన్నికల ఫలితాలు బీజేపీ–శివసేన కూటమికి అనుకూలంగా వచ్చాయి. ఫలితాలు పూర్తిగా వెలువడక ముందే అధికారం కోసం ఎవరితోనైనా కలుస్తామని సేన నేతలు వ్యాఖ్యానించారు. ఆ తరువాత మాతో అబద్దాలు చెబుతూ.. వేరే పార్టీలతో చర్చలు ప్రారంభించారు. హిందూత్వ సిద్ధాంతాలు చెప్పే శివసేన ఈ రోజు సోనియాగాంధీ ముందు మోకరిల్లింది. ఆమె పేరుతో ప్రతిజ్ఞలు కూడా చేశారు’అని విమర్శించారు. ఎన్నికల ఫలితాలను, పోటీ చేసిన స్థానాలను, గెలిచిన సీట్లను విశ్లేషిస్తే.. బీజేపీనే మళ్లీ అధికారంలోకి రావాలని మహారాష్ట్ర ప్రజలు కోరుకున్నట్లు స్పష్టమవుతుందన్నారు.
ఐదేళ్లు ఉద్ధవ్ ఠాక్రేనే
ఫడ్నవీస్ రాజీనామా అనంతరం శివసేన నేత, ఎంపీ సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ.. ఉద్ధవ్ ఠాక్రే సీఎం కాబోతున్నారని, వచ్చే ఐదేళ్లు ఆయనే సీఎంగా ఉంటారని స్పష్టం చేశారు. ఎన్సీపీ నేత అజిత్ పవార్ మళ్లీ తమవైపే వచ్చారన్నారు. టైడెంట్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో కూటమి నేతగా, తదుపరి సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే పేరును ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్ మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడు బాలాసాహెబ్ తోరట్ మద్దతు పలికారు. ఈ కార్యక్రమానికి శరద్‌పవార్‌తో పాటు ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్, కాంగ్రెస్ నేత అశోక్ చవాన్, సమాజ్‌వాదీ పార్టీ నేత అబూ అజం, స్వాభిమాని షేట్కారీ సంఘటన చీఫ్ రాజు షెట్టి తదితరులు హాజరయ్యారు. కానీ, ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్‌పవార్ మాత్రం హాజరుకాలేదు.
అసెంబ్లీ ప్రత్యేక భేటీ
మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశం బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. బుధవారం సాయంత్రంలోగా ఫడ్నవీస్ ప్రభుత్వం విశ్వాస పరీక్ష జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో, మంగళవారం బీజేపీ ఎమ్మెల్యే కాళీదాస్ కొలాంబ్కర్‌ను గవర్నర్ ప్రొటెం స్పీకర్‌గా నియమించారు. ఆయన బుధవారం ఉదయం కొత్త ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
శరద్ పవార్ ఇంటికి అజిత్
కాగా, తిరుగుబాటు చేసి బీజేపీ క్యాంప్‌తో చేతులు కలిపిన ఎన్సీపీ నేత అజిత్ పవార్ తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. శరద్ పవార్ ఇంటికి అజిత్ మంగళవారం రాత్రి వచ్చారు. ఆ తరువాత ఛగన్ భుజ్‌బల్, ప్రఫుల్ పటేల్ కూడా శరద్ పవార్ నివాసానికి వచ్చారు.