వీరిలో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రులు
మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్‌కూ తప్పని పరాజయం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్లు, చిన్న పార్టీల అభ్యర్థులతో పాటు ప్రధాన పార్టీలకు చెందిన పలువురు దిగ్గజ నేతలు కూడా ఓటమిని చవిచూశారు. తమకు మంచి పట్టు, ఓటు బ్యాంకు ఉన్న నియోజక వర్గాలలో విజయం ఖాయమని భావించి బరిలోకి దిగిన మహామహులు పరాజయభారాన్ని మోయక తప్పలేదు. తమకు తిరుగులేదని, ఎట్టి పరిస్థితుల్లో కచ్చితంగా గెలుస్తామని భావించిన కొందరు విజయోత్సవాలకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కానీ ఓటర్లు ఊహించని విధంగా తీర్పునివ్వడంతో వారంతా ఈ పరిస్థితిని జీర్ణించుకోలేకపోతున్నారు. విజయం తథ్యమనుకుని బరిలో దిగి ఓటమిని చవిచూసిన వారిలో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలుండగా మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, కొందరు మాజీ మంత్రులు కూడా ఉన్నారు.
సోలాపూర్ నార్త్‌సిటీ.. బీజేపీదే ఐదోసారీ
సోలాపూర్ సిటీ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే విజయ్ కుమార్ దేశ్‌ముఖ్ ఘనవిజయం సాధించారు. ఈ దఫా రాష్ట్రంలో మహా వికాస్ అగాఢీ తరపున కీలక నేతలు ముమ్మరంగా ప్రచారం నిర్వహించినప్పటికీ తన ప్రత్యర్థి ఎన్సీపీ(ఎస్పీ) అభ్యర్థి మహేష్ కోటేపై మాభైఒక్కవేల ఎనభైఎనిమిది ఓట్ల అధిక్యంతో గెలుపొందారు. ఈ గెలుపుతో వరుసగా ఒకే నియోజకవర్గం నుంచి ఐదుసార్లు గెలిచిన అభ్యర్థిగా విజయ్ కుమార్ దేశ్‌ముఖ్ రికార్డు సృష్టించారు.
బీజేపీ, మహాయుతి కూటమి కార్యకర్తలు ఈ ఎన్నికల్లో ప్రణాళికాబద్దంగా వ్యవహరించారని, ఈ మేరకు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారని విజయ్ కుమార్ దేశ్‌ముఖ్ ప్రశంసించారు. అన్ని వర్గాల మద్దతు వల్లే తన గెలుపు సాధ్యమైందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ, మహాయుతి కూటమి పదాధికారులు, కార్యకర్తలు చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి టపాకాయలు పేలుస్తూ గులాల్ జల్లుకుంటూ స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు.
వర్లీలో ఆదిత్య ఠాక్రే ఘనవిజయం
ముంబైలోని వర్లీ నియోజకవర్గంలో శివసేన (యూబీటీ) అభ్యర్థి ఆదిత్య ఠాక్రే ఘనవిజయం సాధించారు. తెలుగు ప్రజలు అత్యధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో 2019లో మొదటిసారిగా పోటీ చేసిన గెలిచిన ఆదిత్య ఈసారీ విజయం సాధించి తన పట్టును నిలుపుకున్నారు. శివసేన రెండుగా చీలిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా జరిగిన ఈఎన్నికల్లో శివసేన (యూబీటీ) నుంచి ఆదిత్య ఠాక్రే పోటీ చేయగా, శివసేన (శిందే) నుంచి మిలింద్ దేవ్రా ఆయనకు పోటీగా బరిలోకి దిగారు. ఇక మహారాష్ట్ర నవనిర్మాణసేన (ఎమ్మెన్నెస్) నుంచి సందీప్ దేశ్‌పాండే పోటీ చేశారు.
ఈ నేపథ్యంలో వర్లీలో ఆదిత్య ఠాక్రే విజయం కోసం స్వయానా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ జరిగింది. చివరకు 8,801 ఓట్ల మెజారీ్టతో ఆదిత్య ఠాక్రే తన ప్రత్యర్థి మిలింద్ దేవ్రాపై విజయం సాధించారు.
భివండీ రూరల్‌లో శాంతారామ్ మోరే హ్యాట్రిక్ విజయం
భివండీ: భివండీ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మహాయుతి కూటమి శివసేన (శిందే) అభ్యర్థి శాంతారామ్ మోరే హ్యాట్రిక్ విజయం నమోదు చేశారు. మహావికాస్ ఆఘాడీ కూటమి శివసేన(యూబీటీ) అభ్యర్థి మహాదేవ్ ఘటల్‌పై 57,962 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు.
చదవండి: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. ప్రాంతాలవారీగా వివరాలు
హోరాహోరీగా సాగిన కౌంటింగ్‌లో శాంతారామ్ మోరే 1,27,205 ఓట్లతో మొదటిస్థానంలో, మహాదేవ్ ఘటాల్ 69,243 ఓట్లతో రెండోస్థానంలో, జిజావు సంస్థ స్వతంత్ర అభ్యర్థి మనీషా ఠాక్రే 24,304 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. గత ఎన్నికల్లో రెండో స్థానంలో ఉన్న మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎమ్మెన్నెస్) అభ్యర్థి ఈసారి కేవలం 13, 816 ఓట్లు సాధించి నాలుగోస్థానంతో సరిపెట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment