Milind Deora
-
తిరుగు లేదనుకుంటే.. తిప్పిపంపారు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్లు, చిన్న పార్టీల అభ్యర్థులతో పాటు ప్రధాన పార్టీలకు చెందిన పలువురు దిగ్గజ నేతలు కూడా ఓటమిని చవిచూశారు. తమకు మంచి పట్టు, ఓటు బ్యాంకు ఉన్న నియోజక వర్గాలలో విజయం ఖాయమని భావించి బరిలోకి దిగిన మహామహులు పరాజయభారాన్ని మోయక తప్పలేదు. తమకు తిరుగులేదని, ఎట్టి పరిస్థితుల్లో కచ్చితంగా గెలుస్తామని భావించిన కొందరు విజయోత్సవాలకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కానీ ఓటర్లు ఊహించని విధంగా తీర్పునివ్వడంతో వారంతా ఈ పరిస్థితిని జీర్ణించుకోలేకపోతున్నారు. విజయం తథ్యమనుకుని బరిలో దిగి ఓటమిని చవిచూసిన వారిలో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలుండగా మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, కొందరు మాజీ మంత్రులు కూడా ఉన్నారు.సోలాపూర్ నార్త్‌సిటీ.. బీజేపీదే ఐదోసారీసోలాపూర్ సిటీ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే విజయ్ కుమార్ దేశ్‌ముఖ్ ఘనవిజయం సాధించారు. ఈ దఫా రాష్ట్రంలో మహా వికాస్ అగాఢీ తరపున కీలక నేతలు ముమ్మరంగా ప్రచారం నిర్వహించినప్పటికీ తన ప్రత్యర్థి ఎన్సీపీ(ఎస్పీ) అభ్యర్థి మహేష్ కోటేపై మాభైఒక్కవేల ఎనభైఎనిమిది ఓట్ల అధిక్యంతో గెలుపొందారు. ఈ గెలుపుతో వరుసగా ఒకే నియోజకవర్గం నుంచి ఐదుసార్లు గెలిచిన అభ్యర్థిగా విజయ్ కుమార్ దేశ్‌ముఖ్ రికార్డు సృష్టించారు.బీజేపీ, మహాయుతి కూటమి కార్యకర్తలు ఈ ఎన్నికల్లో ప్రణాళికాబద్దంగా వ్యవహరించారని, ఈ మేరకు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారని విజయ్ కుమార్ దేశ్‌ముఖ్ ప్రశంసించారు. అన్ని వర్గాల మద్దతు వల్లే తన గెలుపు సాధ్యమైందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ, మహాయుతి కూటమి పదాధికారులు, కార్యకర్తలు చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి టపాకాయలు పేలుస్తూ గులాల్ జల్లుకుంటూ స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు.వర్లీలో ఆదిత్య ఠాక్రే ఘనవిజయం ముంబైలోని వర్లీ నియోజకవర్గంలో శివసేన (యూబీటీ) అభ్యర్థి ఆదిత్య ఠాక్రే ఘనవిజయం సాధించారు. తెలుగు ప్రజలు అత్యధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో 2019లో మొదటిసారిగా పోటీ చేసిన గెలిచిన ఆదిత్య ఈసారీ విజయం సాధించి తన పట్టును నిలుపుకున్నారు. శివసేన రెండుగా చీలిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా జరిగిన ఈఎన్నికల్లో శివసేన (యూబీటీ) నుంచి ఆదిత్య ఠాక్రే పోటీ చేయగా, శివసేన (శిందే) నుంచి మిలింద్ దేవ్రా ఆయనకు పోటీగా బరిలోకి దిగారు. ఇక మహారాష్ట్ర నవనిర్మాణసేన (ఎమ్మెన్నెస్) నుంచి సందీప్ దేశ్‌పాండే పోటీ చేశారు. ఈ నేపథ్యంలో వర్లీలో ఆదిత్య ఠాక్రే విజయం కోసం స్వయానా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ జరిగింది. చివరకు 8,801 ఓట్ల మెజారీ్టతో ఆదిత్య ఠాక్రే తన ప్రత్యర్థి మిలింద్ దేవ్‌రాపై విజయం సాధించారు.భివండీ రూరల్‌లో శాంతారామ్ మోరే హ్యాట్రిక్ విజయం భివండీ: భివండీ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మహాయుతి కూటమి శివసేన (శిందే) అభ్యర్థి శాంతారామ్ మోరే హ్యాట్రిక్ విజయం నమోదు చేశారు. మహావికాస్ ఆఘాడీ కూటమి శివసేన(యూబీటీ) అభ్యర్థి మహాదేవ్ ఘటల్పై 57,962 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. చదవండి: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. ప్రాంతాలవారీగా వివరాలుహోరాహోరీగా సాగిన కౌంటింగ్‌లో శాంతారామ్ మోరే 1,27,205 ఓట్లతో మొదటిస్థానంలో, మహాదేవ్ ఘటాల్ 69,243 ఓట్లతో రెండోస్థానంలో, జిజావు సంస్థ స్వతంత్ర అభ్యర్థి మనీషా ఠాక్రే 24,304 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. గత ఎన్నికల్లో రెండో స్థానంలో ఉన్న మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎమ్మెన్నెస్) అభ్యర్థి ఈసారి కేవలం 13, 816 ఓట్లు సాధించి నాలుగోస్థానంతో సరిపెట్టుకున్నారు. -
నేను పిలిస్తే.. ఆయన పారిపోయారు : ఆధిత్య ఠాక్రేపై దేవ్రా సెటైర్లు
ముంబై: నేను పిలిస్తే ఆయన ఎందుకు పారిపోతున్నారో నాకు అర్ధం కావడం లేదంటూ శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రేపై ఎంపీ మిలింద్ దేవ్రా సెటైర్లు వేశారు.వచ్చే వారంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఆయా పార్టీల అభ్యర్థులు వారి ప్రత్యర్థుల్ని టార్గెట్ చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేలా సవాళ్లు ,విమర్శలు, ప్రతి విమర్శలతో కాకరేపుతున్నారు.ఈ తరుణంలో శివసేన (యూబీటీ) వర్లీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిత్య ఠాక్రేపై పోటీ చేస్తున్న సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్లీ అభ్యర్థి మిలింద్ దేవ్రా సెటైర్లు వేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మిలింద్ దేవ్రా.. కొన్ని రోజుల క్రితం, వర్లీ భవిష్యత్తు, ముంబై భవిష్యత్తు, మహారాష్ట్ర భవిష్యత్తుపై చర్చకు రావాలని ఆదిత్య ఠాక్రేని ఆహ్వానించాను. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆధిత్య ఠాక్రే ప్రజాస్వామ్యాన్ని నమ్ముతానని, దానిని బలోపేతం చేస్తున్నానని ప్రచారం చేశారు. ఇప్పుడే అదే విషయంపై చర్చకు రమ్మనమని పిలిచా. కానీ, తాను ప్రజాస్వామ్యానికి అనుకూలమని ఆదిత్య ఠాక్రే పారిపోతున్నారు. అలా ఎందుకు పారిపోతున్నారో? అని విమర్శలు గుప్పించారు. ఓట్లకు శివసేన (యూబీటీ) డబ్బు పంచుతోందని దేవ్రా ఆరోపించారు. నిన్న, అతని ఆదిత్య ఠాక్రే పార్టీ డబ్బు పంపిణీ చేస్తుందని, ఇందుకోసం పెద్ద మొత్తంలో సీసీటీవీ పుటేజీలను అమర్చిందన్నారు. ఇదే విషయం ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించే నాయకుడు ఆధిత్య ఠాక్రే’ అని దేవరా విమర్శలు గుప్పించారు. -
సేన vs సేన.. ఆదిత్య ఠాక్రేపై మిలింద్ దేవ్రా పోటీ
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెట్టాయి. గెలుపుపై అటు మహాయుతి, ఇటు మహా వికాస్ అఘాడీ కూటములు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. భాగస్వామ్య పార్టీలతో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక, ప్రచార పర్వాలతో ఎన్నికల వేడిని పెంచాయి. ముంబైలోని వర్లీ నుంచి మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే తనయుడు ఆదిత్య థాక్రే పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.తాజాగా ఆదిత్య ఠాక్రేకు వ్యతిరేకంగా మాజీ ఎంపీ మిలింద్ దేవ్రాను బరిలో దించాలని సీఎం ఏక్నాథ్ షిండే వర్గం శివసేన పార్టీ నిర్ణయించింది. ఉద్ధవ్ థాకరే వర్గం శివసేన పార్టీ అభ్యర్థిగా ఆదిత్య థాకరే నామినేషన్ దాఖలు చేసిన మరుసటి రోజే ఏక్నాథ్ షిండే పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. మిలింద్ దేవ్రా దక్షిణ ముంబై నుంచి ఇప్పటికే మూడు పర్యాయాలు ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. రాజ్ ఠాక్రేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ సేనకు చెందిన సందీప్ దేశ్‌పాండేతో కూడా వర్లీ నుంచి తలపడనున్నారు.కాగా ఆదిత్య థాకరే గురువారం వర్లి అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈసారి కూడా వర్లి ప్రజలు కచ్చితంగా తననే గెలిపిస్తారని ధీమా వ్యక్తంచేశారు. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ ఎన్నికల్లో అధికార మహాయుతి, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీల మధ్యనే ప్రధాన పోటీ ఉండనుంది. -
అలాంటి వాళ్లు కాంగ్రెస్ వీడాలనుకున్నా: రాహుల్ గాంధీ
కోల్‌కతా: కాంగ్రెస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉండేవారు తమ పార్టీలో నుంచి వెళ్లిపోయినా తమకు ఎటువంటి ఇబ్బంది లేదని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. శుక్రవారం రాహుల్ గాంధీ తాను చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ యాత్ర’లో భాగంగా పశ్చిమ బెంగాల్లో ‘డిజిటల్ మీడియా వారియర్స్’ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అస్సాంలో కాంగ్రెస్ పార్టీ పతనం, ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ.. హిమంత, మిలింద్ దేవరా వంటి వ్యక్తులు కాంగ్రెస్‌కు విడిచిపెట్టాలకున్నానని తెలిపారు. వారు పార్టీ నుంచి వెళ్లిపోవటం వల్ల ఇబ్బంది ఏం లేదన్నారు. వారి పార్టీ మార్పు సరైందేనని తెలిపారు. హిమంత విచిత్రమైన రాజకీయనాయుడని.. అతని వంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు సరిపోడని అన్నారు. అతను ముస్లింలపై చేసిన వ్యాఖ్యలు అందుకు నిదర్శనమని తెలిపారు. తాను రక్షించాలనుకుంటున్న విలువలకు అతని వ్యాఖ్యలు చాలా వ్యతిరేకమని చెప్పారు. ఇటీవల అస్సాం సీఎం హిమంత, రాహుల్ గాంధీ.. తీవ్రమైన విమర్శ, ప్రతివిమర్శలకు దిగిన విషయం తెలిసిందే. రాహుల్ ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ ద్వారా అస్సాంలో అలజడి సృష్టించాలని చూశారని విమర్శించారు. దీంతో అత్యంత అవినీతిపరుడైన సీఎం.. హిమంత అని రాహుల్ గాంధీ మండిపడ్డ విషయం తెలిసిందే. ఇటీవల మహారాష్ట్రలో కీలక నేత అయిన మిలింద్ దేవరా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేవలో చేరిన విషయం తెలిసిందే. ముంబై సౌత్ నియోజకవర్గానికి సంబంధించి.. ఇండియా కూటమి సీట్ల పంపకాల్లో అసంతృప్తికి గురై పార్టీ మారిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విలువలు లేని అటువంటి నేతలు వెళ్లిపోవటం అనేది ప్రతిపక్ష ఇండియా కూటమిపై కూడా ఎటువంటి ప్రభావం పడదని రాహుల్ గాంధీ తెలిపారు. చదవండి: karnataka: కాంగ్రెస్‌పై సొంత పార్టీ నేత తీవ్ర విమర్శలు -
ఛాయ్‌వాలా పీఎం.. ఆటోవాలా సీఎం: మిలింద్ దేవరా
ముంబయి: కాంగ్రెస్‌ను వీడి ఏక్నాథ్ షిండే వర్గంలో చేరిన సీనియర్ నేత మిలింద్ దేవరా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత రాజకీయాల్లో ప్రస్తుత మార్పులు సమానత్వ విలువల్ని కోరుకుంటున్నాయని చెప్పారు. టీ అమ్మేవారు ప్రధానమంత్రి స్థానంలో.. రిక్షా నడిపే వ్యక్తి మహారాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారని అన్నారు. ఈ మార్పు భారత రాజకీయాల్ని మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు. ఏక్నాథ్ షిండ్ సామర్థ్యంపై తనకు నమ్మకం ఉందని మిలింద్ దేవరా అన్నారు. ఆయన సారథ్యంలో రాష్ట్రం గణనీయంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తోందని చెప్పారు. "దేశంలోని అత్యంత కష్టపడి పనిచేసే, అందుబాటులో ఉండే సీఎంలలో ఏక్నాథ్ షిండే ఒకరు. మహారాష్ట్రలో అణగారిన వర్గాల పట్ల ఆయనకున్న అవగాహన, మౌలిక సదుపాయాలు మెరుగుపరచడానికి ఆయన చేసిన కృషి అభినందనీయం" అని ఆయన స్పష్టం చేశారు. "మహారాష్ట్రుల సంపన్నమైన భవిష్యత్తు కోసం షిండే ప్రయత్నాలతో ప్రేరణ పొందాను. ఆయన కృషికి మద్దతు ఇవ్వాలనుకుంటున్నాను. భారతదేశం కోసం నరేంద్ర మోదీ, అమిత్ షాల దూరదృష్టి నన్ను ఆకర్షించాయి." అని మిలింద్ దేవరా అన్నారు. "సృజనాత్మక ఆలోచనలకు విలువనిచ్చి, నా సామర్థ్యాలను గుర్తించే నాయకుడితో నేను పని చేయాలనుకుంటున్నాను. ఏక్నాథ్ షిండే నా సామర్థ్యాలను నమ్ముతారు." అని దేవరా అన్నారు. కష్టపడి పనిచేయడం వల్ల అసాధ్యమైన విషయాలు కూడా సాధ్యమవుతాయని పేర్కొన్నారు. మహారాష్ట్రలో కీలక నేత మిలింద్ దేవరా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో చేరిపోయారు. ఇండియా కూటమి సీట్ల పంపకాల్లో అసంతృప్తికి గురైన దేవరా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇదీ చదవండి: ‘ఏక్ భారత్...’కు ప్రతిబింబం పొంగల్: మోదీ -
విధేయతే లేదు.. కేవలం రాజకీయమే: సంజయ్ రౌత్
ముంబయి: కాంగ్రెస్ పార్టీని వీడిన మిలింద్ దేవరాపై శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గం నాయకుడు సంజయ్ రౌత్ విరుచుకుపడ్డారు. ప్రస్తుత రోజుల్లో అధికారం కోసం మాత్రమే రాజకీయాలు జరుగుతున్నాయని అన్నారు. పార్టీకి విధేయత అనేది ఉనికిలో లేదని చెప్పారు. మిలింద్ దేవరా తండ్రి మురళీ దేవరా గురించి కూడా ప్రస్తావిస్తూ.. పార్టీ కోసం ఏం చేయాలో తెలిసిన గొప్ప నాయకుడని కొనియాడారు. " విధేయత, భావజాలం వంటి అంశాలు ఇప్పుడు లేవు. రాజకీయాలు ఇప్పుడు కేవలం అధికారం గురించి మాత్రమే నడుస్తున్నాయి. నాకు మిలింద్ దేవరా తెలుసు.. ఆయన పెద్ద నాయకుడు. కాంగ్రెస్‌తో ప్రత్యేక అనుబంధం కలిగి ఉన్నారు." అని కాంగ్రెస్‌కు మిలింద్ దేవర రాజీనామా చేయడంపై రౌత్ మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికలకు ఇంకా నెలరోజుల ముందు మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి ప్రముఖ నాయకుడు మిలింద్ దేవరా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, శివసేన (యుబిటి)ల మధ్య సీట్ల పంపకాల చర్చలపై ఆయన కలత చెందినట్లు సమాచారం. 'రాజకీయ ప్రయాణంలో ముఖ్యమైన ముగింపు. నేను కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాను. పార్టీతో నా కుటుంబానికి 55 ఏళ్ల బంధాన్ని ముగించాను. ఇన్ని ఏళ్లుగా పార్టీ నుంచి నాకు మద్దతు తెలిపిన నాయకులు, సహచరులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.'అని పేర్కొంటూ ఎక్స్ వేదికగా మిలింద్ దేవరా పంచుకున్నారు. Congress leader Milind Deora resigns from the primary membership of Congress "Today marks the conclusion of a significant chapter in my political journey. I have tendered my resignation from the primary membership of Congress, ending my family’s 55-year relationship with the… pic.twitter.com/iCAmSpSVHH — ANI (@ANI) January 14, 2024 ముంబయి సౌత్ లోక్‌సభ స్థానం నుంచి మిలింద్ కాంగ్రెస్ తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2004, 2009 ఎన్నికల్లో గెలుపొందారు. కానీ 2014, 2019 ఎన్నికల్లో శివసేన నేత ప్రమోద్ సావంత్ చేతిలో ఓటమిపాలయ్యి రన్నరప్‌గా నిలిచారు. ఈ సారి ఇండియా కూటమి సీట్ల పంపకాల్లో భాగంగా సౌత్ ముంబయి లోక్ సభ స్థానాన్ని శివసేన(యూబీటీ)కి కేటాయించారు. దీంతో అసంతృప్తికి లోనైన మిలింద్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇదీ చదవండి: కాంగ్రెస్‌కు సీనియర్ నేత గుడ్ బై.. 55 ఏళ్ల పాటు పార్టీకి సేవలు.. చివరకు.. -
కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ.. సీనియర్ నేత గుడ్‌బై
Milind Deora.. ముంబయి: మహారాష్ట్రలో కీలక నేత మిలింద్ దేవరా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో నేడు చేరిపోనున్నారు. ఇండియా కూటమి సీట్ల పంపకాల్లో అసంతృప్తికి గురైన దేవరా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 'రాజకీయ ప్రయాణంలో ముఖ్యమైన ముగింపు. నేను కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాను. పార్టీతో నా కుటుంబానికి 55 ఏళ్ల బంధాన్ని ముగించాను. ఇన్ని ఏళ్లుగా పార్టీ నుంచి నాకు మద్దతు తెలిపిన నాయకులు, సహచరులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.'అని పేర్కొంటూ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. Congress leader Milind Deora resigns from the primary membership of Congress "Today marks the conclusion of a significant chapter in my political journey. I have tendered my resignation from the primary membership of Congress, ending my family’s 55-year relationship with the… pic.twitter.com/iCAmSpSVHH — ANI (@ANI) January 14, 2024 ముంబయి సౌత్ లోక్‌సభ స్థానం నుంచి మిలింద్ కాంగ్రెస్ తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2004, 2009 ఎన్నికల్లో గెలుపొందారు. కానీ 2014, 2019 ఎన్నికల్లో శివసేన నేత ప్రమోద్ సావంత్ చేతిలో ఓటమిపాలయ్యి రన్నరప్‌గా నిలిచారు. ఈ సారి ఇండియా కూటమి సీట్ల పంపకాల్లో భాగంగా సౌత్ ముంబయి లోక్ సభ స్థానాన్ని శివసేన(యూబీటీ)కి కేటాయించారు. దీంతో అసంతృప్తికి లోనైన మిలింద్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ మండిపాటు మిలింద్ దేవరా పార్టీ నుండి వైదొలగడంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ మండిపడ్డాడు. మిలింద్ దేవరా తండ్రి మురళీ దేవరాతో ఉన్న సుధీర్ఘ బంధాన్ని పంచుకున్నారు. "మురళీ దేవరాతో నాకు సుదీర్ఘ కాలంపాటు అనుబంధం ఉంది. మేము ఎంతో అభిమానంతో ఉండేవాళ్లం. ఆయనకు అన్ని రాజకీయ పార్టీలలో సన్నిహిత మిత్రులు ఉన్నారు. కానీ ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచే ధృడమైన కాంగ్రెస్‌వాది.తథాస్తు..!" అని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఇదీ చదవండి: ఇండియా కూటమికి ప్రధాని అభ్యర్థి అవసరం లేదు: శరద్ పవార్ -
కేజ్రీపై ప్రశంసలతో కాంగ్రెస్‌లో కోల్డ్‌వార్..
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎంగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రశంసల్లో ముంచెత్తిన కాంగ్రెస్ నేత మిలింద్ దియోరాపై ఆ పార్టీ నేత అజయ్ మాకెన్ మండిపడ్డారు. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం రాబడులను రూ 60,000 కోట్లకు రెట్టింపు చేసిందని, గత ఐదేళ్లలో రెవెన్యూ మిగులును కొనసాగిస్తోందని దియోరా కేజ్రీ సర్కార్‌పై ప్రశంసలు గుప్పిస్తూ ట్వీట్ చేశారు. అయితే దియోరా కాంగ్రెస్ పార్టీని వీడాలని, ఆ తర్వాత అర్థ సత్యాలను ప్రచారం చేసుకోవాలని మాకెన్ హితవు పలికారు. ముందుగా మీరు వాస్తవాలను తెలుసుకుని ఆపై ట్వీట్ చేయాలంటూ చురకలు అంటించారు. కాంగ్రెస్ హయాంలో 2015-16లో ఢిల్లీ రాబడి 14.87 శాతం పెరిగి రూ 41,129 కోట్లకు చేరుకున్న విషయం దియోరా గుర్తెరగాలని సూచించారు. కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ ఘనవిజయం సాధించగా బీజేపీ ఎనిమిది స్ధానాలకు పరిమితమవగా కాంగ్రెస్ ఖాతా తెరవని సంగతి తెలిసిందే. చదవండి : మఫ్లర్‌మాన్ సందడి క్రేజీ -
ఊర్మిళ రాజీనామాకు వారే కారణం!
ముంబై: బాలీవుడ్ నటి ఊర్మిల మంటోడ్కర్ రాజీనామాపై ముంబై కాంగ్రెస్ మాజీ చీఫ్ మిలింద్ దేవరా తాజాగా స్పందించారు. ఊర్మిళ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి నార్త్ ముంబై లీడర్లే కారణమని ఆయన విమర్శించారు. ఆమె రాజీనామాకు వారే బాధ్యత వహించాలన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఊర్మిళకు తాను మనస్ఫూర్తిగా సహకరించానని, ముంబై కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికల బరిలో ఆమెకు అండగా నిలబడ్డానని ఆయన పేర్కొన్నారు. ఊర్మిళను పార్టీలోకి తీసుకొచ్చిన నాయకులే ఆమెను రాజకీయంగా తొక్కేశారని, ఆ సమయంలోనూ ఆమెకు తాను మద్దతుగా నిలబడ్డానని చెప్పారు. ఆమె రాజీనామాకు ఉత్తర ముంబై కాంగ్రెస్ నాయకులే కారణమన్న వ్యాఖ్యలతో తాను వందశాతం ఏకీభవిస్తున్నట్టు చెప్పారు. మరోవైపు ప్రతి పార్టీలోనూ అంతర్గత విభేదాలు ఉంటాయని, ఊర్మిళ తన రాజీనామా నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ కోరారు. బాలీవుడ్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన రంగీలా ఫేమ్ ఊర్మిళ మటోండ్కర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే పార్టీలో చేరిన ఆమె అయిదు నెలలు తిరక్కముందే కాంగ్రెస్‌ను వీడారు. పార్టీలో అంతర్గత రాజకీయాలే తన రాజీనామాకు దారి తీశాయని ఆమె మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహారాష్ట్ర మాజీ మంత్రి కృపాశంకర్ సింగ్ కూడా పార్టీకి రాజీనామా చేశారు. ముంబై కాంగ్రెస్‌లో కీలక పదవుల్లో ఉన్నవారు చిత్తశుద్ధితో పార్టీ కోసం పని చేయడం లేదని, కాలానుగుణంగా పార్టీలో మార్పులు చేస్తూ కాంగ్రెస్ అభ్యున్నతికి కృషి చేసేవారు కరువయ్యారని ఊర్మిళ ఆరోపించారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేయడానికి తన మనసు అంగీకరించడంలేదన్నారు. -
‘దీపిక, రణబీర్ డ్రగ్స్ తీసుకుంటారు.. ఇదిగో సాక్ష్యం’
ముంబై : బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఇటీవల తన స్నేహితులకి ఇచ్చిన విందు రాజకీయ దుమారానికి దారి తీసింది. కొద్దిరోజల క్రితం కరణ్ తన స్నేహితులకు తన ఇంట్లో చిన్న పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి బాలీవుడ్ ప్రముఖులు దీపిక పదుకొణే, రణబీర్ కపూర్, షాహిద్ కపూర్, మీర్జా రాజ్‌పుత్, వరుణ్ ధావన్, నటాషా దలాల్, మలైకా అరోరా, అర్జున్ కపూర్ తదితరులు హాజరయ్యారు. వీరందరు సందడి చేస్తుండగా, వీడియోని తీసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు కరణ్. ఇప్పుడు ఆ వీడియో కాంట్రావర్సీగా మారింది. బాలీవుడ్ సెలబ్రీటీలంతా డ్రగ్స్ తీసుకుంటారని శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) ఎమ్మెల్యే మజీందర్ సింగ్ సిర్సా ఆరోపించారు. వారి రీల్ లైఫ్‌కి రియల్ లైఫ్‌కి చాలా తేడా ఉంటుందని, డ్రగ్స్‌ను సేవించామని గర్వంగా ఫీలవుతున్న బాలీవుడ్ సెలబ్రీటీలను చూడండంటూ కరణ్ జోహార్ తీసిన వీడియోను ట్విట్ చేశారు. #UDTABollywood - Fiction Vs Reality Watch how the high and mighty of Bollywood proudly flaunt their drugged state!! I raise my voice against #DrugAbuse by these stars. RT if you too feel disgusted @shahidkapoor @deepikapadukone @arjunk26 @Varun_dvn @karanjohar @vickykaushal09 pic.twitter.com/aBiRxwgQx9 — Manjinder S Sirsa (@mssirsa) July 30, 2019 కాగా మజీందర్ ఆరోపణలను కాంగ్రెస్ నేత మిలింద్ డియోరా ఖండించారు. వారు డ్రగ్స్ సేవించలేదని, అనవసరంగా ఇతరుల ప్రతిష్టతలను దిగజార్చేలా మాట్లాడొద్దని సూచించారు. ఇలాంటి అరోపణలు చేసినందుకు వీడియో ఉన్న బాలీవుడ్ ప్రముఖులందరికి భేషరుతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘ కరణ్ ఇచ్చిన పార్టీకి నా భార్య కూడా వెళ్లింది. అక్కడ ఎవరూ డ్రగ్స్ తీసుకోలేదు. దయచేసి ఇలాంటి అబద్దాలను ప్రచారం చేస్తూ.. ఇతరులను ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నించకండి. వారందరికి మీరు భేషరతుగా క్షమాపణ చెబుతారని ఆశిస్తున్నాను’ అని డియోరా ట్విట్ చేశారు. కాగా, వైరల్‌గా మారిన ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వాళ్లు డ్రగ్స్ తీసుకోలేదు సరదాగా పార్టీ చేసుకున్నారని కొందరు.. ఇది క్యాజివల్ పార్టీ కాదని, మందు పార్టీ అని మరి కొందరు ట్వీట్ చేస్తున్నారు. My wife was also present that evening (and is in the video). Nobody was in a “drugged state” so stop spreading lies & defaming people you don’t know! I hope you will show the courage to tender an unconditional apology https://t.co/Qv6FY3wNRk — Milind Deora मिलिंद देवरा (@milinddeora) July 30, 2019 -
రాజీనామా బాటలో రాహుల్ టీం
న్యూఢిల్లీ: పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో ఆయన బృందం (టీం రాహుల్) కూడా అదే బాట పడుతోంది.ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సింధియా, ముంబై రీజనల్ కాంగ్రెస్ అధ్యక్షుడు మిలింద్ దేవ్రాలు ఆదివారం తమ పదవులకు రాజీనామా చేశారు. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవ్ చాంద్ శనివారం రాజనామా చేయగా, ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు నితిన్ రాత్ అంతకు ముందే పదవి నుంచి వైదొలిగారు. యువశక్తితో పార్టీని పునరుత్తేజితం చేయాలన్న కోరితో రాహుల్ గాంధీ వీరిని ఏరి కోరి మరీ వీరికి కీలక పదవులు అప్పగించారు. రాహుల్ మార్గదర్శకత్వంలో నడిచి పార్టీకి పూర్వ వైభవం తేవాలన్న తపనతో వారు పెద్ద బాధ్యతల్ని తలకెత్తుకున్నారు.అయితే, ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ పేలవమైన పనితీరు కనబరచడం, ఎన్నికల ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో ఈ యువనేతల పని అగమ్యగోచరమయింది. అందుకే రాహుల్‌కు సంఘీభావంగా, పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ వీరు కూడా రాజీనామాలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, గోవా కాంగ్రెస్ అధ్యక్షుడు గిరీష్ చొదాంకర్, ఢిల్లీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేశ్ లిలోతియా కూడా పదవులకు రాజీనామా చేశారు. వీరంతా రాహుల్ బృందం సభ్యులే కావడం గమనార్హం. ‘రాహుల్ ఆశయ సాధన కోసమే మేం కాంగ్రెస్‌లో కీలక బాధ్యతలు చేపట్టాం. ఇప్పుడు ఆయన తప్పుకోవడంతో చుక్కాని లేని నావలయ్యాం. పార్టీలో మా భవిష్యత్తు ఏమిటో అర్థం కాక రాజీనామా చేశాం’అన్నారు ఓ యువ నాయకుడు. రాహుల్ హయాంలో నిశ్శబ్ధంగా ఉన్న సీనియర్లు ఇప్పుడు పార్టీలో కీలక పాత్ర పోషించేందుకు ముందుకొస్తున్నారు. రాహుల్ రాజీనామా విషయం, పార్టీ భవిష్యత్తుపై ఇటీవల జరిగిన చర్చల్లో అహ్మద్ పటేల్, గులాం నబీ ఆజాద్, మోతీలాల్ ఓరా, ఆనంద్ శర్మ,, భూపీందర్ సింగ్ హూడా వంటి తలనెరిసిన పెద్దలే పాల్గొన్నారు. ఇందులో యువ నాయకులెవరికీ అవకాశం కల్పించలేదు. కొత్త అధ్యక్షుడి ఎంపిక విషయంలో తాము జోక్యం చేసుకోబోమని రాహుల్ గాంధీ ఇప్పటికే స్పష్టం చేశారు. పార్టీ వర్కింగ్ కమిటీలో కూడా అంతా పెద్దలే ఉన్నారు. దీన్ని బట్టి పార్టీలో ముందుముందు వారిదే పైచేయిగా కనబడుతోంది. రాహుల్ బృందం రాజీనామాలకు ఇదీ ఒక కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. -
కాంగ్రెస్‌లో ఆగని రాజీనామాల పర్వం..!
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘోరపరాజయానికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ పదవి నుంచి తప్పుకున్నారు. తాజాగా ఆయన బాటలోనే మరికొంతమంది కాంగ్రెస్ సీనియర్ లీడర్లు పయనిస్తున్నారు. కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు జ్యోతిరాదిత్య సింధియా ఆదివారం స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. ముంబై కాంగ్రెస్ చీఫ్ పదవి నుంచి మిలింద్ డియోరా వైదొలగిన కొద్ది గంటల్లోనే సింధియా కూడా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ‘ప్రజాతీర్పును గౌరవిస్తున్నాను. పార్టీ ఓటమికి బాధ్యతవహిస్తూ.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నాను. రాహుల్ గాంధీకి రాజీనామా లేఖను పంపించాను’అని ట్వీట్ చేశారు సింధియా. జనరల్ సెక్రటరీగా పార్టీకి సేవచేసే అవకాశాన్నిఇచ్చినందుకు రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. అప్పుడే నిర్ణయించుకున్నాను... మిలింద్ డియోరా ముంబై కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడించారు. జూన్ 26న రాహుల్ గాంధీని కలిసినప్పుడే రాజీనామాపై నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ‘ముంబైలోని కాంగ్రెస్ నాయకులను ఒక్కటిచేసి.. పార్టీ బలోపేతానికి కృషిచేద్దామనుకున్నాను. ఆ ఉద్దేశంతోనే ముంబై కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టాను. రాహుల్‌తో చర్చించాక నేను కూడా రాజీనామా చేయాలనుకున్నాను’ అని డియోరా ఓ ప్రకటనలో చెప్పుకొచ్చారు. సార్వత్రిక ఎన్నికలకు ముందే ముంబై కాంగ్రెస్ చీఫ్‌గా మిలింద్ బాధ్యతలు తీసుకున్నారు. -
అంబానీ మద్దతుపై దుమారం
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ దక్షిణ ముంబై నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి మిలింద్ డియోరాకు బాహాటంగా మద్దతు ప్రకటించడం రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో చర్చనీయాంశమైంది. అంబానీ మద్దతు ప్రకటిస్తున్న వీడియోను డియోరా తన ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టారు. ‘పదేళ్లుగా దక్షిణ ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తున్న మిలింద్కు ఈ నియోజకవర్గానికి సంబంధించిన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులపై పూర్తి అవగాహన ఉందని నా విశ్వాసం. అందుకే ఈ నియోజకవర్గానికి మిలిందే తగిన వ్యక్తి’ అని అంబానీ అన్నట్టు ఆ వీడియోలో ఉంది. దేశంలోని బడా పారిశ్రామికవేత్తలెవరూ ఇంత వరకు ఒక పార్టీ అభ్యర్థికి బహిరంగంగా మద్దతు ప్రకటించడం జరగలేదు. అలాంటిది దేశంలోనే నంబర్‌వన్ పారిశ్రామికవేత్త అయిన అంబానీ ఒక అభ్యర్థికి, అదీ ప్రతిపక్ష పార్టీ అభ్యర్థికి మద్దతు ప్రకటించడం విశేషమేనని రాజకీయ నిపుణులు అంటున్నారు. రెండోసారి అధికారంలోకి రావాలని మోదీ ప్రయత్నిస్తున్న తరుణంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రతిపక్ష అభ్యర్థికి మద్దతు ప్రకటించడం అధికార బీజేపీకి ఇబ్బందికరమేనని వారు అభిప్రాయపడుతున్నారు. ముకేశ్ ప్రకటనపై బీజేపీ నేతలు నొసలు చిట్లిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో విమర్శిస్తున్నారు. కాగా, అంబానీ, డియోరా చిరకాల మిత్రులని, అందువల్ల అంబానీ ప్రకటనను మరో కోణంలో చూడాల్సిన పనే లేదని పారిశ్రామిక వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అంబానీ తండ్రి ధీరూభాయ్, డియోరా తండ్రి మురళీ మంచి మిత్రులు. వారి స్నేహం గురించి అప్పట్లో రాజకీయ వర్గాల్లో వేడివేడి చర్చ కూడా జరిగేది. ముకేశ్ తాజా నిర్ణయానికి అది కూడా కారణం కావచ్చునని ఆ వర్గాలు వివరించాయి. ముకేశ్ ఉన్న వీడియోలో కోటక్ మహీంద్ర బ్యాంకు ఎండీ ఉదయ్ కొటక్ కూడా ఉండటం గమనార్హం. రఫేల్ కుంభకోణంలో ముకేశ్ సోదరుడు అనిల్ అంబానీ ఇరుక్కోవడం తెలిసిందే. దక్షిణ ముంబై నియోజకవర్గంలో ఈ నెల 29న పోలింగ్ జరగనుంది. ఇక్కడ డియోరా, శివసేన అభ్యర్థి అరవింద్ సావంత్‌తో తలపడుతున్నారు. -
మిలింద్కు ముకేశ్ మద్దతు
ముంబై: సార్వత్రిక ఎన్నికల వేళ మహారాష్ట్రలో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. దక్షిణ ముంబై కాంగ్రెస్ అభ్యర్థి మిలింద్ దేవ్రాకు దేశంలోనే అత్యంత ధనికుడైన ముకేశ్ అంబానీ మద్దతు పలికారు. ‘మిలింద్ దక్షిణ ముంబై వ్యక్తి. ఈ నియోజకవర్గానికి సంబంధించి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులపై ఆయనకు లోతైన అవగాహన ఉంది’ అని ముకేశ్ అన్నారు. ‘దక్షిణ ముంబై అంటే వ్యాపారమే. ముంబైలో వ్యాపారాన్ని అభివృద్ధి చేయడంతో పాటు మన యువతకు ఉపాధి కల్పించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ముకేశ్ అంబానీ లేదా ఉదయ్ కొటక్‌లో ఎవరు మద్దతు తెలిపినా భారీ ప్రచారం లభిస్తుందని నాకు తెలుసు’ అని మిలింద్ అన్నారు. రఫేల్ వివాదంలో ముకేశ్ తమ్ముడు అనిల్ అంబానీని రాహుల్ విమర్శిస్తుండగా, కాంగ్రెస్ అభ్యర్ధికి ముకేశ్ మద్దతుపలకడం గమనార్హం. -
రాహుల్ బృందంపై కాంగ్రెస్‌లో విమర్శలు
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయంపై కాంగ్రెస్‌లోని ఓ వర్గం నేతలు ‘రాహుల్ బృందం’పై మాటల దాడికి దిగారు. రాహుల్ సలహాదారులు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోలేదని విమర్శించారు. పోల్ మేనేజ్మెంట్లో ఎటువంటి పాలనానుభవం లేని వ్యక్తులే కీలక నిర్ణయాలు తీసుకున్నారంటూ కాంగ్రెస్ నేత మిలింద్ దేవ్రా ట్విట్టర్లో విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో పార్టీ వైఫల్యంపై కలత చెందే తాను ఈ విమర్శలు చేస్తున్నానని...పార్టీపై తనకు అపార నమ్మకం ఉందన్నారు. పార్టీ తిరిగి పుంజుకోవాలన్నదే తన వ్యాఖ్యల వెనక ఉన్న ఉద్దేశమని చెప్పుకొచ్చారు. ఇకపై క్షేత్రస్థాయిలో పాలనానుభవం ఉన్న వారికే నాయకత్వ పదవులు ఇవ్వాలని సూచించారు. దేవ్రా వ్యాఖ్యలను పార్టీలోని సీనియర్ నేత సత్యవ్రత్ చతుర్వేది సమర్థించారు. పార్టీలోని సమస్యలు, లోటుపాట్లను సరిదిద్దుకునేందుకు నిష్కర్షగా, నిజాయితీగా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, ఏఐసీసీ కార్యదర్శి ప్రియాదత్ గురువారం పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిశారు. ప్రజలతో పార్టీ నేతలు మమేకం కాకపోవడం వల్లే మహారాష్ట్రలో పార్టీ దెబ్బతిన్నదని ఆమెకు వివరించారు. దేవ్రా, ప్రియాదత్లు లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలవడం తెలిసిందే. మరోవైపు ఈ నెల 24న ఢిల్లీలో జరిగే సమావేశంలో కాంగ్రెస్ పార్టమెంటరీ పార్టీ (సీపీపీ) చైర్‌పర్సన్‌గా సోనియా గాంధీ తిరిగి ఎన్నికయ్యే అవకాశం ఉంది. -
కాంగ్రెస్, ఎన్సీపీలను కూలదోసిన మహాకూటమి
సాక్షి, ముంబై: ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ శుక్రవారం సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అందరూ ఊహించినట్లుగానే రాష్ట్రంలో మోడీ హవాతో కాషాయ పార్టీల జోరు కొనసాగింది. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచే శివసేన, బీజేపీలు స్పష్టమైన మెజారిటీతో ముందుకు దూసుకుపోయాయి. తొలి నుంచి ద్వితీయ, తృతీయ స్థానాల్లో కొనసాగుతూ వచ్చిన కాంగ్రెస్, ఎన్సీపీలు చివరికి అదే స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలకుగాను బీజేపీ 23, శివసేన 18, ఎన్సీపీ 4, కాంగ్రెస్ 2, స్వాభిమాన్ శేత్కారీ సంఘటన ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. గత లోక్‌సభ ఫలితాలకు భిన్నంగా ఓటరు ఇచ్చిన తీర్పులో కాంగ్రెస్‌కు ఘోర పరాభవం ఎదురవగా ఎన్సీపీ పరిస్థితి చావుతప్పి కన్ను లొట్టపోయిన చందంగా మారింది. 17 మంది సిట్టింగ్ ఎంపీలున్న కాంగ్రెస్ ఈసారి చచ్చీ..చెడీ అతి కష్టంమీద రెండో లోక్‌సభ నియోజకవర్గాన్ని దక్కించుకోగలిగింది. ఎన్సీపీ పరిస్థితి కూడా అంతే.. గతంలో 8 లోక్‌సభ స్థానాలుండగా ఈసారి సగానికి తగ్గి నాలుగింటితో సరిపెట్టుకుంది. ఓ దశలో శివసేన, బీజేపీ, ఆర్పీఐ, స్వాభిమాన్ శేత్కారీ సంఘటన నేతృత్వంలోని మహాకూటమి రాష్ట్రంలో క్లీన్‌స్వీప్ చేస్తుందా? అన్న అనుమానాలు కలిగాయి. ముంబై, కోంకణ్ లతోపాటు ఉత్తర మహారాష్ట్ర, విదర్భ, మరాఠ్వాడాలలో మహాకూటమి విజయకేతనం ఎగురవేసింది. ఎన్సీపీ పట్టుందని భావించే పశ్చిమ మహారాష్ట్రలో కూడామహాకూటమి తనదైన మెజార్టీతో దూసుకుపోయింది. గతంలో శివసేనను వీడి కాంగ్రెస్, ఎన్సీపీల్లోకి వెళ్లినవారందరికి ఈసారి ఘోర పరాభవం ఎదురైంది. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ తన సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థి విలాస్ ముత్తెంవార్‌పై 2,84,828ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక నందూర్బార్నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మాణిక్‌రావ్ గావిత్‌పై బీజేపీకి చెందిన హీనాగావిత్ 1,06,905 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా, ధులేలో బీజేపీ నేత సుభాష్ బామ్రే, కాంగ్రెస్‌కు చెందిన అమ్రిష్బాయి పటేల్‌పై 1,30,723ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. జల్గావ్లో బీజేపీనేత ఏటీ నానాపాటిల్, ఎన్సీపీ నేత సతీష్ పాటిల్‌పై 3,83, 525ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రావేర్ నియోజకవర్గం నుంచి రక్షా ఖడ్సే (బీజేపీ), మనీష్ దాదా జైన్(ఎన్సీపీ)పై 3,18,068 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బుల్డానాలో ప్రతాప్‌రావ్ జాదవ్(శివసేన), కృష్ణారావ్ ఇంగ్లే(ఎన్సీపీ)పై 1,59,579 ఓట్ల తేడాతో గెలుపొందారు. అకోలాలో సంజయ్ ధోత్రే (బీజేపీ), రాజీవ్ రాజలే (ఎన్సీపీ)పై 2,03,116 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అమరావతిలో ఆనంద్‌రావ్ అడుసూల్(శివసేన), నవనీత్‌కౌర్ (ఎన్సీపీ)పై 1,37,932ఓట్ల తేడాతో విజయం సాధించారు. గడ్చిరోలీ(చిమూర్) నుంచి అశోక్ నేతే (బీజేపీ), నామ్‌దేవ్ ఉసెండి(కాంగ్రెస్)పై 2,36,870 ఓట్లతో గెలుపొందారు. చంద్రాపూర్ నుంచి హంసరాజ్ ఆహిర్ (బిజేపీ), సంజయ్ దేవ్‌తలే(కాంగ్రెస్)పై 2,36,269ఓట్లతో విజయం సాధించారు. యావత్మల్-వాషిమ్ నుంచి భావనా గావ్లీ(శివసేన), శివాజీరావ్ మోఘే(కాంగ్రెస్)పై 93,816ఓట్లతో గెలుపొందారు. పర్బణీ నుంచి సంజయ్జాదవ్ (శివసేన), విజయ్ బంబాలే(ఎన్సీపీ)పై 1,27,155ఓట్ల తేడాతో విజయం సాధించారు. దిండోరీనుంచి హరీశ్చంద్ర చవాన్(బీజేపీ), భారతీ పవార్(ఎన్సీపీ)పై 2,47,619 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నాసిక్ నుంచి హేమంత్ గోడ్సే (శివసేన), జగన్ భుజ్‌బల్(ఎన్సీపీ)పై 1,87,336 ఓట్లతో విజయం సాధించారు. భివండీనుంచి కపిల్ పాటిల్ (బీజేపీ), విశ్వనాథ్ పాటిల్‌పై 1,09,450 ఓట్ల తేడాతో గెలుపొందారు. కల్యాణ్ నుంచి శ్రీకాంత్ షిండే (శివసేన), ఆనంద్ పరాంజపే (ఎన్సీపీ)పై 2,50,749 ఓట్లతో విజయం సాధించారు. ఠాణే నుంచి రాజన్ విచారే (శివసేన), సంజీవ్ నాయక్ (ఎన్సీపీ)పై 2,81,299 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఉత్తర ముంబై నుంచి గోపాల్ శెట్టి(బీజేపీ), సంజయ్ నిరుపమ్ (కాంగ్రెస్) పై 4,46,582ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఉత్తర మధ్య ముంబైనుంచి పూనమ్ మహాజన్ (బీజేపీ), ప్రియాదత్ (కాంగ్రెస్)పై 1,86,771 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మావల్ నుంచి శ్రీరంగ్ బరనే (శివసేన), లక్ష్మణ్ భావు జగ్తాప్(పీడబ్ల్యూపీఐ)పై 1,57,397 ఓట్లతో గెలుపొందారు. బారామతి నుంచి సుప్రియా సూలే (ఎన్సీపీ), జగన్నాథ్ మహదేవ్ (రాష్ట్రీయ సమాజ్ పార్టీ)పై 69,719 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. షిరిడీలో సదాశివ్ లోకండే, బీడ్‌లో గోపీనాథ్ ముండే, ఉస్మానాబాద్‌లో రవీంద్రగైక్వాడ్, లాతూర్‌లో సునీల్ గైక్వాడ్, షోలాపూర్‌లో శరద్ బన్సోడే, మాడాలో విజయ్‌సింగ్ మోహిత్ పాటిల్, సాంగ్లీలో సంజయ్ కాకా పాటిల్, సతారాలో ఉదయన్ రాజ్ భోస్లే, రత్నగిరి-సింధు దుర్గ్‌లో వినాయక్రావూత్, కొల్హాపూర్‌లో ధనంజయ్ మాడిక్, హతకణంగలేలో రాజుశెట్టి తదితరులు విజయబావుటా ఎగరవేశారు. -
శివసేన, ఎమ్మెన్నెస్ మధ్య ఘర్షణ
సాక్షి, ముంబై: లోక్‌సభ ఎన్నికలకు ఒకరోజు ముందు మాన్ఖుర్డ్లో బుధవారం అర్ధరాత్రి శివసేన-ఎమ్మెన్నెస్‌ల మధ్య ఘర్షణ జరిగింది. డబ్బులు పంపిణీ చేస్తున్నారనే విషయంపై ఇరు పార్టీల కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. ఇరు వర్గాలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై కూడా కొందరు కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో ఓ పోలీసు కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఒక్కసారిగా మాన్‌ఖుర్డ్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల ప్రచారం ముగియడంతో అంతా సవ్యంగా ప్రచారం ముగిసిందని భావించారు. అయితే బుధవారం అర్ధరాత్రి ఓటర్లకు డబ్బులు పంపిణీ విషయంపై శివసేన, ఎమ్మెన్నెస్‌ల మధ్య ఘర్షణ తలెత్తింది. మాన్‌ఖుర్డ్ ప్రాంతం దక్షిణ మధ్య ముంబై లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఈ లోక్‌సభ నియోజకవర్గం నుంచి శివసేన నుంచి రాహుల్ శెవాలే పోటీ చేస్తుండగా ఎమ్మెన్నెస్ నుంచి ఆదిత్య శిరోడ్కర్ బరిలో ఉన్నారు. బుధవారం అర్ధరాత్రి స్థానికంగా డబ్బులు పంపిణీ చేస్తున్నారనే సమాచారంతో ఇరు పార్టీల కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. రెండు వర్గాలు రాళ్లు రువ్వుకోవడం మొదలుపెట్టారు. వారిని అదుపు చేసేందుకు వచ్చిన వికాస్ థోరబోలే అనే పోలీస్ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘర్షణకు కారణం మీరంటే మీరని శివసేన, ఎమ్మెన్నెస్ పార్టీలు ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం మొదలుపెట్టారు. కామిని శెవాలేతోపాటు మొత్తం 18 మందిపై కేసులు నమోదు... దక్షిణ మధ్య ముంబై లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న శివసేన అభ్యర్థి రాహుల్ శెవాలే సతీమణి, మాజీ కార్పొరేటర్ కామిని శెవాలేతోపాటు మొత్తం 18 మందిపై ట్రాంబే పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ విషయంపై సీనియర్ ఇన్స్పెక్టర్ విజయ్ కదం అందించిన వివరాల మేరకు ఘర్షణలో కామినితోపాటు 18 మందిపై హత్యాయత్నం, ప్రభుత్వ పనుల్లో అడ్డంకులు సృష్టించడం, సిబ్బందిపై దాడిచేయడం, అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించడం తదితర అంశాల కేసులు నమోదు చేశారన్నారు. కానిస్టేబుల్ గొంతు కోశారా..? శివసేన, ఎమ్మెన్నెస్ ఘర్షణలో పోలీసు కానిస్టేబుల్ వికాస్ థోరబోలేపై దాడి జరిగిందని తెలిసిన కొందరు దుండగులు కావాలనే అతడిపై దాడిచేసి గొంతు కోశారని తెలిసింది. తీవ్రంగా గాయపడ్డ ఆయనను చెంబూర్‌లోని జాయి ఆస్పత్రిలో చేర్పించారు. ఈ విషయంపై పెద్దగా ఎవరూ మాట్లాడేందుకు ముందుకు రాకపోయినప్పటికీ దుండగులు వికాస్ థోరబోలే గొంతుకోశారని తెలిసింది. ఆయన గొంతు వద్ద శ్వాసనాళికకు తీవ్ర గాయమైందని దీంతో రక్తస్రావం కూడా అధికంగా జరిగింది. దీంతో బాధితుడి ఆరోగ్య పరిస్థితి కొంత విషమంగా ఉందని సమాచారం. -
టవర్ల రేడియేషన్‌ను తగ్గిస్తాం
సాక్షి ముంబై: నగరవ్యాప్తంగా ఉన్న మొబైల్ టవర్ల రేడియేషన్‌ను తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర టెలికమ్యూనికేషన్స్ సహాయక మంత్రి మిలింద్ దేవరా తెలిపారు. ప్రజలు, సామాజిక సంస్థల డిమాండ్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన విలేకరులకు వెల్లడించారు. రేడియేషన్‌కు సంబంధించి అంతర్జాతీయ నియమాలకు అనుగుణంగా భారత్‌లో రేడియేషన్ విడుదల స్థాయుల తగ్గింపునకు గత ఏడాదే ఆదేశాలు జారీ చేశామన్నారు. అంతకుముందు రేడియేషన్ తీవ్రత 4,500 మి.లి.వాట్స్ పర్ స్క్వేర్ మీటర్ ఉండేదని, దానిని 450 మి.లి. వాట్స్ పర్ స్క్వేర్ మీటర్‌కు తగ్గించినట్లు వివరించారు. ఫ్రాన్స్, రష్యా, బెల్జియం, ఆస్ట్రియా దేశాలతో పోలిస్తే భారత్‌లో రేడియేషన్ స్థాయులు చాలా ఎక్కువగా ఉన్నాయని ఎన్జీఓలు వాదిస్తుండడాన్ని కూడా దేవరా ప్రస్తావించారు. ‘రేడియేషన్‌తో వల్ల కలిగే దుష్ర్పభవాలపై భారత్‌లో పరిశోధనలు కొనసాగుతున్నాయి. మనుషులతోపాటు పక్షి, ఇతర ప్రాణులపై కూడా ఇది దుష్ర్పభావం చూపుతుందని అధ్యయనాల్లో వెల్లడయింది’ అని ఆయన పేర్కొన్నారు. అందుకే రేడియేషన్ ఫ్రీక్వెన్సీలను తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. రేడియేషన్ విడుదల నిబంధనలను భారత్‌లోని టెలికాం కంపెనీలు పాటించడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయన్నారు. ఒక టవర్‌పై ఉన్న యాంటెన్నాల సంఖ్య ఆధారంగా రేడియేషన్ తీవ్రతను లెక్కిస్తారు. ఒకే టవర్‌పై అనేక యాంటెన్నాలు ఉంటే అధికముప్పు ఉంటుందని ముంబై ఐఐటీ ప్రొఫెసర్ గిరిష్‌కుమార్ తెలిపారు. టవర్ల ఏర్పాటుకు పాటించాల్సిన నిబంధనలు ఒక భవనంపై ఒకే టవర్‌కు అనుమతి ఇవ్వాలి. అందులో నివసించే 70 శాతం మంది, ముఖ్యంగా చివరి అంతస్తులో ఉంటున్న వారి అంగీకారం కచ్చితంగా ఉండాలి. పాఠశాల, కళాశాలలు, ఆస్పత్రి, వృద్ధాశ్రమాలు ఉన్న ప్రాంతాల్లో మొబైల్ టవర్లకు అనుమతి లభించదు. ఇక ముంబై నగరంలో మొత్తం 4,779 మొబైల్ టవర్లు ఉన్నాయి. అందులో 1,159 టవర్లు మినహా మిగతావన్నీ అనధికారికంగానే ఏర్పాటయ్యాయి. మొబైల్ టవర్ల రేడియేషన్ వల్ల నిద్రలేమి, తలనొప్పి, చిరాకు, ఉదాసీనత, మతిమరుపు, పక్షవాతం, సంతానం కలగకపోవడం, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి.