ముంబయి: కాంగ్రెస్‌ను వీడి ఏక్‌నాథ్ షిండే వర్గంలో చేరిన సీనియర్ నేత మిలింద్ దేవరా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత రాజకీయాల్లో ప్రస్తుత మార్పులు సమానత్వ విలువల్ని కోరుకుంటున్నాయని చెప్పారు. టీ అమ్మేవారు ప్రధానమంత్రి స్థానంలో.. రిక్షా నడిపే వ్యక్తి మహారాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారని అన్నారు. ఈ మార్పు భారత రాజకీయాల్ని మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు.
ఏక్‌నాథ్ షిండ్ సామర్థ్యంపై తనకు నమ్మకం ఉందని మిలింద్ దేవరా అన్నారు. ఆయన సారథ్యంలో రాష్ట్రం గణనీయంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తోందని చెప్పారు. "దేశంలోని అత్యంత కష్టపడి పనిచేసే, అందుబాటులో ఉండే సీఎంలలో ఏక్‌నాథ్ షిండే ఒకరు. మహారాష్ట్రలో అణగారిన వర్గాల పట్ల ఆయనకున్న అవగాహన, మౌలిక సదుపాయాలు మెరుగుపరచడానికి ఆయన చేసిన కృషి అభినందనీయం" అని ఆయన స్పష్టం చేశారు.
"మహారాష్ట్రుల సంపన్నమైన భవిష్యత్తు కోసం షిండే ప్రయత్నాలతో ప్రేరణ పొందాను. ఆయన కృషికి మద్దతు ఇవ్వాలనుకుంటున్నాను. భారతదేశం కోసం నరేంద్ర మోదీ, అమిత్ షాల దూరదృష్టి నన్ను ఆకర్షించాయి." అని మిలింద్ దేవరా అన్నారు.
"సృజనాత్మక ఆలోచనలకు విలువనిచ్చి, నా సామర్థ్యాలను గుర్తించే నాయకుడితో నేను పని చేయాలనుకుంటున్నాను. ఏక్‌నాథ్ షిండే నా సామర్థ్యాలను నమ్ముతారు." అని దేవరా అన్నారు. కష్టపడి పనిచేయడం వల్ల అసాధ్యమైన విషయాలు కూడా సాధ్యమవుతాయని పేర్కొన్నారు.
మహారాష్ట్రలో కీలక నేత మిలింద్ దేవరా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో చేరిపోయారు. ఇండియా కూటమి సీట్ల పంపకాల్లో అసంతృప్తికి గురైన దేవరా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఇదీ చదవండి: ‘ఏక్ భారత్...’కు ప్రతిబింబం పొంగల్: మోదీ
Comments
Please login to add a commentAdd a comment