ముంబై: మహారాష్ట్రలో పది రోజుల ఉత్కంఠకు తెరపడింది. కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ నేడు(గురువారం) సాయంత్రం 5:30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దక్షిణ ముంబయిలోని ఆజాద్ మైదాన్‌లో ప్రమాణ స్వీకారోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించనున్నారు.
ఈ క్రమంలో శివసేన అధినేత ఏక్‌నాథ్ షిండేను మరోసారి సీఎం చేయకపోవడంపై ఉద్దవ్ వర్గం ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏక్‌నాథ్ షిండే పాలన శకం ముగిసిందని, ఆయన ఇంకెప్పుడూ మహారాష్ట్రకు సీఎం కాలేడని అన్నారు. ఈ మేరకు గురువారం విలేకరులతో సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ షిండేను పావులా ఉపయోగించుకొని ఇప్పుడు పక్కన పెట్టిందని ఆరోపించారు.
‘షిండే శకం ముగిసిపోయింది. రెండేళ్లు మాత్రమే సీఎంగా ఉన్నారు. ఇప్పుడు అతని వాడుక ముగిసింది. అతడిని పక్కన పడేశారు. షిండే మళ్లీ ఈ రాష్ట్రానికి సీఎం కాలేడు. తమతో జతకట్టే పార్టీలను బలహీనపరిచేందుకు, కూల్చివేయడానికి బీజేపీ తన రాజకీయ వ్యూహాన్ని ఉపయోగిస్తోంది’ అని ఆరోపించారు.
షిండే పార్టీని కూడా విచ్ఛిన్నం చేయగలరని సంజయ్ రౌత్ విమర్శించారు. రాజకీయాల్లో బీజేపీ వ్యూహం ఇదేనని, తమతో పనిచేసే వారి పార్టీని విచ్ఛిన్నం చేసి ఆ పార్టీని లేకుండా చేస్తుందని మండిపడ్డారు. మెజారిటీ ఉన్నప్పటికీ మహాయుతి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 15 రోజులు ఎందుకు పట్టిందన్న ప్రశ్నకు బదులిస్తూ.. పాలక కూటమిలో చీలిక మొదలైందని.. ఈ సమస్య రేపటి నుంచి ఇంక పెద్దదవుతుందని అన్నారు.
‘ఈరోజు నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ రాష్ట్రానికి సీఎం అవుతారు. ఆయనకు మెజారిటీ ఉంది కానీ, 15 రోజుల పాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయారు . అంటే వారి పార్టీ లేదా మహాయుతిలో ఏదో లోపం ఉందని అర్థం. ఇప్పుడు కాకపోయిన రేపు అయినా బయటపడుతుంది. వారు మహారాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసం పని చేయడం లేదు. తమ స్వార్థంతో కలిసి వచ్చారు.. కానీ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎన్నికల ఫలితాలకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చారు. ఫలితాలను ఇప్పటికీ వారు అంగీకరించడం లేదు.’ అని పేర్కొన్నారు.
కాగా ముంబయిలో బుధవారం జరిగిన రాష్ట్ర భాజపా కోర్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ పేరును ఖరారు చేశారు.ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టనుండటం ఇది మూడోసారి కానుంది. కొత్త ప్రభుత్వంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉంటారని, వారు కూడా గురువారం తనతోపాటు మంత్రులుగా ప్రమాణం చేస్తారని ఫడ్నవీస్ ప్రకటించారు. అయితే ఆ ఇద్దరిలో ప్రస్తుతానికి ఒక్కరిపైనే అధికారికంగా స్పష్టత వచ్చింది.
తాను డిప్యూటీ సీఎంగా మరోసారి బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు ఎన్సీపీ అగ్ర నాయకుడు అజిత్ పవార్ ప్రకటించారు. ఆయనతోపాటు ప్రస్తుతం మహారాష్ట్ర ఆపద్ధర్మ సీఎంగా ఉన్న శివసేన అధినేత ఏక్‌నాథ్ షిండే కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉంటారని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ఇంకా ప్రకటన వెలువడలేదు.
Comments
Please login to add a commentAdd a comment