కాంగ్రెస్, ఎన్సీపీలను కూలదోసిన మహాకూటమి
సాక్షి, ముంబై: ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ శుక్రవారం సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అందరూ ఊహించినట్లుగానే రాష్ట్రంలో మోడీ హవాతో కాషాయ పార్టీల జోరు కొనసాగింది. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచే శివసేన, బీజేపీలు స్పష్టమైన మెజారిటీతో ముందుకు దూసుకుపోయాయి. తొలి నుంచి ద్వితీయ, తృతీయ స్థానాల్లో కొనసాగుతూ వచ్చిన కాంగ్రెస్, ఎన్సీపీలు చివరికి అదే స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలకుగాను బీజేపీ 23, శివసేన 18, ఎన్సీపీ 4, కాంగ్రెస్ 2, స్వాభిమాన్ శేత్కారీ సంఘటన ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నాయి.
గత లోక్‌సభ ఫలితాలకు భిన్నంగా ఓటరు ఇచ్చిన తీర్పులో కాంగ్రెస్‌కు ఘోర పరాభవం ఎదురవగా ఎన్సీపీ పరిస్థితి చావుతప్పి కన్ను లొట్టపోయిన చందంగా మారింది. 17 మంది సిట్టింగ్ ఎంపీలున్న కాంగ్రెస్ ఈసారి చచ్చీ..చెడీ అతి కష్టంమీద రెండో లోక్‌సభ నియోజకవర్గాన్ని దక్కించుకోగలిగింది. ఎన్సీపీ పరిస్థితి కూడా అంతే.. గతంలో 8 లోక్‌సభ స్థానాలుండగా ఈసారి సగానికి తగ్గి నాలుగింటితో సరిపెట్టుకుంది. ఓ దశలో శివసేన, బీజేపీ, ఆర్పీఐ, స్వాభిమాన్ శేత్కారీ సంఘటన నేతృత్వంలోని మహాకూటమి రాష్ట్రంలో క్లీన్‌స్వీప్ చేస్తుందా? అన్న అనుమానాలు కలిగాయి. ముంబై, కోంకణ్ లతోపాటు ఉత్తర మహారాష్ట్ర, విదర్భ, మరాఠ్వాడాలలో మహాకూటమి విజయకేతనం ఎగురవేసింది. ఎన్సీపీ పట్టుందని భావించే పశ్చిమ మహారాష్ట్రలో కూడామహాకూటమి తనదైన మెజార్టీతో దూసుకుపోయింది. గతంలో శివసేనను వీడి కాంగ్రెస్, ఎన్సీపీల్లోకి వెళ్లినవారందరికి ఈసారి ఘోర పరాభవం ఎదురైంది.
బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ తన సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థి విలాస్ ముత్తెంవార్‌పై 2,84,828ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక నందూర్‌బార్‌నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మాణిక్‌రావ్ గావిత్‌పై బీజేపీకి చెందిన హీనాగావిత్ 1,06,905 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా, ధులేలో బీజేపీ నేత సుభాష్ బామ్రే, కాంగ్రెస్‌కు చెందిన అమ్రిష్‌బాయి పటేల్‌పై 1,30,723ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. జల్‌గావ్‌లో బీజేపీనేత ఏటీ నానాపాటిల్, ఎన్సీపీ నేత సతీష్ పాటిల్‌పై 3,83, 525ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రావేర్ నియోజకవర్గం నుంచి రక్షా ఖడ్సే (బీజేపీ), మనీష్ దాదా జైన్(ఎన్సీపీ)పై 3,18,068 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బుల్‌డానాలో ప్రతాప్‌రావ్ జాదవ్(శివసేన), కృష్ణారావ్ ఇంగ్లే(ఎన్సీపీ)పై 1,59,579 ఓట్ల తేడాతో గెలుపొందారు.
అకోలాలో సంజయ్ ధోత్రే (బీజేపీ), రాజీవ్ రాజలే (ఎన్సీపీ)పై 2,03,116 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అమరావతిలో ఆనంద్‌రావ్ అడుసూల్(శివసేన), నవనీత్‌కౌర్ (ఎన్సీపీ)పై 1,37,932ఓట్ల తేడాతో విజయం సాధించారు. గడ్చిరోలీ(చిమూర్) నుంచి అశోక్ నేతే (బీజేపీ), నామ్‌దేవ్ ఉసెండి(కాంగ్రెస్)పై 2,36,870 ఓట్లతో గెలుపొందారు. చంద్రాపూర్ నుంచి హంసరాజ్ ఆహిర్ (బిజేపీ), సంజయ్ దేవ్‌తలే(కాంగ్రెస్)పై 2,36,269ఓట్లతో విజయం సాధించారు. యావత్మల్-వాషిమ్ నుంచి భావనా గావ్లీ(శివసేన), శివాజీరావ్ మోఘే(కాంగ్రెస్)పై 93,816ఓట్లతో గెలుపొందారు. పర్బణీ నుంచి సంజయ్‌జాదవ్ (శివసేన), విజయ్ బంబాలే(ఎన్సీపీ)పై 1,27,155ఓట్ల తేడాతో విజయం సాధించారు. దిండోరీనుంచి హరీశ్చంద్ర చవాన్(బీజేపీ), భారతీ పవార్(ఎన్సీపీ)పై 2,47,619 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
నాసిక్ నుంచి హేమంత్ గోడ్సే (శివసేన), జగన్ భుజ్‌బల్(ఎన్సీపీ)పై 1,87,336 ఓట్లతో విజయం సాధించారు. భివండీనుంచి కపిల్ పాటిల్ (బీజేపీ), విశ్వనాథ్ పాటిల్‌పై 1,09,450 ఓట్ల తేడాతో గెలుపొందారు. కల్యాణ్ నుంచి శ్రీకాంత్ షిండే (శివసేన), ఆనంద్ పరాంజపే (ఎన్సీపీ)పై 2,50,749 ఓట్లతో విజయం సాధించారు. ఠాణే నుంచి రాజన్ విచారే (శివసేన), సంజీవ్ నాయక్ (ఎన్సీపీ)పై 2,81,299 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఉత్తర ముంబై నుంచి గోపాల్ శెట్టి(బీజేపీ), సంజయ్ నిరుపమ్ (కాంగ్రెస్) పై 4,46,582ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఉత్తర మధ్య ముంబైనుంచి పూనమ్ మహాజన్ (బీజేపీ), ప్రియాదత్ (కాంగ్రెస్)పై 1,86,771 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మావల్ నుంచి శ్రీరంగ్ బరనే (శివసేన), లక్ష్మణ్ భావు జగ్తాప్(పీడబ్ల్యూపీఐ)పై 1,57,397 ఓట్లతో గెలుపొందారు.
బారామతి నుంచి సుప్రియా సూలే (ఎన్సీపీ), జగన్నాథ్ మహదేవ్ (రాష్ట్రీయ సమాజ్ పార్టీ)పై 69,719 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. షిరిడీలో సదాశివ్ లోకండే, బీడ్‌లో గోపీనాథ్ ముండే, ఉస్మానాబాద్‌లో రవీంద్రగైక్వాడ్, లాతూర్‌లో సునీల్ గైక్వాడ్, షోలాపూర్‌లో శరద్ బన్‌సోడే, మాడాలో విజయ్‌సింగ్ మోహిత్ పాటిల్, సాంగ్లీలో సంజయ్ కాకా పాటిల్, సతారాలో ఉదయన్ రాజ్ భోస్లే, రత్నగిరి-సింధు దుర్గ్‌లో వినాయక్‌రావూత్, కొల్హాపూర్‌లో ధనంజయ్ మాడిక్, హతకణంగలేలో రాజుశెట్టి తదితరులు విజయబావుటా ఎగరవేశారు.