Priya Dutt
-
మా ఆడపడుచే మార్గదర్శి
‘‘సంజయ్ దత్ చికిత్సలో మా ఆడపడుచు ప్రియాదత్తే మాకు తోడూ నీడగా ఉంది. ఆమే మాకు మార్గదర్శి. మా కుటుంబం నడిపే కేన్సర్ ఫౌండేషన్ వ్యవహారాలను ఆమె రెండు దశాబ్దాలుగా చూస్తోంది. సంజయ్ తల్లి (నర్గిస్) పడ్డ కేన్సర్ వేదనను, కేన్సర్‌కు సంబంధించిన చికిత్స విధానాలను ఆమె పూర్తిగా తెలుసుకొని ఉంది. అందుకే సంజయ్ చికిత్సలో ఆమె ముందు ఉండి మాకు ధైర్యం చెబుతోంది’’ అన్నారు సంజయ్ దత్ భార్య మాన్యతా దత్. సంజయ్ దత్‌కు కేన్సర్ వచ్చిన విషయాన్ని కుటుంబం ఇప్పటిదాకా అధికారికంగా వెల్లడి చేయకపోయినా ఇప్పుడది బహిరంగ రహస్యం అని చెప్పవచ్చు. ఆగస్టు రెండో వారం నుంచి ఆయన కేన్సర్ వార్తలు బయటకు వచ్చినా ‘మీరు ఎటువంటి ఊహాగానాలు చేయవద్దు’ అని మాత్రమే కుటుంబం అంటోంది. ఇప్పుడు తాజాగా సంజయ్ చికిత్స గురించి మాన్యత మరికొన్ని వివరాలు చెప్పింది. ‘‘సంజయ్ దత్‌కు ప్రాథమిక చికిత్స ముంబై కోకిలాబెన్లోనే జరిపించాలని నిశ్చయించుకున్నాం. ఆయన ప్రాథమిక చికిత్స కోకిలాబెన్లో మొదలయ్యింది. అది పూర్తయ్యేవరకు ఇక్కడే ఉంటాం. ఆ తర్వాత అమెరికా వెళ్లడం గురించి కరోనా పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటాం. కోకిలాబెన్లో బెస్ట్ డాక్టర్లు సంజయ్‌కు చికిత్స చేస్తున్నారు. మేము ధైర్యంగా ఉన్నాం’’ అని ఆమె పేర్కొంది. ఈ సమయంలో సంజయ్ దత్ సోదరి ప్రియా దత్ వెన్నంటి ఉండటం ఆమెకు ధైర్యాన్ని ఇస్తోంది. కోకిలాబెన్ ఆస్పత్రికి సంజయ్ దత్తో ప్రియా దత్ తోడుగా వస్తోంది. ‘‘కరోనా పరిస్థితుల వల్ల నేను ఇంట్లోనే ఉంటున్నాను. ఇంటి వ్యవహారాలను చూసుకుంటున్నాను. హాస్పిటల్ పనులన్నీ ప్రియా చూసుకుంటోంది. సంజయ్ దత్ నా పిల్లలకు మాత్రమే తండ్రి కాదు. తండ్రి (సునీల్ దత్) మరణం తర్వాత సంజయ్ దత్ ఇద్దరు చెల్లెళ్లు ప్రియ, నమ్రతలకు కూడా ఆయన తండ్రి సమానుడు అయ్యాడు. ఆయన అనారోగ్యం విషయం తెలిసిన వెంటనే మేమందరం కదిలిపోయాం. కానీ వెంటనే దీనిని సమూలంగా ఎదుర్కొనాలని నిశ్చయించుకున్నాం’’ అని మాన్యతా చెప్పింది. ప్రతి కుటుంబంలో ఆడపడుచు పాత్ర కీలకం. సవాలు సమయాల్లో ఆడపడుచు సలహాలు సూచనలు ముఖ్యమవడాన్ని చూస్తుంటాం. ఇక్కడ ప్రియా దత్ కూడా ఒక ఆడపడుచుగా మాన్యతకు కొండంత అండగా నిలవడం భారతీయ కుటుంబ నిర్మాణపు ఒక విశిష్ట ప్రతిఫలనం అని చెప్పవచ్చు. -
యూటర్న్ : ‘నేను రేసులో ఉన్నాను’
సాక్షి, ముంబై : లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అంశమై కాంగ్రెస్ మాజీ ఎంపీ ప్రియా దత్ యూటర్న్ తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నానని బుధవారం ప్రకటించారు. ‘నేను పోటీలో ఉన్నాను. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థులతో తలపడబోతున్నా. నా పిల్లల భవిష్యత్తు కోసం, ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం నేను ఎన్నికల బరిలో దిగుతున్నా’ అని ఆమె వ్యాఖ్యానించారు. కాగా మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ సంజయ్ నిరుపమ్‌తో విభేదాలు తలెత్తిన కారణంగా ప్రియా దత్తో పాటు.. ఆ పార్టీ నేత మిలింద్ డియోరా రాహుల్ గాంధీకి ఆయనపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి తనకు ఆసక్తిలేదని ఆమె రాహుల్‌కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో పార్టీ ప్రయోజనాల దృష్ట్యా పోటీ చేయాల్సిందిగా రాహుల్ సూచించిన మేరకు ఆమె ఎన్నికల బరిలో దిగుతున్నట్లు సమాచారం. ఇక ప్రియా దత్... ప్రముఖ నటుడు, మాజీ కేంద్ర మంత్రి సునీల్ దత్ కుమార్తె అన్న విషయం తెలిసిందే. ముంబై నార్త్ వెస్ట్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2005(ఉప ఎన్నిక), 09 ఎన్నికల్లో విజయం సాధించిన ప్రియా దత్... 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పూనం మహజన్ చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఆమె ఏఐసీసీ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
ఎన్నికల్లో పోటీ చెయ్యను.. రాహుల్‌కు ప్రియా లేఖ
సాక్షి, ముంబై: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీచెయ్యడానికి తనకు ఆసక్తిలేదని కాంగ్రెస్ మాజీ ఎంపీ ప్రియా దత్ తెలిపారు. ఈమేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఆదివారం లేఖ రాశారు. పోటీచెయ్యకపోవడానికి తగిన కారణాలను మాత్రం ఆమె లేఖలో వివరించలేదు. గత కొంతకాలంగా రాహుల్ గాంధీ టీమ్‌పై వరుస విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. 2017లో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం తరువాత సొంత పార్టీ నేతలపైనే ఆమె ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ప్రముఖ నటుడు, మాజీ కేంద్రమంత్రి సునీల్ దత్ కుమారైన ప్రియా.. ముంబై నార్త్ వెస్ట్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2004, 09 ఎన్నికల్లో విజయం తెలిసిందే. 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పూనం మహజన్పై ఆమె ఓటమి పాలైయ్యారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు ప్రియా సొంత సోదరి. ప్రస్తుతం ఆమె ఏఐసీసీ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
అన్న సినిమా సూపర్ గా ఉంటుంది!
ముంబై: బాలీవుడ్ మున్నాభాయ్ సంజయ్ దత్. మొన్ననే ఎరవాడ జైలు నుంచి విడుదలైన సంజూ భాయ్ జీవితకథ ఆధారంగా త్వరలోనే సినిమా రానుంది. రణ్‌బీర్ కపూర్ సంజూగా నటించే ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రాజ్‌కుమార్ హిరానీ వేగంగా సన్నాహాలు చేస్తున్నారు. బాలీవుడ్ 'ఖల్నాయక్' ముద్రపడిన సంజూభాయ్ జీవితం నిండా వివాదాలే. హీరోయిన్లతో ప్రేమ వ్యవహారాలు, డ్రగ్స్‌కు బానిస కావడం, అండర్ వరల్డ్ మాఫియాతో సంబంధాలు, అక్రమ ఆయుధాలు, జైలు జీవితం.. వై-ఫైలా వివాదాలు చుట్టుముట్టిన ఆయన జీవిత కథ ఆధారంగా తెరకెక్కే సినిమాపై సంజయ్ దత్ సోదరి ప్రియా దత్ తాజాగా స్పదించింది. అన్న సినిమా ప్రేక్షకులకు చాలా ఆసక్తిగా ఉంటుందని, ఎంతగానో నచ్చుతుందని ఆమె పేర్కొంది. 'ఆయన జీవితం చాలా ఆసక్తికరం. ఈ బయోపిక్‌లో ఏం చూపిస్తారో, ఎలా చూపిస్తారో అన్నది నాకు తెలియదు. కానీ ఇంతటి సంఘర్షణను ఎదుర్కొని కూడా శాంతంగా, బలంగా కనిపించే వ్యక్తులు చాలా అరుదు. కాబట్టి ఈ జీవిత కథ తప్పకుండా ఆసక్తికరంగా ఉంటుంది' అని ప్రియాదత్ తెలిపింది. తన కెరీర్లో సంజూభాయ్ ఎన్నో విజయవంతమైన సినిమాలు చేసినప్పటికీ.. 'మున్నాభాయ్' సిరీస్ చిత్రాలు, 'వాస్తవ్' సినిమా తనకెంతో ఇష్టమని పేర్కొంది. -
అన్నాచెల్లెళ్ల అనుబంధం
ముంబై : 42 నెలల జైలు శిక్ష తర్వాత గురువారం విడుదలైన సంజయ్ దత్ కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలతో తడిసి ముద్దవుతున్నారు. విలేకరుల సమావేశంలో ఉండగానే సంజయ్ పిల్లలిద్దరూ ఆయనను అల్లుకుపోయారు. ఇక భార్య మాన్యత భావోద్వేగం బయటపడకుండా కళ్లను గాగుల్స్ వెనుక దాచేశారు. అభిమానుల సంబరమైతే చెప్పనక్కర్లేదు. చెల్లెలు ప్రియా దత్ ఇంట్లో అన్నను చూడగానే సంతోషంతో హత్తుకున్నారు. నిజంగా ఇది జీవితంలో మర్చిపోలేని రోజంటూ ఉద్వేగానికి లోనయ్యారు. తమ కుటుంబం ఎప్పుడూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోలేదని ప్రియా గురువారం సంజయ్ దత్ విడుదల సందర్భంగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇక 'ఇంటికి చేరుకోగానే ఎలా ఫీలయ్యారు' అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు.. ఏం లేదు, ముందు టీ తాగాను అని సమాధానమిచ్చారు సంజూ బాబా. శుక్రవారం అంతా బంధుమిత్రుల పరామర్శలతో మున్నా భాయ్ బిజీగా గడిపారు. -
కాంగ్రెస్, ఎన్సీపీలను కూలదోసిన మహాకూటమి
సాక్షి, ముంబై: ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ శుక్రవారం సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అందరూ ఊహించినట్లుగానే రాష్ట్రంలో మోడీ హవాతో కాషాయ పార్టీల జోరు కొనసాగింది. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచే శివసేన, బీజేపీలు స్పష్టమైన మెజారిటీతో ముందుకు దూసుకుపోయాయి. తొలి నుంచి ద్వితీయ, తృతీయ స్థానాల్లో కొనసాగుతూ వచ్చిన కాంగ్రెస్, ఎన్సీపీలు చివరికి అదే స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలకుగాను బీజేపీ 23, శివసేన 18, ఎన్సీపీ 4, కాంగ్రెస్ 2, స్వాభిమాన్ శేత్కారీ సంఘటన ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. గత లోక్‌సభ ఫలితాలకు భిన్నంగా ఓటరు ఇచ్చిన తీర్పులో కాంగ్రెస్‌కు ఘోర పరాభవం ఎదురవగా ఎన్సీపీ పరిస్థితి చావుతప్పి కన్ను లొట్టపోయిన చందంగా మారింది. 17 మంది సిట్టింగ్ ఎంపీలున్న కాంగ్రెస్ ఈసారి చచ్చీ..చెడీ అతి కష్టంమీద రెండో లోక్‌సభ నియోజకవర్గాన్ని దక్కించుకోగలిగింది. ఎన్సీపీ పరిస్థితి కూడా అంతే.. గతంలో 8 లోక్‌సభ స్థానాలుండగా ఈసారి సగానికి తగ్గి నాలుగింటితో సరిపెట్టుకుంది. ఓ దశలో శివసేన, బీజేపీ, ఆర్పీఐ, స్వాభిమాన్ శేత్కారీ సంఘటన నేతృత్వంలోని మహాకూటమి రాష్ట్రంలో క్లీన్‌స్వీప్ చేస్తుందా? అన్న అనుమానాలు కలిగాయి. ముంబై, కోంకణ్ లతోపాటు ఉత్తర మహారాష్ట్ర, విదర్భ, మరాఠ్వాడాలలో మహాకూటమి విజయకేతనం ఎగురవేసింది. ఎన్సీపీ పట్టుందని భావించే పశ్చిమ మహారాష్ట్రలో కూడామహాకూటమి తనదైన మెజార్టీతో దూసుకుపోయింది. గతంలో శివసేనను వీడి కాంగ్రెస్, ఎన్సీపీల్లోకి వెళ్లినవారందరికి ఈసారి ఘోర పరాభవం ఎదురైంది. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ తన సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థి విలాస్ ముత్తెంవార్‌పై 2,84,828ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక నందూర్బార్నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మాణిక్‌రావ్ గావిత్‌పై బీజేపీకి చెందిన హీనాగావిత్ 1,06,905 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా, ధులేలో బీజేపీ నేత సుభాష్ బామ్రే, కాంగ్రెస్‌కు చెందిన అమ్రిష్బాయి పటేల్‌పై 1,30,723ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. జల్గావ్లో బీజేపీనేత ఏటీ నానాపాటిల్, ఎన్సీపీ నేత సతీష్ పాటిల్‌పై 3,83, 525ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రావేర్ నియోజకవర్గం నుంచి రక్షా ఖడ్సే (బీజేపీ), మనీష్ దాదా జైన్(ఎన్సీపీ)పై 3,18,068 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బుల్డానాలో ప్రతాప్‌రావ్ జాదవ్(శివసేన), కృష్ణారావ్ ఇంగ్లే(ఎన్సీపీ)పై 1,59,579 ఓట్ల తేడాతో గెలుపొందారు. అకోలాలో సంజయ్ ధోత్రే (బీజేపీ), రాజీవ్ రాజలే (ఎన్సీపీ)పై 2,03,116 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అమరావతిలో ఆనంద్‌రావ్ అడుసూల్(శివసేన), నవనీత్‌కౌర్ (ఎన్సీపీ)పై 1,37,932ఓట్ల తేడాతో విజయం సాధించారు. గడ్చిరోలీ(చిమూర్) నుంచి అశోక్ నేతే (బీజేపీ), నామ్‌దేవ్ ఉసెండి(కాంగ్రెస్)పై 2,36,870 ఓట్లతో గెలుపొందారు. చంద్రాపూర్ నుంచి హంసరాజ్ ఆహిర్ (బిజేపీ), సంజయ్ దేవ్‌తలే(కాంగ్రెస్)పై 2,36,269ఓట్లతో విజయం సాధించారు. యావత్మల్-వాషిమ్ నుంచి భావనా గావ్లీ(శివసేన), శివాజీరావ్ మోఘే(కాంగ్రెస్)పై 93,816ఓట్లతో గెలుపొందారు. పర్బణీ నుంచి సంజయ్జాదవ్ (శివసేన), విజయ్ బంబాలే(ఎన్సీపీ)పై 1,27,155ఓట్ల తేడాతో విజయం సాధించారు. దిండోరీనుంచి హరీశ్చంద్ర చవాన్(బీజేపీ), భారతీ పవార్(ఎన్సీపీ)పై 2,47,619 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నాసిక్ నుంచి హేమంత్ గోడ్సే (శివసేన), జగన్ భుజ్‌బల్(ఎన్సీపీ)పై 1,87,336 ఓట్లతో విజయం సాధించారు. భివండీనుంచి కపిల్ పాటిల్ (బీజేపీ), విశ్వనాథ్ పాటిల్‌పై 1,09,450 ఓట్ల తేడాతో గెలుపొందారు. కల్యాణ్ నుంచి శ్రీకాంత్ షిండే (శివసేన), ఆనంద్ పరాంజపే (ఎన్సీపీ)పై 2,50,749 ఓట్లతో విజయం సాధించారు. ఠాణే నుంచి రాజన్ విచారే (శివసేన), సంజీవ్ నాయక్ (ఎన్సీపీ)పై 2,81,299 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఉత్తర ముంబై నుంచి గోపాల్ శెట్టి(బీజేపీ), సంజయ్ నిరుపమ్ (కాంగ్రెస్) పై 4,46,582ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఉత్తర మధ్య ముంబైనుంచి పూనమ్ మహాజన్ (బీజేపీ), ప్రియాదత్ (కాంగ్రెస్)పై 1,86,771 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మావల్ నుంచి శ్రీరంగ్ బరనే (శివసేన), లక్ష్మణ్ భావు జగ్తాప్(పీడబ్ల్యూపీఐ)పై 1,57,397 ఓట్లతో గెలుపొందారు. బారామతి నుంచి సుప్రియా సూలే (ఎన్సీపీ), జగన్నాథ్ మహదేవ్ (రాష్ట్రీయ సమాజ్ పార్టీ)పై 69,719 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. షిరిడీలో సదాశివ్ లోకండే, బీడ్‌లో గోపీనాథ్ ముండే, ఉస్మానాబాద్‌లో రవీంద్రగైక్వాడ్, లాతూర్‌లో సునీల్ గైక్వాడ్, షోలాపూర్‌లో శరద్ బన్సోడే, మాడాలో విజయ్‌సింగ్ మోహిత్ పాటిల్, సాంగ్లీలో సంజయ్ కాకా పాటిల్, సతారాలో ఉదయన్ రాజ్ భోస్లే, రత్నగిరి-సింధు దుర్గ్‌లో వినాయక్రావూత్, కొల్హాపూర్‌లో ధనంజయ్ మాడిక్, హతకణంగలేలో రాజుశెట్టి తదితరులు విజయబావుటా ఎగరవేశారు. -
అభివృద్ధివైపే ఓటరు మొగ్గు
అభ్యర్థుల నేరచరిత్ర కంటే గతంలో చేసిన అభివృద్ధికే మహారాష్ట్ర ఓటరు ప్రాధాన్యమిస్తున్నాడు. ఈ విషయం రెండు స్వచ్ఛంద సంస్థలు ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో స్పష్టమైంది. అయితే కానుకల ఆశ చూపి ఓట్లు వేయించుకోవడాన్ని మాత్రం అనేకమంది ఓటర్లు ఇష్టపడడం లేదు. అది అక్రమమని వారు భావిస్తున్నారు. ఎంపీల పనితీరుపై ఓటర్లు ఇచ్చిన పాయింట్లలో గురుదాస్ కామత్‌కి అందరికంటే ఎక్కువ దక్కాయి. సాక్షి, ముంబై: రాష్ట్రంలో 70 శాతం మంది ప్రజలు అభ్యర్థుల నేరచరిత్రను విస్మరిస్తున్నట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో నేరచరితులైన అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ వారు చేసిన అభివృద్ధి పనులను దృష్టిలో ఉంచుకొని ప్రజలు వారికే ఓటు వేయడానికి ఆసక్తి చూపుతున్న ట్లు స్పష్టమైంది. రాజకీయ నాయకుల పట్ల ప్రజలకు ఉన్న మనోభావాలను తెలుసుకునేందుకు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫామ్స్ (ఏడీఆర్), దక్ష్ అనే సేవా సంస్థలు అధ్యయనం చేశా యి. ఇందులో వెల్లడైన వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పార్టీలను దృష్టిలో పెట్టుకొని 7.73 శాతం మంది ఓట్లు వేయగా, అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని 7.24 శాతం మంది ఓట్లు వేస్తున్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి అభ్యర్థి కోసం 7.53 శాతంమంది, కులాభిమానంతో 5.69 శాతం మంది, ఇచ్చే కానుకలు (చీరలు, మద్యం, డబ్బు) ఆశపడి 5.31 శాతం మంది ఓట్లు వేస్తున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. కానుకలిచ్చి ఓట్లు వేయించుకోవడం అక్రమమని 62.07 శాతం మంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అభ్యర్థులు తమ గెలుపు కోసం కానుకలు పంచుతున్నారని 54.09 శాతం మంది అభిప్రాయపడ్డారు. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లోని ట్రాఫిక్ సమస్య, మహిళలకు భద్రత, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల తదితర అంశాలపై ఎంపీలు చేసిన పనులకు ప్రజలు పాయింట్స్ ఇచ్చారని అధ్యయన నిర్వాహకులు పేర్కొన్నారు. ఇందులో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ ప్రియాదత్ (ముంబై నార్త్ సెంట్రల్)కు అతి తక్కువ 4.01 పాయింట్లు లభించగా, తర్వాత కాంగ్రెస్ ఎంపీ మిలింద్ దేవరా (ముంబై సౌత్)కి 4.63 పాయింట్లు వచ్చాయి. నీలేష్ రాణే (రత్నగిరి, సింధుదుర్గ్) 4.82, ఏక్నాథ్ గైక్వాడ్ (ముంబై సౌత్ సెంట్రల్)కి 4.91, సంజయ్ నిరుపమ్ (ముంబై నార్త్)కు 5.21, గురుదాస్ కామత్ (ముంబై నార్త్ వెస్ట్)కి 6.33 పాయింట్లు వచ్చాయి. ఇదిలావుండగా మావల్ ఎంపీ బాబర్ జి దంషీ (శివసేన)కు అత్యధికంగా 8.4 పాయింట్లు వచ్చాయి. తర్వాత బీజేపీకి చెందిన హరిశ్చంద్ర (డోంగ్రి)కు 7.43, ఎన్సీపీ ఎంపీ సంజయ్ దీనా పాటిల్‌కు (నార్త్ ముంబై ఈస్ట్)కు 5.3 పాయింట్లు వచ్చాయి. కాగా అధ్యయనం చేపట్టే సమయంలో ఓటర్లు పాలనపై వేసుకున్న అంచనాలు, ఎంపీలు చేపట్టిన అభివృద్ధి పనులను బేరీజు వేశారు. ప్రజలు ఊహించుకున్నంత మేర పనులు ఎంపీలు చేయకపోవడంతో కొంత అసంతృప్తి వ్యక్తమవుతోందని రాష్ట్ర ఎలక్షన్ వాచ్ సంస్థ సభ్యుడు శరద్ తెలిపారు. రాష్ట్రానికి చెందిన 48 మంది ఎంపీల పనితీరును పరిశీలించగా కేవలం 12 మంది ఎంపీలు మాత్రమే నయమని ఈ సర్వేలో తేలింది. అధ్యయనం నిర్వహించిన టాప్‌టెన్‌లో పట్టణాల్లో చక్కని రహదారులు, తాగు నీరు, పాఠశాలలను ముఖ్యమైన అంశాలుగా పరిగణిస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, గృహావసరాలకు వ్యవసాయ ఉత్పత్తుల ధరలు, ఎరువులు, విత్తనాలపై సబ్సిడీ, ఆస్పత్రులు, సాగునీటి ప్రాజెక్టులున్నాయి. -
అభివృద్ధి పనులే గెలిపిస్తాయి
సాక్షితో ప్రియాదత్ మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా యువత ఉపాధికి పెద్దపీట వేస్తా సాక్షి-ముంబై: ప్రియాదత్.. బాలీవుడ్ నటులు సునీల్ దత్, నర్గీస్ దంపతుల రాజకీయ వారసురాలిగా మహారాష్ర్ట రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుంటున్నారు. ముంబై వాయవ్య స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటికే రెండుసార్లు జయభేరి మోగించిన ఈమె.. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీజేపీ తరఫున పోటీపడుతున్న ప్రమోద్ మహాజన్ కూతురు పూనమ్ మహాజన్ గట్టిపోటీ ఇస్తున్నా.. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులే తన విజయానికి బాటలు పరుస్తాయని అంటున్న ప్రియాదత్ ‘సాక్షి’తో ముచ్చటించారు. అభిప్రాయాలు ఆమె మాటల్లోనే... మా నియోజకవర్గంలోని యువత కోసం పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఉన్నాం. కోటక్ మహీంద్ర వంటి సంస్థలతో కలిసి పనులు చేపట్టాం. మూడు నెలల్లో కంప్యూటర్, ఆర్కిటెక్చర్, హాస్పిటాలిటీ తదితర అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నాం. వీటిలో శిక్షణ పొందేవారిలో 99 శాతం మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయి. నియోజకవర్గంలో సహారా ఎలివేటెడ్ రోడ్డు, రింగ్ రోడ్డు పనుల్లో ఇళ్లు కోల్పోయిన బాదితులందరికీ పునరావాసం కల్పించేందుకు కృషి చేస్తున్నా. ఇక మహిళల భద్రత విషయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాను. రాత్రి ఆలస్యంగా విధుల ముగించుకొని ఇంటికి వెళ్లేవారు, కాలేజీ, పాఠశాలలకు వెళ్లే విద్యార్థినుల కోసం నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా కొన్ని పథకాలను ప్రారంభించాం. ఇందుకు బాంద్రా అడిషనల్ పోలీసు కమిషనర్‌తో సమావేశమై కార్యాచరరణ రూపొందించాం. స్థానిక ప్రజలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. 15 రోజులకోసారి మేం సమావేశమవుతున్నాం. ఈ బృందాలు మహిళలకు అంతగా సురక్షితం కాని ప్రాంతాలను గుర్తించాయి. రైల్వే స్టేషన్ పరిసరాల్లో కూడా సీసీటీవీలు, ప్రీ-పెయిడ్ ట్యాక్సీలు అందుబాటులో ఉండేలా చూస్తున్నాం. ఎంఎన్ఎస్ అభ్యర్థి ఈ ఎన్నికల్లో నిలబడకపోవడం నా విజయంపై ఎలాంటి ప్రభావం చూపబోదు. 2009లో కూడా నాకు సుమారు 1.75లక్షల మెజార్టీ వచ్చింది. 3 లక్షలకుపైగా ఓట్లు వచ్చాయి. శివసేన, ఎంఎన్ఎస్ అభ్యర్థులిద్దరికీ కలిపి కూడా మూడు లక్షల ఓట్లు రాలేదు. -
అభివృద్ధి పనులే గెలిపిస్తాయి: ప్రియాదత్
* మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా * యువత ఉపాధికి పెద్దపీట వేస్తా శ్రీనివాస్ గుండారి, సాక్షి-ముంబై: ప్రియాదత్.. బాలీవుడ్ నటులు సునీల్ దత్, నర్గీస్ దంపతుల రాజకీయ వారసురాలిగా మహారాష్ర్ట రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుంటున్నారు. ముంబై వాయవ్య స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటికే రెండుసార్లు జయభేరి మోగించిన ఈమె.. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీజేపీ తరఫున పోటీపడుతున్న ప్రమోద్ మహాజన్ కూతురు పూనమ్ మహాజన్ గట్టిపోటీ ఇస్తున్నా.. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులే తన విజయానికి బాటలు పరుస్తాయని అంటున్న ప్రియాదత్ ‘సాక్షి’తో ముచ్చటించారు. అభిప్రాయాలు ఆమె మాటల్లోనే... మా నియోజకవర్గంలోని యువత కోసం పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఉన్నాం. కోటక్ మహీంద్ర వంటి సంస్థలతో కలిసి పనులు చేపట్టాం. మూడు నెలల్లో కంప్యూటర్, ఆర్కిటెక్చర్, హాస్పిటాలిటీ తదితర అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నాం. వీటిలో శిక్షణ పొందేవారిలో 99 శాతం మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయి. నియోజకవర్గంలో సహారా ఎలివేటెడ్ రోడ్డు, రింగ్ రోడ్డు పనుల్లో ఇళ్లు కోల్పోయిన బాదితులందరికీ పునరావాసం కల్పించేందుకు కృషి చేస్తున్నా. ఇక మహిళల భద్రత విషయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాను. రాత్రి ఆలస్యంగా విధుల ముగించుకొని ఇంటికి వెళ్లేవారు, కాలేజీ, పాఠశాలలకు వెళ్లే విద్యార్థినుల కోసం నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా కొన్ని పథకాలను ప్రారంభించాం. ఇందుకు బాంద్రా అడిషనల్ పోలీసు కమిషనర్‌తో సమావేశమై కార్యాచరరణ రూపొందించాం. స్థానిక ప్రజలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. 15 రోజులకోసారి మేం సమావేశమవుతున్నాం. ఈ బృందాలు మహిళలకు అంతగా సురక్షితం కాని ప్రాంతాలను గుర్తించాయి. రైల్వే స్టేషన్ పరిసరాల్లో కూడా సీసీటీవీలు, ప్రీ-పెయిడ్ ట్యాక్సీలు అందుబాటులో ఉండేలా చూస్తున్నాం. ఎంఎన్ఎస్ అభ్యర్థి ఈ ఎన్నికల్లో నిలబడకపోవడం నా విజయంపై ఎలాంటి ప్రభావం చూపబోదు. 2009లో కూడా నాకు సుమారు 1.75 లక్షల మెజార్టీ వచ్చింది. 3 లక్షలకుపైగా ఓట్లు వచ్చాయి. శివసేన, ఎంఎన్ఎస్ అభ్యర్థులిద్దరికీ కలిపి కూడా మూడు లక్షల ఓట్లు రాలేదు. మూడు దశాబ్దాల రాజకీయ నేపథ్యం.. దత్ కుటుంబీకులు గత 30 ఏళ్లకుపైగా రాజకీయాల్లో రాణిస్తున్నారు. సునీల్ దత్ సతీమణి నర్గీస్ 1980లో రాజ్యసభ సభ్యురాలిగా ఎంపికయ్యారు. 1984లో వాయవ్య ముంబై నుంచి కాంగ్రెస్ టికెట్‌పై నెగ్గిన సునీల్ దత్... ఆ ఎన్నికలో బీజేపీ సిట్టింగ్ ఎంపీ రామ్‌జెఠ్మలానీని 1,54,640 ఓట్ల తేడాతో ఓడించారు. తర్వాత 1989, 1991 లోక్‌సభ ఎన్నికల్లోనూ నెగ్గారు. 1993లో జరిగిన ముంబై వరుస బాంబు పేలుళ్ల ఘటనతో తనయుడు సంజయ్‌దత్ కు సంబంధం ఉన్నట్టు ఆరోపణలు రావడంతో సునీల్‌దత్ సుమారు ఆరేళ్లపాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆ సమయంలో 1996, 1998లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వాయవ్య ముంబై నుంచి శివసేన అభ్యర్థి మధుకర్ సర్ పోత్దార్ విజయం సాధించారు. 2004లో సునీల్‌దత్ మళ్లీ పోటీచేసి నెగ్గి, కేంద్రమంత్రి పదవి చేపట్టారు. 2005 మేలో సునీల్‌దత్ మృతి చెందడంతో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన కుమార్తె ప్రియాదత్ విజయం సాధించారు. -
మహిళలకు ప్రాధాన్యం అంతంతే
మహిళలకు ప్రాధాన్యమనే మాటకు అర్ధమే లేకుండాపోయింది. 33 నుంచి 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు గొప్పలు చెబుతున్నప్పటికీ ఎన్నికల విషయానికొచ్చేసరికి ఆయా పార్టీలు మహిళలకు ఇస్తున్న సీట్లు తక్కువే. సాక్షి, ముంబై: రాజకీయాల్లో మహిళలకు ప్రాధాన్యమిస్తున్నామని వివిధ పార్టీలు ఢంకా బజాయిస్తున్నప్పటికీ అది ఆచరణలో అంతంతగానే ఉంది. మహిళలకు పెద్ద పీట వేస్తున్నామని, 33 శాతం నుంచి 50 శాతం వరకు రిజర్వేషన్లు కల్పిస్తున్నామని గొప్పలు చెబుతున్నప్పటికీ ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో అతి తక్కువ సంఖ్యలో మహిళలు పోటీ చేస్తుండడం ఈ సందర్భంగా గమనార్హం. 2009 ఎన్నికలతో పోలిస్తే ఈసారి తక్కువ మంది మహిళా అభ్యర్థులు లోక్‌సభ ఎన్నికల బరిలో దిగారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరఫున 25 మంది పురుష అభ్యర్థులు బరిలోకి దిగగా, మహిళా అభ్యర్థి మాత్రం ఒక్కరే. 2009లో కూడా ఒక్క మహిళే పోటీ చేశారు. అదేవిధంగా శివసేనలో 19 మంది పురుష అభ్యర్థులు పోటీ చేస్తుండగా, కేవలం ఒక టికెట్ మాత్రమే మహిళకు ఇచ్చారు. 2009లో శివసేన తరఫున 20 మంది పురుష అభ్యర్థులు బరిలోకి దిగగా, అప్పుడు కూడా మహిళా అభ్యర్థి ఒక్కరే. ప్రస్తుతం బీజేపీ తరఫున 21 మంది పురుష అభ్యర్థులు, ముగ్గురు మహిళలు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా 2009లో 24 మంది పురుష అభ్యర్థులు పోటీ చేయగా, కేవలం ఒక మహిళా అభ్యర్థి తలపడ్డారు. ప్రస్తుత ఎన్నికల్లో ఎన్సీపీ తరఫున 18 మంది పురుష అభ్యర్థులు బరిలో ఉండగా, ముగ్గురు మహిళలు తలపడుతున్నారు. 2009లో ఎన్సీపీ తరఫున 17 మంది పురుష అభ్యర్థులు, ముగ్గురు మహిళలు బరిలోకి దిగారు. ఎమ్మెన్నెస్ తరఫున 10 మంది పురుష అభ్యర్థులు పోటీ చేయగా, ఒక్క మహిళ కూడా బరిలోకి దిగకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 2009లో ఎమ్మెన్నెస్ తరఫున ఏడుగురు పురుషులు పోటీ చేయగా, నలుగురు మహిళలు బరిలో దిగారు. అయితే మహిళా అభ్యర్థుల సంఖ్య స్వల్పంగా ఉండడానికిగల కారణాలను ఆయా పార్టీల అధికార ప్రతినిధులు స్పష్టంగా చెప్పలేకపోయారు. ఈ విషయమై బీజేపీ అధికార ప్రతినిధి మాధవ్ భండారీ మాట్లాడుతూ.. ప్రతి స్థాయిలో మహిళా నాయకత్వాన్ని పెంచేం దుకు తమ పార్టీ ప్రయత్నిస్తోందన్నారు. శివసేన అధికార ప్రతినిధి నీలం గోరె మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలో జరిగిన సమావేశాల్లో తమ పార్టీ అధినేత ఉద్ధవ్‌ఠాక్రే మహిళలు ముందుకు రావాలని పిలుపునిచ్చారన్నారు. అయినప్పటికీ అతితక్కువ మంది మహిళలు ముందుకొచ్చారన్నారు.వీరిలో అనేకమంది విధానసభ లేదా మేయర్ స్థాయిలో పోటీ చేయడంపైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారన్నారు. ఇదే విషయమై కాంగ్రెస్ అధికార ప్రతినిధి సచిన్ సావంత్ మాట్లాడుతూ..మహిళలు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని రాహుల్ పిలుపునిస్తున్నారని పేర్కొన్నారు. -
ప్రియాదత్ పై పోటీ చేయడం లేదు: ప్రీతి జింటా
రానున్న లోకసభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని బాలీవుడ్ తార ప్రీతి జింటా స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున లోకసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వచ్చిన వార్తలను జింటా ఖండించారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాదత్ పై భారతీయ జనతా పార్టీ తరపున పోటీకి సిద్దమవుతున్నట్టు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని ఆమె అన్నారు. నార్త్, సెంట్రల్ ముంబై నియోజకవర్గంలో ప్రియా దత్ పై ప్రీతి జింటాను పోటీకి దింపాలనే ఆలోచనలో బీజేపీ ఉందనే వార్తలు మీడియాలో వచ్చాయి. ట్విటర్ లో ఓ ఫాలోవర్ అడిగిన ప్రశ్నకు సీరియస్ గా స్పందించారు. ఆ వార్త ఎక్కడ చదివావు. ఆ కథనాన్ని ప్రింట్ చేసిన పేపర్ చింపేయ్. ఆవార్తలో వాస్తవం లేదు అని ప్రీతి ట్వీట్ చేసింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఐపీఎల్ జట్టకు సహ భాగస్వామి ఉన్న ప్రీతి జింటా స్వంత బ్యానర్ పై ఇష్క ఇన్ పారిస్ అనే చిత్రాన్ని నిర్మించింది. -
‘పవర్’ పోరు షురూ!
సాక్షి, ముంబై: ముందుగా హెచ్చరించినట్లుగానే దక్షిణ ముంబై పార్లమెంట్ సభ్యుడు సంజయ్ నిరుపమ్ కాందీవలిలోని రిలయన్స్ ఎనర్జీ కార్యాలయం ముందు సోమవారం ఆందోళనకు దిగారు. ఆయనకు ఎంపీ ప్రియాదత్ కూడా మద్దతు పలికారు. విద్యుత్ టారిఫ్‌ను తగ్గించకపోతే ఆందోళనకు దిగుతామని వారంరోజుల క్రితం నిరుపమ్ హెచ్చరించిన విషయం తెలి సిందే. తగ్గించేవరకు కార్యాలయం ముందునుంచి కదిలేదిలేదని భీష్మించుకు కూర్చున్నారు. వందల సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పాల్గొన్న ఈ ఆందోళనలో నిరుపమ్ ప్రసంగిస్తూ... ‘విద్యుత్ టారిఫ్‌ను తగ్గిస్తూ రిలయన్స్ కంపెనీ ప్రక టన చేసేవరకు ఇక్కడి నుంచి కదిలేదిలేదు. మొండికేస్తే మా పార్టీ ఎంపీలు నిరవధిక నిరాహార దీక్షకు దిగుతార’ని హెచ్చరించారు. రిలయన్స్ కంపెనీ చైర్మన్ అనిల్ అంబానీని ‘దొంగ’ అంటూ నినాదాలు చేశారు. గతంలోనే ఈ విషయమై సంజయ్ నిరుపమ్ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌కు లేఖ రాశారు. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ చార్జీలను తగ్గించినప్పుడు ముంబై లోకూడా ఎందుకు తగ్గించకూడదని లేఖలో ప్రశ్నించారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా రిలయన్స్ చైర్మన్ అనిల్ అంబానీకి కూడా నిరుపమ్ లేఖ రాశారు. టారిఫ్ తగ్గించకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. కాగా ఇరువురి నుంచి ఎటువంటి స్పందన కనిపించకపోవడంతో నిరుపమ్ ఆందోళనబాట పట్టారు. ఫిక్స్డ్ చార్జీలు, ఆస్తుల క్రమబద్ధీకరణ పేరుతో వసూలు చేస్తున్న చార్జీల విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో పాల్గొన్న ఎంపీ ప్రియాద త్ మాట్లాడుతూ... ముంబై, శివారు ప్రాంతాలకు ఏకీకృత టారిఫ్ విధానముండాలన్నారు. టారిఫ్‌ను తగ్గించకపోతే ఆందోళన మరింత ఉధృతమవుతుందని హెచ్చరించారు. తమ పార్టీ నేతలందరు కూడా ఈ ఆందోళనలో పాల్గొంటారని, అంతవరకు పోకుండా ముందుగానే టారిఫ్‌ను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇదిలాఉండగా నారాయణ్ రాణే నేతృత్వంలోని కాంగ్రెస్ మంత్రుల బృందం కూడా ఈ విషయంపై స్పందించింది. 10 నుంచి 20 శాతం టారిఫ్‌ను తగ్గించాలంటూ మంత్రుల బృందం డిమాండ్ చేసింది. ఇప్పటికే పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో సతమతమవుతున్న పేదలకు విద్యుత్ బిల్లులు మరింత భారంగా మారాయని, చార్జీలు తగ్గించాలని గత వారం కిందట శివసేన నేత అనిల్ పరబ్ భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొంది వినియోగదారుల బిల్లులు తగ్గించాలని రిలయన్స్ ఎనర్జీ కంపెనీని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ధర్నా, ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పడు అదే బాట కాంగ్రెస్ నాయకులు పట్టారు. ఆప్‌ను అడ్డుకునేందుకే..! ఢిల్లీలో ప్రారంభించినట్లుగానే ముంబైలో కూడా విద్యుత్ ఉద్యమాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కడ ప్రారంభిస్తుందోనన్న భయంతోనే కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ఈ ఆందోళనకు దిగినట్లు రాజకీయ పండితులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా పార్టీ విస్తరణపై కన్నేసిన ఆప్ పుణే, ముంబైలలో ఇప్పటికే పార్టీ కార్యకలాపాలను వేగం చేసింది. దీంతో ఆ పార్టీ కంటే ఓ అడుగు ముందేసి విద్యుత్ చార్జీలను తగ్గించిన ఘనత తమ పార్టీకే దక్కాలని కాంగ్రెస్ నేతలు ఈ వ్యూహం అమలు చేసినట్లుగా చెబుతున్నారు. అందులోభాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకులే పోరాట ం చేస్తున్నారని చెబుతున్నారు. ఈ ఆందోళన తర్వాత ఆప్ ఉద్యమాన్ని ప్రారంభించినా ఆ పార్టీకి కీర్తి దక్కకుండా చేయడమే కాంగ్రెస్ నేతల వ్యూహంగా భావిస్తున్నారు. ఎంఆర్‌ఈసీ చట్టం-2003 ప్రకారమే.. రాష్ట్రంలో విద్యుత్ టారిఫ్‌ను మహారాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ చట్టం-2003 ప్రకారమే వసూలు చేస్తున్నట్లు రిలయన్స్ ఇన్ఫ్రా ప్రకటించింది. టారిఫ్‌పై నిర్ణయాన్ని ఎంఆర్ఈసీకే వదిలేయాలని సుప్రీం కోర్టు కూడా ప్రకటించిందని, ఈ విషయంలో దేశ, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాలు కూడా జోక్యం చేసుకోలేవని ఆ కంపెనీ ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు.