అభివృద్ధి పనులే గెలిపిస్తాయి: ప్రియాదత్ | Only constituency development to win general elections, says Priya dutt | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనులే గెలిపిస్తాయి: ప్రియాదత్

Published Wed, Apr 23 2014 1:19 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM

అభివృద్ధి పనులే గెలిపిస్తాయి: ప్రియాదత్ - Sakshi

అభివృద్ధి పనులే గెలిపిస్తాయి: ప్రియాదత్

* మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా
* యువత ఉపాధికి పెద్దపీట వేస్తా

శ్రీనివాస్ గుండారి, సాక్షి-ముంబై: ప్రియాదత్.. బాలీవుడ్ నటులు సునీల్ దత్, నర్గీస్ దంపతుల రాజకీయ వారసురాలిగా మహారాష్ర్ట రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుంటున్నారు. ముంబై వాయవ్య స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటికే రెండుసార్లు జయభేరి మోగించిన ఈమె.. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీజేపీ తరఫున పోటీపడుతున్న ప్రమోద్ మహాజన్ కూతురు పూనమ్ మహాజన్ గట్టిపోటీ ఇస్తున్నా.. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులే తన విజయానికి బాటలు పరుస్తాయని అంటున్న ప్రియాదత్ ‘సాక్షి’తో ముచ్చటించారు. అభిప్రాయాలు ఆమె మాటల్లోనే...
 
 మా నియోజకవర్గంలోని యువత కోసం పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఉన్నాం. కోటక్ మహీంద్ర వంటి సంస్థలతో కలిసి పనులు చేపట్టాం. మూడు నెలల్లో కంప్యూటర్, ఆర్కిటెక్చర్, హాస్పిటాలిటీ తదితర అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నాం. వీటిలో శిక్షణ పొందేవారిలో 99 శాతం మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయి. నియోజకవర్గంలో సహారా ఎలివేటెడ్ రోడ్డు, రింగ్ రోడ్డు పనుల్లో ఇళ్లు కోల్పోయిన బాదితులందరికీ పునరావాసం కల్పించేందుకు కృషి చేస్తున్నా. ఇక మహిళల భద్రత విషయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాను. రాత్రి ఆలస్యంగా విధుల ముగించుకొని ఇంటికి వెళ్లేవారు, కాలేజీ, పాఠశాలలకు వెళ్లే విద్యార్థినుల కోసం నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా కొన్ని పథకాలను ప్రారంభించాం.
 
 ఇందుకు బాంద్రా అడిషనల్ పోలీసు కమిషనర్‌తో సమావేశమై కార్యాచరరణ రూపొందించాం. స్థానిక ప్రజలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. 15 రోజులకోసారి మేం సమావేశమవుతున్నాం. ఈ బృందాలు మహిళలకు అంతగా సురక్షితం కాని ప్రాంతాలను గుర్తించాయి. రైల్వే స్టేషన్ పరిసరాల్లో కూడా సీసీటీవీలు, ప్రీ-పెయిడ్ ట్యాక్సీలు అందుబాటులో ఉండేలా చూస్తున్నాం. ఎంఎన్‌ఎస్ అభ్యర్థి ఈ ఎన్నికల్లో నిలబడకపోవడం నా విజయంపై ఎలాంటి ప్రభావం చూపబోదు. 2009లో కూడా నాకు సుమారు 1.75 లక్షల మెజార్టీ వచ్చింది. 3 లక్షలకుపైగా ఓట్లు వచ్చాయి. శివసేన, ఎంఎన్‌ఎస్ అభ్యర్థులిద్దరికీ కలిపి కూడా మూడు లక్షల ఓట్లు రాలేదు.
 
 మూడు దశాబ్దాల రాజకీయ నేపథ్యం..
 దత్ కుటుంబీకులు గత 30 ఏళ్లకుపైగా రాజకీయాల్లో రాణిస్తున్నారు. సునీల్ దత్ సతీమణి నర్గీస్ 1980లో రాజ్యసభ సభ్యురాలిగా ఎంపికయ్యారు. 1984లో వాయవ్య ముంబై నుంచి కాంగ్రెస్ టికెట్‌పై నెగ్గిన సునీల్ దత్... ఆ ఎన్నికలో బీజేపీ సిట్టింగ్ ఎంపీ రామ్‌జెఠ్మలానీని 1,54,640 ఓట్ల తేడాతో ఓడించారు. తర్వాత 1989, 1991 లోక్‌సభ ఎన్నికల్లోనూ నెగ్గారు. 1993లో జరిగిన ముంబై వరుస బాంబు పేలుళ్ల ఘటనతో తనయుడు సంజయ్‌దత్ కు సంబంధం ఉన్నట్టు ఆరోపణలు రావడంతో సునీల్‌దత్ సుమారు ఆరేళ్లపాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆ సమయంలో 1996, 1998లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వాయవ్య ముంబై నుంచి శివసేన అభ్యర్థి మధుకర్ సర్ పోత్దార్ విజయం సాధించారు. 2004లో సునీల్‌దత్ మళ్లీ పోటీచేసి నెగ్గి, కేంద్రమంత్రి పదవి చేపట్టారు. 2005 మేలో సునీల్‌దత్ మృతి చెందడంతో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన కుమార్తె ప్రియాదత్ విజయం సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement