అభివృద్ధివైపే ఓటరు మొగ్గు
అభ్యర్థుల నేరచరిత్ర కంటే గతంలో చేసిన అభివృద్ధికే మహారాష్ట్ర ఓటరు ప్రాధాన్యమిస్తున్నాడు. ఈ విషయం రెండు స్వచ్ఛంద సంస్థలు ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో స్పష్టమైంది. అయితే కానుకల ఆశ చూపి ఓట్లు వేయించుకోవడాన్ని మాత్రం అనేకమంది ఓటర్లు ఇష్టపడడం లేదు. అది అక్రమమని వారు భావిస్తున్నారు. ఎంపీల పనితీరుపై ఓటర్లు ఇచ్చిన పాయింట్లలో గురుదాస్ కామత్‌కి అందరికంటే ఎక్కువ దక్కాయి.
సాక్షి, ముంబై: రాష్ట్రంలో 70 శాతం మంది ప్రజలు అభ్యర్థుల నేరచరిత్రను విస్మరిస్తున్నట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో నేరచరితులైన అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ వారు చేసిన అభివృద్ధి పనులను దృష్టిలో ఉంచుకొని ప్రజలు వారికే ఓటు వేయడానికి ఆసక్తి చూపుతున్న ట్లు స్పష్టమైంది. రాజకీయ నాయకుల పట్ల ప్రజలకు ఉన్న మనోభావాలను తెలుసుకునేందుకు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫామ్స్ (ఏడీఆర్), దక్ష్ అనే సేవా సంస్థలు అధ్యయనం చేశా యి.
ఇందులో వెల్లడైన వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పార్టీలను దృష్టిలో పెట్టుకొని 7.73 శాతం మంది ఓట్లు వేయగా, అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని 7.24 శాతం మంది ఓట్లు వేస్తున్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి అభ్యర్థి కోసం 7.53 శాతంమంది, కులాభిమానంతో 5.69 శాతం మంది, ఇచ్చే కానుకలు (చీరలు, మద్యం, డబ్బు) ఆశపడి 5.31 శాతం మంది ఓట్లు వేస్తున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది.
కానుకలిచ్చి ఓట్లు వేయించుకోవడం అక్రమమని 62.07 శాతం మంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అభ్యర్థులు తమ గెలుపు కోసం కానుకలు పంచుతున్నారని 54.09 శాతం మంది అభిప్రాయపడ్డారు. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లోని ట్రాఫిక్ సమస్య, మహిళలకు భద్రత, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల తదితర అంశాలపై ఎంపీలు చేసిన పనులకు ప్రజలు పాయింట్స్ ఇచ్చారని అధ్యయన నిర్వాహకులు పేర్కొన్నారు.
ఇందులో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ ప్రియాదత్ (ముంబై నార్త్ సెంట్రల్)కు అతి తక్కువ 4.01 పాయింట్లు లభించగా, తర్వాత కాంగ్రెస్ ఎంపీ మిలింద్ దేవరా (ముంబై సౌత్)కి 4.63 పాయింట్లు వచ్చాయి. నీలేష్ రాణే (రత్నగిరి, సింధుదుర్గ్) 4.82, ఏక్‌నాథ్ గైక్వాడ్ (ముంబై సౌత్ సెంట్రల్)కి 4.91, సంజయ్ నిరుపమ్ (ముంబై నార్త్)కు 5.21, గురుదాస్ కామత్ (ముంబై నార్త్ వెస్ట్)కి 6.33 పాయింట్లు వచ్చాయి.
ఇదిలావుండగా మావల్ ఎంపీ బాబర్ జి దంషీ (శివసేన)కు అత్యధికంగా 8.4 పాయింట్లు వచ్చాయి. తర్వాత బీజేపీకి చెందిన హరిశ్చంద్ర (డోంగ్రి)కు 7.43, ఎన్సీపీ ఎంపీ సంజయ్ దీనా పాటిల్‌కు (నార్త్ ముంబై ఈస్ట్)కు 5.3 పాయింట్లు వచ్చాయి.
కాగా అధ్యయనం చేపట్టే సమయంలో ఓటర్లు పాలనపై వేసుకున్న అంచనాలు, ఎంపీలు చేపట్టిన అభివృద్ధి పనులను బేరీజు వేశారు. ప్రజలు ఊహించుకున్నంత మేర పనులు ఎంపీలు చేయకపోవడంతో కొంత అసంతృప్తి వ్యక్తమవుతోందని రాష్ట్ర ఎలక్షన్ వాచ్ సంస్థ సభ్యుడు శరద్ తెలిపారు.
రాష్ట్రానికి చెందిన 48 మంది ఎంపీల పనితీరును పరిశీలించగా కేవలం 12 మంది ఎంపీలు మాత్రమే నయమని ఈ సర్వేలో తేలింది. అధ్యయనం నిర్వహించిన టాప్‌టెన్‌లో పట్టణాల్లో చక్కని రహదారులు, తాగు నీరు, పాఠశాలలను ముఖ్యమైన అంశాలుగా పరిగణిస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, గృహావసరాలకు వ్యవసాయ ఉత్పత్తుల ధరలు, ఎరువులు, విత్తనాలపై సబ్సిడీ, ఆస్పత్రులు, సాగునీటి ప్రాజెక్టులున్నాయి.