తెలంగాణ ఎన్నికల్లో మైనారిటీల ఓట్లే కీలక పాత్ర పోషించనున్నాయి. 30కిపైగా నియోజకవర్గాల్లో మైనారిటీ ఓటర్లే అభ్యర్థుల గెలుపోటములు నిర్ణయిస్తారు. హైదరాబాద్ పాతబస్తీలో అయితే మజ్లిస్‌కి మినహా మరో పార్టీకి అవకాశమే లేదు. ఇక ఏ పార్టీ అధికారంలోకి రావాలో డిసైడ్ చేసేది ఆ 30 నియోజకవర్గాలే. ఒకప్పుడు మైనారిటీలు కాంగ్రెస్‌కి అండగా నిలిచేవాళ్ళు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ ఓట్లన్నీ గులాబీ గూటికే చేరుతున్నాయి. ఈసారి మైనారిటీలు ఎవరిని కరుణించబోతున్నారు?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నడూ లేనివిధంగా ఈసారి కులాలు, మతాల ఓట్లపై బహిరంగంగానే చర్చలు జరుగుతున్నాయి. అన్ని ప్రధాన పార్టీలు కులాలవారీగా, మతాల వారీగా ఓట్ల వేట సాగిస్తున్నాయి. అందుకు అవసరమైన తాయిలాలు ప్రకటిస్తున్నాయి. హామీలిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మైనారిటీల కోసం ఒక డిక్లరేషన్ కూడా ప్రకటించింది. కాంగ్రెస్ డిక్లరేషన్‌పై అటు బీజేపీ.. ఇటు బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. ఇక మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మైనారిటీలంతా తమ మిత్రపక్షం బీఆర్ఎస్‌కు మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అన్ని పార్టీల అభ్యర్థులు కూడా సామాజికవర్గాల వారీగా ఓట్ల వివరాలు సేకరిస్తూ..ఎవరికి కావాల్సిన హామీలు వారికిస్తున్నారు.
గతంలో ఎన్నికలు వస్తే మా ఊరికి, పల్లెకు, కాలనీకి, నగరానికి ఏం చేస్తారంటూ...ఆయా పార్టీల తరపున నిలబడే అభ్యర్థులను అక్కడి ప్రజలు ప్రశ్నించే వాళ్ళు. కానీ ఇప్పుడు కాలం మారింది. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులను మా కమ్యూనిటీకి ఏం చేస్తారు?..మా మతానికి ఎం చేస్తారు? అని అడుగుతున్నారు. కోట్లు గుమ్మరించి ప్రచారం చేసుకుంటున్న అభ్యర్థులు కులం, మతానికి ప్రాధాన్యత ఇస్తూ ఆ దిశగానే ప్రచారం సాగిస్తున్నారు. ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ గ్రామంలోను, పట్టణంలోనూ ముస్లిం మైనారిటీలు నివసిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అందరూ ఒక కుటుంబం మాదిరిగానే ఉంటారు. ఒక మాటకే కట్టుబడతారు. కాని పట్టణాలు, నగరాల్లోని బస్తీల్లో మాత్రం ఎవరి దారి వారిదే. ఎన్నికల సమయంలో ఎవరి పార్టీ వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తారు. రాష్ట్రంలో మొత్తం 119 నియోజకవర్గాలుంటే...హైదరాబాద్ పాతబస్తీలోని ఏడు నియోజకవర్గాల్లో మజ్లిస్ మినహా మరో పార్టీ గెలుస్తున్న ఉదంతాలు కనిపించడంలేదు. ఇక మిగిలిన 112 నియోజకవర్గాల్లో 30 సెగ్మెంట్లలో ముస్లిం మైనారిటీలు కీలక పాత్ర పోషిస్తారు. అభ్యర్థుల గెలవాలన్నా..ఓడించాలన్నా వీరిది నిర్ణయాత్మక పాత్రగా ఉంటోంది.
హైదరాబాద్ మహానగరంలోని జూబ్లీహిల్స్, రాజేంద్ర నగర్, నిజామాబాద్ అర్బన్ తో కలిపి మూడు నియోజకవర్గాల్లో లక్షకు పైగా ముస్లిం మైనారిటీ ఓట్లు ఉన్నాయి. అందుకే ఈసారి కాంగ్రెస్ పార్టీ జూబిలీ హిల్స్‌లో మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌ను బరిలో దించింది. ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, కరీంనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో 60 వేల నుంచి లక్ష లోపు వరకు మైనారిటీ ఓట్లు ఉన్నట్లు లెక్కలు చెప్తున్నాయి. 50వేలకు పైగా మైనారిటీలు ఉన్న నియోజకవర్గాలుగా ముషీరాబాద్, బోధన్, మహబూబ్ నగర్, జహీరాబాద్, గోషామహల్ ఉన్నాయి. ఇక అంబర్ పేట, సికింద్రాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి సెగ్మెంట్లలో 40వేలకు పైగా మైనారిటీ ఓట్లు ఉన్నట్లు సమాచారం.
30 వేల నుంచి 40 వేల వరకు మైనారిటీ ఓట్లున్న నియోజకవర్గాలు 8..20 వేల నుంచి 30 వేల వరకు ఉన్న నియోజకవర్గాలు రెండు ఉన్నాయి. ఇక ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో 12వేలు మైనారిటీ ఓటర్లు ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో ఈ 30 నియోజకవర్గాల్లో 25 సీట్లను గులాబీ పార్టీ గెలుచుకుంది. మూడు స్థానాలను కాంగ్రెస్ దక్కించుకుంది. గోషా మహల్ నియోజకవర్గంలో రాజాసింగ్ కాషాయజెండా ఎగరేసారు. తాజా ఎన్నికల్లో కూడా గులాబీ పార్టీతో ఎంఐఎం స్నేహపూర్వకంగానే ఉంది. తాము పోటీ చేయనిచోట బీఆర్ఎస్‌కు ఓటేయాలని అసదుద్దీన్ ఒవైసీ మైనారిటీలకు పిలుపునిచ్చారు. మరి మైనారిటీలు ఎవరి మాట వింటారో.. ఎవరి హామీలను విశ్వసిస్తారో.. ఎవరిని అందలం ఎక్కిస్తారో చూడాలి.
చదవండి: నిజామాబాద్ అర్బన్ ఇండిపెండెంట్ అభ్యర్థి ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment