సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయంపై కాంగ్రెస్‌లోని ఓ వర్గం నేతలు ‘రాహుల్ బృందం’పై మాటల దాడికి దిగారు.
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయంపై కాంగ్రెస్‌లోని ఓ వర్గం నేతలు ‘రాహుల్ బృందం’పై మాటల దాడికి దిగారు. రాహుల్ సలహాదారులు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోలేదని విమర్శించారు. పోల్ మేనేజ్‌మెంట్‌లో ఎటువంటి పాలనానుభవం లేని వ్యక్తులే కీలక నిర్ణయాలు తీసుకున్నారంటూ కాంగ్రెస్ నేత మిలింద్ దేవ్‌రా ట్విట్టర్‌లో విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో పార్టీ వైఫల్యంపై కలత చెందే తాను ఈ విమర్శలు చేస్తున్నానని...పార్టీపై తనకు అపార నమ్మకం ఉందన్నారు. పార్టీ తిరిగి పుంజుకోవాలన్నదే తన వ్యాఖ్యల వెనక ఉన్న ఉద్దేశమని చెప్పుకొచ్చారు. ఇకపై క్షేత్రస్థాయిలో పాలనానుభవం ఉన్న వారికే నాయకత్వ పదవులు ఇవ్వాలని సూచించారు.
దేవ్‌రా వ్యాఖ్యలను పార్టీలోని సీనియర్ నేత సత్యవ్రత్ చతుర్వేది సమర్థించారు. పార్టీలోని సమస్యలు, లోటుపాట్లను సరిదిద్దుకునేందుకు నిష్కర్షగా, నిజాయితీగా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, ఏఐసీసీ కార్యదర్శి ప్రియాదత్ గురువారం పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిశారు. ప్రజలతో పార్టీ నేతలు మమేకం కాకపోవడం వల్లే మహారాష్ట్రలో పార్టీ దెబ్బతిన్నదని ఆమెకు వివరించారు. దేవ్‌రా, ప్రియాదత్‌లు లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలవడం తెలిసిందే. మరోవైపు ఈ నెల 24న ఢిల్లీలో జరిగే సమావేశంలో కాంగ్రెస్ పార్టమెంటరీ పార్టీ (సీపీపీ) చైర్‌పర్సన్‌గా సోనియా గాంధీ తిరిగి ఎన్నికయ్యే అవకాశం ఉంది.