తల్లీకొడుకులవల్ల దేశం నాశనం
సోనియా, రాహుల్‌లపై విరుచుకుపడిన మోడీ
వారి ప్రభుత్వం పదేళ్లుగా దేశాన్ని లూటీ చేస్తోంది
అరవై ఏళ్లలో ఇంత చెత్త ప్రభుత్వం మరోటి లేదు
ఇప్పుడు కేంద్రంలో బలమైన సర్కారు అవసరం
అధికారమివ్వండి... మీ జీవితాల్లో మార్పు తీసుకొస్తా
హోషియార్‌పూర్/పఠాన్‌కోట్: ‘‘తల్లీకొడుకులు నడుపుతున్న ప్రభుత్వం గత పదేళ్లుగా దేశాన్ని లూటీ చేస్తోంది. ఆ తల్లీకొడుకులు దేశాన్ని నాశనం చేశారు. ఆమె గత పదేళ్లలో కేవలం తన కుమారుడికి మంచి భవిష్యత్ కోసమే పనిచేశారు. ఆమె ఆందోళన అంతా అతడి భవిష్యత్తు గురించే.. దేశం గురించి కాదు’’ అంటూ బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుమారుడు ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలపై తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. మోడీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం పంజాబ్‌లోని హోషియార్‌పూర్, పఠాన్‌కోట్, లూథియానాల్లో బహిరంగ సభల్లో ప్రసంగించారు. సోనియా, రాహుల్‌ల పేర్లు ప్రస్తావించకుండానే వారిపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రజలను దగా చేసిందని.. అరవై ఏళ్ల భారత చరిత్రలో ఇంత చెత్త, అవినీతి, అప్రతిష్టాకరమైన ప్రభుత్వం ఏదీ లేదని దుమ్మెత్తిపోశారు. ‘‘మన్మోహన్‌సింగ్ ఇక్కడ (పంజాబ్) పనిచేశారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేశారు. కానీ ఆయన సొంత ప్రాంతానికి తిరిగి మేలు చేయటం గురించి పట్టించుకోలేదు’’ అంటూ ప్రధానిపైనా మోడీ విమర్శలు చేశారు.
నేను అధికారంలోకి రాకుండా అడ్డుకునే యత్నాలు...
‘‘ఇప్పుడు కావాల్సింది.. తల్లీ కొడుకులు అందించే ప్రాణవాయువుతో నడిచే మృత, బలహీన, బీటలువారిన ప్రభుత్వం కాదు. యూపీఏ చేసిన విధ్వంసం నుంచి దేశాన్ని గట్టెక్కించాలంటే కేంద్రంలో ఒక బలమైన ప్రభుత్వం అవసరం’’ అని పేర్కొన్నారు. తనను అధికారంలోకి రాకుండా అడ్డుకునే ఏకైక సూత్రంతో కాంగ్రెస్ పలు ఎన్‌జీఓలతో చేతులు కలిపిందని మోడీ వ్యాఖ్యానించారు. కానీ బీజేపీకి పెను తుపానులా మద్దతు ఉందని.. వారు తనను అడ్డుకోవటంలో విఫలమవటం ఖాయమని మోడీ పేర్కొన్నారు. యూపీఏ ప్రభుత్వం చేసే శుష్క వాగ్దానాలతో జనం విసిగిపోయారన్నారు. ‘‘నా ఉద్దేశాలు చాలా స్పష్టం.. మీ జీవితాల్లో నేను మార్పు తీసుకొస్తా. విదేశాలకు తరలించి దాచుకున్న నల్లధనాన్ని బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం తీసుకువస్తుంది’’ అని హామీ ఇచ్చారు.
మానవ వనరులను విస్మరించింది..: ‘‘గత పదేళ్లలో పది కోట్ల ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన యూపీఏ ప్రభుత్వం కేవలం 1.25 కోట్ల ఉద్యోగాలు మాత్రమే కల్పించింది. అంతకుముందలి ఎన్‌డీఏ ప్రభుత్వం 6.5 కోట్ల ఉద్యోగాలు సృష్టించింది. మానవ వనరుల అభివృద్ధిని యూపీఏ విస్మరించింది. పారిశ్రామిక వ్యతిరేక విధానాలను అవలంబించింది. పారిశ్రామిక ముడిసరుకుల నిర్వహణలో విఫలమైంది. దేశంలోని చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు తగినన్ని నిధులు సమకూర్చటంలో విఫలమైంది. 10 లక్షల మంది యువతకు నైపుణ్యాల అభివృద్ధిలో సర్టిఫికెట్లు ఇస్తామని హామీ ఇచ్చి 18,000 మందికే సర్టిఫికెట్లు ఇవ్వగలిగారు’’ అంటూ యూపీఏ సర్కారుపై మోడీ విరుచుకుపడ్డారు. కాగా, అధికారంలోకి వస్తే సరిహద్దుల అవతలి నుంచి దేశంలోకి జరుగుతున్న మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌ను అరికడతామని, సరిహద్దు భద్రతను ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు.