సోనియా, రాహుల్ ఓటమి ఖాయం
యూపీ ప్రచారంలో నరేంద్ర మోడీ జోస్యం
కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఖాతా కూడా తెరవదు
ఓటు ద్వారా ప్రజలు ఆ పార్టీకి గుణపాఠం చెప్పనున్నారు
బాల్లియా/కుషీనగర్: సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొన్ని రాష్ట్రాల్లో ఖాతా కూడా తెరవదని, ఆ పార్టీలోని చాలా మంది హేమాహేమీలకు ఓటమి తప్పదని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ జోస్యం చెప్పారు. దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలకు కాంగ్రెస్ పార్టీయే కారణమని గుర్తించిన దేశ ప్రజలు ఆ పార్టీకి ఓటు ద్వారా తగిన గుణపాఠం చెప్పనున్నారన్నారు. ముఖ్యంగా రాయ్‌బరేలీ, అమేథీలలో తల్లీకొడుకులు (సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ) ప్రజాగ్రహానికి గురికాక తప్పదన్నారు. శనివారం ఉత్తరప్రదేశ్‌లోని బాల్లియా, కుషీనగర్‌లలో నిర్వహించిన బహిరంగ సభల్లో మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన యూపీఏ పాలనపై నిప్పులు చెరిగారు. యూపీఏ పాలనలో ఏసీ కార్యాలయాల్లో కూర్చున్న అధికారులు అవలంబించిన తప్పుడు విధానాల వల్ల రైతులు నష్టాల్లో కూరుకుపోయారని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వచ్చాక రైతులకు కనీస మద్దతు ధర విధానాన్ని ప్రక్షాళన చేస్తామన్నారు. తాను నీచ రాజకీయాలకు పాల్పడుతున్నట్లు సోనియా చేసిన విమర్శలను మోడీ తిప్పికొట్టారు. బీజేపీపై ఎంతగా బురదజల్లితే కమలం (బీజేపీ చిహ్నం) అంతగా వికసిస్తుందన్నారు. అలాగే సంపన్న కుటుంబంలో పుట్టిన వ్యక్తి నుంచి తాను నేర్చుకోవాల్సింది ఏమీ లేదని పరోక్షంగా రాహుల్‌గాంధీకి చురకలంటించారు.
యూపీలోని అధికార సమాజ్‌వాదీ పార్టీ, ప్రతిపక్ష బీఎస్పీ కూడా కాంగ్రెస్‌తో చేతులు కలిపి తాను అధికారంలోకి రాకుండా చూడాలని కుట్రపన్నుతున్నాయని మోడీ ఆరోపించారు. కానీ ఎవరెన్ని కుట్రలు పన్నినా ఈ ఎన్నికలు సుపరిపాలనకు నాంది పలుకుతాయన్నారు. జమ్మూలోని వైష్ణోదేవి ఆలయ దర్శనంతో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన తాను 1857 నాటి సిపాయిల తిరుగుబాటులో అమరుడైన మంగళ్ పాండే స్వస్థలం బాల్లియాలో ప్రచారం ముగించడం తన అదృష్టమన్నారు. దేశవ్యాప్తంగా 450 బహిరంగ సభల్లో పాల్గొన్నానని, 3డీ ప్రచారం ద్వారా 5,800 ప్రాంతాల్లోని లక్షలాది మంది ప్రజలకు చేరువయ్యానన్నారు.
ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌తో భేటీ:యూపీలో ప్రచారం ముగించుకున్న అనంతరం మోడీ ఢిల్లీలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్‌తో సమావేశయ్యారు. ఎన్నికల ప్రచారం తీరుతెన్నులను, భవిష్యత్ కార్యాచరణను ఆయనతో చర్చించారు. అంతకుముందు మాజీ ప్రధాని ఎ.బి. వాజ్‌పేయి ఇంటికి వెళ్లిన మోడీ ఆయన ఆశీర్వాదాలు అందుకున్నట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ను కూడా కలిసినట్లు ట్వీట్ చేశారు.