ఫండ్స్‌లో నేతల పెట్టుబడుల జోరు | Sonia Gandhi, Rahul Gandhi and Amar Singh big investors in mutual funds | Sakshi
Sakshi News home page

ఫండ్స్‌లో నేతల పెట్టుబడుల జోరు

Published Tue, May 6 2014 12:47 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

ఫండ్స్‌లో నేతల పెట్టుబడుల జోరు - Sakshi

న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ పథకాలవైపు సామాన్య ప్రజల్ని ఆకర్షించేందుకు, వారిచేత పెట్టుబడులు చేయించేందుకు ప్రభుత్వం, సెబీ వంటి నియంత్రణ సంస్థలు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలిస్తున్నాయో లేదో కానీ పెద్ద సంఖ్యలో రాజకీయ నాయకులు మాత్రం మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టినట్లు ఎన్నికల అఫిడవిట్లు వెల్లడిస్తున్నాయి. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ లాంటి కాంగ్రెస్ దిగ్గజాలతో సహా అరుణ్‌జైట్లీ, వరుణ్‌గాంధీ తదితర బీజేపీ నేతలు కూడా భారీగానే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌చేశారు. ఫండ్స్‌లో లక్షలు కుమ్మరించినవారిలో కాంగ్రెస్, బీజేపీతో పాటు అన్ని పార్టీల నేతలూ ఉన్నారు.

 అమర్‌సింగ్, జ్యోతిరాదిత్య సింధియా, అంబికాసోనీ, శశిథరూర్ లతో పాటు కొత్తగా రాజకీయ అరంగేట్రం చేసిన మాజీ బ్యాంకర్ మీరా సన్యాల్, ఇన్ఫోసిస్ మాజీ ఎగ్జిక్యూటివ్ వీబాలకృష్ణన్, భారత సాకర్‌జట్టు మాజీ కెప్టెన్ భైచుంగ్ భుటియా , బీజేపీ అభ్యర్ధి డ్రీమ్‌గర్ల్ హేమమాలిని  కూడా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీపడుతున్న అభ్యర్థుల అఫిడవిట్లు పరిశీలిస్తే లక్షల్లోనే కాదు, కొందరు అభ్యర్థులు కోట్ల రూపాయల్లో వివిధ మ్యూచువల్ ఫండ్ స్కీముల్లో ఇన్వెస్ట్ చేసినట్లు తేలింది.

 మోడీ దూరం...
 అయితే బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్ధి నరేంద్రమోడీ, ఆమ్‌ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్,బీజీపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, సమాజ్‌వాదీ పార్టీ సుప్రిమో ములాయంసింగ్‌యాదవ్,బీజేపీ ఫైర్‌బ్రాండ్ ఉమాభారతి మ్యూచువల్ ఫండ్స్‌కు దూరంగానే ఉన్నారు. కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్‌గాంధీ అఫిడవిట్ ప్రకారం ఆయన రూ.81 లక్షలు ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌చేస్తే ఆయన త ల్లి, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ రూ.82 లక్షలు వివిధ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌చేశారు. 2009 ఎన్నికల్లో వీరిద్దరు దాఖలు చేసిన అఫిడవిట్ల ప్రకారం అప్పుడు వీరికి ఫండ్స్‌లో ఎలాంటి పెట్టుబడులు లేవు.

 సమాజ్‌వాదీ పార్టీ మాజీ నేత, ఫతేపూర్ సిక్రీ నుంచి రాష్ట్రీయ లోక్‌దళ్ నేత అభ్యర్థిగా బరిలో దిగిన 58 ఏళ్ల అమర్‌సింగ్ తనకు రూ.100 కోట్ల అస్తులున్నట్లు ప్రకటించారు. అందులో రూ.41 కోట్లు చరాస్తులు కాగా, రూ.6.27 కోట్లు మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులున్నాయి. మరో బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ తాను రూ.2 కోట్లు ఫండ్స్ స్కీముల్లో పెట్టుబడులు చేసినట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ పేరుమీద ఫండ్స్‌లో ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్స్ లేకున్నా ఆయన సతీమణి పేర రూ.2 లక్షలున్నట్లు అఫిడవిట్‌లో తెలిపారు.

 మక్కువ చూపుతున్న కొత్త తరం...
 ఇప్పటికీ, బ్యాంకు డిపాజిట్లు, బంగారంలో మాత్రమే ఇష్టంగా పెట్టుబడులు చేసే పాతతరంతో పోలిస్తే  కొత్త తరం ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌చేసేందుకు ఎక్కువ మక్కువ చూపుతున్నారని ఇదే ట్రెండ్ రాజకీయ నేతలకు కూడా వర్తిస్తుందని  మ్యూచువల్‌ఫండ్ హౌసెస్ టాప్ ఎగ్జిక్యూటివ్స్ వెల్లడించారు. గ్వాలియర్ మహారాజాల వంశస్తుడు, విద్యుత్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఆయన కుటుంబీకుల మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ రూ.67 లక్షలు దాటలేదు. నాగాలాండ్ ముఖ్యమంత్రి, నైఫూరియో పవర్ సెక్టార్‌కు చెందిన వివిధ ఫండ్ స్కీముల్లో దాదాపు రూ.17 లక్షల దాకా ఇన్వెస్ట్ చేశారు.

డార్జిలింగ్ నుంచి బరిలో ఉన్న ఫుట్‌బాల్ ఛాంపియన్ భుటియా మ్యూచువల్ ఫండ్స్‌లో 4లక్షలు ఇన్వెస్ట్‌చేశాడు. బ్యాంకింగ్ రంగంనుంచి రాజకీయాల్లోకి వచ్చిన ముంబై సౌత్ ఆమ్‌ఆద్మీపార్టీ  అభ్యర్థి మీరా సన్యాల్ షార్ట్‌టెర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌గా లిక్విడ్ ఫండ్స్‌లో రూ.20 లక్షలు, ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లలో రూ.51 లక్షలు ఇన్వెస్ట్‌చేశారు. మరో ఆమ్‌ఆద్మీపార్టీ అభ్యర్థి, మాజీ ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వి.బాలకృష్ణన్ అలియాస్ బాలా గోల్డ్ ఈటీఎఫ్‌లలో, సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ పద్ధతి (సిప్ ద్వారా) కోటి రూపాయలు ఇన్వెస్ట్‌చేశారు. అయితే డ్రీమ్‌గర్ల్ హేమమాలిని ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ రూ.37వేలు మాత్రమే. మాజీ సమాచార, ప్రసార శాఖ మంత్రి అంబికా సోనీ బాండ్లు,షేర్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.4.58 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఒడిశాలోని కేంద్రపారాలోక్‌సభ నుంచి పోటీచేస్తున్న బీజేడీ అభ్యర్థి బైజయంత్ పాండా గత ఐదేళ్లలో తన ఆస్తులు భారీగా పెరిగినట్లు పేర్కొన్నారు.

 
 ఫండ్స్‌లో పెట్టుబడులకు ప్రోత్సాహం
 సామాన్య ఇన్వెస్టర్లతో సహా బ్యాంకర్లు, కార్పొరేట్లనుంచి సేకరించిన పెట్టుబడులను వివిధ రకాల షేర్లు, బాండ్లలో ఫండ్‌హౌస్‌లు ఇన్వెస్ట్‌చేస్తాయి. సెక్యూరిటీల పనితీరు ఆధారంగా వారి వారి పెట్టుబడుల మేరకు ఇన్వెస్టర్లకు ప్రతిఫలం అందుతుంది. దేశంలో ప్రస్తుతం 45 ఫండ్ హౌస్‌లు దాదాపు 9 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల ఆస్తుల్ని మేనేజ్ చేస్తున్నాయి.అయితే మ్యూచువల్ ఫండ్స్ స్కీములు పట్టణ ఇన్వెస్టర్ల వరకే పరిమితమయ్యయి. దాంతో వీటిని సామాన్యుడి పెట్టుబడి సాధనంగా మలిచేందుకు ప్రభుత్వం, సెబీ భారీగా కసరత్తు చేస్తున్నాయి. వచ్చే ఐదేళ్లలో మ్యూచువల్ ఫండ్స్ ఆస్తులు 20లక్షల కోట్లకు పెరిగేలా దీర్ఘకాల మ్యూచువల్ ఫండ్ పాలసీని సెబీ అమల్లోకి తేనుంది. అప్పుడు ఫండ్స్‌లో చేసే ఇన్వెస్టర్లు పెట్టుబడులకు భారీ పన్ను రాయితీలు లభిస్తాయి.

Related News By Category

Related News By Tags

Advertisement