DNA
-
అరుదైన కేసు: ఆ తల్లి కవలలకు జన్మనిచ్చింది..అయితే డీఎన్ఏ టెస్ట్‌లో..!
ఒక మహిళకు కవల పిల్లలు జన్మించారు. ఇద్దరూ మగపిల్లలే. అయితే ఎందువల్లో ఇద్దరు డీఎన్ఏలు వేర్వురుగా ఉన్నాయి. ఒక బిడ్డ డీఎన్ఏ ఆమె భర్తతో మ్యాచ్ అవ్వగా, మరో బిడ్డ డీఎన్ఏ మాత్రం అస్సలు మ్యాచ్ కాలేదు. ఇదేంటి ఇద్దరు కవలలు ఒకేలా ఉన్నారు. ఇదెలా సాధ్యం ఒకరిది మాత్రమే తండ్రితో మ్యాచ్ అయ్యి, మరొకరిది కాకపోవడంతో వైద్యులు సైతం కంగుతిన్నారు. అసలేం జరిగిందంటే. ఈ విచిత్రమైన ఘటన పోర్చుగల్‌లోని గోయాస్ రాష్ట్రంలోని మినెరోస్ నగరంలో చోటు చేసుకుంది. 19 ఏళ్ల మహిళ కవల ప్లిలలకు జన్మనిచ్చింది. ఇద్దరు మగబిడ్డలకు జన్మనిచ్చిన ఆనందాన్ని తన భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఖుషీగా ఉంది. అయితే ప్రస్తతం వారికి ఎనిమిది నెలల వయసు. వారి బర్త్ సర్టిఫికేట్ల విషయమై డీఎన్ఏ టెస్ట్‌లు చేయగా అవాక్కయ్యే విషయం వెలుగులోకి చ్చింది. ఒక బిడ్డ డీఎన్ఏ మాత్రం ఆ మహిళ భర్తతో సరిపోయింది. మరో బిడ్డది అస్సలు మ్యాచ్ కాలేదు. దీంతో వైద్యులు సైతం ఇదేంటని తలలు పట్టుకున్నారు. అయితే ఆ మహిళలను వైద్యులు క్షణ్ణంగా ఆరా తీయగా తాను మరో వ్యక్తితో సంబంధం పెట్టుకున్న విషయం బయటపెట్టింది. వెంటనే ఆ వ్యక్తిని పిలిపించి డీఎన్ఏ టెస్ట్ చేయగా ఆ వ్యక్తితో ఆ బిడ్డ డీఎన్ఏ సరిగ్గా మ్యాచ్ అయ్యింది. అయితే ఇదెలా సాధ్యం అనే ప్రశ్న వైద్యలును కూడా ఆశ్చర్యాన్ని గురిచేసింది. అయితే పిల్లల తండ్రులు వేర్వేరు అయినా.. జనన ధృవీకరణ పత్రంలో ఒకటే రాయాల్సి ఉంది. దీంతో ఆ మహిళ భర్తనే ఆ ఇద్దరు పిల్లలకు తండిగ్రా పేరు నమోదు చేయించుకుని ఆ బిడ్డ బాధ్యత తనే చూసుకుంటానని అనడం విశేషం.ఇది అత్యంత అరుదైన కేసు..ఈ మేరకు డాక్టర్ టులియో జార్జ్ ఫ్రాంకో మాట్లాడుతూ..ఇప్పటివరకు మొత్తం ప్రపంచంలో ఇలాంటి కేసులు 20 మాత్రమే ఉన్నాయని చెప్పారు. వాటిలో కవలల తండ్రులు వేర్వేరుగా ఉన్నట్లు తెలిపారు. ఈ పరిస్థితిని శాస్త్రవేత్తల భాషలో హెటెరోపెరెంటల్ సూపర్‌ఫెకండేషన్ అంటారని అన్నారు. ఒకే తల్లి రెండు అండాలు వేర్వేరు పురుషుల ద్వారా ఫలదీకరణం చెందినప్పుడు ఇది జరుగుతుందని వెల్లడించారు. అయితే ఇక్కడ ఆ స్త్రీ గర్భం సాధారణంగానే ఉందని అన్నారు. ఇప్పటి వరకు ఆ శిశువులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా లేవని చెప్పారు. నిజంగా ఇది అత్యత విచిత్రమైన కేసు.(చదవండి: సందీప్ కిషన్: అలాంటి డైట్ ఫాలో అవుతాడా..! అందుకే..) -
‘గ్యాన్‌దీప్’.. పిల్లలను డీఎన్ఏ సైంటిస్టులు చేయడమే టార్గెట్
సాక్షి,హైదరాబాద్:కేంద్రీయ విద్యాలయాల విద్యార్థుల నుంచి డీఎన్ఏ సైంటిస్టులను తయారు చేసేందుకు బ్రిక్ సెంటర్‌ఫర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్‌ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ (సీడీఎఫ్‌డీ) కొత్త ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ‘జెనెటిక్స్ఫర్యు’ సహకారంతో ‘గ్యాన్‌దీప్’ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఈ ప్రోగ్రామ్‌కు ఇండియా బయోసైన్సెస్ సంస్థతో పాటు హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయ యూనిట్ సంయుక్తంగా నిధులు సమకూ ర్చనున్నాయి.‘గ్యాన్‌దీప్’ ప్రారంభ సెషన్ శుక్రవారం (నవంబర్ 22) సీడీఎఫ్‌డీ ఆవరణలో జరిగింది. సీడీఎఫ్‌డీ హెడ్ఆఫ్ సైన్స్ అండ్ కమ్యూనికేషన్ డాక్టర్ వర్ష, స్టాఫ్ సైంటిస్ట్ శ్వేతత్యాగి ఆధ్వర్యంలో ఈ సెషన్‌ను నిర్వహించారు. డీఎన్ఏ, జెనెటిక్స్ గురించి ఈ సెషన్లో డాక్టర్ చందనబసు పిల్లలకు వివరించారు.ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌లోని పలు కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. డీఎన్ఏ,జెనెటిక్స్,సెల్సైకిల్ తదితర అంశాల గురించి ఆసక్తిగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అరటిపండ్ల నుంచి డీఎన్ఏను వేరు చేశారు. పలువురికి బహుమతులు ప్రదానం చేశారు. -
ముద్దొచ్చే మర చేప
ఇదేమిటో తెలుసా? రోబోచేప. పేరు ఈవ్. సిలికాన్ తోకను విలాసంగా ఊపుకుంటూ స్విట్జర్లాండ్‌లో జ్యూరిచ్ సరస్సులోని అతి శీతల జలాల్లో ఇలా విలాసంగా విహరిస్తోంది. దీన్ని రూపొందించేందుకు జ్యూరిచ్ ఈటీహెచ్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఏకంగా రెండేళ్లు పట్టిందట! ఇతర చేపలు, సముద్ర జీవాలు బెదిరిపోకుండా ఉండాలని దీన్ని అచ్చం చేపలా కని్పంచేలా డిజైన్ చేశారు. సోనార్ టెక్నాలజీ సాయంతో అడ్డొచ్చే వాటన్నింటినీ సునాయాసంగా తప్పించుకుంటూ సాగిపోగలదీ మర చేప. ఇంతకూ దీని పనేమిటంటారా? నీటి లోపలి పరిస్థితులను కెమెరా కంటితో ఒడిసిపట్టడం. సముద్ర జీవుల డీఎన్ఏను (‘ఇ–డీఎన్ఏ’గా పిలుస్తారు) సేకరించడం. ‘‘సముద్రం లోతుల గురించి, అక్కడి జీవుల గురించీ మనకు తెలిసింది నిజానికి చాలా తక్కువ. ఆ జీవులన్నీ నిరంతరం ‘ఇ–డీఎన్ఏ’ను జలాల్లోకి విడుదల చేస్తుంటాయి. దాన్ని సేకరించి ల్యాబుల్లో పరీక్షిస్తే వాటి గురించి మనకిప్పటిదాకా తెలియని విశేషాలెన్నో వెలుగులోకి వస్తాయి’’ అని అధ్యయన బృందం చెబుతోంది. ఈ రోబో చేపలు మున్ముందు సముద్రాల అధ్యయనం రూపురేఖలనే మార్చగలవని భావిస్తున్నారు. సాక్షి, నేషనల్ డెస్క్ -
పుట్టుకతోనే మతం ముద్రా?!
డీఎన్ఏ వల్ల కలిగే శారీరక, మానసిక వైకల్యాలను సాంకేతికత ద్వారా గుర్తించవచ్చు, సరిదిద్దవచ్చు. కానీ ఒకరి విశ్వాస వ్యవస్థ వల్ల కలిగే బలహీనతలు శాశ్వతంగా ఉంటాయి. ఒక బిడ్డ జన్మించిన మతపు నమ్మకాలే అతడికి వాస్తవికంగా, నిజంగా మారిపోతాయి. పిల్లలు పెరిగే వాతావరణమే వారి మనస్తత్వాన్ని మలచే శక్తిని కలిగి ఉంటుంది. అందుకే పుట్టినప్పుడే పిల్లలకు మతాన్ని అంటగట్టడం అనేది తిరోగమనంతో కూడిన, ప్రమాదకరమైన పద్ధతి. పిల్లల మతాన్ని నమోదు చేయడాన్ని తప్పనిసరి చేసే చట్టం ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తుంది. అది పితృస్వామ్యాన్నీ, మెజారిటీ వాదాన్నీ ప్రోత్సహిస్తుంది. వారి స్వేచ్ఛపై పరిమితులను విధిస్తుంది. వారి ఎదుగుదలను ఆపివేస్తుంది. ఆ కోణంలో చూస్తే ఇది మానవ హక్కుల ఉల్లంఘనే. అందుకే మతాన్ని ‘వయోజనులకు’ సంబంధించిన అంశంగానే చూద్దాం.ఏప్రిల్ 5 నాటి ప్రముఖ వార్తాపత్రికలోని ఒక ప్రధాన శీర్షిక, ‘జననాల నమోదు కోసం తల్లిదండ్రుల మతాన్ని పొందుపరచనున్న ప్రభుత్వం’ అని చెబుతోంది. జనన మరణాల నమోదు (సవరణ) చట్టం, 2023ను గత ఏడాది ఆగస్టు 11న పార్లమెంటు ఆమోదించింది. జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్పీఆర్), ఓటర్ల జాబితాలు, ఆధార్ నంబర్, రేషన్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆస్తి నమోదు, నోటిఫై చేసిన ఇతర అంశాలతో సహా వివిధ డేటాబేస్లను అప్డేట్ చేయ డానికి ఉపయోగించే జాతీయ స్థాయిలో జనన, మరణ డేటాబేస్ నిర్వహణను ఈ చట్టం తప్పనిసరి చేస్తోంది. పిల్లల మతానికి చెందిన కాలమ్‌లో తల్లిదండ్రులు వేర్వేరు మతాలకు చెందినవారైతే వారిద్దరి మతాన్ని నమోదు చేయడాన్ని కూడా ఈ సవరణ చట్టం తప్పనిసరి చేస్తోంది. ఇది, మోసపూరితంగా చట్టానికి ఉదారమైన రూపాన్ని ఇస్తోంది. కానీ మాకు సంబంధించి, పుట్టినప్పుడే పిల్లలకు మతాన్ని అంటగట్టడం అనేది తిరోగమనంతో కూడిన, ప్రమాదకరమైన పద్ధతి.వయోజనులు అనే అంశాన్ని ముందు స్పష్టం చేద్దాం. ఇది ఓటు వేయడానికి లేదా వివాహం చేసుకోవడానికి కావాల్సిన చట్టబద్ధమైన వయస్సు కాదు. ఇక్కడ వయోజనుడు అంటే వ్యక్తిగత నైతిక చట్రాన్ని అభివృద్ధి చేసుకునేంత స్థాయిలో ఎదిగిన వ్యక్తి అని అర్థం. మతం అనే పదం వ్యవస్థీకృతమైన మతాలను సూచిస్తుంది.చట్టపరంగా, వయోజనులు భౌతిక స్వభావం గల లక్షణాలను కలిగి ఉంటారు. అయితే, మతం పాక్షికంగా ఆధిభౌతికమైనది. పిల్లలు పొందిన డీఎన్ఏతో దానిని కలపడం అనేది వారి స్వేచ్ఛపై పరి మితులను విధిస్తుంది. వారి ఎదుగుదలను ఆపివేస్తుంది. ఆ కోణంలో చూస్తే ఇది మానవ హక్కుల ఉల్లంఘనే. ఇది ప్రమాదకరమైన చట్టం. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యపు విలువలను దెబ్బతీస్తుంది. అంతే కాక, మతతత్వం, పితృస్వామ్యం, మెజారిటీతత్వాలను ప్రోత్సహిస్తుంది. కొన్ని రాష్ట్రాలు ‘లవ్ జిహాద్’కు (హిందూ అమ్మాయితో ముస్లిం పురుషుడి సంబంధం లేదా వివాహం) వ్యతిరేకంగా చట్టాన్ని ఆమోదించిన వాస్తవాన్ని గమనిస్తే, ఆ నిబంధన అంత అమాయ కమైనది కాకపోవచ్చు. కనీసం, ఇది పితృస్వామికతతో కూడుకుని ఉన్నది.మొదటిది, మానవ హక్కులకు సంబంధించిన ప్రశ్న. ఓటింగ్ లేదా వివాహం గురించిన అవకాశాన్ని ఎంపిక చేసుకోవడానికి ఒక పిల్లవాడు యుక్తవయస్సుకు ఎదగవలసి ఉంటుంది. అయితే, ఓటు వేయమని లేదా వివాహం చేసుకోవాలని ఎవరినీ బలవంతం చేసే చట్టం లేదు. వయోజనుడైన బిడ్డకు ఎంపిక చేసుకోకుండా ఉండటానికి స్వేచ్ఛ ఉంది. కానీ వ్యవస్థీకృత మతం కొన్నిసార్లు ప్రచ్ఛన్నంగా, కానీ తరచుగా నేరుగానే చేయవలసినవీ, చేయకూడనివీ చెబుతుంటుంది. వాటితోపాటు, తప్పు ఒప్పులను విధిస్తుంది. పౌరాణిక సత్యాలు, తల్లిదండ్రులు, ఇతర పెద్దల సాంప్రదాయిక జ్ఞానం, సామాజిక ఒత్తిళ్లు, ‘సంస్కారం’ ఆశించే నియమాలు, ఆచారాలు, సంప్రదాయా లను అంగీకరించడం తప్ప అభాగ్యుడైన బిడ్డకు వేరే మార్గం లేదు. ఇటువంటి సూక్ష్మమైన, కానీ తీవ్రమైన బ్రెయిన్ వాష్ వల్ల, పిల్లల సహజసిద్ధమైన శాస్త్రీయ ఉధృతికి, ఆధ్యాత్మిక, వ్యక్తిత్వ పరమైన ఎదుగుదలకు ఆటంకం కలుగుతుంది.పిల్లల మెదడు అభివృద్ధిలో 80 శాతం జీవితంలో మొదటి 1,000 రోజులలోనే జరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ కాలంలో ఛాందస, ఉదారవాద పరిసరాలు పిల్లల జీవితకాలం చెరగని వైఖరులకు కారణమవుతాయి. పైగా అవి స్థూలంగా తిరోగ మనం, అణచివేత, అమానవీయమైనవి కూడా కావచ్చు. ఏది సరైనది ఏది తప్పు అనే సొంత నైతిక చట్రం ఆధారంగా పిల్లల అభివృద్ధిని వారి పరిసరాలు ప్రభావితం చేస్తాయి. డీఎన్ఏ వల్ల కలిగే శారీరక, మానసిక వైకల్యాలను సాంకేతికత లేదా వైద్య శాస్త్రాల ద్వారా గుర్తించవచ్చు, సరిదిద్దవచ్చు. అయితే ఒకరి విశ్వాస వ్యవస్థ, మానవత్వం, సున్నితత్వం, ప్రవర్తన, ముందుగా నిర్ణయించిన ‘సత్యాల’ వల్ల కలిగే బలహీనతలు శాశ్వతంగా ఉంటాయి. ఒక బిడ్డ జన్మించిన మతపు నమ్మకాలే అతడికి వాస్తవికంగా, నిజంగా మారిపోతాయి.30 ఏళ్ల వయస్సు తర్వాత తాను సాగించిన ప్రయాణంలో, గౌతమ బుద్ధునికి ‘నేను ఇంకా జీవించాల్సిన జీవితం, అది నా స్వభావానికి ప్రతిబింబంగా ఉండితీరాలి’ అనిపించింది. ‘నా భ్రాంతిమయమైన కచ్చితత్వాల ఆశ్రయం నుండి, నా సొంత సరి హద్దుల నుండి నేను విముక్తి పొందాల్సి ఉంటుంది’ అని ఆయన భావించాడు.గౌతముడు ఆధ్యాత్మిక పరిపక్వత సాధించకుంటే, ఆయన తన అసలైన స్వభావాన్ని గుర్తించడంలో విఫలమై, నిజంగా తన సొంతం కాని నమ్మకాలు, అంతర్దృష్టిలో తెలియకుండానే చిక్కుకుని ఉండే వాడు. పర్యవసానంగా, ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యా కులైన వ్యక్తులకు ఓదార్పును అందించి దిశానిర్దేశం చేసిన మానవీయ జీవిత తత్వశాస్త్రం ప్రపంచానికి నిరాకరించబడి ఉండేది. ప్రతి ఒక్కరూ గౌతమ బుద్ధుడిని అనుకరించలేరు కాబట్టి, వారి సొంత ప్రత్యేక మార్గాన్ని ఏర్పరచుకునే పిల్లల సామర్థ్యానికి సామాజిక నిబంధనలు, చట్టం అధిగమించ లేని అడ్డంకులను సృష్టించకూడదు.స్థాపితమైన మతం శాస్త్రీయ ఆలోచనాపరులు, స్వేచ్ఛా ఆలోచనా పరులు, మేధావుల పట్ల విపరీతమైన క్రూర త్వాన్ని ప్రదర్శిస్తుంది. ఉదాహరణకు, రోమన్ క్యాథలిక్ చర్చి, ఇటాలియన్ భౌతిక శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త అయిన గెలీలియోను మతవిశ్వాసిగా ముద్ర వేసి శిక్షకు గురిచేసింది. 1633లో, గెలీలియోపై చర్చి... సూర్యుడు ప్రపంచానికి కేంద్రం మరియు నిశ్చలమనీ; భూమి దాని చుట్టూ తిరుగుతుందనీ... తప్పుడు, మత గ్రంథాలకు విరుద్ధంగా భావించే నమ్మకాన్ని ఆమోదించాడనీ ఆరోపించింది. హాస్యాస్పదంగా, గెలీ లియో పేర్కొన్న ఈ సంచలనాత్మక ఆవిష్కరణలు న్యూటన్, ఐన్ స్టీన్ సిద్ధాంతాలకు పునాది వేయడమే కాకుండా, ఈ రోజు మనకు తెలిసిన ఆధునిక భౌతికశాస్త్ర అభివృద్ధికి మార్గం సుగమం చేశాయి.‘ద చైల్డ్ ఈజ్ ఫాదర్ ఆఫ్ ద మ్యాన్’ అనే పదబంధం, విలియం వర్డ్స్‌వర్త్ కవిత ‘మై హార్ట్ లీప్స్ అప్’ నుండి ఉద్భవించింది. ఇది కేవలం కవిత్వ వ్యక్తీకరణ మాత్రమే కాదు. వరుసగా తరాలను రూపొందించడంలో పిల్లలు కీలకమైన పాత్ర పోషిస్తారనే లోతైన సత్యాన్ని ఇది వ్యక్తీకరుస్తుంది. పిల్లలు పెరిగే వాతావరణమే వారి మనస్తత్వాన్ని మలచే శక్తిని కలిగి ఉంటుంది. అంటే అదే వారి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ, ఈ ప్రభావం ద్వంద్వ స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇది స్వధర్మం ముసుగులో ఉన్న మతతత్వం, కులతత్వం, ద్వేషపు తాలూకు హింసాత్మక వ్యక్తీకరణల వంటి విభజన భావజాలాలను పిల్లల్లో శాశ్వతంగా కలిగించడంలోనో లేదా బాధితులుగా మార్చడంలోనో గణ నీయమైన ప్రభావాన్ని కలిగివుంది. ఇటువంటి ధోరణులు మెజారిటీ వాదాన్ని పెంపొందించవచ్చు. సామాజిక, ఆర్థిక అసమానతలకు వ్యక్తులను స్పందించకుండా చేయవచ్చు. శతాబ్దాల తరబడి వారసత్వంగా వచ్చిన నమ్మకాల్లో స్థిరపడిన మంచి ఉద్దేశం ఉన్న తల్లిదండ్రులు కూడా అనుకోకుండా తమ పిల్లల నిజమైన సారాన్ని అణచివేయవచ్చు. ఇక, చట్టసభ సభ్యులు క్రూరత్వానికి చెందిన అటువంటి రూపాలను శాశ్వతం చేసి సంస్థాగతీకరించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు.– అశోక్ లాల్ ‘ రచయిత, నాటకరంగ కళాకారుడు– నసీరుద్దీన్ షా ‘ హిందీ, ఉర్దూ నాటక రచయిత, నటుడు -
రాహుల్ డీఎన్ఏపై కేరళ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు
కేరళలో ‘ఇండియా’ కూటమి సభ్యులైన కాంగ్రెస్, సీపీఎం మధ్య జరుగుతున్న మాటల యుద్ధం మరింత వేడెక్కింది. తాజాగా సీపీఎం మద్దుతు ఉన్న ఇండిపెండెంట్ ఎమ్మెల్యే పీవీ అన్వర్.. రాహుల్ గాంధీ డీఎన్ఏను పరిశీలించాలి అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మలప్పురంలోని ఎడతనట్టుకరలో జరిగిన సీపీఎం ఎన్నికల ప్రచార సభలో అన్వర్ ప్రసంగిస్తూ, “రాహుల్‌కు గాంధీ పేరును వాడుకునే హక్కు లేదు. అత్యంత నీచ స్థాయికి దిగజారిపోయాడు. అతను నెహ్రూ కుటుంబంలోనే పుట్టారా? నాకు సందేహాలు ఉన్నాయి. అతని డీఎన్ఏను పరీక్షించాలి” అన్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై రాహుల్ చేసిన హేళనపై విమర్శలు చేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అన్వర్ వ్యాఖ్యలను మంగళవారం సీఎం విజయన్ కూడా సమర్థించారు. రాహుల్ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే ఎదుటివారి నుంచి తగిన సమాధానం వస్తుందని గ్రహించాలని హితవు పలికారు. గత వారం కేరళలో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ “ఇద్దరు ముఖ్యమంత్రులు జైలులో ఉన్నారు. కేరళ ముఖ్యమంత్రికి ఇలా జరగకపోతే ఎలా? నేను బీజేపీపై 24 గంటలూ విమర్శలు చేస్తులంటే కేరళ ముఖ్యమంత్రి మాత్రం నాపై 24 గంటలూ విమర్శలు చేస్తున్నారు. ఇది కొంచెం అయోమయంగా ఉంది” అని వ్యాఖ్యానించారు. విజయన్ కుమార్తె వీణా ఐటీ సంస్థలో జరిగిన అక్రమ చెల్లింపుల కుంభకోణం, త్రిసూర్‌లోని సహకార బ్యాంకులో జరిగిన మరో కుంభకోణంపై కేంద్ర ఏజెన్సీల దర్యాప్తుల కారణంగానే సీఎం విజయన్ ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించడం లేదని కాంగ్రెస్ ఆరోపించింది. దీనికి బదులిస్తూ “మీ నానమ్మ (ఇందిరా గాంధీ మమ్మల్ని ఒకటిన్నర సంవత్సరాలు (ఎమర్జెన్సీ సమయంలో) జైలులో పెట్టింది రాహుల్” అని సీఎం విజయన్ గుర్తు చేశారు. -
బీథోవెన్ డీఎన్ఏలో అంతుచిక్కని రహస్యాలు?
జర్మనీకి చెందిన అలనాటి స్వరకర్త లుడ్విగ్ వాన్ బీథోవెన్ సింఫనీ, పియానో, వయెలెన్ మొదలైన వాటితో మ్యూజిక్ కంపోజ్ చేయడంలో ఎంతో పేరొందారు. తాజాగా ఆయన జుట్టు నుంచి సేకరించిన డిఎన్ఏపై జరిపిన విశ్లేషణ అతనికి సంబంధించిన పలు రహస్యాలను వెల్లడించింది. బీథోవెన్ దీర్ఘకాలం పాటు అనారోగ్యంతో బాధపడుతూ 1827లో కన్నుమూశారు. అతను వినికిడి లోపం, కాలేయ వ్యాధి, ఉదర సంబంధిత వ్యాధులు, అతిసారంతో బాధపడ్డాడు. బీథోవెన్ తన చివరి రోజుల్లో తన మూలాల గురించి జనానికి సవివరంగా తెలియజేయమని తన సోదరులను కోరారు. డీఎన్ఏ విశ్లేషణ కోసం.. జర్మనీ, యూకేల నుండి వచ్చిన పరిశోధకుల బృందం బీథోవెన్ జుట్టుకు సంబంధించిన డీఎన్ఏను విశ్లేషించింది. బీథోవెన్ డీఎన్ఏని అతని బంధువులుగా భావిస్తున్నవారి డీఎన్ఏతో సరిపోల్చారు. అలాగే అతని ఇప్పుటి బంధువులు ఎవరో తెలుసుకునేందుకు పలు రికార్డులను కూడా పరిశీలించారు. హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్తో మృతి బీథోవెన్ జుట్టు నమూనాలలో ఒకటి బీథోవెన్కి చెందినది కాదని, గుర్తు తెలియని మహిళ నుండి వచ్చినదని పరిశోధకులు కనుగొన్నారు. బీథోవెన్ మరణం బహుశా హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ వల్ల సంభవించి ఉండవచ్చునని కూడా వారు కనుగొన్నారు. హెపటైటిస్ వ్యాధి అతని కాలేయాన్ని దెబ్బతీసింది. ఇతర అవయవాల పనితీరుపై ప్రభావం చూపింది. బీథోవెన్ విషప్రయోగం వల్ల మరణించారనే మునుపటి నమ్మకానికి విరుద్ధమైన ఫలితం వచ్చింది. తండ్రులు వేరా? బీథోవెన్కు చెందిన ‘వై’ క్రోమోజోమ్ అతని తండ్రి తరపు బంధువులతో సరిపోలడం లేదని పరిశోధకులు కనుగొన్నారు. అతని వంశవృక్షంలో తండ్రులు వేరుగా ఉండే అవకాశం ఉందని ఉందని కూడా వారు తెలిపారు. అంటే అతని పూర్వీకులలో ఒకరు వారి వంశానికి చెందిన తండ్రి కాకుండా వేరే వ్యక్తి అయివుంటాడని, అతని ద్వారా బీథోవెన్ జన్మించి ఉండవచ్చని కూడా పరిశోధకులు చెబుతున్నారు. -
Rahul Gandhi: ప్రేమ మన డీఎన్ఏలోనే ఉంది
రాయ్‌గఢ్: మన దేశ డీఎన్ఏలోనే ప్రేమ ఉందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మాత్రం దేశంలో విద్వేషం వ్యాప్తి చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఆయన భారత్ జోడో న్యాయ్ యాత్ర రెండు రోజుల విరామం తర్వాత ఆదివారం ఛత్తీస్‌గఢ్‌లో మొదలైంది. రాయ్‌గఢ్ ర్యాలీలో రాహుల్ మాట్లాడారు. ‘‘భారత్‌లో భిన్న మతాలు, భిన్న సంప్రదాయాల ప్రజలు పరస్పరం ప్రేమతో శాంతియుతంగా జీవిస్తున్నారు. కానీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ విద్వేష రాజకీయాల వల్ల ప్రతి ప్రాంతంలో విద్వేషం, హింస పెరిగిపో తున్నాయి. భాష ఆధారంగా కొందరు, రాష్ట్రాన్ని బట్టి ఇంకొందరు ఇతరులను ద్వేషిస్తామంటున్నారు’’ అని ఆవేదన వెలిబుచ్చారు. విద్వేషం, హింసకు తావులేని హిందుస్తాన్‌ను భవిష్యత్ తరానికి అందించడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. -
కేరళ నాయర్లూ...రాజస్తాన్ గుజ్జర్లూ చుట్టాలే!
దక్షిణాది రాష్ట్రమైన కేరళలోని నాయర్లు... వాయవ్య దిశలో ఉన్న రాజస్తాన్, దాని పొరు గునే ఉన్న పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలకు చెందిన గుజ్జర్లు చుట్టాలేనట! ఈ విషయాన్ని హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) తాజా అధ్యయనంలో వెల్లడించింది. నాయర్లతోపాటు కేరళకే చెందిన థియ్యాలు, ఎళవ తెగల ప్రజలు కూడా ఒకప్పుడు దేశ వాయవ్య ప్రాంతానికి చెందిన వారని జన్యుక్రమాల ఆధారంగా నిర్ధారించింది. – సాక్షి, హైదరాబాద్ వలసలపై భిన్న వాదనలు... భారతదేశ నైరుతి ప్రాంతం.. అంటే కేరళ, కర్ణాటక, తమిళనాడు దక్షిణ భాగాలు జీవవైవిధ్యానికే కాదు.. జన్యువైవిధ్యానికి కూడా పెట్టింది పేరు. వేల సంవత్సరాలుగా ఎక్కడెక్కడి నుంచో ప్రజలు ఇక్కడకు వలస వచ్చి స్థిరపడ్డారని చరిత్రకారులు చెబుతుంటారు. యూదు లు, పార్సీలు, రోమన్ కేథలిక్కులు కొన్ని ఉదాహరణలు మాత్రమే. అయితే ఈ ప్రాంతంలోనే ఉన్నప్పటికీ నాయర్లు, థియ్యాలు, ఎళవ తెగల వారు ఎక్కడి నుంచి వలస వచ్చారన్న విషయంపై భిన్నాభిప్రాయాలు ఉండేవి. చరిత్రకారుల అంచనాల ప్రకారం వారంతా గంగా తీరంలోని అహిఛాత్ర (ఇనుప రాతి యుగం) ప్రాంతం నుంచి వలస వచ్చిన వారని చారిత్రక, లిఖిత దస్తావేజుల సాయంతో వాదిస్తున్నారు. మరోవైపు ఈ వాదనతో మరికొందరు విభేదించేవారు. వారంతా ఇండో–సిథియన్ వర్గం వారని, దేశ వాయవ్య ప్రాంతం నుంచి వలస వచ్చారని పేర్కొనేవారు. డీఎన్ఏ సేకరణతో... ఈ నేపథ్యంలో నాయర్లు సహా ఇతరుల వలస ఎలా సాగింది? వారు ఏ ప్రాంతానికి చెందిన వారై ఉండవచ్చో నిర్ధారించేందుకు సీసీఎంబీ సీనియర్ శాస్త్రవేత్త కుమారస్వామి తంగరాజ్ నేతృత్వంలోని బృందం ప్రయత్నించింది. నాయర్లు, థియ్యాలు, ఎళవ తెగల వంటి భూస్వామ్య, యుద్ధవీరుల తెగలకు చెందిన 213 మంది జన్యుక్రమాలను సేకరించింది. అటు తల్లివైపు నుంచి మాత్రమే అందే మైటోకాండ్రియల్ డీఎన్ఏ గుర్తులు, ఇటు జన్యుక్రమం మొత్తమ్మీద ఉండే ఆటోసోమల్ గుర్తులను (మన మునుపటి తరాల గురించి తెలిపేవి. సెక్స్ క్రోమోజోములు మినహా మిగిలిన 22 క్రోమోజోముల్లో ఈ మార్పులు ఉంటాయి. వారసత్వంతోపాటు జన్యుపరమైన సంబంధాలు, నిర్దిష్ట వ్యాధులు సోకేందుకు ఉన్న అవకాశాల గురించి ఈ మార్పులు సూచిస్తాయి) విశ్లేషించింది. వాటిని యూరేసియా ప్రాంతంలోని పురాతన, ప్రస్తుత తెగల జన్యుక్రమాలతో తంగరాజ్ బృందం పోల్చిచూసింది. కేరళలోని నాయర్లు, థియ్యాలు, ఎళవలతోపాటు కర్ణాటకలోని బంట్స్ (ఐశ్వర్యరాయ్ బంట్ తెగకు చెందిన మహిళే), హొయసళ సామాజిక వర్గ ప్రజలు కూడా జన్యుపరంగా దేశ వాయవ్య ప్రాంత ప్రజలతో దగ్గరి సంబంధాలు కలిగి ఉన్నారని ఈ పరిశోధన ద్వారా స్పష్టమైంది. ఈ పరిశోధన వివరాలు జినోమ్ బయాలజీ అండ్ ఎవల్యూషన్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. వారి మధ్య ఎక్కువ జన్యుసంబంధాలు.. నాయర్లు, థియ్యా, ఎళవ తెగల ప్రజలకు దేశ వాయవ్య ప్రాంతంలోని కాంభోజ్, గుజ్జర్ తెగల ప్రజలకు మధ్య జన్యుసంబంధాలు ఎక్కువగా ఉన్నట్లు ఈ పరిశోధన స్పష్టం చేసింది. అంతేకాకుండా వారిలో ఇరాన్ ప్రాంత జన్యు వారసత్వం కూడా ఇతరుల కంటే ఎక్కువగా ఉంది. తల్లివైపు నుంచి అందిన జన్యు సమా చారాన్ని విశ్లేషిస్తే పశ్చిమ యూరేసియా ప్రాంత వారసత్వం కనిపిస్తోంది. దీన్నిబట్టి మహిళల నేతృత్వంలో జరిగిన వలసలో వారు భాగమై ఉంటారని చెప్పవచ్చు. – డాక్టర్ కుమారస్వామి తంగరాజ్, శాస్త్రవేత్త గోదావరి తీరం మీదుగా... భారతదేశ దక్షిణ, పశ్చిమ తీర ప్రాంతంలోని వాయవ్య ప్రాంతం నుంచి గోదావరి తీరం ద్వారా కర్ణాటకకు ఆ తరువాత అక్కడి నుంచి మరింత దక్షిణంగా కేరళకు నాయర్లు, ఇతర వర్గాల ప్రజలు వలస వచ్చినట్లు ఈ పరిశోధన ద్వారా తేలింది. – సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ నందికూరి -
సరదాగా డీఎన్ఏ టెస్టు... షాకిచ్చిన రిపోర్టు!
ఒక యూరోపియన్ మహిళ తన సోదరీమణులతో కలిసి సరదాగా ఇంట్లోనే డీఎన్ఏ పరీక్ష చేయించుకోవాలనుకుంది. అయితే వాటి ఫలితాలు తన జీవితంలో ఎంతటి దారుణమైన పరిణామాలకు దారితీస్తాయో ఆమె గ్రహించలేకపోయింది. తన తల్లిదండ్రులు ఇన్నాళ్లూ ఇంత పెద్ద రహస్యాన్ని దాచిపెట్టారని ఆమె ఊహించలేకపోయింది. ఈ మహిళ తన గుర్తింపును వెల్లడించకుండా సోషల్ మీడియా సైట్ రెడ్డిట్‌లో ఒక వివరణాత్మక పోస్ట్ పెట్టింది. దానిలో ఆమె.. ‘నేను, నా సిస్టర్స్ సరదాగా డీఎన్ఏ పరీక్ష చేయించుకోవాలనుకున్నాం. ఒక కిట్ సాయంతో డిఎన్ఏ టెస్టు చేయించుకున్నాం. ఆ పరీక్ష ఫలితాలు రాగానే గుండె బద్ధలయ్యే నిజం వెలుగు చూసింది. డీఎన్ఏ పరీక్ష ఫలితాలలో తన అన్నలు, అక్కాచెల్లెళ్లకు పూర్తి బంధుత్వం ఉందని, తానుమాత్రం ఒంటరినని తేలిందని ఆ మహిళ చెప్పింది. కాగా ఆమె సోదరి తమ తల్లిదండ్రులతో ఈ విషయమై మాట్లాడాలని నిర్ణయించుకుంది. అయితే తల్లిదండ్రులు ఆ డిఎన్ఏ ఫలితాలు నిజం కాదని అన్నారు. అయితే ఆమె తండ్రి ఈ విషయాన్ని ఇంతటితో ఆపేయాలని కోరాడు. తల్లి ఈ విషయంలో తనకేమీ పట్టనట్టు వ్యవహరించింది. అయితే ఎట్టకేలకు తండ్రి నిజాన్ని చెప్పాడు. అయితే ఆమె ఎప్పటికీ తన కుమార్తెనేనని అన్నాడు. ఇంతకాలం తన తల్లిదండ్రులు ఈ విషయాన్ని దాచిపెట్టడంపై ఆ మహిళ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తనను తల్లిదండ్రులు పెంచిన విధానంలో ఏదో తేడా కనిపించడంతో తనకు వేరే తండ్రి ఉన్నడని అనుకునేదానినని ఆమె తెలిపింది. ప్రస్తుతం ఆమె తల్లితో నాటి పరిస్థితిని చర్చించాలనుకుంటోంది. అయితే తల్లి తనకు ఏమీ తెలియదని అంటోంది. కాగా ఆ మహిళ తన జీవసంబంధమైన తండ్రిని గుర్తించగలిగింది. అయితే ఇప్పుడు తాను ఏమి చేయాలంటూ ఆమె రెడ్డిట్ యూజర్స్‌ను కోరింది. ఇది కూడా చదవండి: పాక్‌పై ప్రాణాంతక అమీబా దాడి.. 11 మంది మృతి! -
అధర్వ హీరోగా కొత్త మూవీ.. టైటిల్ ఫిక్స్!
కోలీవుడ్ నటుడు అధర్వ కథానాయకుడిగా నటించనున్న తాజా చిత్రానికి డీఎన్ఏ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇంతకుముందు మనం కొత్తి పరవై, డాడా, కళువేత్తి మూర్కన్ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఒలింపియా మూవీస్ అధినేత అంబేత్‌కుమార్ తర్వాత చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమయ్యారు. ఇందులో నటుడు అధర్వ కథానాయకుడిగా నటించనున్నారు. ఆయనకు జంటగా చిత్తా చిత్రంతో పాపులర్ అయిన మలయాళ నటి నిమీషా సజయన్ నటిస్తున్నారు. కాగా ఇంతకుముందు ఒరునాళ్ కూత్తు, మాన్స్టర్, పర్హానా వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన నెల్సన్ వెంకటేశన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. (ఇది చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 29 సినిమాలు) తాజాగా ఈ మూవీకి డీఎన్ఏ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈ చిత్రం బుధవారం పూజాకార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ వేడుకలో నిర్మాత ఆర్బీ.చౌదరి, దర్శకుడు పా.రంజిత్ పలువురు సినీ ప్రముఖులు పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. వైవిధ్యమైన కథాంశంతో యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్‌ను చైన్నె పరిసర ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు దర్శకుడు తెలిపారు. ప్రణాళిక ప్రకారం చిత్రాన్ని త్వరగా పూర్తిచేయనున్నట్లు చెప్పారు. కాగా ఇందులో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఆయన చెప్పారు. (ఇది చదవండి: నువ్వు నీలా ఉండు అని చెప్పింది ) Twitter Glimpse from #DNA film launch auspicious Pooja Starring @atharvaaMurali #NimishaSajayan Directed by @nelsonvenkat@Olympiamovis Production@Filmmaker2015 @editorsabu @amudhanPriyan @nagarajandir @Sanjay_cheqba @sharmaseenu11 @SriramRavi33@donechannel1 pic.twitter.com/SAZyHQsyPQ — Olympia Movies (@Olympiamovis) October 11, 2023 Twitter Presenting the title look of @atharvaaMurali & #NimishaSajayan starring #DNAmovie 🧬 Directed by @nelsonvenkat The shooting has officially kicked off. Brace yourself for an crime action drama@Ambethkumarmla@Filmmaker2015 @editorsabu @amudhanPriyan @nagarajandir pic.twitter.com/5T8io8BpkD — Olympia Movies (@Olympiamovis) October 11, 2023 -
ఎలుక పాలు లీటరు 18 లక్షలా..!
ఇంతవరకు అత్యంత ఖరీదైన పాలంటే గాడిద పాలనే భావించేవారు. కానీ కాదట వాటికంటే ఓ చిన్న జీవి, మన వినాయకుడి వాహనం అయిన మూషికం పాలే ఖరీదైనవి. ఏకంగా లక్షలు పలుకుతోంది ధర. పైగా పరిశోధకలకు ఎంత ప్రియమైన జంతువట అది. ఇంతకీ ఎలుక పాలు ఎందుకంత కాస్టలీ? అత్యంత ఖరీదైన పాలు ఎలుక పాలే! షాకింగ్ అనిపిస్తున్నా ఇదే వాస్తవం. ఎలుకపాలు సంపాదించటం అంత ఈజీ కాదు. పైగా ఇది 30 నిమిషాల ప్రక్రియే అయినా ఎలుక నుంచి కొద్ది మొత్తంలోనే పాలు వస్తాయి. ఒక లీటరు పాలను ఉత్పత్తి చేయడానికి దాదాపు 40 వేల ఎలుకలు అవసరం. ఈ ఎలుకల నుంచి సేకరించిన ఒక లీటరు పాల ధర దాదాపు 23 వేల యూరోలు అంటే సుమారు 18 లక్షల రూపాయలు. దేనికీ ఈ పాలు.. ఎలుక పాలను పరిశోధనలకు ఓ సాధనంగా ఉపయోగిస్తారు. మలేరియా బ్యాక్టీరియాను చంపే మందులు తయారీలో ఈ ఎలుక పాలను ఉపయోగిస్తారు. అయితే శాస్త్రవేత్తలు ఆవు పాలకు బదులుగా ఈ ఎలుక పాలేనే ఎందుకు ఉపయోగిస్తున్నారు? అంటే..ఎలుక డీఎన్ఏ ఇతర జంతువుల డీఎన్ఏకంటే ప్రభావవంతంగా ఉంటుంది. పైగా మానవ శరీరానికి సంబంధించింది. అందువల్ల ప్రయోగాల ఫలితాలను విశ్లేషించడం చాలా ఈజీ. ప్రయోగాలకు వేల జంతువులు అవసరం. అదే ఆవు అయితే వేల ఆవులను వినయోగించడం సాధ్యం కాదు. దానికంటే వేల ఎలుకలను ఉపయోగించడమే చాలా ఆచరణాత్మకమైనది, సులభమైనది కూడా. ఏ ఔషధాల్లో ఉపయోగిస్తారంటే.. మలేరియాను నయం చేసే మందుల్లోనే గాక రీసెర్చ్ మెటీరియల్గానూ ఈ పాలను వినియోగిస్తారు. అందువల్ల ఈ ఎలుక పాలు పరిశోధనల పరంగా అత్యంత ఖరీదైనవి. ఏజంతువు ఎక్కువ పాలు ఉత్పత్తి చేస్తుందంటే.. ఒక ఆవు ఏడాదికి దాదాపు 10 వేల లీటర్ పాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది దాని బరువు కంటే ఏడు రెట్లు ఎక్కువ. మేకలు ఏడాదికి వాటి బరువు కంటే 12 రెట్లు పాలను ఉత్పత్తి చేస్తాయి. ఇప్పటి వరకు ఉన్న జీవులన్నింటిలో బ్లూ వేల్ రికార్డును కలిగి ఉంది. నీలి తిమింగలం రోజుకు 600 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ పాలు చాలా కొవ్వుగా ఉంటాయి. కాబట్టి తిమింగలం పిల్ల రోజుకు 100 కిలోల బరువు పెరుగుతుంది. (చదవండి: వాస్తవికతకే రూపం ఇస్తే..పాజిటివ్ ఎమోషన్..) -
ఆకులపై జంతువుల డీఎన్ఏ
సాక్షి, అమరావతి: జీవ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు ఏ ప్రాణి.. ఎక్కడ.. ఎలా జీవిస్తోందనే సమాచారం సేకరించేందుకు శాస్త్రవేత్తలు కొత్త పద్ధతులను అన్వేషిస్తున్నారు. ఇప్పటివరకు కెమెరా ట్రాపింగ్, లైన్ ట్రాన్‌సెక్టు్టలను ఉపయోగించి జంతువుల కదలికలను ట్రాక్ చేయడం ద్వారా వన్యప్రాణుల ఉనికిని పర్యవేక్షిస్తున్నారు. ఈ ట్రాకింగ్ నిర్ధిష్ట ప్రాంతం, ప్రత్యేకించి డిజైన్ చేసిన ట్రయల్స్‌గా మాత్రమే ఉంటోంది. ఇందులో ఖరీదైన పరికరాల వాడకం, శ్రమతో కూడుకోవడంతో పాటు ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి వస్తోంది. ఒక ప్రాంతంలోని అన్ని జాతులను గుర్తించడం సాధ్యపడటం లేదు. దట్టమైన వర్షారణ్యాల్లో ఈ రకమైన ట్రాకింగ్ కష్టతరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో అంతర్జాతీయ జీవ వైవిధ్య శాస్త్రవేత్తల బృందం అడవుల్లో జంతువుల డీఎన్ఏ నమూనాల సేకరణ ద్వారా జీవ వైవిధ్యాన్ని సులభంగా, తక్కువ ఖర్చుతో గుర్తించవచ్చని ఓ అధ్యయనంలో పేర్కొంది. గాలిలోకి కణాలుగా జంతు డీఎన్ఏ ఉగాండాలోని కిబలే జాతీయ పార్కులోని వర్షారణ్యంలో అంతర్జాతీయ పరిశోధన బృందం మొక్కలు, చెట్ల ఆకులపై జంతువులు డీఎన్ఏలను కనుగొంది. జంతువులు తమ డీఎన్ఏను గాలిలోకి కణాలుగా విడుదల చేస్తున్నట్టు.. అది కాస్తా అడవిలోని వృక్ష సంపదపై సన్నని మైనం పొర మాదిరిగా అల్లుకుంటున్నట్టు పరిశోధనలో తేలింది. ఆకులపైన స్వాబ్ నమూనాలను కాటన్ బడ్స్ ద్వారా సేకరించి డీఎన్ఏ సీక్వెన్సింగ్ పరీక్ష ద్వారా జాతుల వివరాలను తెలుసుకోవడంతోపాటు జీవ వైవిధ్యాన్ని మ్యాప్ చేయవచ్చని పరిశోధన బృందం చెబుతోంది. పర్యావరణంలోని మార్పులను అర్థం చేసుకుంటూ జీవ వైవిధ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి, అటవీ జనాభాను పర్యవేక్షించడానికి డీఎన్ఏ పరీక్షా విధానం ఎంతగానో ఊతమిస్తోంది. కోవిడ్ తర్వాత డీఎన్ఏ సీక్వెన్సింగ్ టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందడం కూడా కలిసి వస్తోంది. ఆకులను శుభ్రపరచడానికి టెక్నాలజీ, ఖరీదైన పరికరాలు, ఎక్కువ శిక్షణ అవసరం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వైల్డ్‌లైఫ్ అథారిటీలో పని చేసే సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇతర జీవ శాస్త్రవేత్తలు దీనిని సులభంగా నిర్వహించవచ్చు. వాస్తవంగా పర్యావరణంలో సేకరించే డీఎన్ఏ చాలా పెద్దస్థాయిలో జీవ వైవిధ్య పర్యవేక్షణకు దోహదపడుతుంది. వర్షాధార పరిస్థితుల్లో, అత్యంత వేడి పరిస్థితుల్లో మాత్రమే ఆకులపై డీఎన్ఏ త్వరగా క్షీణిస్తుంది తప్ప మిగిలిన సందర్భాల్లో పరిశోధనలకు అనుకూలంగా ఉండటంతో ఈ పద్ధతిపై అంచనాలు పెరుగుతున్నాయి. గంటలో 50కి పైగా జాతుల గుర్తింపు కిబలే జాతీయ పార్కు గొప్ప జీవ వైవిధ్యానికి ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోని ‘ప్రైమేట్ క్యాపిటల్’ (కోతి జాతులు) నిలయంగా ఉంది. ఇందులో అంతరించిపోతున్న రెడ్ కోలోబస్ కోతి, చింపాజీలతో సహా 13 జాతులు ఇందులో ఉన్నాయి. ఇక్కడ పరిశోధకులు కేవలం ఒక గంటలో 24 కాటన్ బడ్స్ ద్వారా ఆకులపై స్వాబ్ నమూనాలను సేకరించారు. వాటి విశ్లేషణ కోసం ల్యాబ్‌కు పంపగా.. ఏకంగా 50 రకాల క్షీరదాలు, పక్షులు, ఒక కప్ప జాతులను గుర్తించడం గమనార్హం. ప్రతి మొక్క ఆకులపై దాదాపు 8 జంతు జాతులను కనుగొన్నారు. వీటిల్లో పెద్దవైన అంతరించిపోతున్న ఆఫ్రికన్ ఏనుగు నుంచి చిన్న జాతులైన సన్‌బర్డ్ వరకు భారీ జీవ వైవిధ్యాన్ని ప్రతిబింబించాయి. డీఎన్ఏల ద్వారా ఒక మీటరు పొడవాటి రెక్కలుండే గబ్బిలాలు, బయటకు కనిపించని పర్వత కోతులు, బూడిద, ఎరుపు వర్ణాల కోతులు, సుంచు ఎలుకలు, అనేక రకాల చిలుకలు ఉన్నట్టు గుర్తించారు. -
అరుదైన ప్రయోగం.. ముగ్గురి డీఎన్ఏతో జన్మించిన శిశువు.. పోలికలు వాళ్లవే!
లండన్: బ్రిటన్ శాస్త్రవేత్తలు సంచాలనాత్మక శాస్త్రీయ ప్రయోగంలో విజయం సాధించారు. ఆ దేశంలో తొలిసారి ఓ శిశువు ముగ్గురి డీఎన్ఏలతో జన్మించింది. ఇందులో 99.8 శాతం డీఎన్ఏ తల్లిదండ్రలదే కాగా.. మిగతా శాతం మహిళా దాతది. వినాశకరమైన మైటోకాండ్రియల్ వ్యాధులతో పిల్లలు పుట్టకుండా నిరోధించే ప్రయత్నంలో భాగంగా బ్రిటన్ శాస్త్రవేత్తలు ఈ సాంకేతికతను ఉయోగిస్తున్నారు. దీనికి మైటోకాండ్రియల్ డోనేషన్ ట్రీట్మెంట్(ఎండీటీ)గా నామకరణం చేశారు. ఈ పద్ధతిలో ఆరోగ్యవంతమైన మహిళా దాత అండాల కణజాలన్ని ఉపయోగించి ఐవీఎఫ్ పిండాలను సృష్టిస్తారు. తద్వారా పిల్లలకు తల్లుల ద్వారా మైటోకాండ్రియా సోకకుండా నిరోధిస్తారు. మైటోకాండ్రియా వ్యాధులు అత్యంత ప్రమాదకరమైనవి. వీటితో పుట్టిన బిడ్డలు గంటల్లో లేదా కొన్ని రోజుల తర్వాత చనిపోయే ప్రమాదం ఉటుంది. తల్లుల ద్వారా మాత్రమే పిల్లలకు ఈ వ్యాధులు సోకుతాయి. అందుకే వీటిని నిరోధించేందుకు ఇతర మహిళల అండాల కణజాలాన్ని ఉపయోగిస్తున్నారు. ఫలితంగా పిల్లలు మైటోకాండ్రియా వ్యాధుల బారినపడకుండా చేస్తున్నారు. పోలికలు తల్లిదండ్రులవే.. ఈ పద్ధితిలో జన్మించిన శిశువు తన తల్లిదండ్రుల ద్వారా వచ్చే న్యూక్లియర్ డీఎన్ఏను కలిగి ఉంటుంది. అందుకే శిశువు వ్యక్తిత్వం, కంటి రంగు వంటి ముఖ్యమైన లక్షణాలు తల్లిదండ్రుల లాగే ఉంటాయి. అయితే ఈ విధానంలో పుట్టిన బిడ్డ తల్లిదండ్రుల వివరాలను మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు. ఈ ఫలితాలు చాలా ఆశాజనకంగా ఉన్నాయని, ఇప్పటివరకు అతికొద్ది మంది మాత్రమే ఇందులో భాగమయ్యారని శాస్త్రవేత్తలు తెలిపారు. అందుకే దీని భద్రత, ప్రభావశీలత గురించి ఇప్పుడే ఓ అంచనాకు రాలేమన్నారు. ఎండీటీ పద్ధతి ద్వారా శిశువు జన్మించిన ఘటన యూకేలో ఇదే తొలిసారి అయినప్పటికీ.. అమెరికాలో మాత్రం 2016లోనే ఈ ప్రయోగం జరిగింది. జోర్డాన్‌కు చెందిన ఓ జంట ఈ సాంకేతికతతోనే ఆ ఏడాది పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. చదవండి: ట్రంప్‌కు బిగ్ షాక్.. లైంగిక వేధింపుల కేసులో దోషిగా తేల్చిన జ్యూరీ.. రూ.410 కోట్లు చెల్లించాలని ఆదేశం -
షాకింగ్ ఘటన: విమాన చక్రంలో మనిషి మృతదేహం
గాంబియా నుంచి బ్రిటన్‌కు వెళ్లిన జెట్ విమానంలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విమానం వీల్ బేలో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్నారు. టీయూఐ ఎయిర్వేస్ నడుపుతున్న జెట్ విమానంలో గుర్తు తెలియని ఒక నల్లజాతీయుడు మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. డిసెంబర్5, 2022న గాంబియా రాజధాని బంజుల్ నుంచి లండన్‌లోని గాట్విక్ మిమానాశ్రయానికి విమానం బయలుదేరింది. సరిగ్గా ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయినప్పుడే ఈ దిగ్బ్రాంతికర ఘటనను గుర్తించారు అధికారులు. ఈ మేరకు బ్రిటన్ మెట్రో పోలీసులు గాంబియా ప్రభుత్వానికి ఈ సమాచారం అందించారు. ఎలాంటి గుర్తింపు పత్రాలు లేకుండా ఒక అపరిచిత వ్యక్తి విమానం వీల్ బేలో మృతి చెంది ఉన్నట్లు తెలిపారు. ఈ మృతదేహాన్ని విమానం నుంచి తొలగించి వర్థింగ్ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. గాంబియన్ అధికారులు బ్రిటన్ పోలీసులకు సహకరించడమే కాకుండా మృతదేహానికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు యూకే పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి ఘటనలు మొదటిసారి కాదు. 2019లో ఆమ్స్టర్డామ్లోని పోలీసులు కెన్యా నుండి వచ్చిన కార్గో విమానం ముక్కు చక్రంలో ఒక వ్యక్తి అక్రమంగా ప్రవేశించి మరణించాడు. (చదవండి: కారుతో ఢీకొట్టి చంపినందుకు.. రూ 90 లక్షలు జరిమానా) -
దొంగను పట్టించిన దోమ!
వినడానికి ఎంతో ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది నిజమేనండోయ్! ఇంతకీ విషయం ఏమిటంటే.. తూర్పు చైనాలోని ఫూజియాన్ ప్రావిన్సులో ఉన్న ఫుజోలో ఓ దొంగ ఇటీవల ఓ అపార్ట్మెంట్లోకి చొరబడ్డాడు. ఖాళీగా ఉన్న ఇంటిని ఎంచుకొని బాల్కనీ మీదుగా లోపలికి ప్రవేశించాడు. అప్పటికే బాగా ఆకలితో ఉండటంతో ముందుగా వంటింట్లోకి వెళ్లాడు. కోడిగుడ్లు, న్యూడుల్స్ కనబడటంతో ఎగ్ న్యూడుల్స్ చేసుకొని లాగించేశాడు. ఆ తర్వాత కాసేపు కునుకుతీద్దామని మంచంపై వాలాడు. కానీ ఇల్లంతా దోమలమయం కావడంతో అల్మరాలోంచి ఓ దుప్పటి తీసి కప్పుకున్నాడు. ఆ తర్వాత అక్కడున్న ఓ మస్కిటో కాయిల్ వెలిగించాడు. అయినా కూడా దోమలు కుడుతుండటంతో కొన్నింటిని టపీటపీమంటూ చంపేశాడు. తెల్లవారుజాము దాకా ఇంట్లోనే ఉండి అందినకాడికి దోచుకెళ్లాడు. దొంగతనం ఫిర్యాదు అందుకున్న స్థానిక పోలీసులు ఇంటినంతా క్షుణ్ణంగా పరిశీలించారు. ఓ దోమ గోడపై రక్తపు మరకలతో అతుక్కుపోయి ఉండటాన్ని గమనించిన పోలీసులు.. దీని ద్వారా ఏదైనా ఆధారం దొరుకుతుందేమోనన్న ఉద్దేశంతో ఆ రక్త నమూనాను ఫోర్సెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. డీఎన్ఏ విశ్లేషణలో దోమలోని ఆ రక్తం చాయ్ అనే పాత నేరస్తుడితో సరిపోలడంతో అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. దీంతో నిజం ఒప్పుకున్న అతను ఆ ప్రాంతంలో మరో మూడు దొంగతనాలు కూడా చేసినట్లు వెల్లడించాడు. ప్రస్తుతం అతను జైల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు. -
రక్త ఆభరణాలు! ఔను! మానవుని రక్తంతో చేసినవి...
బంగారం, వెండీ, ప్లాటినం వంటి వాటిని కాలదన్నే విచిత్ర ఆభరణాలు రాబోతున్నాయి. మనం ఇంతవరకు తల్లిపాలతో చేసిన ఆభరణాలు గురించి విన్నాం. తల్లిపాలతో ఆభరణాలేంటి అనికొందరూ విమర్మించిన ఇందులో ఎలాంటి తప్పులేదని తయారుచేసి చూపించింది లండన్‌కి చెందిన జంట. ఐతే ఇప్పుడూ ఒక అడుగు ముందుకేసి మానవుని రక్తంతో తయారు చేసే ఆభరణాలు రూపొందిస్తున్నారు ప్రీతీ మాగో అనే మహిళ. పైగా ఇది మన ప్రియమైన వారి జ్ఞాపకంగా మన వద్ద ఉంటుందంటున్నారు. ప్రీతీ మాగో కంటి ఆస్ప్రతిలో ఆప్టోమెట్రిస్ట్‌గా పనిచేసేవారు. ఆమె ప్రెగ్నెంట్ అవ్వడంతో ఉద్యోగాన్ని వదిలేయవలసి వచ్చింది. అదీగాక బిడ్డ సంరక్షణ నిమిత్తం ఆమె ఉద్యోగానికే వెళ్లే అవకాశం లేకుండాపోయింది. ఆర్థిక స్వాతంత్య్రం కూడా కోల్పోవడంతో ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్న ఆమెకు తల్లిపాలతో జ్యూవెలరీ తయారు చేయడం గురించి సోషల్ మాధ్యమాల ద్వారా తెలుసుకుంది. దీంతో ఆమె ఆ దిశగా తన గమ్యాన్ని మార్చుకుంది. తన భర్త సాయంతో యూఎస్‌లో వివిధ జ్యూవెలరీ కోర్సులను నేర్చకుంది. తల్లిపాలతో చేసే ఆభరణాల దగ్గర నుంచి బొడ్డుతాడు, వెంట్రుకలు, దంతాలు ఉపయోగించి ఆభరణాలు తయారు చేయడంలో నైపుణ్యం సాధించారు ఆమె. ఇంతవరకు చాలామంది పలు రకాలైన ఆభరణాలను తయారు చేశారు గానీ రక్తంతో తయారు చేసే ఆభరణాలనేది అనేది అరుదైన కాన్సెప్ట్ అని, ఇంతవరుకు ఎవరూ ఇలాంటి ఆభరణాలు తయారు చేయలేదని చెబుతున్నారు ప్రీతీ. ఆమె మొదట్లో ఎన్నో వైఫల్యాలు చవిచూసిన అనంతరం 2019లో తన వ్యాపారాన్ని ప్రారంభించినట్లు ప్రీతీ తెలిపారు. మనకు ఇష్టమైన వాళ్లు మనల్ని విడిచి వెళ్లిపోయినప్పుడూ... వారి గుర్తుగా వారి శరీరం నుంచి సేకరించిన రక్తంతో అందమైన లాకెట్లుగా రూపొందిస్తారు. స్వర్గంలో ఉన్న మన ప్రియమైన ఆప్తులు గుర్తుగా ఉంటుందని చెబుతున్నారు. తాను డీఎన్ఏ కలిగిన మెటీరియల్‌ని ఉపయోగించి ఈ ఆభరణాలను రూపొందించనట్లు ప్రీతీ పేర్కొంది. (చదవండి: నడి రోడ్డు పై ల్యాండ్ అయిన విమానం: వీడియో వైరల్) -
1959లో హత్యాచారం.. డీఎన్ఏ టెస్ట్‌తో ఇప్పుడు తీర్పు.. ట్విస్ట్ ఏంటంటే
వాషింగ్టన్: అత్యాచారం.. ఆడవారి జీవితాన్ని సమూలంగా నాశనం చేసే దుర్ఘటన. దురదృష్టం కొద్ది బాల్యంలోనే ఇలాంటి చేదు అనుభవం ఎదురైతే.. వారు జీవితాంతం నరకయాతన అనుభవిస్తారు. ప్రస్తుత రోజుల్లో ముఖ్యంగా చిన్నారుల్లో అమ్మాయి, అబ్బాయి తేడా లేకుండా అకృత్యాల బారిన పడుతున్నారు. ఇదిలా ఉంటే నేటికి కూడా మన సమాజంలో అత్యాచార బాధితులు తమకు జరిగిన అన్యాయం గురించి ఫిర్యాదు చేయాడానికి ఎక్కువగా ముందుకు రావడం లేదు. వచ్చిన కేసుల్లో సత్వర న్యాయం జరగడం లేదు. ఇక సమయం గడిచిన కొద్ది నిందితులకు శిక్షపడే అవకాశాలు తక్కువ. మన దగ్గర పరిస్థితులు ఇలా ఉన్నాయి. కానీ అగ్రరాజ్యం అమెరికాలో మాత్రం 62 ఏళ్ల తర్వాత ఓ వ్యక్తిని అత్యాచార కేసులో నేరస్థుడిగా నిర్ధారించింది కోర్టు. డీఎన్ఏ టెస్ట్ ఆధారంగా అతడిని దోషిగా తేల్చింది. ఆ వివరాలు.. 62 ఏళ్ల క్రితం హత్యాచారం... 62 ఏళ్ల క్రితం అనగా 1959లో ఈ దారుణం చోటు చేసుంది. స్పోకనే వెస్ట్ సెంట్రల్ పరిసర ప్రాంతానికి చెందిన 9 ఏళ్ల బాలిక క్యాంప్‌ఫైర్ మింట్స్ అమ్మడానికి బయటకు వెళ్లింది. ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. బాలిక గురించి గాలించినప్పటికి ప్రయోజనం లేకపోయింది. రెండు వారాల తర్వాత చిన్నారి మృతదేహం లభ్యమయ్యింది. బాలికపై దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి పేరు జాన్ రీగ్ హాఫ్. అప్పటికి అతడిపై పోలీసులకు ఎలాంటి అనుమానం కలగలేదు. (చదవండి: లైంగిక వేధింపులు: ‘నన్ను క్షమించండి.. నాకు బతకాలని ఉంది.. కానీ’) అందుకే నిందితుడిపై అనుమానం రాలేదు... కారణం ఏంటంటే జాన్ రీగ్ హాఫ్ అమెరికా ఆర్మీలో సైనికుడిగా పని చేస్తుండేవాడు. అందుకని పోలీసులు అతడిని అనుమానించలేదు. ఇక దారుణానికి ఒడిగట్టిన సమయంలో జాన్ రీగ్ దారుణం జరిగిన స్పోకేన్ కౌంటీలోని ఫెయిర్‌చైల్డ్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. బాలిక మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన వైద్యులు.. బాలికపై అత్యాచారం చేసి.. ఆ తర్వాత హత్య చేశారని తెలిపారు. నిందితుడి కోసం పోలీసులు గాలించసాగారు. పట్టించిన మరో దారుణం ఈ క్రమంలో అప్పటికే 9 ఏళ్ల చిన్నారి ఉసురు తీసిన జాన్ రీగ్.. మరో దారుణానికి ఒడిగట్టాడు. ఓ మహిళ కాళ్లు, చేతులు కట్టేసి.. కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ కేసులో పోలీసులు జాన్ రీగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో అతడి వయసు 20 సంవత్సరాలు. మహిళను హత్య చేసిన కేసులో అమెరికా కోర్టు జాన్ రీగ్‌కి శిక్ష విధించింది. (చదవండి: కన్నపేగు పోరాటం.. ఆ బిడ్డ అనుపమ బిడ్డే అయి ఉండాలని..) మహిళ హత్య కేసు విచారణ సమయంలో జాన్ రీగ్‌కు సంబంధించి పోలీసులు కొన్ని ఆసక్తికర విషయాలు గుర్తించారు. బాలిక హత్యాచారానికి గురైన సమయంలో జాన్ రీగ్ ఆ ప్రాంతంలోనే విధులు నిర్వహిస్తున్నట్లు గమనించారు. అయితే ఇప్పుడున్నంత సాంకేతిక పరిజ్ఞానం అప్పట్లో అందుబాటులో లేకపోవడంతో బాలిక హత్యాచార కేసులో జాన్ రీగే నేరస్థుడని పోలీసులు నిరూపించలేకపోయారు. అప్పట్లో ఈ కేసు ‘మౌంట్ ఎవరెస్ట్’ పేరుతో ప్రసిద్ధి చెందింది. అత్యాధునిక డీఎన్ఏ పరిజ్ఞానం సాయంతో.. ఈ సంవత్సరం ప్రారంభంలో, టెక్సాస్‌లోని డీఎన్ఏ ల్యాబ్‌కు బాధితురాలి శరీరం నుంచి వీర్య నమూనాను తీసుకెళ్లడానికి పోలీసు డిపార్ట్మెంట్కు అనుమతి లభించింది. ఇక చిన్నారి శరీరంపై ఉన్న వీర్య నమూనాలు ముగ్గురు అనుమానితుల్లో ఒకరితో సరిపోలింది. ఆ ముగ్గురు ఎవరనగా.. జాన్ రీగ్, అతడి ఇద్దరు సోదరులు. ఇక బాలిక శరీరం మీద లభ్యమైన వీర్య నమూనాలు జాన్ రీగ్‌తో సరిపోలాయి. దాంతో బాలికపై హత్యాచారానికి ఒడిగట్టిన వ్యక్తి జాన్ రీగ్ అని తెలిపారు పోలీసులు. ఆ తర్వాత కేసు మూసివేశారు. అదేంటి నేరస్థుడికి శిక్ష విధించాలి కదా అంటే.. అతడు దాదాపు 30 ఏళ్ల క్రితమే అనగా 1971లో మృతి చెందాడు. (చదవండి: హత్యాచార కేసు: 30 రోజుల్లోనే విచారణ పూర్తి.. సంచలన తీర్పు) మరి కేస్ ఎలా చేధించారు అంటే.. మహిళను హత్య చేసిన కేసులో జాన్ రీగ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. బాలిక హత్యాచారం కేసులో అతడే నిందితుడై ఉంటాడని భావించారు. ఈ క్రమంలో జాన్ రీగ్‌తో పాటు అతడి తమ్ముళ్లిద్దరి వీర్య నమూనాలను, బాధిత బాలికపై సేకరించిన వీర్య నమూనాలను భద్రపరిచారు. తాజాగా అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక డీఎన్ఏ సాంకేతిక పరిజ్ఞానం సాయంతో జాన్ రీగ్‌ను నేరస్థుడిగా నిర్థారించారు. కేసు చేధించేనాటికే అతడు మరణించడంతో ఫైల్ ముసివేశారు. చదవండి: మహిళా ఉద్యోగికి ఏఈ లైంగిక వేధింపులు.. బుద్ధి చెప్పిన కుటుంబ సభ్యులు -
Health Tips: ఈ విటమిన్ లోపిస్తే మతిమరుపు, యాంగ్జైటీ, హృదయ సమస్యలు.. ఇంకా..
రక్తహీనత, అలసట, తిమ్మిర్ల నివారణకు విటమిన్ బి12 ఎంతో సహాయపడుతుంది. ఇది శరీర పెరుగుదలకు, రక్త కణాల నిర్మాణంలో, నాడీ వ్యవస్థ క్రమబద్ధీకరణకు, డీఎస్ఏ ఉత్పత్తికి ప్రధాన పోషకం. అలాగేశరీరంలోని వివిధ భాగాల పనితీరును క్రమబద్ధీకరిస్తుంది కూడా. ఐతే ప్రపంచవ్యాప్తంగా 15% కంటే ఎక్కువ మంది ప్రజలు విటమిన్ బి12 లోపంతో బాధపడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. విటమిన్ బి 12 మన శరీరంలో సహజంగా ఉత్పత్తి కాదు. సీ ఫుడ్ (సముద్ర ఆధారిత ఆహారాలు), గుడ్లు, మాంస ఉత్పత్తులు, కొన్ని ప్రత్యేక పండ్లు, కూరగాయల్లో మాత్రమే ఈ విటమిన్ ఉంటుంది. ఏదిఏమైనప్పటికీ శాఖాహారులు ఈ విటమిన్ లోపంతో అధికంగా బాధపడుతున్నారు. విటమిన్ బి12 లోపిస్తే శక్తి హీనతతోపాటు కొన్ని రకాల మానసిక సమస్యలు కూడా తలెత్తుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అవేంటో తెలుసుకుందాం.. యాంగ్జైటీ విటమిన్ బి12 స్థాయిలు తక్కువగా ఉంటే మానసిక సమతుల్యత దెబ్బతిని డిప్రెషన్‌కు దారితీస్తుంది. ఎందుకంటే మెదడులోని ముఖ్యమైన న్యూరోట్రాన్స్మిటర్ రసాయనాలైన డోపమైన్, సెరోటోనిన్ ఉత్పత్తికి విటమిన్ బి 12 బాధ్యత వహిస్తుంది. చదవండి: Suspense Thriller Crime Story: 37 కోట్ల బీమా కోసం పాముకాటుతో చంపించి.. తిమ్మిర్లు చేతులు, కాళ్ల వేళ్ల చివర్లు సూదులతో గుచ్చినట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా విటమిన్ బి12 మన శరీరంలో నాడీవ్యవస్థ పనితీరులో, ఎర్ర రక్తకణాల ఉత్పత్తిలో కీలకపాత్ర పోషిస్తాయి. ఇది లోపిస్తే శరీరం సమతుల్యత తప్పి కళ్లు తిరగడం, వికారం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. మతిమరుపు విటమిన్ బి12 లోపం మెదడు ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. మతిమరుపు, తికమకపడటం, విషయాలను గుర్తుపెట్టుకోవడం కష్టతరమవ్వడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కొన్ని సందర్భాల్లో మిమిక్ డైమెన్షియా అనే వ్యాధి భారీనపడే అవకాశం కూడా ఉంది. చదవండి: Science Facts: క్యాన్సర్ నివారణకు పసుపు ఉపయోగపడుతుందా?.. అదే అడ్డంకి.. నాలుక రుచి మందగించడం విటమిన్ బి12 లోపిస్తే నాలుకపై ఉండె రుచిమొగ్గలు క్రమంగా రుచిని కోల్పోతాయి. అంతేకాకుండా నాలుక వాపు, నోటి పుండ్లు, ముడతలు, నోటిలో మంట వంటి ఇతర సమస్యలు కూడా సంభవించవచ్చు. హృదయ సమస్యలు గుండె వేగం పెరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కూడా తలెత్తుతాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: Viral Video: అరె.. ఏం చేస్తున్నావ్.. ఛీ! డ్రైనేజీ వాటర్‌తోనా.. -
ఏకరూప కవలల వేలిముద్రలు మారిపోతాయా?
సాక్షి, న్యూఢిల్లీ: వేలిముద్రలు లేదా ఫింగర్ ప్రింట్స్ మన జీవన విధానంలో వీటికున్న ప్రాధాన్యత చాలా కీలకం. జీవి గుర్తింపుకు ప్రతీకలివి. అందుకే నేరస్తులను పట్టుకోవడంలో వేలిముద్రలు ప్రధాన సాక్క్క్ష్యాలుగా మారిన ఉదాహరణలు ఎన్నో..ఎందుకంటే ఈ భూమిపై ఏ ఇద్దరి వేలిముద్రలు ఒకేలా ఉండవు. మరి ఒకే డీఎన్ఏను పంచుకున్న ఏక రూప కవలల ఫింగర్ ప్రింట్స్ మాటేమిటి? లేదా వేరు వేరుగా ఉంటాయా? మధ్యలో మారిపోతాయా? ఈ వేలిముద్రల ఆసక్తికర విషయాలగురించి తెలుసుకుందాం.. ఆధునిక సమాజంలో వ్యక్తి గుర్తంపునుంచి ఆఫీస్ అటెండెన్స్ నుంచి..అంతా ఫింగర్‌ప్రింట్ బయోమెట్రిక్ అథెంటికేషన్ సిస్టంతోనే నడుస్తుంది. మనం ముందే చెప్పుకున్నట్టుగా ఏ ఇద్దరి ఫింగర్ ప్రింట్స్ ఒకరితో ఒకరికి సరిపోలవు. అంతేకాదు ఒకే వ్యక్తికి సంబంధించిన ఏ రెండు వేళ్ళ ముద్రలు కూడా ఒకేలా ఉండవు, వాటిని ఎవరూ దొంగిలించలేరు కూడా. ఎందుకో తెలుసా..! జన్యుపరమైన నిర్మాణాన్ని అనుసరించి వేళ్లపై ఉండే గీతలు రూపొందుతాయి కాబట్టి. మరి ఒకే డీఎన్ఏను పంచుకునే ఏక రూప కవలల ఫింగర్ ప్రింట్స్ విషయమేంటి? వారి వేలి ముద్రలు ఒకేలా ఉంటాయా? అనే సందేహం ఎప్పుడైనా వచ్చిందా..ఏక రూప కవలలను మోనోజెనెటిక్ ట్విన్స్ అనికూడా అంటారు. అంటే ఒకే అండం (జైగోట్) నుంచి అభివృద్ధి చెంది, పెరెంట్స్ నుంచి దాదాపుగా ఒకే జన్యువులను పంచుకుని ఒకేలా కనిపించే కవలలు అన్నమాట! సమరూపజీవులకు ఒకే గర్భం సమానంగా స్థలాన్ని పంచినా, జెనెటిక్ నిర్మాణాన్ని మాత్రం వంద శాతం సమానంగా ఒకేలా పంచదని పెన్సిల్వేనియా యూనివర్సిటీ లైవ్ సైన్స్ విభాగం గతంలో వెల్లడించింది. ఏదిఏమైనప్పటికీ.. ఏకరూపకవలల ఫింగర్ ప్రింట్స్ ఒకేలా ఉండవని ఫోరెన్సిక్ సైంటిస్ట్ సిమోనా ఫ్రాన్సిస్ (షిఫీల్డ్ హల్లామ్ యూనివర్సిటీ ) స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ ప్రపంచంలో ఏ ఇద్దరి వేలి ముద్రలు ఒకేలా ఉన్నట్టు నిరూపించబడలేదు. వేళ్ళపై ఉండే రిడ్జ్ ప్యాట్రన్ మార్పుకు కేవలం డీఎస్ఏ మాత్రమే కారణం కాదు. గర్భంలోని భిన్న వాతావరణ కారకాలు కూడా వేలి ముద్రల నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తాయి. సాధారణంగా అభివృద్ధి చెందిన గర్భస్థ శిశువుకు 13 నుంచి 19 వారాల వ్యవధిలో వేలి ముద్రలు రూపొందుతాయి. ఈ సమయంలో గర్భం వైశాల్యం, బొడ్డు తాడు పొడవు, తల్లి నుంచి సంక్రమించే పోషకాల స్థాయి.. వేలి ముద్రల నిర్మాణంలో ప్రభావం చూపుతాయి. కవలలు పుట్టిన తర్వాత కూడా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వేలి ముద్రలు తాత్కాలికంగా లేదా శాశ్వతంగా మారే అవకాశం కూడా ఉంది. అంటే.. చర్మ స్వభావం, మచ్చలు, కాలిన గాయాలు, వాడే మందులు వంటి అరుదైన పరిస్థితుల్లో వేలి ముద్రలు మారతాయని ఫ్రాన్సిస్ తెలిపారు. ఏకరూప కవలలు తమ పేరెంట్స్‌ను, ఫ్రెండ్స్‌ను.. ఇతరులను మోసం చేయవచచ్చునేమో కానీ, వేలి ముద్రలు మాత్రం పట్టించేస్తాయి. -
వ్యాధులున్న పిల్లలకు మొదట జైకోవ్–డీ
న్యూఢిల్లీ: భారత్‌లో తయారైన తొలి డీఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్ జైకోవ్–డీని వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకు ముందుగా ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీనిపై విధివిధానాలను ఖరారు చేసేందుకు నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ (ఎన్టీఏజీఐ) త్వరలో ఓ సమావేశం నిర్వహించబోతున్నట్లు వెల్లడిం చారు. ఈ నెల 20న జైడస్ క్యాడిలాకు చెందిన జైకోవ్–డీ వ్యాక్సిన్‌కు భారత్‌లో అత్యవసర అనుమతులు లభించడం తెల్సిందే. 12–18 సంవత్సరాల మధ్య వయసు ఉండి, అప్పటికే పలు వ్యాధులతో బాధపడుతున్న వారికి ముందుగా ఇచ్చేలా ప్రణాళిక రచిస్తున్నారు. దేశంలో 12–18 ఏళ్ల వయసు ఉన్న వారు 12 కోట్ల మంది ఉంటారని, అందులో ఒక శాతం మంది పలు వ్యాధులతో బాధపడుతుంటారని అంచనా వేస్తున్నట్లు ఎన్టీఏజీఐ చైర్మన్ డాక్టర్ ఎన్కే అరోరా తెలిపారు. జైకోవ్–డీ వ్యాక్సిన్‌ను సూది లేకుండా మూడు డోసుల ద్వారా అందించనున్నారు. -
ప్రపంచాన్ని రక్షిస్తానంటూ.. కన్న బిడ్డలను చంపేశాడు..!
వాషింగ్టన్: ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలలో బ్రెయిన్ వాషింగ్ అనేది కూడా ఓ ప్రమాదరమైన ఆయుధం వంటిదే. ఇటీవల ఆమెరికాకు చెందిన ఓ తండ్రి తన పిల్లలను చంపిన సంఘటనే దానికి రుజువు నిలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన మాథ్యూ టేలర్ కోల్మన్(40) అనే వ్యక్తి తన పిల్లలను క్యాంపింగ్‌కు తీసుకెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి తీసుకెళ్లాడు. అయితే వారిని ఎక్కడికి తీసుకెళ్తున్నాడో.. ఎప్పుడు తీసుకువస్తాడో అతని భార్యకు చెప్పడానికి నిరాకరించాడు. అంతే కాకుండా ఆమె మెసేజ్‌లు, కాల్ చేసినపుడు కూడా అతను సమాధానం ఇవ్వలేదు. దీంతో అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడు యుఎస్‌కు తిరిగి వచ్చే క్రమంలో సరిహద్దు వద్ద ఆగస్టు 7న అతడిని ఎఫ్బిఐ అరెస్టు చేసింది. భవిష్యత్తులో ‘‘రాక్షసులు’’గా ఎదుగుతారని.. కాగా పోలీసు అధికారులు అతడి ఫోన్‌ని ఫైండ్ మై ఐఫోన్ యాప్ ద్వారా ట్రాక్ చేశారు. ఇది మెక్సికోలోని రోసారిటోగా అతని చివరిగా ఉన్నట్లు చూపించింది. దీంతో అప్రమతమైన ఎఫ్బిఐ అతడిని అరెస్టు చేసి ప్రశ్నించింది. ఇంటరాగేషన్‌లో కోల్మన్ తన పిల్లలను ఈటెల ఫిషింగ్ గన్‌తో చంపి, వారి మృతదేహాలను మెక్సికోలో పడవేసినట్లు ఒప్పుకున్నాడు. వారి మృతదేహాలను మెక్సికో అధికారులు కనుగొన్నారు. కాగా తన భార్య ‘‘సర్పెంట్ డీఎన్ఏ’’ తన పిల్లలు కలిగి ఉన్నారనే కారణంతో వారిని చంపేశానని, ఈ ‘‘సర్పెంట్ డీఎన్ఏ’’ ను కలిగి ఉన్నందరున వారు భవిష్యత్తులో ‘‘రాక్షసులు’’గా ఎదుగుతారని ఈ నేరానికి పాల్పడినట్లు నిందితుడు పోలీసులకు తెలియజేశాడు. భవిష్యత్తులో ప్రపంచం "రాక్షసులతో" నిండి ఉంటుందని క్యూఆనన్, ఇతర కుట్ర సిద్ధాంతాల ద్వారా "జ్ఞానోదయం" పొందానని కోల్మన్ తెలిపినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇది ప్రపంచాన్ని రక్షించే ఏకైక చర్య అని నిందితుడు కోల్మన్ చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
వయసు 18.. శరీరం 144 ఏళ్లు! పోరాడి ఓడిన అమ్మాయి
పుట్టిన ప్రతీ ప్రాణికి ఏదో ఒకరోజు చావు తప్పదు. కానీ, ఆమె మాత్రం తన మరణం గురించి ముందే తెలుసుకుంది. అరుదైన జబ్బుతో బాధపడుతున్నా.. దుఖాన్ని దిగమింగుకుంది. సంతోషంగా ఉంటూ.. కన్నవాళ్లనూ, తోబుట్టువును నవ్వించేందుకు ప్రయత్నించింది. చివరికి బతుకు పోరాటంలో మృత్యువు ఒడిలోకి ఒదిగిపోయింది. యూకేకు చెందిన అశాంతి స్మిత్(18)గాథ ఇప్పుడు సోషల్ మీడియాతో కన్నీళ్లు పెట్టిస్తోంది. యూకే వెస్ట్ సస్సెక్స్‌కు చెందిన 18 ఏళ్ల అమ్మాయి Ashanti Smith.. జులై 17న కన్నుమూసింది. ఆమె ‘హట్చిసన్-గిల్ఫోర్డ్ ప్రోగేరియా’ అనే అరుదైన సిండ్రోమ్‌తో బాధపడుతూ వచ్చింది. ఇదొక జెనెటిక్ డిసీజ్. ఈ సిండ్రోమ్ ఉన్నవాళ్లకు చిన్నవయసులో వయసు మళ్లిన లక్షణాలు వస్తాయి. స్మిత్ ఎనిమిదవ ఏట నుంచి ఈ సిండ్రోమ్ తీవ్ర ప్రభావం చూపెడుతూ వస్తోంది. అప్పటి నుంచి ఏడాదికి.. ఎనిమిది రేట్ల వయసు పెరుగుతూ వస్తోంది. చివరికి.. పద్దెనిమిదేళ్ల వయసులో ‘పండు ముసలి’ లక్షణాలతో నరకం అనుభవిస్తూ ఆమె తుది శ్వాస విడిచింది. నవ్వుతూ బతకమంది అశాంటి స్మిత్.. బతికినంత కాలం ఆత్మస్థైర్యంతో బతికిందని ఆమె తల్లి లూయిస్ స్మిత్ గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనవుతోంది.‘తనకు ఉన్న జబ్బు గురించి అశాంటికి తెలుసు. ఎక్కువ కాలం జీవించదని కూడా తెలుసు. అయినా సంతోషంగా ఉండాలనుకుంది. అవతలి వాళ్లు తన గురించి ఏమనుకున్నా, జాలి పడినా.. అందరినీ నవ్విస్తూ బతికింది. మా కన్నీళ్లు తుడుస్తూ నవ్వుతూ ఉండాలని కోరేది. ఆమెకు బీటీఎస్ సంగీతం అంటే ఇష్టం. ఆమె అంత్యక్రియలు ఆ సంగీతంతోనే ముగిస్తాం. ఇక నుంచి ప్రొగెరియా సిండ్రోమ్‌తో బాధపడే చిన్నారుల చేయూత కోసం పని చేస్తాన’ని చెబుతోంది లూయిస్. ప్రొగేరియా అంటే.. డీఎన్ఏ సంబంధింత జబ్బు. రెండు కోట్ల మందిలో ఒకరు ఈ సిండ్రోమ్‌తో పుట్టే ఛాన్స్ ఉంది. 1886లో జోనాథన్ హట్చిన్సన్ అనే సైంటిస్టు ఈ సిండ్రోమ్‌ను గుర్తించాడు. ఆపై గిల్ఫోర్డ్ అనే సైంటిస్ట్ పూర్తి స్థాయి అధ్యయనం చేయడంతో.. ‘హట్చిసన్-గిల్ఫోర్డ్ ప్రొగేరియా’ అనే పేరు వచ్చింది. ఈ జబ్బుకు పూర్తిస్థాయి చికిత్స లేదు. వైద్యం కూడా చాలా ఖరీదుతో కూడుకుంది. అందుకే విరాళాల సేకరణతో పిల్లల్ని బతికించుకునే ప్రయత్నం చేస్తుంటారు తల్లిదండ్రులు. 2020 సెప్టెంబర్ నాటికి 53 దేశాల్లో.. 179 కేసులు రికార్డు అయినట్లు ప్రొగేరియా రీసెర్చ్ ఫౌండేషన్ చెబుతోంది. చాలామంది ఈ వ్యాధితో చనిపోగా.. కొన్ని కేసులు చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయాయి కూడా. లక్షణాలు ప్రొగేరియా ఒక జెనెటిక్ డిసీజ్.. డీఎన్ఏ విపరీతమైన మార్పుల వల్ల ఇలా జరుగుతుంది. ఈ డిసీజ్ వల్ల చర్మం మారుతుంది.. ముడుతలు పడుతుంది. జుట్టు ఊడిపోతుంది. వయసుకు సంబంధించిన ప్రతికూల లక్షణాలు శరీరంలో ఏర్పడతాయి. లక్షణాలు ఏడాది వయసు నుంచి కనిపించొచ్చు. లేదంటే ఆలస్యంగా బయటపడొచ్చు. జెనెటిక్ పరీక్షల ద్వారా మాత్రమే దీనిని నిర్ధారించుకోవచ్చు. ఈ డిసీజ్ గుండె జబ్బులకు దారితీస్తుంది, ఒక్కోసారి కదల్లేని స్టేజ్‌కు చేరుకుంటారు. పేషెంట్లలో 90 శాతం స్ట్రోక్స్‌తో చనిపోతుంటారు. బ్రాడ్ పిట్ నటించిన ‘ది క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్’(2008) ఇలాంటి సబ్జెక్ట్‌తో తీసిన కథే. అందుకే బెంజమిన్ బటన్ డిసీజ్ అని కూడా వ్యవహరిస్తుంటారు. ఈ మూవీకి ఇన్స్పిరేషన్.. అమెరికన్ శాన్ బెర్న్ జీవితం. 1996లో పుట్టిన శాన్బెర్న్.. ప్రొగేరియా పేషెంట్. అందుకే ఆ డిసీజ్ అవగాహన కోసం కృషి చేశాడు. చివరికి పద్దెనిమిదేళ్ల వయసులో యువ ఉద్యమవేత్తగా కన్నుమూశాడు. మరణానంతరం శాన్బెర్న్ పేరెంట్స్ ‘ప్రొగేరియా రీసెర్చ్ ఫౌండేషన్’ స్థాపించి.. ఆ వ్యాధి పట్ల అవగాహన కోసం కృషి చేస్తున్నారు. -సాక్షి, వెబ్‌డెస్క్ -
కరోనాకు ‘కత్తెర’ పడినట్టే!.. సరికొత్త చికిత్స అందుబాటులోకి
ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మందిని గడగడలాడిస్తున్న కరోనాకు ‘కత్తెర’ పడే టైం వచ్చేస్తోంది. కరోనా ఎన్ని కొత్త రూపాంతరాలు మార్చుకున్నా.. ఎన్నిమార్పులు చేసుకున్నా దొరకబుచ్చుకుని అంతం చేసే సరికొత్త చికిత్స అందుబాటులోకి రానుంది. అత్యంత ఆధునికమైన జన్యు ఎడిటింగ్ టెక్నాలజీతో కోవిడ్‌కు చెక్‌పెట్టే దిశగా ఈ పరిశోధనలు జరుగుతున్నాయి. ఒక్క కరోనా అనే గాకుండా చాలా రకాల వైరస్‌లను ఈ విధానంలో నిర్మూలించవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మరి ఈ పరిశోధన వివరాలు ఏమిటో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ రూపు మార్చుకుంటూ.. భయపెడుతూ.. కరోనా వ్యాప్తి మొదలై ఏడాదిన్నర దాటింది. ఇప్పటికే రెండు వేవ్‌లతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ఇబ్బందిపెట్టి.. లక్షల మందిని పొట్టనపెట్టుకుంది. ఎప్పటికప్పుడు రూపు మార్చుకుంటూ పంజా విసురుతోంది. శాస్త్రవేత్తలు పగలూరాత్రీ కష్టపడి వ్యాక్సిన్లను అభివృద్ధి చేసినా.. వాటి ప్రభావం నుంచి, మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకునే సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. ఇలాంటి సమయంలో మళ్లీ ప్రపంచవ్యాప్తంగా కేసులు,మరణాలు పెరుగుతుండటంతో అలజడి మొదలైంది.కరోనాను పూర్తిస్థాయిలో ని ర్మూలించే చికిత్సలపై అందరిదృష్టిపడింది.ఈ క్ర మంలోనే ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ యూనివర్సి టీ ఇన్ఫెక్షన్ అండ్ ఇమ్యూనిటీ ఇన్స్టిట్యూట్, పీటర్ మెకల్లమ్ కేన్సర్‌సెంటర్ శాస్త్రవేత్తలు ‘క్రిస్పర్ క్యాస్’ సాంకేతికతతో కోవిడ్‌కు చెక్‌పెట్టే పరిశోధన చేపట్టారు. కరోనా మూలంపైనే టార్గెట్.. కోవిడ్ వైరస్‌లో అంతర్గతంగా జన్యు పదార్థం ఉండి.. దానిచుట్టూ కొన్ని ప్రొటీన్లు, ఆపై కొవ్వు పదార్థంతో కూడిన పొర, దానిపై స్పైక్ ప్రొటీన్లు ఉంటాయి. కరోనా వ్యాక్సిన్లుగానీ, ప్రస్తుతం చికిత్సలో వాడుతున్న యాంటీవైరల్ మందులుగానీ.. వైరస్‌లోని స్పైక్ ప్రొటీన్, మరికొన్ని ఇతర ప్రొటీన్లను టార్గెట్ చేస్తాయి. మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ కూడా వీటినే లక్ష్యంగా చేసుకుంటుంది. అయితే కరోనా వైరస్.. ఈ ప్రొటీన్లలో మార్పులు చేసుకుని, కొత్త వేరియంట్లుగా మారుతుండటంతో.. వ్యాక్సిన్లకు, మందులకు చిక్కడం లేదు. ఈ నేపథ్యంలోనే వైరస్‌లో మార్పు చెందకుండా ఉండే జన్యు పదార్థంపై నేరుగా దాడి చేసే చికిత్సపై మెల్బోర్న్ వర్సిటీ శాస్త్రవేత్తలు దృష్టిపెట్టారు. ఏమిటీ ‘క్రిస్పర్ క్యాస్’? భూమ్మీద జీవులన్నింటికీ మూలాధారం జన్యువులే. ఒక రకంగా చెప్పాలంటే.. మనకు మెదడు ఎలాంటిదో, ప్రతి కణానికి డీఎన్ఏ పదార్థం అలాంటిది. ఆ కణం ఏమిటి? దాని విధులు ఏమిటి? కణంలోని భాగాలు ఏయే పనులు చేయాలి? ఏం ఉత్పత్తి చేయాలి? ఎలా వ్యవహరించాలి అన్నది జన్యువులే చూసుకుంటాయి. బ్యాక్టీరియాల వంటి సూక్ష్మజీవులు మొదలుకుని చెట్లు, జంతువులు, మనుషులు సహా అన్నిజీవుల కణాల్లో ఈ డీఎన్ఏ ఉంటుంది. ఇలాంటి జన్యువుల్లో మార్పులు, చేర్పులు చేయడం ద్వారా కణాల విధులు, లక్షణాల్లో మార్పులు తేవొచ్చు. ఇందుకు తోడ్పడే అత్యాధునిక సాంకేతికతనే ‘క్రిస్పర్ క్యాస్’. ఇందులో క్రిస్పర్ అనే వ్యవస్థ ద్వారా ‘క్యాస్–9’ అనే ఎంజైమ్ ఎంజైమ్‌ను ఉపయోగించి.. డీఎన్ఏను కత్తిరించడం, అందులోని ఏదైనా భాగాన్ని తొలగించడం, మరేదైనా భాగాన్ని కలపడం చేస్తారు. ఈ ‘క్రిస్పర్ క్యాస్9’ విధానాన్ని అభివృద్ధి చేసిన ఇద్దరు మహిళా శాస్త్రవేత్తలు.. మ్యాక్స్‌ప్లాంక్ యూనిట్ ఆఫ్ సైన్స్‌కు చెందిన ఎమ్మాన్యుయెల్ చార్పింటర్, కాలిఫోర్నియా వర్సిటీ ప్రొఫెసర్ జెన్నిఫర్ దౌడ్నాలకు 2020 రసాయన శాస్త్ర నోబెల్ రావడం గమనార్హం. కరోనా జన్యు పదార్థాన్ని ముక్కలు చేసేలా.. జీవుల్లో జన్యుపదార్థం ‘డీఎన్ఏ’ రూపంలో ఉంటుంది. వైరస్లు పూర్తిస్థాయి జీవులు కాదు. వాటిలో ‘ఆర్ఎన్ఏ’ రూపంలో ఉంటుంది. క్యాస్9 ఎంజైమ్‌లు డీఎన్ఏను మాత్రమే కత్తిరిస్తాయి. దీంతో మెల్బోర్న్ వర్సిటీ శాస్త్రవేత్తలు ఆర్ఎన్ఏను కత్తిరించగలిగే.. ‘క్యాస్13బీ’ ఎంజైమ్‌ను అభివృద్ధి చేశారు. ల్యాబ్‌లో కరోనాపై ప్రయోగించి చూశారు. ►‘‘ఈ ప్రయోగంలో కరోనా వైరస్‌ను గుర్తించిన ‘క్యాస్13బీ’ ఎంజైమ్.. దాని ఆర్ఎన్ఏకు అతుక్కుని, వైరస్ పునరుత్పత్తికి తోడ్పడే భాగాలను కత్తిరించేసింది. వేర్వేరు కరోనా వేరియంట్లపైనా ప్రభావవంతంగా పనిచేసింది’’ అని పరిశోధనకు నేతృ త్వం వహించిన శాస్త్రవేత్త షరోన్ లెవిన్ తెలిపారు. వ్యాక్సిన్ కాదు.. చికిత్స.. కరోనాకు మ్యూటేషన్ చెందే సామర్థ్యం ఎక్కువని, భవిష్యత్తులో వ్యాక్సిన్ల ప్రభావం తగ్గిపోతుందని షరోన్ లెవిన్ అభిప్రాయపడ్డారు. అందువల్ల కరో నా సోకిన తర్వాత అందించే చికిత్స కీలకమన్నారు. ప్రస్తుతం తాము రూపొందించినది ఒక రకంగా యాంటీ వైరల్ చికిత్స అని తెలిపారు. దీన్ని జంతువులపై ప్రయోగించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని.. తర్వాత మానవ ప్రయోగాలు చేపడతామన్నారు. ►క్రిస్పర్ క్యాస్ విధానం ద్వారా ఒక్క కరోనా మా త్రమేగాకుండా చాలా రకాల వైరస్‌లకు చెక్‌పెట్టవచ్చని షరోన్ తెలిపారు. ఇప్పటికే కేన్సర్, హెచ్ఐవీలను ఈ విధానంలో నియంత్రించేందుకు ప్రయోగాలు జరుగుతున్నాయని వెల్లడించారు. -
వారిది తప్ప.. అందరి డీఎన్ఏ ఒక్కటే
న్యూఢిల్లీ: ఆవు మాంసం తినే వారిది తప్ప..దేశ ప్రజలందరి డీఎన్ఏ ఒక్కటేనంటూ విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ)నేత సాధ్వి ప్రాచి వ్యాఖ్యానించారు. శనివారం సాధ్వి ప్రాచి రాజస్తాన్‌లోని దౌసాలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ..‘ఆవు మాంసం తినేవారిది మినహా అందరి డీఎన్ఏ ఒక్కటే’అని పేర్కొన్నారు. దేశంలో జనాభా పెరుగుదలను ఆపేందుకు కఠిన చట్టాలు తీసుకురావాలన్నారు. ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానాన్ని కలిగిన వారికి ప్రభుత్వ సేవలు బంద్ చేయాలన్నారు. వారికి ఓటు హక్కు కూడా లేకుండా చేయాలని డిమాండ్ చేశారు. రాజస్తాన్‌లో లవ్ జిహాద్ ముసుగులో జరుగుతున్న మత మార్పిడులను ఆపేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఐక్యత లేకుండా అభివృద్ధి సాధ్యం కాదనీ, దేశంలోని అన్ని మతాల ప్రజల డీఎన్ఏ ఒక్కటేనని ఇటీవల జరిగిన ముస్లిం రాష్ట్రీయ మంచ్ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్న విషయం తెలిసిందే. -
Research: కోవిడ్ తీవ్రతకు ఆ డీఎన్ఏకు లంకె!
సాక్షి, హైదరాబాద్: కరోనా బారినపడిన కొందరిలో తీవ్రమైన లక్షణాలు కన్పిస్తున్నాయి ఎందుకు? ఈ ప్రశ్నకు అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం సమాధానం కనుగొంది. యూరోపియన్లపై జరిగిన ఓ పరిశోధనలో డీఎన్ఏలోని ఒక భాగానికి, కోవిడ్ తీవ్రతకు, ఆస్పత్రిలో గడిపే అవసరానికి సంబంధం ఉందని తేలింది. ఈ డీఎన్ఏ భాగం 50 శాతం మంది దక్షిణాసియావాసుల్లో ఉండగా.. 16 శాతం మంది యూరోపియన్లలో ఉంది. ఈ డీఎన్ఏ భాగం కోవిడ్–19 బాధితులపై చూపుతున్న ప్రభావాన్ని అంచనా వేసేందుకు సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ (సీడీఎఫ్‌డీ) డైరెక్టర్ డాక్టర్ తంగరాజ్, బెనారస్ హిందూ యూనివర్సిటీ శాస్త్రవేత్త ప్రొఫెసర్ జ్ఞానేశ్వర్ చౌబేతో కూడిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు నిర్వహించింది. యూరోపియన్లలో తీవ్రస్థాయి లక్షణాలకు కారణమవుతున్న కోవిడ్–19 రూపాంతరితాల ప్రభావం దక్షిణాసియావాసులపై పెద్దగా లేనట్లు ఈ అధ్యయనం స్పష్టం చేసింది. సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో ఈ పరిశోధన ఫలితాలు ప్రచురితమయ్యాయి. ‘యూరోపియన్లు, దక్షిణాసియా జన్యు సమాచారం ఆధారంగా ఇరువర్గాల్లోని ఇన్ఫెక్షన్, మరణాల రేటును పోల్చి చూశాం. కరోనా ప్రబలిన కాలంలో మూడుసార్లు ఈ పరిశీలన జరిగింది. భారత్, బంగ్లాదేశ్‌లోని వారిపై ఎక్కువగా దృష్టి సారించాం’అని డాక్టర్ తంగరాజ్ తెలిపారు. దక్షిణాసియా ప్రజల జన్యుమూలాలు ప్రత్యేకమైనవని ఈ అధ్యయనం మరోసారి రుజువు చేసిందని, దక్షిణాసియా జనాభా మొత్తానికి, కోవిడ్‌కు ఉన్న లింకులపై జన్యుక్రమం స్థాయిలో విస్తృత పరిశోధనలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఈ అధ్యయనానికి తొలి రచయితగా ఉన్న ప్రజీవల్ ప్రతాప్‌సింగ్ తెలిపారు. బంగ్లాదేశ్‌లో భిన్న ప్రభావాలు.. బంగ్లాదేశ్‌లో కరోనా వైరస్ గిరిజన తెగలపై ఒక రకమైన ప్రభావం చూపితే కొన్ని కులాల ప్రజలపై ఇంకో రకమైన ప్రభావం చూపిందని తమ అధ్యయనంలో తేలినట్లు శాస్త్రవేత్త ప్రొఫెసర్ జార్జ్ వాన్ డ్రీమ్ తెలిపారు. జన్యుక్రమం మొదలుకొని రోగ నిరోధక వ్యవస్థ, జీవనశైలి వంటి అనేక అంశాలు కరోనా బారినపడే అవకాశాలపై ప్రభావం చూపుతున్నట్లు ఇటీవల సేకరించిన సమాచారం చెబుతోందని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ నందికూరి వినయ్ తెలిపారు. చదవండి: అమెరికాకు వచ్చే విద్యార్థులకు కరోనా నెగెటివ్ రిపోర్ట్ మస్ట్ -
ఆ చిట్టి తల్లి పేరు పెట్టడం వెనక ఓ విషాదం
అయిదేళ్ల ఆ చిన్నారి పేరు రెండు వారాల కిందట ఆసీస్ ప్రసార మాధ్యమాల్లో మార్మోగింది. కారణం.. ఓ ప్రాణాంతక వ్యాధిపై పోరుకోసం చేయనున్న చట్ట సవరణ ప్రతిపాదన బిల్లుకు ఆ చిన్నారి పేరు పెట్టడమే. దీనిని ఆ దేశ ఆరోగ్య మంత్రి గ్రెగ్ హంట్ ఏకంగా పార్లమెంట్లో ప్రకటించారు. ఆ చట్టం మావె లా.. ఆ చిన్నారి పేరు మావె హుడ్. విప్లవాత్మక చట్ట సవరణకు ఆ చిట్టి తల్లి పేరు పెట్టడం వెనక ఓ విషాదం దాగి ఉంది. సారా హుడ్, జోయెల్ హుడ్ దంపతుల మూడో కూతురు మావె హుడ్. ఐదు నెలల వయసులో తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్య తలెత్తింది మావెలో. వైద్యుల పర్యవేక్షణ, చికిత్సతో కోలుకున్నప్పటికీ ఆ తర్వాతా అనేక సమస్యలు వెంటాడాయి. 18 నెలల వయసులో చిన్నారి మరోసారి తీవ్ర అస్వస్థతకు గురైంది. ఈసారి పాపను పరీక్షించిన వైద్యులు.. మైటోకాండ్రియా లోపంతో వచ్చే లీ సిండ్రోమ్‌కు గురైనట్లు గుర్తించారు. పాపను అనుక్షణం కంటికి రెప్పలా చూసుకుంటూ, అప్పటికప్పుడు మాత్రలతో వ్యాధి తీవ్రతను తగ్గించి, మరణాన్ని వాయిదా వేయడం తప్ప మరో మార్గం లేదన్నారు డాక్టర్లు. దీంతో ఆ తల్లిదండ్రులు తమ పాప పరిస్థితికి తల్లఢిల్లినా, పాపను అప్రమత్తంగా చూసుకోసాగారు. ఇటీవల ఈ విషయం పత్రికల ద్వారా ఆ దేశ ఆరోగ్య మంత్రి గ్రెగ్‌కు చేరింది. మావె పడుతున్న కష్టాలను తెలుసుకున్న ఆయన దేశంలో మరే చిన్నారికీ ఇలాంటి అవస్థ రాకూడదంటే ఏం చేయాలో చెప్పాలని వైద్యులనడిగారు. డీఎన్ఏ మార్పిడి ద్వారా ఈ సమస్య పరిష్కరించవచ్చని వాళ్లు చెప్పారు. తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఈ వ్యాధి ఉంటే.. తల్లి గర్భిణిగా ఉన్నప్పడు చిన్నారిలోని ఆమె డీఎన్ఏ స్థానంలో మరొకరి నాణ్యమైన డీఎన్ఏను ఐవీఎఫ్ పద్ధతిలో ప్రవేశపెడితే ప్రాణాంతక వ్యాధి రాకుండా అడ్డుకోవచ్చని వివరించారు. అయితే, ఇది కష్టమైన పని. ఎందుకంటే డీఎన్ఏ మార్పిడిపై ఆసీస్‌లో నిషేధం ఉంది. దీంతో ఈ చట్టాన్ని సవరించేందుకు గ్రెగ్ హంట్ తీర్మానించాడు. అందులో భాగంగానే చట్ట సవరణ కోరుతూ బిల్లు ప్రవేశపెట్టడంతోపాటు, ఆ బిల్లుకు మావె పేరు పెట్టాడు. నిజానికి ఆస్ట్రేలియాలో ఏటా కనీసం 56 మంది చిన్నారులు మైటోకాండ్రియా డిసీజ్‌తో జన్మిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అందులో చాలామంది ఐదేళ్లలోపే మరణిస్తున్నారు. ఈ పరిస్థితిని పరిష్కరించి, పసిప్రాణాలను కాపాడడం, తల్లిదండ్రుల కడుపుకోతను అడ్డుకోవాలనే తన ప్రయత్నానికి మనఃస్ఫూర్తిగా సహకరించాలని గ్రెగ్ హంట్ పార్లమెంట్లో విపక్ష సభ్యులందరినీ కోరాడు. ఈ చట్ట సవరణకు ఆమోదం లభిస్తే ఆ తరువాత ఆస్ట్రేలియాలో మైటోకాండ్రియాతో చిన్నారులు మరణించడమేనేది ఉండకపోవచ్చు. మైటోకాండ్రియా డిసీజ్ అంటే... మనిషిని పట్టి పీడించే ప్రాణాంతక వ్యాధుల్లో ఇదొకటి. మన శరీరానికి కావాల్సిన శక్తి మనం తీసుకునే ఆహారం నుంచి వస్తుందనే విషయం తెలిసిందే కదా. అయితే, ఆహారం జీర్ణమై శక్తిగా రూపొందడంలో కీలకంగా వ్యవహరించే పాత్ర మన శరీరంలోని ఉండే కణాల్లోని మైటోకాండ్రియాదే. ఏ కారణం వల్ల అయినా మైటోకాండ్రియా సరిగా పనిచేయకపోయినా, నిర్జీవమైనా మన శరీరానికి తగిన శక్తి ఆహారం నుంచి అందదు. ఫలితంగా రకరకాల రుగ్మతలు వస్తాయి. అందులో ముఖ్యమైనది ఆర్గాన్ ఫెయిల్యూర్.. అంటే అవయవం పనిచేయకపోవడం. ఇది మరణానికి దారి తీస్తుంది. అలాగే గుండెపోటు, చెవుడు, దృష్టిలోపం, నడవలేకపోవడం, మాట్లాడలేకపోవడం వంటివీ సంభవిస్తాయి. జన్యులోపం వల్లో, వంశపారంపర్యంగానో, జీవన శైలిలో మార్పుల వల్లో వచ్చే ఈ వ్యాధికి ఇప్పటికీ సరైన చికిత్స లేదు. పుట్టినప్పటి నుంచి చనిపోయేలోగా ఎప్పుడైనా సరే ఈ వ్యాధి వచ్చే ప్రమాదముంది. -
భయంతో కరోనా వ్యాక్సిన్‌ను ఖతం చేశాడు!
వాషింగ్టన్: ఓ వైపు కరోనా వైరస్‌కి వ్యాక్సిన్ వచ్చిందని సంతోషిస్తుండగా.. మరోపక్క టీకా సామార్థ్యం మీద జనాల్లో రోజురోజుకు అనుమానాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అమెరికాకు చెందిన ఓ ఫార్మసిస్ట్ మోడర్నా వ్యాక్సిన్ 500 డోసులను పనికి రాకుండా చేశాడు. దాంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇక విచారణలో సదరు ఫార్మసిస్ట్ మోడర్నా వ్యాక్సిన్ వల్ల డీఎన్ఏలో మార్పులు వస్తాయని తెలిసి.. వాటిని నేలపాలు చేశానని వెల్లడించాడు. వివరాలు.. స్టీవెన్ బ్రాండెన్‌బర్గ్‌గా గుర్తించబడిన ఫార్మసిస్ట్ విస్కాన్సిన్లోని గ్రాఫ్టన్‌లోని అరోరా మెడికల్ సెంటర్లో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఆ మెడికల్ సెంటర్లో మోడర్నా వ్యాక్సిన్‌ని భద్రపరిచారు. ఈ క్రమంలో స్టీవెన్ మోడర్నా వ్యాక్సిన్ తీసుకుంటే డీఎన్ఏలో మార్పులు చోటు చేసుకుంటాయని విన్నాడు. ఆ భయంతో ఫ్రిజ్‌లో ఉన్న వ్యాక్సిన్ డోసులను బయటపెట్టి.. వాటిని పనికి రాకుండా చేశాడు. (చదవండి: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న నర్స్ మృతి) విషయం తెలుసుకున్న పోలీసులు బ్రాండెన్‌బర్గ్‌ని అరెస్ట్ చేశారు. తొలుత అతడు కేవలం 57 వ్యాక్సిన్ డోసులను మాత్రమే పనికి రాకుండా చేశాడని భావించినప్పటికి తర్వాత ఆ సంఖ్య 500కు చేరింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు, డిటెక్టివ్లు బ్రాండెన్‌బర్గ్ అపనమ్మకంతోనే కావాలనే వ్యాక్సిన్ డోసులను నాశనం చేశాడని వెల్లడించారు. మరో ముఖ్యమైన అంశం ఎంటంటే బ్రాండెన్‌బర్గ్ ఫ్రిజ్ నుంచి తీసి బయటపడేసిన వ్యాక్సిన్ డోసుల్లో నుంచి 60 డోసులను వైద్యులు ప్రజలకు పంపిణీ చేశారు. ఆ తర్వాత విషయం తెలియడంతో మిగతా వాటిని వదిలేశారు. (చదవండి: మూఢ నమ్మకాలు.. కరోనా వ్యాక్సిన్ వద్దు) ఇదిలా ఉండగా కరోనాను కట్టడి చేయడానికి మోడర్నా వ్యాక్సిన్ హాఫ్ డోస్ సరిపోతుందా లేదా అనే దాని గురించి తెలుసుకునేందుకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మోడర్నా ఇంక్స్ శాస్త్రవేత్తలు టెస్ట్‌లు జరుపుతున్నారు. మరో రెండు నెలల్లో ఈ ఫలితాలు వెలువడతాయి. దాన్ని బట్టి వ్యాక్పిన్ డోసులను సగానికి తగ్గించాలా లేక రెట్టింపు చేయాలా అనే నిర్ణయం తీసుకోన్నుట్లు తెలిపారు. ఇక అమెరికాలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఫైజర్, మోడర్నా వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. -
లండన్‌లో కొత్త రకం కరోనా వైరస్..?
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్‌లో జన్యుమార్పులు జరుగుతున్న కారణంగా లండన్‌లో కోవిడ్ వేగంగా వ్యాప్తి చెందుతోందని.. ఈ కారణంగా డిసెంబర్ 16 నుంచి కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నామని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. ‘ఎన్501వై’అని పిలుస్తున్న ఈ కొత్త రకం వైరస్ ప్రమాదకరమా? జన్యుమార్పులు అన్నింటితోనూ చిక్కులేనా? అసలు మార్పులు ఎలా జరుగుతాయి? ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు నిపుణులు ఇచ్చిన సమాధానాలు ఇలా ఉన్నాయి.. డీఎన్ఏలో మార్పులు జరిగితే మానవులకు అపూర్వమైన శక్తులు వస్తాయని పలు హాలీవుడ్ సినిమాల్లో చూపిస్తుంటారు. అయితే వాస్తవంలో ఇలాంటిదేమీ ఉండదని మనకూ తెలుసు. నిజ జీవితంలో డీఎన్ఏలో మార్పులు చాలా నెమ్మదిగా జరుగుతాయి. ఇంకోలా చెప్పాలంటే పరిణామక్రమంలో జన్యుమార్పులు అత్యంత సాధారణమైన విషయం. జన్యు మార్పులను అర్థం చేసుకోవాలంటే ముందుగా ప్రొటీన్ల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. మన శరీరంలో ఐదో వంతు భాగం ప్రొటీన్లే. పొట్టలో ఆహారాన్ని జీర్ణం చేసేందుకు ఉపయోగపడే ఎంజైమ్‌లు మొదలుకొని మన చర్మం, వెంట్రుకల వరకూ అన్నీ ప్రొటీన్ రూపాలే. దాదాపు 20 అమైనో యాసిడ్స్‌తో తయారవుతాయి. ఈ అమైనో యాసిడ్స్‌లో అత్యధికం ఒకేలా ఉంటాయి.. కానీ అవి చేసే పనుల ఆధారంగా వీటిని చాలా వర్గాలుగా విభజించవచ్చు. ఈ అమైనో యాసిడ్స్‌ను వాడుకుని బోలెడన్ని కాంబినేషన్లలో ప్రొటీన్లను తయారు చేయొచ్చు. మొత్తమ్మీద మానవ శరీరంలో దాదాపు 60 లక్షల రకాల ప్రొటీన్లు ఉంటాయని లెక్క! (చదవండి: ఎల్ఈడీ లైట్లతో కరోనా ఖతం!) వైరస్‌లో మార్పుల కథేంటి? కరోనా వైరస్ ఆర్ఎన్ఏ ఆధారితమైందని తెలిసే ఉంటుంది. మెలితిరిగిన నిచ్చెన ఆకారంలో డీఎన్ఏ ఉంటే.. దాంట్లోని ఒక పోగు ఆర్ఎన్ఏ అన్నమాట. నిర్దిష్ట ప్రొటీన్ తయారీకి అమైనో యాసిడ్స్‌ను ఏ క్రమంలో కలపాలో తెలిపే సమాచారం ఆర్ఎన్ఏలో ఉంటుంది. ఆర్ఎన్ఏలో చోటు చేసుకునే మార్పుల ప్రభావం చాలా సందర్భాల్లో సానుకూలంగానే ఉంటుంది. వాస్తవంగా చెప్పాలంటే.. జన్యుమార్పులు కాస్తా ప్రొటీన్ ధర్మాలను మార్చేసి వైరస్‌ను బలహీనపరుస్తుంది. శరీరం (డీఎన్ఏ) మనకు లాభాన్నిచ్చే అంశాలను మాత్రమే ఉంచుకుని హానిచేసే వాటిని తొలగిస్తుందని జీవపరిణామ సిద్ధాంతం చెబుతున్న విషయం. వందల కోట్ల ఏళ్ల పరిణామ క్రమం వల్ల ఆ జీవికి కచ్చితంగా ఉపయోగకరంగా ఉండే ప్రొటీన్లను తయారు చేసుకోగల శక్తి ఏర్పడింది. కరోనా వైరస్ విషయానికి వచ్చేసరికి ఈ మార్పులు అకస్మాత్తుగా చోటు చేసుకున్నవి కాబట్టి అవి వాటికి మేలు చేసేవిగా ఉండవని నిపుణుల అంచనా. పైగా ప్రతి జీవిలోనూ జన్యు క్రమంలో ఏర్పడే మార్పులను సరిదిద్దేందుకు ఒక వ్యవస్థ ఉంటుందన్నది మనం మరిచిపోకూడదని ఇది మనిషికీ, వైరస్కూ వర్తిస్తుందని వివరించారు. వైరస్ ఉత్పత్తి చేసే ప్రొటీన్లలో ఏదైనా తేడా వస్తే ఈ వ్యవస్థ వెంటనే రంగంలోకి దిగి ఆ తప్పును సరిదిద్దే ప్రయత్నం చేస్తుందన్న మాట. -
ఒక రోజు నిద్రలేకున్నా ఏమవుతుందో తెలుసా...
నిద్రలేమి కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని మనందరికీ తెలుసు కానీ ఆ పరిణామాలు మనం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఒక రోజు నిద్ర పోకపోయినా సమస్యలు తీవ్రంగా ఉంటాయని చెబుతున్నారు. నిద్రలేమి కారణంగా మానవ డీఎన్ఏలో మార్పులు చోటుచేసుకుంటాయని హాంకాంగ్‌కు చెందిన ష్యు వేయ్ చాయ్ అనే శాస్త్రవేత్త పేర్కొన్నారు. ఆరోగ్యవంతులైన 49మందిపై జరిపిన పరిశోధనలో రాత్రి వేళలో పనులు చేస్తున్న వారిలో శరీరం డీఎన్ఏను మరమ్మత్తు చేయటంలో విఫలమైనట్లు గుర్తించారు. కేవలం ఒక రాత్రి మేలుకోవటం కారణంగా వారి డీఎన్ఏ తీవ్రంగా దెబ్బతిన్నట్లు కనుగొన్నారు. ఒక రోజు నిద్రను కోల్పోవటం కారణంగా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని చాయ్ వెల్లడించారు. మనసు పెట్టి తింటేనే మంచిది... ఉరుకుల పరుగు జీవితం... వేళకు ఏదో గబాగబా తినేసి కానిచ్చేద్దాం అంటే సమస్యలు తప్పవు. భోజనం మీద మనసు లగ్నం చేయడం వల్ల శరీరానికి పోషకాలు సరిగ్గా అందుతాయని, ఆరోగ్యకరమైన బరువుతో ఉంటారని, మానసిక ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుందని చెబుతున్నారు పరిశోధకులు. ఇటీవల బరువు తగ్గేందుకు డైట్ పాటిస్తున్న 53 మందిపై ఆరు నెలలుగా అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో వెల్లడైన ఆసక్తికర విశేషాలేమంటే... 6 నెలల్లో మైండ్‌ఫుల్ ఈటింగ్‌కు సంబంధంచి మూడు, నాలుగు సెషన్స్‌కు హాజరైన వారు సగటున 3 కిలోల బరువు తగ్గారట. ఒకటి, రెండు సెషన్లకు వచ్చినవారు కిలో మాత్రమే తగ్గారట. పండుగలు, సెలవురోజుల్లో కుటుంబం, స్నేహితులతో కలిసి వివిధ రకాల ఆహారపదార్థాలను కడుపునిండా లాగించేస్తాం. తీరా బరువు పెరిగి, మునుపటి షేప్‌లోకి వచ్చేందుకు కసరత్తులు, నానా కష్టాలు పడతాం. అయితే ఈ సమస్యకు సులువైన పరిష్కారం చెబుతున్నారు పరిశోధకులు. మనసుపెట్టి పనిచేయడం వల్ల ఉద్రేకం తగ్గి, ఆలోచనల మీద గురి ఉంటుంది. ఒత్తిడి తగ్గి, అదనపు శక్తి సమకూరి, రెట్టించిన ఉత్సాహం సొంతమవుతుంది. అదేవిధంగా మనసుపెట్టి తినడం వల్ల ఆహారాన్ని సంతృప్తిగా తినడం అలవడుతుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి కూడా పటిష్ఠమవుతుందంటున్నారు పరిశోధకులు. -
ఈ అమ్మాయి ఈ కాలపు మనిషి కాదు...
ఫొటో చూశారుగా.. అమ్మాయి భలే ముద్దుగా ఉంది కదూ. టామ్ జోక్లాండ్ అనే చిత్రకారుడు గీశాడు దీన్ని. అయితే ఏంటి అంటున్నారా? చాలా విశేషాలే ఉన్నాయి ఈ చిత్రం వెనుక. ఈ అమ్మాయి ఈ కాలపు మనిషి కాదు. సుమారు 5,700 ఏళ్ల క్రితం నివసించి ఉండొచ్చని అంచనా. డెన్మార్క్‌లోని సైల్థోలమ్ అనే ప్రాంతంలో తవ్వకాల్లో లభించిన ఓ బబుల్గమ్ (ఓ చెట్టు బెరడు. బబుల్‌గమ్‌లా నమిలేవారట) అవశేషం నుంచి ఈ అమ్మాయి చిత్రాన్ని రూపొందించారు శాస్త్రవేత్తలు. అదెలా అంటే ఈ బబుల్గమ్ అవశేషంలో అమ్మాయి తాలూకు డీఎన్ఏ లభించింది. దీని ఆధారంగా మొత్తం జన్యుక్రమాన్ని పునర్నిర్మించారు. అంతేకాకుండా నమిలిన కారణంగా ఆ అవశేషానికి నోటిలోని బ్యాక్టీరియా, ఆ చెట్టులో ఉండే సూక్ష్మజీవుల ఆనవాళ్లూ కనిపించాయి. వీటన్నింటి ఆధారంగా ఆ డీఎన్ఏ కలిగిన వ్యక్తి మహిళ అని గుర్తించారు. అంతేకాకుండా ఒడ్డూ పొడవు, కనులు, చర్మం రంగు వంటి వాటిని నిర్ధారించారు. ఆ విశేషాలను ఆధారంగా చేసుకుని టామ్ జోక్లాండ్ ఈ చిత్రాన్ని గీశారు. -
డొనెల్లీకి ఓ ‘అందమైన అనుభవం’
న్యూఢిల్లీ : బ్రిటన్ ప్రజలకు సుపరిచితుడైన డెక్లాన్ డొనెల్లీ టీవీ ప్రెజెంటర్, కమేడియన్, సింగర్, టీవీ ప్రొడ్యూసర్. ఇటీవల ఆయన తన టీవీ మిత్రుడైన ఆంటోని మాక్ పార్టిలిన్తో కలిసి ‘ఆంట్ అండ్ డెక్స్ డీఎన్ఏ జర్నీ’ పేరిట ఐటీవీ కోసం ఓ సీరియల్‌ను తీస్తున్నారు. అందులో భాగంగా వారిద్దరు ఇటీవల డీఎన్ఏ పరిశోధనల కోసం అమెరికా వెళ్లారు. అక్కడ అనుకోకుండా డెక్లాన్‌కు కజిన్ మెగ్, ఆమె భర్త గ్రెక్ ఉన్నట్లు తెల్సింది. వారు కూడా డెక్లాన్ లాగా అత్యధిక ధనవంతులే వారు ఓ విశాలమైన మైదానంలో నిర్మించిన ఓ పెద్ద భవనంలో నివసిస్తున్నారు. మెగ్, గ్రెక్ దంపతులకు సొంతంగా ఓ హెలికాప్టర్ కూడా ఉంది. డొనెల్లీ మిత్రులను గ్రెక్ తన హెలికాప్టర్లో తిప్పి తన మైదానాన్ని పరిసర ప్రాంతాలను చూపించారు. అంతే కాకుండా మెగ్ దంపతులు అమెరికాలోనే ఉంటున్న మరో 12 మంది డొనెల్లీ కజిన్స్‌ను రప్పించి ఓ రోజున డొనెల్లీకి పరిచయం చేశారు. అనూహ్యంగా అంతమంది కజిన్స్‌ను కలుసుకున్నందుకు డొనెల్లీ ఉబ్బి తబ్బిబ్బయ్యారు. వారిలో ఎక్కువ మంది ధనికులే అవడం మరో విశేషం. డొనెల్లీ తన అందమైన అనుభవం గురించి మీడియాతో షేర్ చేసుకున్నారు. అలా ఒకరికొకరు డీఎన్ఏ సంబంధాలను కనుక్కుంటూ పోగా, డొనెల్లీ నానమ్మ కిట్టీ జన్మతా ఐర్లాండ్ పౌరురాలట. 15వ ఏట ఇంగ్లాండ్‌కు వలసపోయి స్థిరపడ్డారట. ఇలా వంశవృక్షం మూలాలను వెతుక్కుంటూ పోతే ‘అలెక్స్ హాలి’ రాసినంత ‘రూట్స్’ పుస్తకం అవుతుందేమో! తనకు ఎదురైన అనుభవాన్ని డొనెల్లీ తన టీవీ సీరియల్ ఉపయోగించు కోవాలనుకుంటున్నారు. -
అంబులెన్సుకు దారివ్వకుంటే రూ.10 వేల ఫైన్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సోమవారం నాడిక్కడ సమావేశమైంది. ఈ భేటీలో మోటార్ వాహనాల(సవరణ) బిల్లు–2019తో పాటు డీఎన్ఏ ప్రొఫైలింగ్ బిల్లు–2019కు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వాహనాలు నడిపేటప్పడు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారికి భారీ జరిమానాలు విధించేలా నూతన బిల్లును కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. దీనిప్రకారం అంబులెన్స్, ఇతర అత్యవసర సేవల వాహనాలను దారి ఇవ్వకుంటే రూ.10,000 వరకూ జరిమానా విధిస్తారు. డ్రైవింగ్ చేసేందుకు అనర్హులైనప్పటికీ వాహనం నడిపితే రూ.10 వేలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇక డ్రైవింగ్ లైసెన్స్ ఉల్లంఘనలకు పాల్పడే వాహనదారులకు రూ.లక్ష వరకూ జరినామా విధించేలా బిల్లును రూపొందించారు. సీటు బెల్ట్ లేకుంటే లైసెన్స్ రద్దు.. రోడ్లపై అతివేగంతో దూసుకెళ్లే వాహనదారులకు రూ.1,000 నుంచి రూ.2,000 జరిమానా విధించాలని బిల్లులో నిబంధనలు చేర్చారు. ఇక ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.2,000 కట్టాలి. వాహనాల్లో సీటు బెల్టు ధరించకుంటే రూ.వెయ్యి జరిమానా చెల్లించడంతో పాటు 3 నెలలు డ్రైవింగ్ లైసెన్స్ రద్దుచేస్తారు. ద్విచక్ర వాహనాలపై హెల్మెట్లు లేకుండా ప్రయాణిస్తే రూ.1,000 జరిమానాతో పాటు 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దవుతుంది. ఒకవేళ మైనర్ పిల్లలు రోడ్డు ప్రమాదానికి కారకులైతే వారి తల్లిదండ్రులు/ సంరక్షకులను దోషులుగా నిర్ధారిస్తారు. సదరు తల్లిదండ్రులు/ సంరక్షకులకు మూడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.25,000 జరిమానా విధించవచ్చు. ఇలాగే ప్రమాదానికి కారణమైన రిజిస్ట్రేషన్‌ను రద్దుచేస్తారు. ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఉల్లంఘించే వాహనదారులకు విధిస్తున్న రూ.100 జరిమానాను ఈ బిల్లులో రూ.500కు పెంచుతూ బిల్లును రూపొందించారు. అధికారుల ఆదేశాలు పాటించకుంటే విధించే పెనాల్టీని రూ.500 నుంచి రూ.2 వేలకు పెంచారు. ఒకవేళ లైసెన్స్ అందుకోకుండానే వాహనాలు నడిపితే, లైసెన్స్ లేకుండా నడిపేవారికి రూ.5,000 జరిమానా విధించనున్నారు. అలాగే ర్యాష్ డ్రైవింగ్ చేసేవారికి రూ.5,000, మద్యం సేవించి వాహనం నడిపితే రూ.10,000 జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఓవర్ లోడింగ్ వాహనాలు రూ.20 వేల పెనాల్టీ కట్టేలా బిల్లులో నిబంధనల్ని చేర్చారు. ఒకవేళ ఈ నిబంధనలను స్వయంగా సంబంధిత అధికారులు ఉల్లంఘిస్తే జరిమానా రెట్టింపు అవుతుంది. డీఎన్ఏ ప్రొఫైలింగ్ బిల్లుకు ఆమోదం.. నేరాల్లో వ్యక్తులను గుర్తించేందుకు ఉద్దేశించిన డీఎన్ఏ ప్రొఫైలింగ్ బిల్లు–2019కు కేబినెట్ ఓకే చెప్పింది. బిల్లు ప్రకారం ప్రభుత్వం జాతీయ డీఎన్ఏ బ్యాంకు, ప్రాంతీయ డీఎన్ఏ బ్యాంకులను ఏర్పాటుచేస్తుంది. ఈ బ్యాంకుల్లో నేరం జరిగిన ప్రాంతంలోని డేటా, నిందితుల డేటా, అదృశ్యమైన వ్యక్తుల డేటా, గుర్తుతెలియని మృతుల డేటాను విడివిడిగా నిర్వహించాలి. అలాగే ఈ బిల్లు ప్రకారం డీఎన్ఏ రెగ్యులేటరీ బోర్డును ఏర్పాటు చేస్తారు. డీఎన్ఏను విశ్లేషించే ప్రతీ ల్యాబ్ ఈ సంస్థ నుంచి ధ్రువీకరణ పొందాల్సి ఉంటుంది. ఏడేళ్లు అంతకంటే ఎక్కువశిక్ష పడే నేరాలు లేదా హత్య కేసుల్లో డీఎన్ఏ సేకరణకు నిందితుల అంగీకారం అక్కర్లేదు. ఈ రెండు బిల్లులను త్వరలోనే పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. -
నైట్షిఫ్ట్లతో డీఎన్ఏలో మార్పులు
ఇతరులతో పోలిస్తే నైట్‌షిఫ్ట్‌లలో పనిచేసే వారి డీఎన్ఏలో చాలా ఎక్కువగా మార్పులు వస్తుంటాయని హాంకాంగ్ శాస్త్రవేత్తలు పరిశోధన పూర్వకంగా నిర్ధారించారు. ఫలితంగా గుండెజబ్బులు, నాడీసంబంధిత సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని వీరు అంటున్నారు. అనెస్థీషియా అకడమిక్ జర్నల్‌లో ప్రచురితమైన వివరాల ప్రకారం.. నైట్‌షిఫ్ట్‌లో పనిచేసే వారి డీఎన్ఏ మార్పులు... మామూలు వారితో పోలిస్తే 30 శాతం వరకూ ఎక్కువ ఉంటాయి. దీనికి నిద్రలేమి కూడా తోడైతే డీఎన్ఏ నష్టం ఇంకో 25 శాతం ఎక్కువ ఉంటుంది. డీఎన్ఏలో తరచూ ఒకటి అరా మార్పులు జరగడం మామూలే అయినప్పటికీ రెండుగా విడిపోయేటప్పుడు ఈ మార్పులు కొనసాగడం.. మరమ్మతులకు లొంగకపోవడం వల్ల సమస్యలు వస్తూంటాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డబ్ల్యూ.చోయి తెలిపారు. తాము జరిపిన అధ్యయనంలో రాత్రిపూట పనిచేసే వారితోపాటు మూడురోజులపాటు సరైన నిద్ర లేని వారి రక్తాన్ని విశ్లేషించామని, కాకపోతే ఈ పరీక్షలు చాలా తక్కువ మందితో జరిపామని చోయి వివరించారు. మరిన్ని విస్తృత పరిశోధనల ద్వారా ఈ ఫలితాలను నిర్ధారించుకున్న తరువాతే డీఎన్ఏ విడిపోవడానికి.. వ్యాధులకూ ప్రత్యక్షసంబంధం ఉందని చెప్పగలమని వివరించారు. -
నైట్ డ్యూటీలతో డీఎన్ఏకు చేటు
బీజింగ్: రాత్రిపూట విధులు నిర్వర్తించే వారిలో డీఎన్ఏకు ముప్పు పొంచి ఉందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. దీనివల్ల కేన్సర్, హృదయ, జీవక్రియ, నాడీ వ్యవస్థకు సంబంధించి వ్యాధులు వచ్చే అవకాశముందని తెలిపింది. ఫుల్ టైమ్ విధులు నిర్వర్తించే 49 మంది వైద్యుల రక్త నమూనాలను వివిధ సమయాల్లో సేకరించి యూనివర్సిటీ ఆఫ్ హాంగ్‌కాంగ్ పరిశోధకులు అధ్యయనం చేశారు. ‘ఈ పని చాలా చిన్నదైనప్పటికీ స్పష్టమైన ఫలితాలు వెల్లడయ్యాయి. రాత్రి పూట విధులు నిర్వర్తించే వారిలో నిద్రలేమి సమస్య కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇటు డీఎన్ఏ సైతం దిబ్బతింటోంది. ఇదే దీర్ఘకాలిక వ్యాధులను ప్రేరేపించేందుకు దోహదపడుతోంది..’ అని పరిశోధకుల్లో ఒకరైన సియూ–వై చోయ్ చెప్పారు. అలాగే డీఎన్ఏ ఎంత దెబ్బ తింటే అంతగా నిద్రలేమి సమస్య తీవ్రమవుతోందని వెల్లడించారు. -
ఒక రోజు నిద్రపోకపోయినా అంతే!
హాంకాంగ్ : నిద్రలేమి కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని మనందరికీ తెలుసు కానీ ఆ పరిణామాలు మనం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఒక రోజు నిద్ర పోకపోయినా సమస్యలు తీవ్రంగా ఉంటాయని చెబుతున్నారు. నిద్రలేమి కారణంగా మానవ డీఎన్ఏలో మార్పులు చోటుచేసుకుంటాయని హాంకాంగ్‌కు చెందిన ష్యు వేయ్ చాయ్ అనే శాస్త్రవేత్త పేర్కొన్నారు. ఆరోగ్యవంతులైన 49మందిపై జరిపిన పరిశోధనలో రాత్రి వేళలో పనులు చేస్తున్న వారిలో శరీరం డీఎన్ఏను మరమ్మత్తు చేయటంలో విఫలమైనట్లు గుర్తించారు. కేవలం ఒక రాత్రి మేలుకోవటం కారణంగా వారి డీఎన్ఏ తీవ్రంగా దెబ్బతిన్నట్లు కనుగొన్నారు. ఒక రోజు నిద్రను కోల్పోవటం కారణంగా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని చాయ్ వెల్లడించారు. -
జాతకం వద్దు ‘జినోమ్’ ముద్దు!
‘‘పెళ్లంటే మాటలా.. అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాల చరిత్ర చూడాల్సిందే కదా’’ ‘‘అబ్బాయి ఎలాంటి వాడో ఏమో.. సంబంధం కలుపుకునే ముందే కొంచెం జాగ్రత్త’’ ‘‘తల్లి లావుగా ఉంది.. పెళ్లయిన తరువాత అమ్మాయికూడా అలాగే అయితే..?’’ పెళ్లి సందర్భంగా దాదాపు అన్ని కుటుంబాల్లోనూ ఇలాంటి మాటలు వినిపిస్తుంటాయి. ప్రేమించుకున్నామని, పెళ్లి చేసుకుంటామని చెప్పినా.. ఎందుకైనా మంచిది కాస్తా జాతకాలు కూడా చూసేద్దాం అనేవాళ్లూ లేకపోలేదు. దశాబ్దాలపాటు కలిసి జీవితం సాగించాల్సిన వారు సుఖంగా, సంతోషంగా ఉండాలని తల్లిదండ్రులు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ఇవన్నీ ఒకప్పటి మాట అంటోంది సైన్స్. కేవలం చూపులతో.. కాసిన్ని విచారణలతో వ్యక్తుల గుణగణాలపై ఒక నిర్ధారణకు రావడం సరికాదని హెచ్చరిస్తోంది. ఈ పాతకాలపు పద్ధతులైన జన్మపత్రాన్ని కాకుండా.. జినోమ్ పత్రాన్ని నమ్ముకోవడం మేలని అంటోంది. జినోమ్ పత్రి అంటే.. మన ఒడ్డూ పొడవు మొదలుకొని.. మనకు రాగల జబ్బుల వరకూ అన్నింటి సమాచారం జన్యువుల్లో ఉంటుందని మనకు తెలుసు కదా.. ఈ జన్యువుల్లోని సమాచారాన్ని చదివేందుకు వీలు కల్పించేదే ఈ జినోమ్ పత్రి. డీఎన్ఏ పోగు అడినైన్, గ్వానైన్, థయామీన్, సైటోసైన్ అనే నాలుగు రసాయనాలతో ఏర్పడి ఉంటుంది. వీటిని నూక్లియోటైడ్ బేసెస్ అని పిలుస్తారు. ఈ బేసెస్ జంటలను బేస్ పెయిర్స్ అంటారు. ఇలాంటి 300 కోట్ల బేస్‌పెయిర్స్‌తో మెలితిరిగిన నిచ్చెన ఆకారంలో ఉంటుంది డీఎన్ఏ. ఈ డీఎన్ఏ పోగులోని భాగాలే జన్యువులు. మనుషుల్లో వీటి సంఖ్య దాదాపు 25 వేలు. మన జీవక్రియలకు అవసరమైన అన్ని రకాల ప్రొటీన్లను ఇవే ఉత్పత్తి చేస్తుంటాయి. వారసత్వంతోపాటు, వాతావరణం, ఆహారపు అలవాట్లు, జీవనశైలి వంటి అనేక కారణాలతో జన్యుక్రమంలో వచ్చే మార్పులు వ్యాధులకు దారితీస్తాయి అని సైన్స్ చెబుతోంది. ఆరోగ్య సమస్యలు లేని ఇద్దరు దంపతులైతే.. పుట్టబోయే బిడ్డకు జబ్బులేవీ దగ్గరకావన్నది తెలిసిందే. మారుతున్న ట్రెండ్.. జాతకాలను బట్టి పెళ్లిళ్లు చేసుకోవడం భారత్ లాంటి దేశాల్లో ఇంకా కొనసాగుతున్నప్పటికీ విదేశాల్లో మాత్రం ట్రెండ్ మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. మానవ జన్యుక్రమం నమోదు చేసే ఖర్చు గణనీయంగా తగ్గడం దీనికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు కోట్లకు కోట్లు పోస్తేగానీ సాధ్యం కాని జన్యుక్రమ నమోదు ఇప్పుడు లక్ష రూపాయల్లోపు మాత్రమే అవుతోంది. ఇదే సమయంలో జన్యువుల పనితీరు.. వ్యాధుల విషయంలో వీటి పాత్ర వంటి వాటిల్లో సైన్స్ కూడా బాగా అభివృద్ధి చెందింది. ఈ నేపథ్యంలో రెండు జన్యుక్రమాలను పోల్చి చూసి దంపతులైతే ఎలా ఉంటుందో చెప్పే ప్రత్యేక పరీక్షలు కూడా అందుబాటులోకి వచ్చేశాయి. స్విట్జర్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ బెర్న్ శాస్త్రవేత్త క్లాస్ వెడెకైండ్ కొన్నేళ్ల క్రితం చేసిన ఒక ప్రయోగం ఇలాంటి పరీక్షలకు మూలం. ఈ ప్రయోగంలో మహిళలు మగవారు వేసుకున్న టీషర్ట్‌ల వాసన ఆధారంగా తాము ఎవరిని ఇష్టపడ్డారో చెప్పారు. పలానా వారినే ఎందుకు ఎంచుకున్నారన్న విశ్లేషణ జరిపినప్పుడు మహిళలు తమకంటే భిన్నమైన హెచ్ఎల్ఏ జన్యువు ఉన్నవారిపట్ల ఆకర్షితులవుతున్నట్లు తెలిసింది. ఈ హెచ్ఎల్ఏ జన్యువు రోగ నిరోధక వ్యవస్థ చైతన్యానికి సూచిక. పాశ్చాత్య దేశాల్లో ఇలాంటి జెనిటిక్ మ్యాచింగ్ చేసిపెట్టే కంపెనీలు బోలెడున్నా.. దేశంలో మాత్రం ఇలాంటివి వేళ్లమీద లెక్కపెట్టేటన్ని మాత్రమే ఉన్నాయి. ఐదేళ్ల క్రితం కాలిఫోర్నియా, నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన ఒక పరిశోధన ప్రకారం 5–హెచ్‌టీటీఎల్‌పీఆర్ అనే జన్యువుల్లో తేడాలుంటే సంసారం సాఫీగా సాగదని, మానసిక ఉద్వేగాలను ప్రభావితం చేసే ఈ జన్యువులున్న వారు విడాకులు తీసుకునే అవకాశాలు ఎక్కువని తేలింది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
కాంగ్రెస్, టీఆర్ఎస్ల డీఎన్ఏ ఒక్కటే
జహీరాబాద్: కాంగ్రెస్, టీఆర్ఎస్ల డీఎన్ఏ ఒక్కటే అని, ఆ రెండూ కుటుంబ పార్టీలే అయినందున వాటిని ఓడించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో బీజేపీ అభ్యర్థి గోపి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. నెహ్రూ నుంచి రాహుల్ వరకు కాంగ్రెస్‌లో కుటుంబ పాలనే సాగుతోందని, టీఆర్ఎస్లో సైతం ఇదే పరిస్థితి ఉందన్నారు. ఈ రెండు పార్టీలను ఓడించాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీలో కులం, మతం ఉండదు.. చాయ్ అమ్ముకునే వ్యక్తిని ప్రధాన మంత్రిని చేసిన ఘనత ఒక్క బీజేపీకే సాధ్యమైందని మురళీధర్‌రావు అన్నారు. తమ పార్టీలో కులం, మతం ఉండదని తెలిపారు. టీఆర్ఎస్ చేతకాని పార్టీ అని, అందుకే ముందస్తుకు వెళ్లిందన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్లను ఓడించి బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని, తమ పార్టీ అభ్యర్థి గోపిని గెలిపించాలని కోరారు. బంగారు తెలంగాణ ఏమో కాని తాగుబోతుల తెలంగాణగా సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని మార్చారన్నా రు. టీఆర్ఎస్ పార్టీ మజ్లిస్‌కు తొత్తుగా మారిందని విమర్శించారు. కాంగ్రెస్ గెలిస్తే పరోక్షంగా టీడీపీయే ప్రభుత్వాన్ని ఏలుతుందన్నారు. సమావేశంలో బీజేపీ అభ్యర్థి గోపి తదితరులు పాల్గొన్నారు. -
లక్నో విద్యార్థుల గిన్నిస్ రికార్డ్
లక్నో: సుమారు 550 మంది విద్యార్థులు ఏక కాలంలో అరటి పండు నుంచి డీఎన్ఏను వేరు చేసి గిన్నిస్ రికార్డు సాధించారు. ఇండియా ఇంటర్నేషన్ సైన్స్ ఫెస్టివల్లో (ఐఐఎస్ఎఫ్ 2018)లోభాగంగా వీరు ఈ ఘనత సాధించారు. లక్నోకు చెందిన జీడీ గోయెంకా పబ్లిక్ స్కూల్‌కు చెందిన 13–17 ఏళ్ల విద్యార్థులు ఉమ్మడిగా ఈ ప్రయోగం చేశారు. శాస్త్రసాంకేతిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు అనుగుణంగా స్లైడర్స్‌తో 61 నిమిషాల పాటు వివరణ ఇచ్చారు. గతంలో అమెరికాకు చెందిన 302 విద్యార్థులు ఉమ్మడిగా ఈ ప్రయోగం చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. ఎన్బీఆర్ఐ డైరెక్టర్ ఫ్రొఫెసర్ ఎస్.కె బారిక్, బయోటెక్ పార్క్ సీఈఓ ప్రమోద్ టాండన్‌లు చిన్నారుల ప్రయోగాన్ని అధికారికంగా ప్రకటించిన తర్వాత గిన్నిస్ వరల్డ్ రికార్డు నిర్ణేత రిషీనాథ్ 550 మంది విద్యార్థులకు ధ్రువపత్రాన్ని అందజేశారు. -
సాంకేతికతలో భేష్ అనిపించాలి
సాక్షి, హైదరాబాద్: శాస్త్ర సాంకేతిక విజ్ఞానంలో భారత్ భేష్ అనిపించేలా పని చేయాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్దన్ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేలా సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్, డయాగ్నోస్టిక్ (సీడీఎఫ్‌డీ) విభాగం పని చేయాలని సూచించారు. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో నూతనంగా నిర్మించిన సీడీఎఫ్‌డీ భవనాన్ని హర్షవర్దన్ ఆదివారం ప్రారంభించారు. డీఎన్ఏ, ఫింగర్ ప్రింట్స్ గుర్తింపు, సమాచార సేకరణలో దర్యాప్తు సంస్థలకు సీడీఎఫ్‌డీ కీలకమని, దేశంలోని అన్ని దర్యాప్తు విభాగాలు ఉపయోగించుకునేలా పనిచేయాలని కోరారు. శాస్త్ర సాంకేతిక విజ్ఞానానికి కేరాఫ్ అడ్రస్‌గా హైదరాబాద్ మారబోతోందని, అనేక కేంద్ర సంస్థలు ఇక్కడ ఏర్పాటవడం సంతోషకర పరిణామమని అన్నారు. దక్షిణ భారతదేశానికి ఉపయోగపడేలా సౌత్ విజ్ఞాన్ భవన్‌కు రెండు రోజుల క్రితమే శంకుస్థాపన చేశామని, హైదరాబాద్ ఇప్పుడు దేశంలో కీలకమైన నగరమని అభిప్రాయపడ్డారు. వచ్చే సమావేశాల్లోనే డీఎన్ఏ బిల్లు వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో డీఎన్ఏ టెక్నాలజీ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందుతుందని హర్షవర్దన్ తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం తొలిసారి ఏర్పడ్డప్పుడే డీఎన్ఏ టెక్నాలజీ బిల్లు రూపొందించామని, కొన్ని సాంకేతిక సమస్యల వల్ల అప్పటినుంచి బిల్లు పెండింగ్‌లోనే ఉందన్నారు. ఇటీవల ముగిసిన సమావేశాల్లో బిల్లును లోక్‌సభకు పరిచయం చేశామని, వచ్చే శీతాకాల సమావేశాల్లో డీఎన్ఏ బిల్లుకు ఆమోదం లభిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. డీఎన్ఏ బిల్లు ఆమోదం వల్ల అదృశ్యమైన చిన్నారుల కేసులు, సంచలనాత్మకమైన కేసుల్లో పరిష్కారాలు లభిస్తాయని ఆశిస్తున్నామన్నారు. డీఎన్ఏ టెక్నాలజీ యాక్ట్‌లో ఆధార్ అనుసంధానం అంశం లేదని, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన ఆధార్‌ను ఈ యాక్ట్‌కు అనుసంధానించే ఆలోచన కూడా తమకు లేదని వెల్లడించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ కార్యదర్శి రేణు స్వరూప్, సీడీఎఫ్‌డీ డైరెక్టర్ మిత్రా, మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, సీడీఎఫ్‌డీ మాజీ డైరెక్టర్లు, శాస్త్రవేత్తలు, ఉద్యోగులు పాల్గొన్నారు. ల్యాకోన్స్ కృషి భేష్ సమన్వయంతో పనిచేస్తే ఎన్ని అద్భుతాలైనా సాధించవచ్చనేందుకు హైదరాబాద్‌లోని ల్యాబొరేటరీ ఫర్ ద కన్సర్వేషన్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీషీస్ (ల్యాకోన్స్) నిదర్శనమని హర్షవర్ధన్ అన్నారు. అంతరించిపోతున్న అరుదైన జింక జాతిని ఆధునిక శాస్త్ర పద్ధతుల ద్వారా వృద్ధి చేయడం.. వాటిని మళ్లీ అడవుల్లోకి ప్రవేశపెట్టడం హర్షణీయమని చెప్పారు. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీలో ఆదివారం వన్యప్రాణి జన్యువనరుల కేంద్రాన్ని ప్రారంభించిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ల్యాకోన్స్ వంటి కేంద్రాలను అత్యున్నత నైపుణ్య కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు శాస్త్రవేత్తలు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని, అన్ని విధాలుగా సహకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. వన్యప్రాణి జన్యు వనరుల కేంద్రంలో ప్రస్తుతం 23 జీవజాతులకు సంబంధించిన జన్యువులు, కణజాలం అండాలను నిల్వ చేశామని, రానున్న మూడు సంవత్సరాల్లో ఈ సంఖ్యను ఐదు రెట్లు ఎక్కువ చేసేందుకు ప్రయతిస్తున్నామని సీసీఎంబీ ల్యాకోన్స్ సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ కార్తికేయన్ వాసుదేవన్ ‘సాక్షి’కి తెలిపారు. కృత్రిమ గర్భధారణ పద్ధతుల ద్వారా మౌస్ డీర్ల సంఖ్యను పెంచగలిగామని.. ఇప్పటివరకూ అవి స్థానిక జంతు సంరక్షణాలయంలో ఉండగా.. దశల వారీగా వాటిని మహబూబ్‌నగర్ జిల్లాలోని అమ్రాబాద్, తదితర అటవీ ప్రాంతాల్లో వదిలేస్తామని ఆయన వివరించారు. -
ఇకపై శవాలు ‘మాట్లాడతాయి’!
సాక్షి, హైదరాబాద్: ఉత్తరాదిలో అదృశ్యమైన ఓ వ్యక్తి నగరంలో శవంగా కనిపిస్తాడు... ఆ రాష్ట్రంలో మిస్సింగ్‌గా ఉన్న ఈ కేసు ఇక్కడ ఆన్‌నోన్ డెడ్‌బాడీగా ఉంటుంది... అనేక కారణాల నేపథ్యంలో ప్రత్యర్థుల్ని హత్య చేస్తున్న నేరగాళ్లు వారి శవాలను వేరే ప్రాంతానికి తరలించి రోడ్లపై పడేస్తున్నారు... రాజధానిలో ఏటా లభిస్తున్న గుర్తుతెలియని మృతదేహాల వెనుక ఇలాంటి కారణాలెన్నో ఉన్నాయి. ఈ కేసుల దర్యాప్తు దశ, దిశ లేకుండా సాగి చివరకు మూతపడుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఉన్న ఈ సమస్యను కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. మిస్సింగ్ కేసులు, గుర్తు తెలియని శవాలతో పాటు నేరగాళ్ల వివరాలతోనే డీఎన్ఏ బ్యాంకులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన బిల్లును కేంద్రమంత్రి హర్షవర్ధన్ గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఇది అమల్లోకి వస్తే కేసుల దర్యాప్తులో ఎంతో ఉపయుక్తమని పోలీసులు చెప్తున్నారు. వ్యాపార, ఆర్థిక లావాదేవీలతో పాటు సెక్సువల్ జెలసీ కారణంగా దారుణంగా హత్యలు చేస్తున్నవారు మృతదేహాలను బహిరంగ ప్రదేశాల్లో పడేస్తున్నారు. ఈ తరహా కేసులను కొలిక్కి తీసుకురావడానికి పోలీసులు ముప్పుతిప్పలు పడుతున్నా ఫలితం దక్కట్లేదు. ఇది మరికొందరు ఇదే బాటపట్టడానికి ‘ప్రోత్సాహం’ఇస్తోంది. ఇదే ఆ దుండగుల ధైర్యం.. హత్య జరిగినప్పుడు పోలీసులు హతుడి చరిత్ర, వ్యాపార/వ్యక్తిగత లావాదేవీలు, ప్రవర్తన తెలుసుకోవడంపై దృష్టి పెడతారు. హత్యకు వీటిలో ఏదో ఒకటి కారణమై.. నిందితులు పట్టుబడే అవకాశం ఉంటుంది. ఘటనాస్థలి, హతుడు లేదా హంతకుడికి సంబంధించి స్థలంలో శవాన్ని వదిలేస్తే అది దర్యాప్తునకు ఆధారంగా మారే చాన్స్ ఉంది. దీంతోనే హంతకులు ఓ వ్యక్తిని చంపిన తరవాత వారిని గుర్తుపట్టే అవకాశం లేకుండా బహిరంగ ప్రదేశాల్లో పడేస్తున్నారు. ఒకవేళ సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు గుర్తించినా... ఈలోపు పరారవడమో, అజ్ఞాతంలోకి వెళ్లిపోవడమో చేస్తున్నారు. ఇలాంటి కేసులు కొలిక్కి వచ్చినా వాటిని న్యాయస్థానాల్లో నిరూపించడానికి ఆధారాలను సేకరించడం అంత తేలిక్కాదు. ‘లుక్ఔట్’తో సరిపెట్టాల్సిందే... ఇలా మృతదేహాలుగా దొరుకుతున్న వారు ఎక్కడో ఒకచోట అదృశ్యం అవుతున్న వారే. ప్రస్తుతం అదృశ్యం కేసులు, గుర్తుతెలియని మృతదేహాల కేసుల దర్యాప్తు మొక్కుబడిగానే సాగుతోంది. వీరి ఫొటోలతో లుక్ఔట్ నోటీసులు జారీ చేస్తున్న పోలీసులు వాటిని అన్ని స్టేషన్లకు పంపిస్తున్నారు. ఈ మృతదేహాలు ఎక్కువగా చెడిపోయిన స్థితిలో లభిస్తున్నాయి. మిస్సింగ్ కేసు నమోదు చేసిన మరో ఠాణా అధికారులు ఈ ఫొటోలను చూసినా గుర్తించే స్థితిలో ఉండట్లేదు. ఫలితంగా అనేక అదృశ్యం కేసులు మిస్సింగ్స్ గానే, గుర్తు తెలియని మృతదేహాల కేసులు అలానే ఉండిపోతున్నాయి. దీంతో హత్యలు చేసిన నేరగాళ్లు స్వేచ్ఛగా సమాజంలో సంచరిస్తున్నారు. ‘సుప్రీం’ ఆదేశాలతో కదిలిన కేంద్రం... గుర్తుతెలియని శవాలకు సంబంధించి ఓ కేసును విచారించిన సుప్రీం కోర్టు 2015, జనవరిలో కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసుల్ని కొలిక్కి తెచ్చేందుకు సమగ్ర విధానాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించింది. దీంతో కదిలిన కేంద్రం డీఎన్ఏ బ్యాంకులుగా సమాచార నిధి ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించింది. దీనికోసం తయారు చేసిన ముసాయిదా బిల్లు ప్రకారం దేశంలోని అన్ని జిల్లాలు, కమిషనరేట్లలో డీఎన్ఏ నమూనాల సేకరణ, పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. గుర్తుతెలియని మృతదేహాలు, మిస్సింగ్ కేసుల డీఎన్ఏను సేకరించి విశ్లేషించడంతో పాటు భద్రపరుస్తారు. అన్నీ తేలతాయి.. ఈ బ్యాంకుల ఏర్పాటుతో ఓపక్క మిస్సింగ్ కేసులతో పాటు మరోపక్క అన్నోన్ డెడ్‌బాడీస్ గుట్టు రట్టవుతుందని అధికారులు చెప్తున్నారు. ఎవరైనా తమ వారు తప్పిపోయారని ఫిర్యాదు చేస్తే సంబంధీకుల డీఎన్ఏను సేకరిస్తారు. అలాగే గుర్తుతెలియని శవాల డీఎన్ఏను భద్రపరుస్తారు. ఈ వివరాలతో దేశ వ్యాప్తంగా సెంట్రలైజ్డ్ డేటాబేస్ సిద్ధమవుతుంది. ఫలితంగా ఓ రాష్ట్రంలో తప్పిపోయి, మరో రాష్ట్రంలో శవంగా మారిన వారి వివరాలను తక్షణం గుర్తించే వీలుంటుంది. దీంతో పాటు మతిస్థిమితం లేక ఓ చోట తప్పిపోయి మరోచోట పోలీసుల చెంతకు చేరుతున్న వారి వివరాలూ తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. దీంతో దారుణహత్యలకు పాల్పడుతున్న నేరగాళ్లను జైలుకు పంపేందుకు ఆస్కారం ఉంటుందని నగర అధికారులు పేర్కొంటున్నారు. -
డీఎన్ఏ పోగు తగ్గితే... వృద్ధాప్య లక్షణాలు!
వయసు ఎంత పెరిగినా.. చర్మం ముడుతలు పడకుండా.. వెంట్రుకలు రాలిపోకుండా చేయవచ్చా? అవునంటున్నారు అలబామా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. కణాల్లోని మైటోకాండ్రియా పనితీరును సరిచేయడం ద్వారా దీన్ని సుసాధ్యం చేయవచ్చునని వీరు ప్రయోగాత్మకంగా నిరూపించారు. వయసు పెరుగుతున్న కొద్దీ కణాల్లోని మైటోకాండ్రియా పనితీరు మందగిస్తున్నట్లు శాస్త్రవేత్తలు చాలాకాలం క్రితమే గుర్తించారు. మైటోకాండ్రియల్ డీఎన్ఏ పొడవు తగ్గుతున్న కొద్దీ మధుమేహం, వృద్ధులకు వచ్చే నాడీ సంబంధ సమస్యలు, కేన్సర్ వంటి వ్యాధులు వస్తున్నట్లు ఆధారాలు ఉన్నాయి. అంతేకాకుండా దశాబ్ద కాలంలో మనిషి మైటోకాండ్రియల్ డీఎన్ఏలో నాలుగు కాపీలు తగ్గిపోతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో అలబామా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కొన్ని ఎలుకలపై ప్రయోగాలు చేశారు. యాంటీబయాటిక్‌ల ద్వారా వాటి మైటోకాండ్రియల్ డీఎన్ఏ తగ్గిపోయేలా చేసినప్పుడు కొన్ని వారాల్లోనే వెంట్రుకలు రాలిపోవడంతోపాటు, చర్మం ముడుతలు పడటం మొదలైంది. ఇవన్నీ వృద్ధాప్యంతో వచ్చే లక్షణాలే. కాకపోతే వేగంగా చోటు చేసుకున్నాయి. యాంటీబయాటిక్‌లను నిలిపివేసిన వెంటనే పరిస్థితి చక్కదిద్దుకుంటున్నట్లు గుర్తించారు. దీన్నిబట్టి వృద్ధాప్య లక్షణాలకు, మైటోకాండ్రియల్ డీఎన్ఏ తగ్గుదలకు సంబంధం ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలుసుకోగలిగారు. మరిన్ని పరిశోధనల ద్వారా ఈ ప్రక్రియ ద్వారా వ్యాధులకు చికిత్స చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని కేశవ్‌సింగ్ అనే శాస్త్రవేత్త తెలిపారు. -
నెమలి జన్యుక్రమాన్ని కనుగొన్నారు
సాక్షి, న్యూఢిల్లీ : మన జాతీయ పక్షి నెమలి జన్యు క్రమాన్ని భోపాల్‌లోని ఐఐఎస్ఆర్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. నెమలి పురివిప్పినప్పుడు అందంగా కనిపించే నెమలి పించాలు నెమలికి ఎలా వచ్చాయి? బరువు ఎక్కువగా ఉన్నప్పటికీ నెమలి ఎలా గాల్లోకి సులువగా ఎగురగలుగుతుందన్నది నెమలికి సంబంధించిన రెండు ప్రత్యేక అంశాలు. ఏడాదిన్నర కృషితో ఇప్పుడు నెమలి జన్యుక్రమాన్ని పరిశోధకులు కనుగొనడంతో ఈ రెండు ప్రత్యేక అంశాలు దానికి ఎలా సిద్ధించాయో! సులభంగానే తెలుసుకోవచ్చు. నెమలిలో మొత్తం 15,970 జన్యువులు, 110 కోట్ల డీఎన్ఏ జతలు ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు. నెమలికి దగ్గరిగా ఉండే మన నాటు కోడి, టర్కీ కోడితోని పోల్చి చూడగా నెమలిలో 99 జన్యువులు వేరుగా ఉన్నాయి. నెమలి పిండం ఎదగడానికి, దానిలో రోగ నిరోధక శక్తి పెరగడానికే ఈ జన్యువులు ఎక్కువగా ఉపయోగపడుతున్నాయని వారు తేల్చారు. 99 భిన్నమైన జన్యువులు కనిపించడం తమకు నూతనోత్సాహాన్ని కలిగిస్తోందని ‘బీ10కె ప్రాజెక్ట్’ నిర్వాహకుల్లో ఒకరైన గోజీ జాంగ్ వ్యాఖ్యానించారు. 2020 నాటికి అన్ని పక్షి జాతుల జీనోమ్‌ను కనుగొనడమే తమ ప్రాజెక్ట్ లక్ష్యమని ఆయన తెలిపారు. కోళ్లు ఏడెనిమిది ఏళ్లు జీవిస్తుండగా, టర్కీ కోళ్లు పదేళ్లు జీవిస్తాయి. నెమళ్లు మాత్రం 25 సంవత్సరాలు జీవిస్తాయి. కోళ్లకన్నా నెమళ్లు ఎక్కువ కాలం జీవించడానికి కారణం అందులో ప్రత్యేకంగా కనిపిస్తోన్న 99 జన్యువులే కారణమని శాస్త్రవేత్తలు తెలిపారు. నెమళ్లలో ఆడ నెమళ్లే తమతో లైంగికంగా జతకట్టే మగనెమళ్లను ఎంపిక చేసుకోవడం వీటిలో ఉండే మరో ప్రత్యేకత. అందుకే ఆడ నెమళ్ల దష్టిలో పడేందుకు మగ నెమళ్లు పురివిప్పి నాట్యమాడుతున్నట్లుగా తిరుగుతాయి. మగ నెమలి పించాల్లో ఎన్ని కనులు ఉన్నాయనే అంశం ఆధారంగానే వాటి లైంగిక జీవితం ఆధారపడుతుంది. సాధారణంగా ఆడ నెమళ్ళు ఎక్కువ ఈకలపై ఎక్కువ కన్నులున్న నెమళ్లనే జోడిగా ఎంపిక చేసుకుంటాయి. వాటి లైంగిక పటుత్వానికి నెమలి కన్నులు ప్రతీకగా నిలుస్తున్నాయని, ఈ విషయంలో మరిన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉందని పరిశోధకులు తెలిపారు. -
రెండు చేతులు ఇరవై పనులు!
నెత్తి మీద వంద పనులు పెట్టుకుని, పడిపోకుండా పరుగులు తీయడం మల్టీటాస్కింగ్. (పనులు పడిపోకుండానా, మనిషి పడిపోకుండానా? రెండూనూ). పెద్ద పెద్ద కంపెనీల సీఈవోలు, మేనేజింగ్ డైరెక్టర్లు, ఛైర్మన్లు నిత్యం మల్టీటాస్కింగ్ చేస్తుంటారని విన్నప్పుడు.. వాళ్ల ‘డీఎన్ఏ’ వేరేమో అనిపిస్తుంది. వాళ్లు తప్ప నరమానవులెవరూ మల్టీటాస్కింగ్ చెయ్యలేరు. వేగం ఉంటుంది. ఒత్తిడి ఉంటుంది. కాలపరిమితి ఉంటుంది. అన్నిటినీ తట్టుకుని నిలబడాలి. పని ఫినిష్ చేసేయాలి. మల్టీటాస్కింగ్ ఒక విధంగా సామర్థ్యానికి కొలబద్ద. అయితే ఈ మల్టీటాస్కింగ్.. ఒంటికి మంచిది కాదని, ఒత్తిడిని తట్టుకునే శక్తిని కొద్దికొద్దిగా ఈ టాస్కింగ్ తగ్గించేస్తుందని మయామీ యూనివర్శిటీ న్యూరోసైంటిస్ట్ అమిషీ ఝా అంటున్నారు! ‘మైండ్‌తో పరుగులు తీసే మనిషి, బాడీ ఏమైపోతుందో పట్టించుకోడు. బాడీ బలహీనం అయ్యాక, ఆ ప్రభావం మైండ్ మీద పడి కొత్తకొత్త న్యూరో ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయని ఆమె హెచ్చరిస్తున్నారు. అందుకే.. అన్నీ ఒకరే చేయాలనుకోవడం ఆరోగ్యకరం కాదు. పనుల్ని పంచండి. ఎవరికైతే పంచారో వాళ్లపై నమ్మకం ఉంచండి. ఆరోగ్యంగా ఉండండి. మరి గృహిణుల మాటేమిటి? వాళ్ల మల్టీటాస్కింగ్.. ఏ కంపెనీ సీఈవో కన్నా తక్కువ కాదు కదా! నిజమే. లోకంలోని అతి పెద్ద మల్టీటాస్కింగ్ గృహిణులదే. రెండు చేతులు, ఇరవై పనులు. వాళ్ల ఆరోగ్యం దెబ్బతినదా? తింటుంది. అందుకే.. బయట మన మల్టీటాస్కింగ్ పనుల్ని నలుగురికి పంచిన విధంగానే, ఇంట్లో స్త్రీల మల్టీటాస్కింగ్ని మనమూ పంచుకోవాలి. -
రెండు చేతులు ఇరవై పనులు!
నెత్తి మీద వంద పనులు పెట్టుకుని, పడిపోకుండా పరుగులు తీయడం మల్టీటాస్కింగ్. (పనులు పడిపోకుండానా, మనిషి పడిపోకుండానా? రెండూనూ). పెద్ద పెద్ద కంపెనీల సీఈవోలు, మేనేజింగ్ డైరెక్టర్లు, ఛైర్మన్లు నిత్యం మల్టీటాస్కింగ్ చేస్తుంటారని విన్నప్పుడు.. వాళ్ల ‘డీఎన్ఏ’ వేరేమో అనిపిస్తుంది. వాళ్లు తప్ప నరమానవులెవరూ మల్టీటాస్కింగ్ చెయ్యలేరు. వేగం ఉంటుంది. ఒత్తిడి ఉంటుంది. కాలపరిమితి ఉంటుంది. అన్నిటినీ తట్టుకుని నిలబడాలి. పని ఫినిష్ చేసేయాలి. మల్టీటాస్కింగ్ ఒక విధంగా సామర్థ్యానికి కొలబద్ద. అయితే ఈ మల్టీటాస్కింగ్.. ఒంటికి మంచిది కాదని, ఒత్తిడిని తట్టుకునే శక్తిని కొద్దికొద్దిగా ఈ టాస్కింగ్ తగ్గించేస్తుందని మయామీ యూనివర్శిటీ న్యూరోసైంటిస్ట్ అమిషీ ఝా అంటున్నారు! ‘మైండ్‌తో పరుగులు తీసే మనిషి, బాడీ ఏమైపోతుందో పట్టించుకోడు. బాడీ బలహీనం అయ్యాక, ఆ ప్రభావం మైండ్ మీద పడి కొత్తకొత్త న్యూరో ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయని ఆమె హెచ్చరిస్తున్నారు. అందుకే.. అన్నీ ఒకరే చేయాలనుకోవడం ఆరోగ్యకరం కాదు. పనుల్ని పంచండి. ఎవరికైతే పంచారో వాళ్లపై నమ్మకం ఉంచండి. ఆరోగ్యంగా ఉండండి. మరి గృహిణుల మాటేమిటి? వాళ్ల మల్టీటాస్కింగ్.. ఏ కంపెనీ సీఈవో కన్నా తక్కువ కాదు కదా! నిజమే. లోకంలోని అతి పెద్ద మల్టీటాస్కింగ్ గృహిణులదే. రెండు చేతులు, ఇరవై పనులు. వాళ్ల ఆరోగ్యం దెబ్బతినదా? తింటుంది. అందుకే.. బయట మన మల్టీటాస్కింగ్ పనుల్ని నలుగురికి పంచిన విధంగానే, ఇంట్లో స్త్రీల మల్టీటాస్కింగ్ని మనమూ పంచుకోవాలి. -
మేధ వెనుక 500లకు పైగా జన్యువులు!
మనిషి మేధకు.. మనలోని దాదాపు 500 జన్యువులు కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు తొలిసారి గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.40 లక్షల మంది డీఎన్ఏలను అధ్యయనం చేయడం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చామని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఎడిన్‌బరో, సౌతాంప్టన్, హార్వర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సంయుక్తంగా జరిపిన అధ్యయనం ద్వారా ఈ విషయం తెలిసింది. మానవ జన్యుక్రమంలోని దాదాపు 187 ప్రాంతాలు ఆలోచన నైపుణ్యానికి కారణమవుతున్నాయని, 538 జన్యువులు వేర్వేరు మార్గాల్లో మనిషి తెలివిని ప్రభావితం చేస్తున్నాయని వీరు చెప్పారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మేధకు సంబంధించిన కొన్ని జన్యువులతో దీర్ఘాయుష్షుకూ సంబంధం ఉండటం! ఇంకేముంది... ఇంకొన్నేళ్లలో ఈ జన్యువులన్నింటినీ ప్రభావితం చేయడం ద్వారా అపరమేధావులను తయార చేసేద్దామని అనుకుంటున్నారా? అది ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే కేవలం జన్యుక్రమం ద్వారానే మనిషికి మేధను సమకూర్చడం చాలా కష్టమని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త డేవిడ్ హిల్ అంటున్నారు. జన్యువులతోపాటు వాతావరణ పరిస్థితులు కూడా మేధను ప్రభావితం చేస్తూండటం దీనికి కారణం. అందుకే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, బుర్రకు పదును పెట్టే పరిస్థితుల్లో పెరిగే వారితో పోలిస్తే, ఇవేవీ లేని పరిస్థితుల్లో పెరిగిన పిల్లలు తక్కువ మేధ కలిగి ఉంటారని ఆయన వివరించారు. -
చిటికెలో మట్టి పరీక్షలు...
వ్యవసాయం లాభసాటిగా ఉండాలంటే భూమి సారవంతంగా ఉండటంతోపాటు చీడపీడలకు అవకాశాలు తక్కువగా ఉండాలని మనకు తెలుసు. అయితే భూసారాన్ని పరీక్షించేందుకు ఇప్పటికే కొన్ని టెక్నాలజీలు అందుబాటులో ఉన్నాయిగానీ.. చీడపీడల విషయానికి వస్తే మాత్రం ఇలాంటివేవీ లేవు. ఈ అంతరాన్ని పూరించేందుకు వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన టెక్నాలజీని అభివృద్ధి చేశారు. పంట నష్టానికి కారణం కాగల సూక్ష్మజీవుల వివరాలను ఇది అతితక్కువ సమయంలో గుర్తించి రైతులకు వివరాలు అందిస్తుంది. ఇదే పనిచేసేందుకు ప్రస్తుతం కొన్ని వారాల సమయం పడుతుందన్నది తెలిసిందే. మట్టిలో ఉండే సూక్ష్మజీవుల డీఎన్ఏ పోగులను ప్రత్యేకమైన అయస్కాంతాల సాయంతో గుర్తించి.. పాలిమరేస్ చెయిన్ రియాక్టర్ల ద్వారా వివరాలు తెలుసుకోవడం ఈ టెక్నాలజీలోని కీలక అంశం. పరికరాన్ని తయారు చేసేందుకు అవసరమైన అన్ని విడిభాగాలు, విధానం గురించి వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఒక పరిశోధన వ్యాసంలో వెల్లడించారు. వాషింగ్టన్ ప్రాంతంలోని బంగాళాదుంపల పొలాల్లో ఈ పరికరాన్ని పరిశీలించి మంచి ఫలితాలు సాధించామని ఈ పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్త కివామూ తనాకా అనే శాస్త్రవేత్త చెప్పారు. -
డీఎన్ఏ రోబోలతో కేన్సర్ వేట
కాగితాన్ని రకరకాల ఆకారాల్లోకి మడిచేసే ఒరిగామి.. రక్తాన్ని గడ్డకట్టించేందుకు వాడే మందు.. అప్పగించిన పని తు.చ. తప్పకుండా చేసే రోబో..! ఈ మూడు అంశాల్లో ఏమైనా సారూప్యం ఉందా? మామూలుగా చూస్తే అస్సలు ఉండదుగానీ.. ప్రాణాంతకమైన కేన్సర్ పనిపట్టేందుకు శాస్త్రవేత్తలు ఈ మూడింటిని ఒక దగ్గరకు చేర్చారు! అన్నీ సవ్యంగా సాగితే ఇంకొన్నేళ్లలో.. డీఎన్ఏ రోబోలు మన రక్తంలో ఈదుకుంటూ వెళ్లి.. కేన్సర్ కణితులను మాయం చేసేస్తాయి! సాక్షి హైదరాబాద్ : కేన్సర్.. పేరు వినగానే చాలామంది ఇక చావు తప్పదన్న నిర్ధారణకు వచ్చేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. వ్యాధిబారిన పడినా.. ఏళ్లపాటు జీవించేందుకు అవకాశాలున్నాయి. అయితే ఆయుష్షు కొంతవరకూ పెంచగలమేమోగానీ.. పూర్తిస్థాయిలో చికిత్స అన్నది ఇప్పటికీ సాధ్యం కాదనే ఆధునిక శాస్త్ర పరిజ్ఞానం చెబుతోంది. ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల ప్రయోగాలు పూర్తిస్థాయిలో విజయవంతమైతే ఈ పరిస్థితి పూర్తిగా మారిపోనుంది. శరీరంలో కేన్సర్ కణితులు ఎక్కడున్నా గుర్తించి మరీ వాటికి రక్తం సరఫరా చేసే నాడులను అడ్డుకోగల అద్భుత వ్యవస్థను వీరు రూపొందించారు. కేన్సర్ కణితులు వేగంగా విభజితమవ్వాలంటే కణాలకు బోలెడంత శక్తి కావాలి. ఈ శక్తి కోసం కేన్సర్ కణాలు కొత్త కొత్త రక్తనాడులను సృష్టించుకుంటాయి. దీన్నే యాంజియోజెనిసిస్ అంటారు. ఇలా కొత్త రక్తనాళాలు పెరిగే వేగాన్ని తగ్గించగలిగితే కణితుల సైజును నియంత్రించడంతోపాటు వ్యాధి ఇతర శరీర భాగాలకు వ్యాపించకుండా అడ్డుకోవచ్చని శాస్త్రవేత్తలు చాలాకాలంగా అంచనా వేస్తున్నారు. అయితే ఈ పని ఎలా చేయాలన్న విషయంలో ఇప్పటివరకూ స్పష్టత లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీలోని బయోడిజైన్ ఇన్స్టిట్యూట్కు చెందిన సెంటర్ ఫర్ మాలిక్యులర్ డిజైన్ అండ్ బయో మిమిటిక్స్ విభాగపు ప్రొఫెసర్ హోయాన్ వినూత్నమైన రీతిలో పరిశోధనలు నిర్వహించారు. దీని గురించి తెలుసుకోవాలంటే ముందుగా ఒరిగామి అనే జపనీస్ కళ గురించి తెలసుకోవాల్సి ఉంటుంది. కాగితాన్ని మడత పెడుతూ రకరకాల ఆకృతులను సృష్టించడం ఒరిగామి ప్రత్యేకత. కాగితానికి బదులుగా మన కణాల్లోని డీఎన్ఏతో ఓ గొట్టం లాంటి ఆకారాన్ని తయారు చేశారు ప్రొఫెసర్ హోయాన్. ఈ గొట్టం లోపలిభాగంలో రక్తాన్ని గడ్డకట్టించేందుకు ఉపయోగించే థ్రోంబిన్ అనే మందును ఉంచారు. డీఎన్ఏ గొట్టంతో కలసి మందు రక్తనాళాల్లో కేన్సర్ కణాల పరిసరాల్లోకి చేరుతుంది. ఆ ప్రాంతాల్లో ఉండే ప్రత్యేకమైన ప్రొటీన్ మూలకాలకు స్పందించి డీఎన్ఏ గొట్టం విచ్చుకుంటే.. దాంట్లోని మందు పనిచేయడం మొదలుపెడుతుంది. ఇంకేముంది.. ఆ ప్రాంతంలోని రక్తనాళం పూడిపోవడం.. దాంతోపాటే కేన్సర్ కణితి నాశనమైపోవడం చకచకా జరిగిపోతాయి. తెలివైన డిజైన్.. మామూలుగా రోబో అనగానే మనకు యంత్రుడు గుర్తుకొస్తాడు గానీ.. దీనిని డీఎన్ఏనే చాలా తెలివిగా డిజైన్ చేసి తయారు చేసిన రోబోగా చెప్పాలి. చికిత్సకు ఉపయోగించే మందు కణితి వద్దకు వెళ్లకుండానే రక్తంలో కలిసిపోకుండా ఉండేందుకు డీఎన్ఏ పోగులతో చేసిన గొట్టం లాంటి నిర్మాణాన్ని ఉపయోగించారు. పైగా మందుల జీవితకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అది అవసరమైనప్పుడే కణితుల వద్ద విడుదలయ్యేలా ఈ డిజైన్ ఉపయోగపడింది. కేన్సర్ కణాలకే పరిమితమైన ప్రొటీన్‌ను గుర్తించి అతుక్కునేలా ఈ గొట్టం చివరల్లో ప్రత్యేకమైన మార్కర్లను ఏర్పాటు చేయడం వల్ల ఈ మందు ఆరోగ్యకరమైన కణాల వద్ద పనిచేసి దుష్ప్రభావాలు చూపే అవకాశాలను తగ్గించారన్నమాట. ఏఏ కేన్సర్లకు వాడవచ్చు.. ఈ కొత్త నానో డీఎన్ఏ రోబో విధానాన్ని ఎలుకల్లోని రొమ్ము కేన్సర్‌పై పరీక్షించి చూశారు. ఊపిరితిత్తుల కేన్సర్‌తోపాటు గర్భాశయ కేన్సర్లు ఉన్న ఎలుకల్లోనూ ఈ విధానం మెరుగైన ప్రభావం చూపినట్లు నేచర్ బయోటెక్నాలజీ టుడేలో ప్రచురితమైన పరిశోధన వ్యాసం చెబుతోంది. మూడు రోజుల్లో ఈ నానో డీఎన్ఏ రోబోలు కేన్సర్ కణితుల చుట్టూ ఉన్న రక్తనాళాలను మూసేయడంలో విజయం సాధించాయని, రక్త కేన్సర్ల విషయంలో దీని ప్రభావం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. రక్త కేన్సర్ల విషయంలో ఎనిమిది ఎలుకల్లో మూడింటిలో కణితులు పూర్తిగా తొలగిపోగా.. మిగిలిన వాటిలో సైజు గణనీయంగా తగ్గింది. అంతేకాకుండా వాటి జీవితకాలం కూడా రెట్టింపు అయినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. కణితులు ఉన్న ప్రాంతానికి దూరంగా రక్తనాళాలపై ఎలాంటి చెడు ప్రభావం చూపకపోవడం ఈ విధానం ఇంకో ప్రత్యేకత. ఎలుకలతోపాటు తాము పందులపై కూడా ప్రయోగాలు జరిపి మంచి ఫలితాలు సాధించామని ప్రొఫెసర్ హోయాన్ అంటున్నారు. ఈ నానో డీఎన్ఏ రోబోలను కేన్సర్‌కే కాకుండా ఇతర వ్యాధులకు చికిత్స అందించేందుకూ ఉపయోగించవచ్చని.. అవి మోసుకెళ్లే మందును మారిస్తే చాలని తాము అంచనా వేస్తున్నట్లు యాన్ చెప్పారు. -
పరి పరిశోధన
వైరస్‌లను ఖతం చేసే బుల్లి యంత్రాలు! తనలోకి చొచ్చుకుపోయే వైరస్‌లను కణాలు ఎలా చంపుతాయి? అది కూడా తనకు హాని జరక్కుండానే? ఆసక్తికరమైన ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కున్నారు యూటా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. డీఎన్ఏ పోగుల్లా ఉండే వైరస్‌లలోని రసాయనాలను క్రమేపీ కత్తిరించేసే బుల్లి యంత్రాల్లాంటివి కణాల్లో ఉంటాయని వీరు ఈగలపై జరిపిన పరిశోధనల ద్వారా తెలుసుకున్నారు. బుల్లి యంత్రం అనగానే ఇదేదో కత్తెరలు, రంపాలతో ఉండదు. జన్యువుల ద్వారా ఉత్పత్తి అయ్యే ఒక ప్రొటీనే... కణాల్లోకి వైరస్లు చొచ్చుకు రాగానే చైతన్యవంతమైపోయి.. వాటిని కత్తిరించేస్తాయని, తద్వారా ఇన్ఫెక్షన్ విస్తరించకుండా అడ్డుకుంటాయని అసిస్టెంట్ ప్రొఫెసర్ పీటర్ షెన్ తెలిపారు. కణం లోపల వైరస్లు తమని తాము కాపీ చేసుకుని పెరిగిపోవడం ద్వారా ఇన్ఫెక్షన్ను వ్యాప్తి చేస్తాయన్నది తెలిసిందే. ఇంగ్లిష్ అక్షరం ‘ఎల్’ ఆకారంలో ఉండే ఈ ప్రొటీన్‌కు ‘డైసర్’ అని పేరు పెట్టారు. వైరస్ దగ్గరకు రాగానే డైసర్ దాంట్లో ఉండే తాడులాంటి డీఎస్ ఆర్ఎన్ఏను పట్టుకుని ముకకలు ముక్కలుగా చేస్తుంది. సాధారణ డీఎస్ ఆర్ఎన్ఏకు, వైరస్లు ఉత్పత్తి చేసే వాటికి మధ్య ఉన్న స్వల్పమైన తేడా ఆధారంగా డైసర్ వాటిని గుర్తించగలదని పీటర్ తెలిపారు. డైసర్ లాంటిదేదో ఒకటి ఉందని చాలాకాలంగా తెలిసినప్పటికీ అది ఏమిటి? ఎలా పనిచేస్తుందన్న అంశంపై మాత్రం స్పష్టత లేదని.. తమ ప్రయోగాలను మానవుల్లో వైరస్ ఇన్ఫెక్షన్లను మరింత సమర్థంగా తొలగించేందుకు ఉపయోగించవచ్చునని ఆయన వివరించారు. చూస్తే.. వాసన పీలిస్తే... ఆకలి తగ్గుతుందా? అహ నా పెళ్లంట సినిమాలో ఓ సీన్ ఉంటుంది. పిసినారి కోట శ్రీనివాసరావు కోడిని వేలాడదీసి.. దాన్ని చూస్తూ ఆహా.. ఓహో అని లొట్టలేస్తూ అన్నం తింటూ ఉంటాడు. అది చూసి సుత్తి వీరభద్రరావుకు పిచ్చెక్కే విషయాన్ని కాసేపు పక్కన బెడితే.. ఆహారాన్ని తినకుండా కేవలం చూస్తేనో.. లేదంటే వాసన పీలిస్తేనో మన ఆకలి తగ్గిపోతుందా? అవుంటున్నారు పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. బాగా ఆకలేసినప్పుడు ఇలా చేస్తే మెదడులో తినాలన్న కోరికను పుట్టించే న్యూరాన్లు కొద్దిసేపు పనిచేయకుండా పోతాయని జె.నికోలస్ బెట్లీ అనే శాస్త్రవేత్త తెలిపారు. ‘‘ఈ న్యూరాన్లు పనిచేస్తూన్నంత సేపు అవి ఆకలవుతోంది.. ఏదైనా తిను అనే సంకేతాలు మెదడుకు పంపుతూ ఉంటాయి’’ అని... మన ఆహారంలోని పోషకాల ఆధారంగా ఈ అలారమ్ పనిచేస్తూంటుందని వివరించారు. ఎలుకలపై చేసిన కొన్ని ప్రయోగాల ద్వారా తాము ఈ అంచనాకు వచ్చామని వివరించారు. ఆహారం జీర్ణమయ్యే సమయంలో శరీరంలో విడుదలయ్యే కొన్ని ఎంజైమ్‌లను ఎక్కించినప్పుడు ఈ న్యూరాన్ల క్రియను తక్కువ చేశాయని చెప్పారు. ఇంకోలా చెప్పాలంటే ఆకలి లేకుండా పోతుందన్నమాట. ఊబకాయాన్ని తగ్గించుకునేందుకు, తద్వారా ఇతర ఆరోగ్య సమస్యలను ముందుగానే అడ్డుకునేందుకు ఇదో మార్గమని నికోలస్ అంటున్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో మనిషి దీర్ఘకాలం అంతరిక్ష ప్రయాణాలు చేసే పరిస్థితి ఉన్నప్పుడు ఆహారాన్ని సమర్థంగా వాడుకునేందుకూ ఈ టెక్నిక్‌ను వాడుకోవచ్చునని సూచిస్తున్నారు. దాల్చిన చెక్కతో కొవ్వు కరుగుతుంది! విషయం పాతదేగానీ.. ఇంకోసారి శాస్త్రీయంగా ఆధారాలు దొరికాయి కాబట్టి ఇంకోసారి దీన్ని ప్రస్తావించాల్సి వస్తోంది. ఏంటా విషయం అంటారా? దాల్చిన చెక్క వాడితే కొలెస్ట్రాల్ తగ్గుతుంది అని! ఒక చెట్టు బెరడైన దాల్చిన చెక్కను ఆయుర్వేదంతో పాటు చాలారకాల ఇతర వైద్య విధానాల్లోనూ మందుగా ఏళ్లుగా వాడుతున్న సంగతి తెలిసిందే. తాజా పరిశోధనల ద్వారా ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకూ ఉపయోగపడుతుందని స్పష్టమైంది. అధిక కొలెస్ట్రాల్ కారణంగా ఏటా కొన్ని లక్షల మంది మరణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొంతమంది మధుమేహులను ఎంచుకుని వారికి ప్రతిరోజూ దాదాపు ఆరు గ్రాముల దాల్చిన చెక్క పొడి అందించడం మొదలుపెట్టారు. నాలుగు నెలల తరువాత పరిశీలిస్తే రక్తంలోని హానికారక ట్రైగ్లిజరైడ్లతోపాటు కొలెస్ట్రాల్ కూడా తగ్గినట్లు స్పష్టమైంది. అయితే ఇది ఎల్డీఎల్, హెచ్డీఎల్లపై మాత్రం ఎలాంటి ప్రభావం చూపలేదు. ఇంకో అధ్యయనంలోనూ ఇదే విషయం రూఢి అయింది. అయితే దీంట్లో ఉండే కౌమారిన్ అనే పదార్థంతో కాలేయంపై దుష్ప్రభావం చూపుతుందని ఇతర పరిశోధనలు చెబుతున్న నేపథ్యంలో ఎంత మోతాదులో తీసుకోవాలన్న అంశంపై ప్రశ్నలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో శరీర బరువులో ప్రతి కిలోకు 0.1 మిల్లీ గ్రాముల చెక్క తీసుకోవడం మేలని యూరోపియన్ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. -
నేను ఎవరి బిడ్డని!
-
నేను ఎవరి బిడ్డని!
► మలుపు తిరిగిన సరోగసీ అమ్మ వివాదం ► ఆ బిడ్డ మా బిడ్డ కాదంటున్న గుంటూరు దంపతులు ► వారి బిడ్డనే మోశానంటున్న శిశువుకు జన్మనిచ్చిన తల్లి ► డీఎన్ఏ పరీక్షల ద్వారానే వివాదం తేల్చాల్సిన పరిస్థితి సాక్షి, హైదరాబాద్ అద్దె గర్భం(సరోగసీ) ద్వారా జన్మించిన ఆ శిశువు ఇప్పటి వరకు కన్నతల్లి మురిపాలకు నోచుకోలేదు. పేగు తెంచుకు పుట్టిన బిడ్డ ముఖాన్ని ఆ తల్లి చూడనేలేదు. అసలు తల్లిదండ్రులు ఎవరో తెలియకుండా పుట్టిన ఆ బిడ్డ ఓ అనాథలా నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే.. ‘సరోగసీ’ ద్వారా బిడ్డను కనాలనుకున్న తల్లిదండ్రులు, ఇందుకు పురమాయించిన వైద్యుల చేతిలో మోసపోయి నాలుగు రోజులుగా పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న బాధితురాలి పరిస్థితి మరీ దయనీయంగా మారింది. సరోగసి ద్వారానే బిడ్డకు జన్మనిచ్చినట్లు బాధితురాలు చెపుతుంటే.. అసలు ఆ బిడ్డకు తమకూ ఎలాంటి సంబంధం లేదని గుంటూరుకు చెందిన దంపతులు చెపుతుండటంతో ఈ అంశం మరింత క్లిష్టంగా మారింది. దీంతో డీఎన్ఏ పరీక్షల ద్వారానే ఎవరి బిడ్డ అనేది తేల్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, తన భార్య ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయనున్నట్లు బాధితురాలి భర్త లక్ష్మణ్ తెలిపారు. ఆ బిడ్డకు, మాకూ ఎలాంటి సబంధం లేదు: సుధారాణి, సరోగసీ ద్వారా బిడ్డ కావాలనుకున్న మహిళ పిల్లలపై ఉన్న మమకారంతో రాజ్‌భవన్ రోడ్డులోని ఓ ఇన్ఫెర్టిలిటీ సెంటర్‌కు వెళ్లాం. అక్కడ అనిత అనే మధ్యవర్తి ద్వారా బాధితురాలు పరిచయమైంది. అద్దె గర్భం ద్వారా శిశువుకు జన్మనిచ్చేందుకు అంగీకరించింది. ఆ మేరకు ఇరువురి మధ్యా ఒప్పందం కుదిరింది. రెగ్యులర్ చెకప్ కోసం ఎస్ఆర్ నగర్‌లోని జేజే ఆస్పత్రికి తీసుకెళ్లాం. సరోగసీ ప్రక్రియ ద్వారా ఆమె గర్భం దాల్చింది. అప్పటి నుంచి ఏడో నెల వరకు నెలవారీ వైద్య పరీక్షలు సహా కడుపులోని బిడ్డ ఎదుగుదలకు కావాల్సిన పౌష్టికాహారం ఇలా అన్నీ మేమే సమకూర్చాం. ఏమైందో ఏమో ఏడో నెల తర్వాత బాధితురాలు అకస్మాత్తుగా ఫాలోఅప్ చికిత్సకు నిరాకరించింది. అనేకసార్లు ఫోన్ చేసినా ఆమె నుంచి కనీస స్పందన లేదు. నిజానికి బాధితురాలికి జన్మించిన బిడ్డకు మాకూ ఎలాంటి సంబంధం లేదు. పిల్లలు లేని లోటు తీర్చుకునేందుకు మానవతా ధృక్ఫథంతో మేమే ముందుకు వచ్చాం. బిడ్డకు డీఎన్ఏ పరీక్ష చేస్తే అసలు తల్లిదండ్రులు ఎవరో తెలుస్తుంది. ఒకవేళ ఆమెకు జన్మించిన బిడ్డ జన్యువు మా దంపతుల జన్యువుతో పోలి ఉంటే తీసుకెళ్లడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ల బిడ్డనే మోసాను: వెంకటమ్మ, సరోగసీ ద్వారా శిశువుకు జన్మనిచ్చిన తల్లి నవమాసాలు మోసి కన్నబిడ్డ పుట్టుక గురించి ఏ తల్లీ అబద్ధం చెప్పదు. ఇప్పటికే ఒక బాబుకు జన్మనిచ్చి పెంచుతున్న తల్లిని నేను. నిజానికి పేదరికం వల్ల డబ్బుకు ఆశపడి ఈ ప్రక్రియకు అంగీకరించాను. తొలుత ఈ విషయం నా భర్తకు కూడా తెలియదు. ఏడో నెల తర్వాత గుంటూరు దంపతులు నన్ను జేజే ఆస్పత్రికి తీసుకెళ్లి స్కానింగ్ చేయించారు. స్కానింగ్ చేసిన డాక్టర్ కడుపులో పెరుగుతోంది ఆడబిడ్డ అని చెప్పింది. అప్పటి వరకు అన్నీ తామై వ్యవహరించిన ఆ దంపతులు ఆడబిడ్డ అని తెలిసి ముఖం చాటేశారు. అనేకసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. ఒకవేళ నాకు, నా భర్తకే ఈ బిడ్డ పుట్టి ఉంటే.. సాదుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. నన్ను మోసం చేసిన దంపతులు, వైద్యులపై చర్యలు తీసుకుని పుట్టిన బిడ్డకు న్యాయం చేయాలి. అలా నిర్థారించడం నేరం:డాక్టర్ రమేశ్‌రెడ్డి, డీఎంఈ కడుపులో పెరుగుతుంది ఆడో, మగో నిర్థారించడం చట్టరీత్యా నేరం. అలా చేసిన డయాగ్నోస్టిక్పైనే కాదు సంబంధిత వైద్యులపైనా కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవచ్చు. నిజానికి దేశంలో సరోగసీ విధానంపై స్పష్టమైన నిబంధనలు లేవు. కొంతమంది వైద్యులు దీన్ని అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే పటిష్టమైన చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం బిడ్డ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఈ కేసును పోలీసులే తేల్చాలి. నేను ఐవీఎఫ్ చేయను: డాక్టర్ జయంతి, గైనకాలజిస్ట్, జేజే ఆస్పత్రి మా ఆస్పత్రిలో బేసిక్ ఇన్ఫెర్టిలిటీ చికిత్సలు, సాధారణ, సిజేరియన్ ప్రసవాలు, ఇతర గైనిక్ సంబంధిత చికిత్సలు తప్ప.. ఐవీఎఫ్, సరోగసీ వంటి చికిత్సలు లేవు. బాధితులు ఆరోపిస్తున్నట్లు మా ఆస్పత్రిలో ఎలాంటి లింగనిర్థారణ పరీక్షలు చేయలేదు. అసలు వారెవరో కూడా మాకు తెలియదు. పుట్టిన బిడ్డకు, ఆ ఘటనకు మాకు ఎలాంటి సంబంధం లేదు. -
చనిపోయిన తల్లిదండ్రులే వారిని కలిపారు!
బీజింగ్: వెయిటింగ్ ఫర్ మీ అనే టీవీ కార్యక్రమం ద్వారా 27 ఏళ్ల క్రితం విడిపోయిన తోబుట్టువులు చైనాలో మళ్లీ కలిశారు. వారిని కలిపింది ఎవరో కాదు.. చనిపోయిన వారి తల్లిదండ్రులే. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా.. చనిపోయిన తల్లిదండ్రుల సమాధి నుంచి సేకరించిన డీఎన్ఏ ద్వారా అక్కాతమ్ముడు కలిశారు. షో నిర్వాహకులతో పాటు ఆ కార్యక్రమాన్ని వీక్షించిన వారిని కంటతడిపెట్టించిన ఆ వివరాలు ఇవి. 1990వ సంవత్సరంలో యాన్యన్ అనే రెండేళ్ల బాలుడు రైల్వే స్టేషన్లో తప్పిపోయాడు. తప్పిపోయిన కొడుకు కోసం నాలుగేళ్ల కూతురు జియాయును అమ్మమ్మ వద్ద వదిలేసి.. తల్లిదండ్రులు వెతకని చోటులేదు. ఉద్యోగాన్ని వదిలేసి రెండేళ్ల పాటు యాన్యన్‌ను వెతికుతూ.. తీవ్ర నిరాశలో కూరుకుపోయిన తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆ తరువాత తమ్ముడిని వెతికే బాధ్యతను జియాయు తీసుకుంది. ఈ క్రమంలో 2015లో పబ్లిక్ సెక్యురిటీ అఫిసియల్ వెబ్సైట్లో జియాయు తన డీఎన్ఏ వివరాలను నమోదుచేసుకుంది. రైల్వే స్టేషన్లో తప్పిపోయి అక్రమ రవాణా ద్వారా తూర్పు చైనాకు చేరుకున్న యాన్యన్ కూడా సరిగ్గా ఇదే సమయంలో తన డీఎన్ఏ వివరాలను ఆ వెబ్సైట్లో నమోదు చేశాడు. అయితే.. ఈ రెండు డీఎన్ఏల మధ్య సారూప్యతలు ఉన్నప్పటికీ.. తల్లిదండ్రుల డీఎన్ఏతో సరిపోల్చడం ద్వారా వీరిద్దరు తోబుట్టువులని నిర్థారణ అయింది. దీంతో వెయిటింగ్ ఫర్ మీ అనే సీసీటీవీ కార్యక్రమం ద్వారా వారు కలిశారు. సమాధుల నుంచి తల్లిదండ్రుల డీఎన్ఏను సేకరించడానికి అక్కడి కట్టుబాట్ల పరంగా కొన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ.. జియాయు ధైర్యంగా సోదరుడి కోసం ముందడుగు వేసింది. ‘యాన్యన్ నువ్వు ఎక్కడ ఉన్నావ్. ఈ అమ్మ మొహాన్ని గుర్తుంచుకో. నిన్ను కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నా. ఎప్పుడూ నీ గురించే కలగంటున్నా’ అంటూ కొడుకు కోసం మరణించిన తన తల్లి రాసుకున్న డైరీలోని కొన్ని మాటలను టీవీ కార్యక్రమంలో జియాయూ వినిపించింది. ఇక.. తమ్ముడిని తల్లిదండ్రుల సమాధి వద్దకు తీసుకెళ్లి మీ కొడుకు తిరిగొచ్చాడని చెప్తానని జియాయు తెలిపింది. కాగా.. తూర్పు చైనాలోని ఓ ఫ్యామిలీతో పాటు ఉంటున్న తాను.. అక్కడి వారి పోలికలు వేరుగా ఉండటంతో అనుమానంతో డీఎన్ఏ వివరాలు నమోదు చేశానని యాన్యన్ వెల్లడించాడు. -
డీఎన్ఏలో లఘుచిత్రం!
న్యూయార్క్: డీఎన్ఏలో ఓ లఘుచిత్రం, కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్(ఓఎస్)తోపాటు వేరే డేటాను పరిశోధకులు విజయవంతంగా పొందుపరిచారు. స్పెయిన్ లోని గుహల్లో 4.3 లక్షల ఏళ్ల పూర్వీకుడికి సంబంధించిన ఎముకల నుంచి సేకరించిన డీఎన్ ఏలో అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ, న్యూయార్క్ జినోమీ సెంటర్(ఎన్ వైజీసీ)కి చెందిన పరిశోధకులు ఈ మేరకు డేటాను పొందుపరిచారు. క్యాసెట్ టేపులు, సీడీల మాదిరిగా డీఎన్ ఏ పాడైపోదని కొలంబియా వర్సిటీకి చెందిన యానివ్ ఎర్లిచ్ పేర్కొన్నారు. కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్, ‘అరీవల్ ఆఫ్ ఏ ట్రైన్ ఎట్ లా సియోటట్’ అనే 1895 సంవత్సరపు ఫ్రెంచ్ సినిమా, 50 డాలర్ల అమెజాన్ గిఫ్ట్ కార్డు, కంప్యూటర్ వైరస్, పయోనీర్ చిహ్నం కొన్ని ఫైళ్లను క్రోఢీకరించి డీఎన్ ఏలో పొందుపరిచారు. మొత్తం ఆరు ఫైళ్లకు సంబంధించిన 215 పెటాబైట్స్ను ఒక గ్రామ్ డీఎన్ఏలో నిక్షిప్తం చేసినట్లు ఎర్లిచ్ చెప్పారు. -
జీన్ ఎడిటింగ్ ద్వారా నయమయ్యే
ఎన్నెన్నో వ్యాధులు! ఇక్కడ వివరించే అంశాల పూర్తిగా సాంకేతికం. ఇక్కడ చెప్పినంత సులభం కాకపోవచ్చు. అయితే అందరికీ అర్థం కావడం కోసం కాస్త తేలిక భాషలో చెప్పుకుందాం. పత్రికా రచన, పుస్తకాల ప్రచురణ సమయంలో ఇతరులకు అర్థం కావడం కోసం కొంత తొలగిస్తారు. కానీ అది లేకపోయినా పాఠకులకు అర్థం అవుతుంది. అలాగే సినిమాలోనూ చాలా భాగాన్ని తీసేసి, నిర్ణీత సమయంలో ఎంత చూపగలరో అంతకు కుదిస్తారు. కొన్ని చోట్ల కొన్ని మార్పులు చేస్తారు. కొంత పాఠ్యభాగాలను ముందుకూ, వెనక్కూ చేస్తారు. అలాగే సినిమాలో సీన్స్ కూడా. ఇదే ప్రక్రియ జన్యువులోని పదార్థమైన డీఎన్ఏలోనూ జరిగితే! అది డీఎన్ఏ-ఎడిటింగ్. చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. కానీ మనకు అర్థం కావడం కోసం ఇలా చెప్పుకున్నాం. ఇలా డీఎన్ఏ-ఎడిటింగ్ చేసే ప్రక్రియ ఇప్పటివరకూ చాలా పరిశోధన స్థాయిలోనే ఉంది. కానీ ఈ పరిశోధన వల్ల ఒనగూరే ప్రయోజనాలు మాత్రం చాలా ఎక్కువేనని అంటున్నారు సాల్క్ ఇన్స్టిట్యూట్కు చెందిన పరిశోధకులు. ఉదాహరణకు గుండె, కన్ను, కాలేయం, మెదడు లాంటి అవయవాల్లోని కణాలలో ఉండే మూల పదార్థమైన జీన్‌లోని డీఎన్ఏలు చెడిపోతే వాటిని బాగు చేయడం సాధ్యం కాదు. కానీ ఈ పరిశోధనల తర్వాత వాటిలోనూ మార్పు చేయవచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని వల్ల చేకూరే ప్రయోజనాలు చాలా ఎక్కువ. దీని వల్ల జరిగే మేలు గురించి చిన్న ఉదాహరణగా అంధత్వం వచ్చిన వారి కళ్లు మళ్లీ మామూలుగానే అయ్యేలా చేసి, చూపు తెప్పించవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ టెక్నిక్‌ను ‘హైటై’ అంటున్నారు. ఈ పరిశోధనల సహాయంతో ల్యాబ్‌లో కనుచూపులేని కొన్ని ఎలుకలకు కొంతవరకు చూపు తెప్పించగలిగారు. ‘‘ఇప్పటికి మనం చేస్తున్నది చాలా తక్కువ. దీని గురించి ఇంకా తెలుసుకోవాల్సించి చాలా ఉంది’’ అంటారు ఈ పరిశోధనల్లో పాలుపంచుకుంటున్న డాక్టర్ బెల్మాంటె. -
డీఎన్ఏ ద్వారా నేరస్థుల మొహాన్నిసృష్టించవచ్చు
లండన్: నేరం జరిగిన చోట దొరికే డీఎన్ఏ అవశేషాల ద్వారా ఇప్పుడు నేరస్థులను పట్టుకుంటున్న విషయం తెల్సిందే. అనుమానిత నేరస్థులు లేదా పాత నేరస్థుల డీఎన్ఏతో నేరం జరిగిన చోట దొరికిన డీఎన్ఏ అవశేషాలను సరిపోల్చడం ద్వారా మాత్రమే నేరస్థులను పట్టుకోవడం సాధ్యమవుతుంది. ముక్కూ మొహం తెలియని కొత్త వాళ్లు నేరానికి పాల్పడితే వారిని డీఎన్ఏ ద్వారా పట్టుకోవడం కష్టమే. ఇక ముందు డీఎన్ఏ ద్వారా వారి ముఖాలను అచ్చుగుద్దినట్టు గుర్తించే అద్భుత సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. ఒక్కొక్కరి ముఖాలు ఒక్కోలాగా ఉండడానికి వారి వారి జన్యువులే కారణమని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కొనదేలిన ముక్కు, కుదురైన పెదవులు, విశాలమైన కళ్లతో కొందరి ముఖాలు అందంగా ఉంటాయి. బండ ముక్కు, మొద్దు పెదవులు, డొప్ప చెవులతో కొందరి ముఖాలు కాస్త వికారంగా ఉంటాయి. ఈ అవయవాల తీరు తెన్నులతోపాటు కళ్ల మధ్య ఎంత దూరం, కళ్లకు చెవులకు ఎంత దూరం, ముక్కుకు కళ్లుకు, ముక్కుకు చెవులకు, పెదాలకు ముక్కుకు ఎంత దూరం ఉందనే అంశంపై ముఖం తీరుతెన్నులు లేదా ముఖ కవలికలు ఆధారపడి ఉంటాయి. ముఖంపై నుండే ఈ అవయవాల తీరును మనిషిలోని కొన్ని జన్యువులు నిర్దేశిస్తున్నాయని ఇప్పుడు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. యూరప్‌కు చెందిన 3,118 మంది ఆరోగ్యవంతుల ముఖాలను 3డి ద్వారా చిత్రీకరించి, వారి వారి జన్యుక్రమంలో ఉన్న తేడాలపై పరిశోధనలు జరపడం ద్వారా ఈ విషయం కనుగొన్నామని ‘ప్లోస్ జెనటిక్స్’ జనరల్‌లో శాస్త్రవేత్తలు వివరించారు. డీఎన్ఏ ద్వారా ఒకరి జన్యుక్రమాన్ని కనిపెట్టి వాటి ఆధారంగా వారి మొఖం ఎలా ఉంటుందో గ్రాఫిక్ ద్వారా డిజైన్ చేయవచ్చని వారు తెలిపారు. నేరస్థుల డీఎన్ఏను సేకరించి వారి ముఖాలు ఎలా ఉంటాయో కనుక్కోవచ్చని వారు తేల్చారు. అయితే ఈ దిశగా మరింత లోతుగా దర్యాప్తు జరపాల్సి ఉందని వారు చెప్పారు. -
ముగ్గురికి జన్మించిన బిడ్డ!
న్యూయార్క్: ప్రపంచంలోనే తొలిసారిగా ముగ్గురి ద్వారా ఓ బాబు జన్మించాడు. వివాదాస్పద సరికొత్త సంతానోత్పత్తి విధానంతో ముగ్గురి నుంచి సేకరించిన డీఎన్ఏ ద్వారా జోర్డాన్ జంటకు జన్మించాడు. బాబు తల్లి లీగ్ సిండ్రోమ్ అనే జన్యు సంబంధ వ్యాధితో బాధపడుతోంది. దీంతో పుట్టే పిల్లలకు మెదడు, కండరాలు, నాడీ కణాల అభివృద్ధి లోపం ఏర్పడి చనిపోతారు. వారికి పెళ్లయిన పదేళ్ల తర్వాత బిడ్డ పుట్టినా లీగ్ సిండ్రోమ్ ఉండటంతో ఆరేళ్లకు చనిపోయింది. రెండోసారి ఓ బాబు పుట్టినా 8 నెలలకే మరణించాడు. దీంతో ఈ జంట న్యూయార్క్‌కు చెందిన ‘న్యూ హోప్’ ఫెర్టిలిటీ సెంటర్లోని జాన్ జాంగ్‌ను సంప్రదించారు. తల్లి అండం నుంచి కేంద్రకాన్ని తీసుకుని దాత అండంలోకి ప్రవేశపెట్టారు. ఈ అండాన్ని తండ్రి శుక్రకణాలతో ఫలదీకరణం చెందించారు. పిండాన్ని తల్లి అండాశయంలోకి చొప్పించారు. ఈ ఏడాది ఏప్రిల్ 6న జన్మించిన బాబు ఆరోగ్యంగా ఉన్నాడు. -
కాఫీ తాగడంపై జన్యు ప్రభావం
స్కాట్లాండ్: మన చుట్టూవున్న వాతావరణం చలి, చలిగా ఉన్నప్పుడు వేడి వేడి కాఫీ తాగాలని అనిపించడం ఎవరికైనా అనుభవమే. అయితే కొందరు తక్కువ తాగుతారు. కొందరు ఎక్కువ కప్పులు తాగుతారు. మరి కొందరు గబ,గబా తాగేస్తారు. ఇంకొందరు అసలే తాగరు. కాఫీ తాగడంలో వ్యక్తికి, వ్యక్తికి మధ్య వ్యత్యాసానికి కారణం ఏమిటీ? మన అలవాట్లా, మన ప్రవర్తనా? ఇదే అంశాన్ని తేల్చుకుందామని ఎడిన్బర్గ్ యూనివర్శిటీకి చెందిన ‘యుషర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ హెల్త్ సెన్సైస్ ఇన్ఫార్మిటిక్స్’కు చెందిన నిపుణులు పరిశోధనలు చేశారు. మానవ డీఎన్ఏలో ఉండే ‘పీడీఎస్‌ఎస్2’ అనే జన్యు రకం మానవులు కాఫీ తాగడాన్ని ప్రభావితం చేస్తోందని, ఈ జన్యువును కలిగిన వారు అది లేనివారికన్నా తక్కువ కప్పుల కాఫీ తాగుతారని పరిశోధనల్లో తేలింది. మరో విధంగా చెప్పాలంటే కాఫీ తాగడాన్ని ఈ జన్యువు నియంత్రిస్తుంది. మన ఆహారపు అలవాట్లు, రుచులకు మనలోని జన్యువులకు ప్రత్యక్ష సంబంధం ఉంటుందని శాస్త్రవేత్తలు ఎప్పుడో కనిపెట్టినప్పటికీ కాఫీ తాగే అలవాటుపై జన్యువుల ప్రభావం ఎలా ఉంటుందో విఫులంగా పరిశోధించడం దాదాపు ఇదే మొదటిసారి. దక్షిణ ఇటలీలోని 370 మంది, ఈశాన్య ఇటలీకి చెందిన 843 మంది కాఫీ తాగే అలవాటున్న వారి డీఎన్ఏలోని జన్యువుల క్రమాన్ని శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. పీడీఎస్‌ఎస్ 2 రకం జన్యువు ఉన్నవారు తక్కువ కప్పుల టీ తాగగా ఇది లేని వారు ఎక్కువ కప్పుల టీ తాగుతున్నట్లు తేలింది. నెదర్లాండ్స్‌కు చెందిన 1731 మందిపై కూడా ఈ పరిశోధనలు జరపగా ఒకే రకమైన ఫలితాలు వచ్చాయి. అసలు టీ అనేది తాగడానికి పరిస్థితులు, పరిసరాలు, సంస్కృతి, అలవాటు కారణం అనే విషయం తెల్సిందే. అయితే కాఫీ ఎక్కువ, తక్కువ తాగడానికి మానవ జీర్ణక్రియకున్న ప్రత్యక్ష సంబంధం ఏమిటో తెలుసుకునేందుకు ఈ అంశంలో మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. కాఫీ తాగే అలవాటు మనుషుల్లో ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉంటుందన్న విషయం తెల్సిందే. అమెరికాలో 65 శాతం మంది ప్రజలు రోజుకు ఒక్క కప్పయిన కాఫీ తాగుతారు. -
డీఎన్ఏలో మరో సమాచార వ్యవస్థ
మన శరీర కణాల్లోని క్రోమోజోములపై ఉండే జన్యువులే మన రూపురేఖలు, ఆరోగ్య అంశాలను నిర్ణయిస్తాయని భావిస్తున్నాం. కానీ ఈ నియంత్రణలో ఒక్క జన్యువులే గాకుండా మరో సమాచార వ్యవస్థ కూడా భాగం పంచుకుంటోందని లెయిడెన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ శాస్త్రవేత్తలు గుర్తించారు. శరీరంలోని కణాలన్నింటిలో ఉండే డీఎన్ఏ పోగులు, జన్యువులు ఒకేలా ఉన్నా... ఒక్కో అవయవం ఉత్పత్తి చేసే ప్రొటీన్లు, ఎంజైమ్‌లు వేర్వేరుగా ఎందుకు ఉంటాయన్నది శాస్త్రవేత్తలకు చాలాకాలంగా పజిల్‌గానే ఉంది. జన్యు సమాచారానికి అదనంగా మరో సమాచార వ్యవస్థ ఏదో కణాల్లో ఉండి ఉండాలని కొందరు శాస్త్రవేత్తలు భావించారు. దీనినే లెయిడన్ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అసలు ఈ రెండో సమాచార వ్యవస్థ ఏమిటో తెలుసా? ఒక్కో కణంలోని డీఎన్ఏ ఉండ చుట్టుకుని ఉండే తీరే. ఇలా చుట్టుకుని ఉండడం ద్వారా దానిలో కొన్ని జన్యువుల సమాచారం మాత్రమే చదివేందుకు వీలవుతుందని.. అందుకు అనుగుణంగానే ప్రొటీన్లు, ఎంజైమ్‌ల ఉత్పత్తి జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే కంటిలో ఉండే కణాల్లోని డీఎన్ఏ పోగు అక్కడ అవసరమైన ప్రొటీన్లను ఉత్పత్తి చేసే జన్యువులు మాత్రమే కనిపించేలా ఉండచుట్టుకుని ఉంటే... గుండె కణాల్లో ఆ అవయవానికి తగ్గట్టుగా ముడతలు పడి ఉంటుందన్నమాట! లెయిడెన్ శాస్త్రవేత్తలు కంప్యూటర్ సిమ్యులేషన్ ద్వారా బేకర్ ఈస్ట్, ఫిషన్ ఈస్ట్‌ల డీఎన్ఏలను విశ్లేషించడం ద్వారా ఈ విషయాన్ని నిర్ధారించారు. - సాక్షి, హైదరాబాద్ -
కాలగర్భంలోకి మానవ తొలిజాతి సంస్కృతి
లండన్: తరానికి తరానికే సంస్కృతి, సంప్రదాయాలు మారిపోతున్న నేటి ఆధునిక సమాజంలో ఆదిమ జాతి సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవడం కష్టమే! దక్షిణాఫ్రికాలో నివసిస్తున్న మానవ జాతి పూర్వికుల సంస్కృతి, సంప్రదాయాలు ఈ తరానికే కాకుండా భవిష్యత్తులో మరే తరానికి తెలియకుండా కాలగర్భంలో కలసిపోయే ప్రమాదం ఏర్పడింది. శ్యాన్ తెగగా పిలిచే వీరే మానవ తొలి జాతి వారసులని డీఎన్ఏ పరీక్షల ద్వారా నిపుణులు తేల్చారు. వీరు 20 వేల ఏళ్ల కిందటి నుంచే దక్షిణాఫ్రికా అటవి ప్రాంతంలో నివసిస్తున్నారు. వీరు దక్షిణాఫ్రికా నుంచి బోట్స్వానా, అంగోలా, నమీబియా వరకు విస్తరించి ఉన్నారు. బోట్స్వానాలో వీరిని బసర్వాలని పిలుస్తారు. వీరు సంచార జీవితమే ఎక్కువగా గడుపుతారు. బోట్స్వానా రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో నివసిస్తున్న వీరిని అక్కడి ప్రభుత్వం మైదాన ప్రాంతాలకు తరలిస్తోంది. వారికి పునరావాసం కల్పిస్తోంది. ఆధునిక ఆరోగ్య వసతులతోపాటు పిల్లలకు పాఠశాలలు ఏర్పాటు చేస్తోంది. దీంతో వారి సంస్కృతీ సంప్రదాయాలు పూర్తిగా మారిపోనున్నాయి. శ్యాన్ తెగ పిల్లలు ఇంగ్లీషు చదువులు నేర్చుకుంటే క్రమంగా మారి ఆదిమ భాష కనుమరుగై పోతుంది. ఇప్పటికే వారి నృత్య రీతుల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. వారి సంప్రదాయ కళలు కూడా నశించి పోతున్నాయి. ఎంతో మంది చరిత్రకారులు, కళాకారులు ఆదిమ జాతుల కళలు, సంప్రదాయాలను పరిరక్షించేందుకు కృషి చేస్తున్నా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఎన్నో ఆదిమ జాతుల సంస్కృతీ సంప్రదాయాలు కనుమరుగయ్యాయి. ఎప్పటికో ఓ నాటికి అంతరించిపోయే సంస్కృతిని మనం క్రియాశీలకమని గుర్తించాలని, అప్పుడే అది ఏదో రూపంలో బతికి ఉంటుందని లండన్‌లోని బోట్స్వానా హై కమిషన్‌లో పనిచేసిన బిహేలా సెకిరే వ్యాఖ్యానిస్తున్నారు. -
33 ఏళ్ల తర్వాత తెలిసింది.!
వాషింగ్టన్: చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్న అమెరికా పౌరుడికి ఎట్టకేలకు విముక్తి లభించింది. ఓ మహిళను పిల్లలు నిద్రపోతున్న సమయంలో రేప్ చేసి, ఆమె భర్తను క్రూరంగా చంపాడనే కేసులో హార్వాడ్(59)కు కోర్టు జీవితకాల జైలు శిక్షను విధించింది. 1982లో ఈ ఘటన జరిగింది. నిందితుడికి డీఎన్ఏ పరీక్షను నిర్వహించి బాధితురాలి ఒంటిపై ఉన్న పంటి గుర్తులతో సరిపోలడంతో దోషిగా తేల్చారు. కాగా 33 ఏళ్ల తర్వాత డీఎన్ఏ ఫలితాలను మరోసారి చూసినపుడు అసలు విషయం వెలుగు చూసింది. నేరం చేసింది వేరొక వ్యక్తి అని, అతను జైలు శిక్షను అనుభవిస్తూ మరణించాడని తేలడంతో హార్వాడ్ ను విడుదల చేయాలని వర్జీనియా సుప్రీంకోర్టు ఆదేశించింది. కేవలం 2015లోనే అమెరికాలో చేయని నేరానికి శిక్షను అనుభవిస్తున్న 149 మందిని అక్కడి కోర్టులు నిర్దోషులుగా విడుదల చేశాయి. వీరందరూ సగటున 14.5 సంవత్సరాల శిక్షను అనుభవించినవారే. -
ప్రాచీన మమ్మీ నుంచి డీఎన్ఏ సేకరణ
పరిశోధకులు మొదటిసారి 300 ఏళ్ళనాటి ప్రాచీన డీఎన్ఏ అవశేషాలను కనుగొన్నారు. దక్షిణాఫ్రికాలోని ఓ మమ్మీనుంచి విజయవంతంగా ప్రాచీన డీఎన్ఏ ను వెలికి తీశారు. ముందుగా మమ్మీకి కంప్యూటరరైజ్జ్ టోమోగ్రఫీ (సీటీ స్కాన్) నిర్వహించి డీఎన్ఏ అవశేషాలను గుర్తించారు. అనాటమికల్ సైన్సెస్ స్కూల్ ప్రొఫెసర్ మెరీనా స్టెయిన్... స్విట్జర్లాండ్ లోని జురిచ్, ప్రెటోరియా, బోట్స్వానా విశ్వవిద్యాలయాలనుంచి వచ్చిన ఇతర అధ్యయనకారుల బృందంతో కలసి ఈ తాజా అధ్యయనాలు నిర్వహించారు. తులిబ్లాక్ కు చెందిన ఇనుప యుగంనాటి మమ్మీపై జరిపిన జన్యు విశ్లేషణ పరిశోధనా ఫలితాలను సౌతాఫ్రికాలోని బోట్స్వానా సైన్స్ జర్నల్ లో ప్రచురించారు. తాజాగా కనుగొన్న ప్రాచీనకాలంనాటి మమ్మీ అవశేషాలు.. అప్పటి జనాభాకు సంబంధించిన విలువైన సమాచారాన్ని తెలిపేందుకు మంచి వనరుగా ఉపయోగిస్తాయని పరిశోధకులు అంటున్నారు. అయితే పరిశోధనలు జరిపిన మమ్మీ.. తులి ప్రాంతానికి చెందిన వ్యక్తిదిగా మొదట్లో భావించిన పరిశోధకులు... అనంతరం మమ్మీ అవశేషాలను బట్టి ఆఫ్రికన్ మాలాలు కలిగిన పురుషుడికి చెందినదిగా గుర్తించారు. అతడి మమ్మీ కదలసి స్థితిలో ఉండి, జంతు చర్మంతో చుట్టి, తాళ్ళతో గట్టిగా కట్టి ఉన్నట్లు పరిశోధనా ఫలితాల్లో ప్రచురించారు. మమ్మీలోని అంతర్గత అవయవాలు ఏవీ సురక్షితంగా లేవని సీటీ స్కాన్ ద్వారా తెలుసుకున్న పరిశోధక బృదం... అనేక పోస్టు మార్టం లను కూడ నిర్వహించి వెన్నెముక కింది భాగంలో కొన్నిప్రమాదకర మార్పులు చోటు చేసుకున్నట్లు గుర్తించారు. అస్థిపంజరం మాత్రం చెక్కు చెదరకుండా ఉందని తెలుసుకున్నారు. అయితే వెన్నెముకలో కనిపించిన మార్పులను బట్టి చూస్తే వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తిలా కనిపించిందని, అతడి మరణం ఎప్పుడు జరిగింది, ఏ కారణంగా జరిగింది అన్న వివరాలు ధృవీకరించడం సాధ్యం కాలేదని వెల్లడించారు. శరీరంలో ఎలాంటి గాయాలు ఉన్నట్లు కూడ కనిపించలేదని చెప్పారు. అయితే విజయవంతంగా తాము కనుగొన్న డీఎన్ ఏ విశ్లేషణను బట్టి ఆ వ్యక్తి సోతో సెటస్వానా లేదా ఖోయెసాన్ ప్రాంతానికి చెందిన వాడిగా నిర్థారించవచ్చని పరిశోధకులు చెప్తున్నారు. -
'నాపై చర్య తీసుకునే దమ్ము ఎవరికీ లేదు'
న్యూఢిల్లీ: బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి శత్రుఘ్నసిన్హా మరోసారి పార్టీ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. ఇటీవలే జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పార్టీ పెద్దలు తనను పక్కన బెట్టడంపై ఆయన ఇంకా సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. తనపై, కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి, పార్టీ ఎంపీ ఆర్కే సింగ్‌పై చర్యలు తీసుకునే అధికారం బీజేపీలో ఎవరికి లేదంటూ శత్రుఘ్నసిన్హా మండిపడ్డారు. పార్టీ ఓటమికి సమిష్టి బాధ్యత వహించాలన్న అగ్రనేతల నిర్ణయాన్ని ఆయన మరోసారి తోసిపుచ్చారు. బిహార్ ఎన్నికల ఓటమికి బాధ్యులైనవారే అందుకు గల కారణాలు వెల్లడించాలని శత్రుఘ్నసిన్హా పేర్కొన్నారు. బిహారీ 'సింహం' ఆర్కే సింగ్ చెసిన వ్యాఖ్యల్లో తప్పు లేదన్నారు. మా ఇద్దరిపై చర్యలు తీసుకోవడం, మందలించే అధికారం, ధైర్యం పార్టీకి చెందిన నేతల ఎవరి డీఎన్ఏలోనూ లేదంటూ విరుచుకుపడ్డారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో క్రిమినల్స్‌కు పార్టీ టిక్కెట్లు ఇచ్చారని వ్యాఖ్యానించారన్న కారణంగా బీజేపీ జాతీయ కార్యదర్శి రామ్‌లాల్ పార్టీ ఎంపీ శత్రుఘ్నసిన్హాకు సమన్లు జారీ చేసిన విషయం విదితమే. స్థానిక నేతలను పక్కనపెట్టి, స్థానికేతరులతో ప్రచారం చేయించినందునే బిహార్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైందని ఆయన వ్యాఖ్యానించారు. బిహార్ ఎన్నికల్లో మహాకూటమి ఘనవిజయం సాధించిన విషయం అందరికీ విదితమే. -
గర్భంలోనే పసిగట్టొచ్చు..
వాషింగ్టన్: గర్భస్థ శిశువులోని జన్యువుల పరిస్థితి, బ్లడ్ గ్రూప్, లింగత్వం, డీఎన్ఏ వంటివి నిర్ధారించేందుకు కచ్చితమైన, తక్కువ ముప్పు ఉండే రక్త పరీక్షను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇంగ్లండ్‌లోని ‘ప్లైమౌత్ యూనివర్సిటీ’కి చెందిన నీల్ అవెంట్ సారథ్యంలో ఈ పద్ధతిని కనుగొన్నారు. ప్రస్తుతం చేస్తున్న పరీక్ష (ఆమ్నియోసెంటెసిస్) ద్వారా గర్భ స్రావం అయ్యే అవకాశం (ఒక్క శాతం)ఉండటంతో ఎంతో మంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. దీంతో తక్కువ ఖర్చు, తక్కువ హానికరమైన పరీక్ష ప్రవేశపెట్టారు. ఈ పరీక్ష ద్వారా తల్లి నుంచి సంక్రమించే జన్యు సంబంధ వ్యాధులను బిడ్డ పుట్టక ముందే గుర్తించవచ్చు. ఈ పరీక్ష కోసం రక్తాన్ని గర్భం దాల్చిన మొదట్లోనే తల్లి నుంచి సేకరిస్తారు. అంతే కాకుండా తల్లి నుంచి సేకరించిన రక్తం ద్వారా దాదాపు 10 ఏళ్ల వరకు పుట్టబోయే బిడ్డ బ్లడ్ గ్రూప్, జన్యువుల పై అధ్యయనం చేయవచ్చు. ఈ పద్ధతి ద్వారా బిడ్డ డీఎన్ఏను కచ్చితంగా నిర్ధారించవచ్చు. -
డీఎన్ఏ శోధనకు నోబెల్
స్వీడన్, అమెరికా, టర్కిష్ అమెరికన్ శాస్త్రవేత్తలకు రసాయనశాస్త్ర బహుమతి స్టాక్‌హోమ్: దెబ్బతిన్న డీఎన్ఏను మానవ శరీరం స్వయంగా ఎలా మరమ్మతు చేసుకుంటుందనే అంశంపై పరిశోధన చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది రసాయన నోబెల్ వరించింది. స్వీడన్‌కు చెందిన థామస్ లిండాహ్, అమెరికాకు చెందిన పాల్ మాడ్రిక్, టర్కిష్ అమెరికన్ అజీజ్ సంకార్‌లకు సంయుక్తంగా నోబెల్ అందజేయనున్నట్లు రాయల్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ బుధవారం తెలిపింది. జీవకణాల పనితీరు ఏ విధంగా ఉంటుందనేది వీరి పరిశోధనతో వెల్లడైందని పేర్కొంది. వారసత్వంగా జన్యులోపాల వల్ల వచ్చే ఎన్నో రకాల వ్యాధులకు చికిత్సను, ఔషధాలను రూపొందించడానికి అది తోడ్పడిందని పేర్కొంది. సాధారణంగా శరీరంలో కణ విభజన జరిగినప్పుడు, తీవ్రమైన సూర్యరశ్మి వంటి బాహ్యకారణాలతో కణాల్లోని డీఎన్ఏ దెబ్బతింటుంది. ఇలా దెబ్బతిన్న డీఎన్ఏను కణాల్లో ఉండే కొన్ని ప్రొటీన్లు మరమ్మతు చేస్తాయి. తద్వారా ఆ జీవకణం తిరిగి ఆరోగ్యవంతం అవుతుంది. ఈ డీఎన్ఏ మరమ్మతు ప్రక్రియను లిండాహ్, పాల్ మాడ్రిక్, అజీజ్ గుర్తించారు. టర్కీలోని సావర్‌లో జన్మించి అమెరికాకు వలస వెళ్లిన లిండాహ్.. అల్ట్రా వయోలెట్ రేడియేషన్ ద్వారా డీఎన్ఏ మరమ్మతు ప్రక్రియను గుర్తించారు. మాడ్రిక్ ఆ సంక్లిష్లమైన విధానాన్ని అధ్యయనం చేశారు. ఈ విజేతలు ముగ్గురికీ కలిపి దాదాపు రూ. 6.17 కోట్లు బహుమతిగా అందజేస్తారు. ఇక నోబెల్ పురస్కారాల్లో భాగంగా గురువారం సాహిత్యం విభాగంలో, శుక్రవారం శాంతి విభాగంలో, సోమవారం ఆర్థిక విభాగంలో బహుమతులను ప్రకటించనున్నారు. మరమ్మతు మెకానిక్‌లు మీరెంత పొడవు పెరగాలో... మీకు ఏఏ వ్యాధులు వచ్చే అవకాశముందో.. అన్నీ మీరు పుట్టకముందే నిర్ణయమైపోతాయి! మీ శరీరంలోని ప్రతి కణంలోని డీఎన్ఏలో ఈ సమాచారం ఉంటుంది. అయితే వేర్వేరు కారణాల వల్ల ఈ డీఎన్ఏలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. సూర్యుడి అతినీలలోహిత కిరణాలతోపాటు ధూమపానం, పలు రసాయనాలు శరీరంలోకి చేరడం వల్ల డీఎన్ఏలో వచ్చే మార్పుల ఫలితంగా వ్యాధులు వచ్చే అవకాశముంటుంది. అదృష్టవశాత్తూ మన శరీరంలోని కొన్ని ఎంజైమ్‌లు, ప్రొటీన్లు ఈ మార్పులపై నిత్యం ఓ కన్నేసి ఉంటాయి. అంతేకాదు వాటిని మరమ్మతు చేస్తూంటాయి కూడా. ఇదెలా జరుగుతుందో గుర్తించిన శాస్త్రవేత్తలు థామస్ లిండాల్, పాల్ మాడ్రిక్, అజీజ్ సంకార్‌లకు ఈ ఏడాది రసాయన శాస్త్ర నోబెల్ అవార్డు దక్కింది. - సాక్షి, హైదరాబాద్ ►46 ప్రతీ కణంలో ఉండే క్రోమోజోమ్‌ల సంఖ్య ►డీఎన్ఏ రసాయనిక నిర్మాణంలో ఒక్కో బ్లాకును ఏ, సీ, టీ, జీలుగా వ్యవహరిస్తారు ►23 తల్లిదండ్రుల్లో ఒక్కొక్కరి నుంచి వచ్చే క్రోమోజోమ్‌ల సంఖ్య ►మొత్తం 300 కోట్ల బ్లాకులతో మానవుని జీనోమ్ నిర్మితమై ఉంటుంది ►{పతి క్రోమోజోమ్లోనూ దాదాపు రెండు మీటర్ల పొడవున్న డీఎన్ఏ ఉండచుట్టుకుని ఉంటుంది. ►అడినైన్ (ఏ) థమమీన్ (టీ), గ్వానైన్ (జీ), సైటోసైన్ (సీ) అనే నాలుగు రసాయనాలతో డీఎన్ఏ ఏర్పడుతుంది. డీఎన్ఏ ఆకారం మెలితిరిగిన నిచ్చెన మాదిరిగా ఉంటుంది. దీంట్లోని మెట్లలో ఇరువైపులా రెండు రసాయనాలు ఉంటాయి. ► గ్వానైన్ - సైటోసైన్, అడినైన్ -థయమీన్లు డీఎన్ఏ పొడవునా వరుసగా ఉంటాయి. ఒక్కోదాన్ని ఒక బేస్పెయిర్ అంటారు. లిండాల్ పరిశోధన ►కణ విభజన సమయంలో డీఎన్ఏ రెండు పోగులుగా విడిపోతుంది. సరిగ్గా మ్యాచింగ్‌తో కలసిపోయి కొత్త కణంలో పూర్తిస్థాయి డీఎన్ఏ ఏర్పడుతుంది. ►ఈ క్రమంలో ఒక్కోసారి డీఎన్ఏలోని సైటోసైన్లో కొన్ని మార్పులు వచ్చి యురాసిల్ అనే కొత్త రసాయనం ఏర్పడుతుంది. ►గ్లైకోసైలేస్ అనే ప్రత్యేకమైన ఎంజైమ్ ఈ తేడాను గుర్తించి యురాసిల్ను కత్తిరిస్తుంది. అదేసమయంలో మరికొన్ని ఎంజైమ్‌లు యురాసిల్ స్థానంలో నిరపాయకరమైన కొన్ని ఇతర రసాయనాలను చేరుస్తాయి. అజీజ్ సంకార్ గుర్తించింది ఇదీ... సూర్యుడి అతినీలలోహిత కిరణాలు, సిగరెట్ పొగలోని కేన్సర్ కారకాల వల్ల డీఎన్ఏలో వచ్చే మార్పులు వాటంతట అవే ఎలా మరమ్మతు అవుతాయో అజీజ్ సంకార్ గుర్తించారు. ► అతినీల లోహిత కిరణాలు డీఎన్ఏ పోగులోని రెండు థయమీన్ అణువుల మధ్య రసాయన బంధం ఏర్పడేలా చేస్తాయి. ► ఎక్సిన్యూక్లియేస్ అనే ఎంజైమ్ ఈ మార్పును గుర్తిస్తుంది. వెంటనే డీఎన్ఏ పోగును కత్తిరించి, 12 న్యూక్లియోటైడ్లను తొలగిస్తుంది. ► ఫలితంగా ఏర్పడ్డ ఖాళీని డీఎన్ఏ పాలిమరేస్ అనే పదార్థం పూరిస్తుంది. ఆ వెంటనే డీఎన్ఏ లిగేస్ అనే రసాయనం పాలిమరేస్లోని థయమీన్ను, దిగువభాగంలోని అడినైన్లను కలిపేస్తుంది. దీంతో మరమ్మతు పూర్తవుతుంది. పాల్ మాడ్రిక్ ఏం చేశారు... ► కణం రెండుగా విభజితమైనప్పుడు కొన్నిసార్లు సహజసిద్ధంగానే వాటిల్లోని బేస్పెయిర్లలో తేడాలు నమోదవుతూంటాయి. అంటే అడినైన్ థయమీన్‌తో కాకుండా మరో రసాయనంతో జతకడుతుందన్నమాట. ► ఈ తేడాలను మ్యూట్ ఎస్, మ్యూట్ ఎల్ అనే ఎంజైమ్‌లు గుర్తిస్తాయి. ►ఇంకో ఎంజైమ్ సరైన బేస్‌పెయిర్‌ను గుర్తించి మోసుకొస్తే... మ్యూట్ ఎస్ తేడాగా ఉన్న బేస్‌పెయిర్‌ను కత్తిరిస్తుంది. ► డీఎన్ఏ పాలిమరేస్, డీఎన్ఏ లిగేస్ల సాయంతో తేడాల్లేని డీఎన్ఏ పోగు, వాటిమధ్య రసాయన బంధం ఏర్పడుతుంది. -
'దాని గురించి పట్టించుకోనవసరం లేదు'
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ డీఎన్ఏపై తప్పుడు ఉద్దేశంతో వ్యాఖ్యలు చేశారని నేను భావించడం లేదని, అయినా.. ఆ మాటలు పెద్దగా పట్టించుకోనవసరం లేదని బీజేపీ సీనియర్ నేత శత్రఘ్నసిన్హా అన్నారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన మాట్లాడారు. ఇటీవల నితీశ్‌కుమార్‌తో, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో సమావేశమవడాన్ని ఆయన సమర్థించుకున్నారు. స్నేహాన్ని, మిత్రులను రాజకీయాలతో ముడిపెట్టకూడదని చెప్పారు. నితీశ్ కుమార్ తనకు మంచి మిత్రుడని, మంచి ముఖ్యమంత్రుల్లో ఆయన ఒకరని చెప్పారు. ప్రధాని మోదీ కేబినెట్లోకి మిమ్మల్ని తీసుకోకపోవడం పట్ల అసంతృప్తితో ఉన్నారా అని ప్రశ్నించగా.. ఒక్క అనుభవం మాత్రమే ఉంటే ప్రధాని కేబినెట్లో చోటుదక్కుతుందని తాను అనుకోవడం లేదని చెప్పారు. -
ఆ అవశేషాలు షీనా బోరావేనా ?
ముంబై: దాదాపు మూడేళ్ల క్రితం రాయ్‌గఢ్ జిల్లాలో దొరికిన గుర్తు తెలియని శవం అవశేషాలు షీనా బోరావేనా ? అయితే వాటిని ఎలా గుర్తించడం ? సాధారణంగా తల్లిదండ్రులు, వారి ఇతర సంతానం డీఎన్ఏలతో అవశేషాల నుంచి తీసిన డీఎన్ఏను పోల్చి గుర్తిస్తారు. సర్వ సాధారణంగా ముక్కలు ముక్కలుగా నరికిన శవం నుంచి డీఎన్ఏను గుర్తించడం దాదాపు అసాధ్యమని ఫోరెన్సిక్ నిపుణులు చెబుతున్నారు. అలాంటప్పుడు మరెలా ఆ అవశేషాలు షీనా బోరావేనా, కాదా ? అన్న అంశాన్ని ఎలా తేల్చాలి ? షీనా బోరా ఇప్పటికీ బతికే ఉందని, అమెరికాలో ఉంటోందని సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితురాలైన ఇంద్రాణి పోలీసు ఇంటరాగేషన్‌లో మాటమార్చిన నేపథ్యంలో ఈ ప్రశ్నకు మరింత బలం చేకూరింది. ప్రతి మనిషికి ప్రత్యేకమైన పలు వరుస ఉంటుంది. ఆ పలు వరుస ద్వారాగానీ, 2డీ లేదా 3డీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ముఖాన్ని పునర్నిర్మించి కచ్చితంగా గుర్తించవచ్చని ఫోరెన్సిక్ నిపుణలు చెబుతున్నారు. అనుమానిత స్కల్పై ముఖం ఫైల్ ఫొటోను సూపర్ ఇంపోజ్ చేసి కూడా గుర్తించవచ్చని వారు అంటున్నారు. ఒకప్పుడు సంచలనం సృష్టించిన నిఠారి హత్య కేసుల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న 19 మంది పిల్లల కపాలాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించి అక్కడ ముఖ పునర్నిర్మాణం ద్వారా 16 మంది పిల్లలను కచ్చితంగా గుర్తించారు. అదే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇక్కడ కూడా ఉపయోగించవచ్చని నిపుణులు తెలియజేశారు. నోయిడా పోలీసులు 2006లో చండీగఢ్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించగా అక్కడి డాక్టర్లు డాక్టర్ సంజీవ్, డాక్టర్ రాజీవ్ గిరోటి (డీఎన్ఏ) నిపుణులు కంప్యూటర్ సూపరింపోజ్, 3డీ ద్వారా ముఖాలను పునర్నిర్మించి ఆ కపాలాలు ఎవరివో గుర్తించారు. ప్రస్తుతం షీనా బోరాగా భావిస్తున్న అవశేషాలను 2012, మే 23వ తేదీన రాయ్‌గఢ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో స్కల్, ఎముకలు, పంటి శాంపిల్స్‌ను ముంబైలోని జేజే ఆస్పత్రికి పంపించారు. ఎలాంటి మిస్సింగ్ కేసు దాఖలు కాకపోవడం, దర్యాప్తు ముందుకు సాగకపోవడం ఆ అవశేషాలు చాలాకాలం జేజే ఆస్పత్రిలోనే ఉండిపోయాయి. అనంతరం వాటిని ఆస్పత్రి వర్గాలు తిరిగి ముంబై పోలీసులకు అప్పగించారు. అవి, ముఖ్యంగా స్కల్, పను వరుస ఇప్పటికీ భద్రంగా ఉన్నాయని షీరా బోరా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు తెలియజేస్తున్నారు. పంటి వరుస ద్వారా ఆ అవశేషాలు షీనా బోరావేనా ? అన్న విషయాన్ని గుర్తించాలంటే ఆమె ఎప్పుడైన డెంటిస్ట్ దగ్గరికి వెళ్లారా? అన్న విషయం తేలాలి. వెళ్లినట్టయితే అక్కడ అందుకు సంబంధించిన రికార్డులు ఉండాలి. అలా లేనప్పుడు 2 డీ లేదా 3డీ లేదా కంప్యూటర్ సూపర్ ఇంపోజ్ ద్వారా స్కల్‌ను ముఖంగా మార్చి గుర్తించడమే ప్రత్యామ్నాయ మార్గాలు. ఆ సాంకేతిక పరిజ్ఞానం అన్ని ఆస్పత్రుల్లో అందుబాటులో లేదు. ముంబైలోని కెమ్ ఆస్పత్రి, చండీగఢ్‌లోని ఎఫ్ఎస్ఎల్ ఆస్పత్రిలో మాత్రమే ఉంది. -2డీ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ముఖాన్ని పునర్నిర్మించాలంటే: అనుమానిత వ్యక్తి ఫొటోలు కావాలి. స్కల్ కావాలి. ఒక చిత్రకారుడు, ఓ ఫోరిన్సెక్ ఆంత్రోపాలజిస్ట్ కలసి ముఖాన్ని పనర్నిర్మిస్తారు. కొన్ని సందర్భాల్లో స్కల్ రేడియో గ్రాఫ్‌లను కూడా వినియోగిస్తారు. -3డీ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ముఖాన్ని పునర్నిర్మించాలంటే: బంకబట్టి, ఇతర పదార్థాలను ఉపయోగించి స్కల్‌ను ముఖ విగ్రహంగా మలుస్తారు. దీనికోసం హై రెసల్యూషన్గల త్రీ డెమైన్షనల్ కంప్యూటర్ చిత్రాలను ప్రాతిపదికగా తీసుకుంటారు. ఇందులోనూ చిత్రకారుడు, ఫోరెన్సిక్ ఆంత్రోపాలజిస్ట్ పరస్పర సహకారం అవసరం. ఇదివరకు 2డీ, కంప్యూటర్ చిత్రాల ద్వారా విడివిడిగా ముఖాలను పునర్నిర్మించేవారు. ఇప్పుడు 3డీ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో కంప్యూటర్ చిత్రాలను, 3డీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏకకాలంలో ఉపయోగించి ముఖాలను పునర్నిర్మిస్తున్నారు. -
మోదీ డీఎన్ఎ వ్యాఖ్యలపై దుమారం
-
‘డీఎన్ఏ’ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
పట్నా: ‘మీ డీఎన్ఏలో ఏదో సమస్య ఉంద’ని ప్రధాని మోదీ తనపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని బిహార్ సీఎం నితీశ్‌కుమార్ డిమాండ్ చేశారు. లేకపోతే ‘శబ్ద వాపసీ’ పేరిట ఉద్యమం ప్రారంభిస్తామని, 50 లక్షల మంది డీఎన్ఏ శాంపిళ్లను పరీక్షల కోసం ప్రధాని మోదీకి పంపుతామని ప్రకటించారు. ఈ అంశంలో మోదీపై ఒత్తిడి పెంచేందుకు నాలుగైదు స్వాభిమాన్ ర్యాలీలను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇందులో మొదటి ర్యాలీని ఈ నెల 29న పట్నాలో నిర్వహిస్తామన్నారు. మోదీ చేసిన డీఎన్ఏ వ్యాఖ్యలు బిహార్ ప్రజలను అవమానించడమే అని ఆయన మండిపడ్డారు. బిహార్‌లో జేడీయూ-ఆర్జేడీలది అవకాశవాద కూటమి అని ఆదివారం ప్రధాని మోదీ విమర్శలు చేసిన నేపథ్యంలో నితీశ్ ట్విటర్లో మోదీని విమర్శించారు. -
ప్రధానికి 50 వేల డీఎన్ఏలు!
పాట్నా: తన డీఎన్ఏలో ఏదో తేడా ఉందని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించడం పట్ల బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. మోదీ వెంటనే తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వస్తున్న ఆయన ఇప్పుడు ఏకంగా 50 వేలమంది బీహారీల డీఎన్ఏలను మోదీకి పంపిస్తామని, కావాలంటే వాటన్నింటిని పరీక్ష చేసి చూసుకోవాలని హితవు పలికారు. తనపై అనవసర ఆరోపణలు చేసిన నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో భాగంగా తాము 50 వేలమంది డీఎన్ఏలను ప్రధాని మోదీకి పంపించాలనుకుంటున్నామని సోమవారం ఉదయం ట్విట్టర్లో ట్వీట్ చేశారు. గత వారం మోదీ బీహార్‌లోని ముజఫర్ పూర్ పర్యటనలో పాల్గొన్న సందర్భంలో మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో తోటి నాయకులను గౌరవించే అలవాటు ఇతర నేతలకు ఉంటుందని, కానీ నితీశ్‌లో మాత్రం అలాంటి లక్షణాలు కనిపించడం లేదని, ఆయన డీఎన్ఏలో ఏదో లోపం ఉందని ఆరోపించారు. దీనిపై నితీశ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. -
నాతోపాటూ...రాష్ట్రాన్నీ అవమానించారు
పట్నా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనపై చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి ఆయన ఒక బహిరంగ లేఖను బుధవారం ట్విట్టర్లో సంధించారు. ఇటీవల సోషల్ మీడియాలోకి ఎంటరైన నితీష్ కుమార్ తన ట్విట్టర్లో ఈ లేఖను పోస్ట్ చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్బంగా మోదీ తనపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధాని చేసిన వ్యాఖ్యలతో తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా రాష్ట్ర ప్రజలను కూడా అవమానించారని ఆరోపించారు. ఇప్పటికైనా మోదీ తన డీఎన్ఎ గురించి చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని నితీష్ కుమార్ డిమాండ్ చేశారు. లేదంటే బీహార్ ప్రజలు ఆయనను క్షమించరని లేఖలో పేర్కొన్నారు. మోదీ మాటలు తమలో చాలామందికి బాధ కలిగించాయని నితీష్ కుమార్ పేర్కొన్నారు. తాను బీహార్ బిడ్డననీ, బీహార్ ప్రజల డీఎన్ఎ తన డిఎన్ఎ ఒకటేనని స్పష్టం చేశారు. తన డీఎన్ఎ గురించి వ్యాఖ్యానించి బీహార్ ప్రజలను కూడా అవమానించారని మండిపడ్డారు. తమ పార్టీని బీహార్ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించారని గుర్తుచేశారు. గత నెలలో బీహార్‌లో పర్యటించిన ప్రధాని నరేంద్రమోదీ సీఎం నితీష్‌పై విమర్శలు గుప్పించారు. ఆయన (నితీష్్) జితేన్ రామ మాంఝీ లాంటి మహాదళితుణ్ని అవమానించడంద్వారా, నన్ను కూడా అగౌరవపర్చారని మోదీ వ్యాఖ్యానించారు. బహు శా ఆయన డిఎన్ఎలోనే ఏదో లోపముంది... భారతదేశంలోని ప్రజాస్వామ్యం వ్యవస్థలో ప్రతిపక్ష నాయకులను కూడా గౌరవించే సంస్కృతి ఉందని విమర్శించిన సంగతి తెలిసిందే. Sharing my Open Letter to @NarendraModi about his comment on my DNA http://t.co/x1qypoZEus pic.twitter.com/dFekhbpLjI — Nitish Kumar (@NitishKumar) August 5, 2015 -
ద్రవమూ ఘనమూలాంటి జీవితం
మంచి కథ జీవితమంటే ఏమిటి? సాధువులు, సన్యాసులు, దొంగలు, పెద్ద మనుషులతో సహా ఎవడికీ సమాధానం తెలియదు. శిశువులు, పిచ్చివాళ్లకు మాత్రమే తెలిసుండొచ్చు, కానీ వాళ్లు చెప్పేది అర్థం కాదు. డీఎన్ఏ లాగా ఏ ఒక్కడి జీవితమూ ఇంకొకడిని పోలి లేదు. ఎక్కడికో తెలియకపోయినా ఎందుకైనా మంచిదని అందరూ పరిగెత్తుతున్నారు. ఈ వేగంలో రచయితలు కూడా గందరగోళంలో ఉన్నారు. తాను పరిగెత్తుతూ పరిగెత్తేవాడిని పరిశీలించాలి. ఇది షేర్ ఆటోలో వేలాడ్డానికి మించిన కష్టం. కథలు రాసేవాళ్లూ చదివేవాళ్లూ తగ్గిపోయారని అంటున్నారు. నిజమే తుక్కు రాసేవాళ్లూ చదివేవాళ్లూ తగ్గిపోయారు. మంచి కథకులు, చదువరులు ఇంకా ఉన్నారు. వాళ్లెప్పుడూ అల్ప సంఖ్యాకులే! 2014 ‘ప్రాతినిధ్య’ కథల సంపుటిలో వంశీధర్‌రెడ్డి ‘ఐస్‌క్యూబ్’కథ ఉంది. ఏకకాలంలో ద్రవ పదార్థంగానూ, ఘనంగానూ ఉండటమే ఐస్‌క్యూబ్ ప్రత్యేకత. జీవితం కూడా అంతే. గడ్డ కడుతూ కడుతూ కరిగిపోతుంది. ఎప్పుడూ ఏదో ఒక సందర్భాన్ని ఎదుర్కోవడంలోనే జీవితం గడిచిపోతూ ఉంటుంది. ఈ కథలో ఏముంది? ఒక కుర్రాడు, కాస్త మందు తాగుతాడు, ఎవరో చనిపోతే హాజరవుతాడు, ఎప్పుడో విడిపోయిన గర్ల్‌ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది. ఆమె గురించి ఆలోచనలు. చివరికి ‘ఒకటే జీవితం, ఏం చేసినా ఇప్పుడే, కానీ మనల్నే జీవితం అనుకునేవాళ్లని మోసం చేయడం కరెక్టేనా?’ అనుకోవడంతో కథ అయిపోతుంది. చైతన్యస్రవంతి పద్ధతిలో సాగే ఈ కథలో నగర జీవితానికి సంబంధించిన బోలెడన్ని షేడ్స్ ఉన్నాయి. తండ్రిని వెంటిలేటర్‌పై ఉంచి ఆస్తి వ్యవహారాలన్నీ చక్కదిద్దుకుని, తనకూ తన భార్యకూ సెలవు దొరికినప్పుడు వెంటిలేటర్ తీసేసి అంత్యక్రియలు చేసిన కొడుకున్నాడు(నిజానికి ఇది వేరే కథ). చాలా రోజుల తర్వాత గర్ల్‌ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఇంటికి ప్లాన్ ఫ్రీగా అడుగుతుందేమోనని భయపడే కుర్రాడు. డబ్బులడుగుతుందనే భయం కూడా! చాలాకాలం తర్వాత ఎవరైనా స్నేహితులు ఫోన్ చేస్తే అందరిలోనూ ఇప్పుడు ఇవే భయాలు. స్త్రీ పురుష సంబంధాలపై సున్నితమైన విశ్లేషణ, అంతర్లీన హాస్యం ఉన్నాయి కథలో. గర్ల్‌ఫ్రెండ్‌తో ఒకరాత్రి గడిపేంత దూరం పోయిన ఆలోచనలు మళ్లీ వెనక్కి వస్తాయి. తనకే గుర్తులేని పుట్టినరోజుని భార్య సెలబ్రేట్ చేస్తున్నప్పుడు ఆ అపస్మారక స్థితి నుంచి బయటికొస్తాడు. రిలేషన్స్, కాంప్లికేషన్స్ ఈ రెంటికీ అర్థం ఒకటే అవుతున్న తరుణంలో ఐస్‌క్యూబ్ మంచి కథ. డా॥వంశీధర్ రెడ్డి -
డీఎన్ఏ.. అంతరిక్షంలోనూ చెక్కుచెదరదు!
లండన్: జీవుల జన్యు సమాచారాన్ని నిక్షిప్తం చేసుకుని ఉండే ‘డీఎన్ఏ’ జన్యు పదార్థం అంతరిక్షంలోని తీవ్ర ప్రతికూల వాతావరణంలోనూ చెక్కు చెదరదట. గురుత్వాకర్షణ లేమి పరిస్థితులకు గురై, అంతరిక్షం నుంచి తిరిగి భూమికి వచ్చినా దానిలోని జన్యు సమాచారం నిక్షేపంగా ఉంటుందట. స్విట్జర్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ జూరిచ్ శాస్త్రవేత్తలు ఇటీవల నిర్వహించిన ప్రయోగంలో ఈ విషయం వెల్లడైంది. రోదసిలోని ప్రతికూల పరిస్థితులను డీఎన్ఏ తట్టుకుంటుందా? అన్న కోణంలో పరిశోధనలు చేస్తున్న వీరు.. ‘టెక్సస్-49’ రాకెట్‌ను ప్రయోగించారు. ఈ రాకెట్ పైభాగంలో బయటి కవచంలో బ్యాక్టీరియా, ప్లవకాలకు చెందిన డీఎన్ఏను అమర్చి పంపారు. రాకెట్ నింగికి వెళ్లేటప్పుడు వెయ్యి డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత బయటి కవచాన్ని తాకింది. పేలోడ్ రోదసికి వెళ్లాక గురుత్వాకర్షణలేమికి గురైంది. తిరిగి అత్యధిక వేడిని, పీడనాన్ని తట్టుకుంటూ భూవాతావరణంలోకి ప్రవేశించింది. చివరగా భూమికి చేరిన పేలోడ్‌లోని డీఎన్ఏ నమూనాలను పరీక్షించగా, సగం నమూనాలు చెక్కుచెదరకుండా ఉన్నట్లు గుర్తించారు. దీంతో.. జీవుల పుట్టుకకు అత్యవసరమైన ప్రాథమిక అణువులు, నీరు మన భూమిపైకి ఉల్కలు, తోకచుక్కల ద్వారానే చేరి ఉంటాయన్న వాదనకు మరింత బలం చేకూరింది. -
మా డీఎన్ఏలోనే శాంతి, అహింస
-
మా డీఎన్ఏలోనే శాంతి, అహింస
టోక్యో: జపాన్ పర్యటనను అత్యంత విజయవంతమైన పర్యటనగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ అభివర్ణించారు. జపాన్ హామీ ఇచ్చిన 3.5 ట్రిలియన్ డాలర్ల( రూ. 2.12 లక్షల కోట్లు)సాయంతో భారత్‌లో మౌలిక వసతుల కల్పన మెరగుపడుతుందని, దేశాన్ని పరిశుభ్ర భారత్‌గా మార్చడం సాధ్యమవుతుందని అన్నారు. రానున్న ఐదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేటు నిధుల ద్వారా ఈ సాయం భారత్‌కు అందనుందని తెలిపారు. స్మార్ట్ సిటీల నిర్మాణం, గంగానదిని శుద్ధి చేయడం సహా పలు కార్యక్రమాల అమలుకు ఆ మొత్తాన్ని ఉపయోగిస్తామన్నారు. పర్యటనలో నాలుగో రోజు మంగళవారం ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చివరగా జపాన్‌లోని భారతీయులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ చేసిన ప్రసంగంలో.. హెచ్ఏఎల్ సహా ఆరు భారతీయ కంపెనీలపై జపాన్ నిషేధం ఎత్తివేయడాన్ని ప్రస్తావస్తూ.. ‘జపాన్ మనపై విశ్వాసముంచడం నన్నెంతో సంతోషపరుస్తోంది’ అన్నారు. జపాన్‌తో బంధం ధృఢమైనదని పేర్కొంటూ.. ‘ఇది ఫెవికాల్ బంధం కన్నా ధృఢమైనది’ అని చమత్కరించారు. శాంతి, అహింసలు భారతీయుల డీఎన్ఏలోనే ఉన్నాయని మోడీ స్పష్టం చేశారు. అది ఏ అంతర్జాతీయ ఒప్పందంకన్నా ఎక్కువేనన్నారు. సేక్రెడ్ హార్ట్స్ వర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అణ్వస్త్ర నిరోధక ఒప్పందంపై భారత్ సంతకం చేయకపోవడంపై వివరణ ఇస్తూ మోడీ పై వ్యాఖ్యలు చేశారు. ప్రపంచమంతా ఒక కుటంబమనే ‘వసుధైక కుటుంబం’ భావనను భారత్ విశ్వసిస్తుందన్నారు. మోడీ కార్యక్రమాల విశేషాలు, వ్యాఖ్యలు.. జపాన్‌లోని స్మార్ట్ సిటీ క్యోటోకు, మన వారణాసికి చాలా పోలికలున్నాయి. రెండూ చిన్న పట్టణాలే. రెండు పట్టణాల్లోనే పెద్ద సంఖ్యలో దేవాలయాలున్నాయి. క్యోటో తరహాలో కాశిని కూడా స్మార్ట్ సిటీగా తయారు చేస్తాం. పరిశుభ్రత మహాత్మాగాంధీకి చాలా ఇష్టమైన విషయం. అందుకే ఆయన 150వ జయంతి(2019) నాటికి దేశాన్ని పరిశుభ్ర భారత్‌గా మార్చాలని ప్రతినబూనాం. అదే ఆయనకు మనమిచ్చే నివాళి. పాములోళ్ల దేశంగా భారత్‌ను కొందరు భావిస్తారు. అందుకే ‘గతంలో పాములతో ఆడుకున్నాం.. ఇప్పుడు మౌజ్(భారతీయుల ఐటీ సామర్ధ్యాన్ని అన్యాపదేశంగా ప్రస్తావిస్తూ)లతో ఆడుకుంటున్నాం’ అని నేను ఒకరితో చెప్పాను. 21వ శతాబ్దం భారత్కో, చైనాకో, జపాన్‌కో చెందదు. అది ఆసియాకు చెందుతుంది. దేశాల మధ్య సంబంధాలు పెరగాలంటే.. ప్రజల మధ్య అనుబంధం పెరగాలి. ఇరుదేశాలు యువ ఎంపీల పార్లమెంటరీ సంఘాలను ఏర్పాటు చేయాలి. అలాగే, జపాన్ నుంచి వచ్చే పార్లమెంటేరియన్లు భారత్‌లో కేవలం ఢిల్లీలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ పర్యటించాలి. భారతీయ ఎంబసీలో వివేకానంద సెంటర్‌ను ప్రారంభించిన అనంతరం బయటకు వచ్చిన మోడీకి భారీగా గుమికూడిన భారతీయ అభిమానులు స్వాగతం పలికారు. దాంతో భద్రత సిబ్బందిని కాదని మోడీ వారితో మమేకమయ్యారు. వారితో కరచాలనాలు చేసి, ఫోటోలు దిగారు. జపాన్ చక్రవర్తి అకిహితోతో భేటీ సందర్భంగా ఆయనకు భగవద్గీతను బహుమతిగా ఇచ్చారు. భగవద్గీతను బహుమతిగా ఇవ్వడంపై భారత్‌లోని లౌకికవాద మిత్రులు తుపాను సృష్టిస్తారని, మీడియాలో చర్చలు ప్రారంభమవుతాయని హాస్యంగా వ్యాఖ్యానించారు. డ్రమ్మర్ మోడీ: జపాన్‌లో మోడీలోకి కొత్త కళ ఆవిష్కృతమైంది. డ్రమ్మర్‌గా కొత్త అవతారమెత్తి.. జపాన్ సంప్రదాయ డ్రమ్మర్లతో కలసి ‘జుగల్బందీ’ చేశారు. అక్కడ నిపుణులైన వాయిద్యకారులకు గట్టి పోటీనిచ్చారు. ‘టీసీఎస్ జపాన్ టెక్నాలజీ అండ్ కల్చరల్ అకాడెమీ’ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. -
డీఎన్ఏతో సరోగసీ చిన్నారులకు పాస్‌పోర్ట్
హైదరాబాద్ పాస్‌పోర్టు అధికారుల నిర్ణయం దేశంలోనే తొలిసారిగా ఎన్నారై దంపతుల సరోగసీ బిడ్డకు టెస్టుట హైదరాబాద్: పిల్లలకు పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేస్తే అందులో తల్లిదండ్రుల పేర్లు తప్పనిసరి.. తల్లిదండ్రుల చిరునామా, వారి పాస్‌పోర్టులు, గుర్తింపు ఆధారంగానే పిల్లలకు పాస్‌పోర్ట్ జారీ చేస్తారు. మరి ఒక తండ్రి, ఇద్దరు తల్లులు ఉంటే పాస్‌పోర్టులో తల్లి పేరుగా ఎవరిది ఉండాలి? అద్దె గర్భం (భర్త వీర్యకణాలు, భార్య అండాలను ఫలదీకరించి.. మరో మహిళ గర్భంలో బిడ్డను పెరిగేలా చేసే ప్రక్రియ - సరోగసీ) ద్వారా సం తానాన్ని పొందుతున్న వారి సమస్య ఇది. ఇలా ‘సరోగసీ’ విస్తృతమవుతున్న నేపథ్యంలో... బిడ్డలకు తల్లిదండ్రులెవరో తేల్చేం దుకు డీఎన్ఏ పరీక్షలు చేయాలని హైదరాబాద్ పాస్‌పోర్టు అధికారులు నిర్ణయించారు. దేశంలోనే తొలిసారిగా ఓ ప్రవాస భారతీయ దంపతుల సరోగసీ బిడ్డకు డీఎన్ఏ పరీక్ష చేయించాలని ఆదేశించారు. తల్లి ఎవరనే దానిపైనే వివాదం.. తల్లిదండ్రులకు పాస్‌పోర్ట్ ఉండి బిడ్డకు జనన ధ్రువీకరణ పత్రం ఇస్తే చాలు రెండుమూడు రోజుల్లోనే బిడ్డకు పాస్‌పోర్ట్ జారీ చేస్తారు. కానీ సరోగసీ వల్ల పుట్టే బిడ్డకు తల్లి విషయంలో వివాదాలు వస్తున్నాయి. అండం ఇచ్చిన తల్లి పేరును పాస్‌పోర్ట్‌లో చేర్చాలా? నవమాసాలు మోసి కన్న తల్లిని చేర్చాలా? అన్నది తేలలేదు. సరోగసీ బిడ్డల పాస్‌పోర్ట్ విషయమై మార్గదర్శకాలు ఇవ్వాలని గతంలోనే హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి విదేశీ మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. కానీ, దీనిపై ఇప్పటికీ మార్గదర్శకాలు రాలేదు. దీంతో ‘సరోగసీ’ బిడ్డలకు డీఎన్ఏ పరీక్షలు చేయించి, పాస్‌పోర్టు ఇవ్వాలని నిర్ణయించారు. వాన్‌బ్యూరెన్ కేసు వివాదంతోనే.. జమైకాకు చెందిన వాన్‌బ్యూరెన్ అనే మహిళ అమెరికా జాతీయుడిని పెళ్లి చేసుకున్నారు. కొన్ని కారణాలతో వారికి పిల్లలు పుట్టే అవకాశం లేదని తేలడంతో సరోగసీని ఆశ్రయించారు. భారత్‌లోని ఓ మహిళ ద్వారా వారికి మగబిడ్డ జన్మించాడు. కానీ ఈ బిడ్డకు పాస్‌పోర్టు కోసం ఆమె పాస్‌పోర్ట్ కార్యాలయానికి వెళ్లగా.. ధ్రువపత్రాలు పరిశీలించిన అధికారులు తిరస్కరించారు. దీంతో ఆమె పాస్‌పోర్ట్ కార్యాలయం వద్దే పిల్లాడ్ని వదిలేసి వెళ్లిపోయారు. తర్వాత సంతాన సాఫల్య కేంద్రం యాజమాన్యం బిడ్డను తీసుకెళ్లి తిరిగి వాన్బ్యూరెన్కు ఇచ్చింది. ఆ తర్వాత ఆమె ఢిల్లీకి వెళ్లి అక్కడి అధికారులతో మాట్లాడి బిడ్డతో సహా అమెరికాకు వెళ్లగలిగింది. తాజాగా ఎన్నారై దంపతులు.. వాన్‌బ్యూరెన్ వివాదం తర్వాత ఒక ప్రవాస భారతీయ జంట తమ సరోగసీ బిడ్డకు పాస్‌పోర్ట్ కోసం హైదరాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి వచ్చారు. దీనిపై పాస్‌పోర్ట్ అధికారి అన్ని ధ్రువపత్రాలూ పరిశీలించాక.. ఆ బిడ్డకు డీఎన్ఏ టెస్టు చేయించాలన్నారు. ఎన్నారై దంపతులు అంగీకరించడంతో... గత డిసెంబర్లో దంపతుల రక్తనమూనాలను సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ)కి పంపించి పరీక్షలు చేయించారు. ఈ డీఎన్ఏ పరీక్ష ఫలితాల నివేదిక ఇటీవలే పాస్‌పోర్ట్ కార్యాలయానికి అందింది. దాని ఆధారంగా త్వరలోనే ఆ బిడ్డకు పాస్‌పోర్ట్ అందజేయనున్నట్టు పాస్‌పోర్ట్ కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. దేశంలో డీఎన్ఏ టెస్టు ద్వారా తల్లిదండ్రులను నిర్ణయించి పాస్‌పోర్ట్ అందజేస్తున్న తొలి ఘటనగా ఇది రికార్డులకెక్కనుంది. -
ఫండ్స్‌లో నేతల పెట్టుబడుల జోరు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ పథకాలవైపు సామాన్య ప్రజల్ని ఆకర్షించేందుకు, వారిచేత పెట్టుబడులు చేయించేందుకు ప్రభుత్వం, సెబీ వంటి నియంత్రణ సంస్థలు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలిస్తున్నాయో లేదో కానీ పెద్ద సంఖ్యలో రాజకీయ నాయకులు మాత్రం మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టినట్లు ఎన్నికల అఫిడవిట్లు వెల్లడిస్తున్నాయి. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ లాంటి కాంగ్రెస్ దిగ్గజాలతో సహా అరుణ్‌జైట్లీ, వరుణ్‌గాంధీ తదితర బీజేపీ నేతలు కూడా భారీగానే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌చేశారు. ఫండ్స్‌లో లక్షలు కుమ్మరించినవారిలో కాంగ్రెస్, బీజేపీతో పాటు అన్ని పార్టీల నేతలూ ఉన్నారు. అమర్‌సింగ్, జ్యోతిరాదిత్య సింధియా, అంబికాసోనీ, శశిథరూర్ లతో పాటు కొత్తగా రాజకీయ అరంగేట్రం చేసిన మాజీ బ్యాంకర్ మీరా సన్యాల్, ఇన్ఫోసిస్ మాజీ ఎగ్జిక్యూటివ్ వీబాలకృష్ణన్, భారత సాకర్జట్టు మాజీ కెప్టెన్ భైచుంగ్ భుటియా , బీజేపీ అభ్యర్ధి డ్రీమ్‌గర్ల్ హేమమాలిని కూడా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీపడుతున్న అభ్యర్థుల అఫిడవిట్లు పరిశీలిస్తే లక్షల్లోనే కాదు, కొందరు అభ్యర్థులు కోట్ల రూపాయల్లో వివిధ మ్యూచువల్ ఫండ్ స్కీముల్లో ఇన్వెస్ట్ చేసినట్లు తేలింది. మోడీ దూరం... అయితే బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్ధి నరేంద్రమోడీ, ఆమ్ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్,బీజీపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, సమాజ్‌వాదీ పార్టీ సుప్రిమో ములాయంసింగ్‌యాదవ్,బీజేపీ ఫైర్‌బ్రాండ్ ఉమాభారతి మ్యూచువల్ ఫండ్స్‌కు దూరంగానే ఉన్నారు. కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్‌గాంధీ అఫిడవిట్ ప్రకారం ఆయన రూ.81 లక్షలు ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌చేస్తే ఆయన త ల్లి, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ రూ.82 లక్షలు వివిధ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌చేశారు. 2009 ఎన్నికల్లో వీరిద్దరు దాఖలు చేసిన అఫిడవిట్ల ప్రకారం అప్పుడు వీరికి ఫండ్స్‌లో ఎలాంటి పెట్టుబడులు లేవు. సమాజ్‌వాదీ పార్టీ మాజీ నేత, ఫతేపూర్ సిక్రీ నుంచి రాష్ట్రీయ లోక్‌దళ్ నేత అభ్యర్థిగా బరిలో దిగిన 58 ఏళ్ల అమర్‌సింగ్ తనకు రూ.100 కోట్ల అస్తులున్నట్లు ప్రకటించారు. అందులో రూ.41 కోట్లు చరాస్తులు కాగా, రూ.6.27 కోట్లు మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులున్నాయి. మరో బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ తాను రూ.2 కోట్లు ఫండ్స్ స్కీముల్లో పెట్టుబడులు చేసినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ పేరుమీద ఫండ్స్‌లో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ లేకున్నా ఆయన సతీమణి పేర రూ.2 లక్షలున్నట్లు అఫిడవిట్లో తెలిపారు. మక్కువ చూపుతున్న కొత్త తరం... ఇప్పటికీ, బ్యాంకు డిపాజిట్లు, బంగారంలో మాత్రమే ఇష్టంగా పెట్టుబడులు చేసే పాతతరంతో పోలిస్తే కొత్త తరం ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌చేసేందుకు ఎక్కువ మక్కువ చూపుతున్నారని ఇదే ట్రెండ్ రాజకీయ నేతలకు కూడా వర్తిస్తుందని మ్యూచువల్ఫండ్ హౌసెస్ టాప్ ఎగ్జిక్యూటివ్స్ వెల్లడించారు. గ్వాలియర్ మహారాజాల వంశస్తుడు, విద్యుత్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఆయన కుటుంబీకుల మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ రూ.67 లక్షలు దాటలేదు. నాగాలాండ్ ముఖ్యమంత్రి, నైఫూరియో పవర్ సెక్టార్‌కు చెందిన వివిధ ఫండ్ స్కీముల్లో దాదాపు రూ.17 లక్షల దాకా ఇన్వెస్ట్ చేశారు. డార్జిలింగ్ నుంచి బరిలో ఉన్న ఫుట్‌బాల్ ఛాంపియన్ భుటియా మ్యూచువల్ ఫండ్స్‌లో 4లక్షలు ఇన్వెస్ట్చేశాడు. బ్యాంకింగ్ రంగంనుంచి రాజకీయాల్లోకి వచ్చిన ముంబై సౌత్ ఆమ్ఆద్మీపార్టీ అభ్యర్థి మీరా సన్యాల్ షార్ట్‌టెర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌గా లిక్విడ్ ఫండ్స్‌లో రూ.20 లక్షలు, ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లలో రూ.51 లక్షలు ఇన్వెస్ట్‌చేశారు. మరో ఆమ్ఆద్మీపార్టీ అభ్యర్థి, మాజీ ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వి.బాలకృష్ణన్ అలియాస్ బాలా గోల్డ్ ఈటీఎఫ్‌లలో, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ పద్ధతి (సిప్ ద్వారా) కోటి రూపాయలు ఇన్వెస్ట్‌చేశారు. అయితే డ్రీమ్‌గర్ల్ హేమమాలిని ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ రూ.37వేలు మాత్రమే. మాజీ సమాచార, ప్రసార శాఖ మంత్రి అంబికా సోనీ బాండ్లు,షేర్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.4.58 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఒడిశాలోని కేంద్రపారాలోక్సభ నుంచి పోటీచేస్తున్న బీజేడీ అభ్యర్థి బైజయంత్ పాండా గత ఐదేళ్లలో తన ఆస్తులు భారీగా పెరిగినట్లు పేర్కొన్నారు. ఫండ్స్‌లో పెట్టుబడులకు ప్రోత్సాహం సామాన్య ఇన్వెస్టర్లతో సహా బ్యాంకర్లు, కార్పొరేట్లనుంచి సేకరించిన పెట్టుబడులను వివిధ రకాల షేర్లు, బాండ్లలో ఫండ్హౌస్లు ఇన్వెస్ట్‌చేస్తాయి. సెక్యూరిటీల పనితీరు ఆధారంగా వారి వారి పెట్టుబడుల మేరకు ఇన్వెస్టర్లకు ప్రతిఫలం అందుతుంది. దేశంలో ప్రస్తుతం 45 ఫండ్ హౌస్‌లు దాదాపు 9 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల ఆస్తుల్ని మేనేజ్ చేస్తున్నాయి.అయితే మ్యూచువల్ ఫండ్స్ స్కీములు పట్టణ ఇన్వెస్టర్ల వరకే పరిమితమయ్యయి. దాంతో వీటిని సామాన్యుడి పెట్టుబడి సాధనంగా మలిచేందుకు ప్రభుత్వం, సెబీ భారీగా కసరత్తు చేస్తున్నాయి. వచ్చే ఐదేళ్లలో మ్యూచువల్ ఫండ్స్ ఆస్తులు 20లక్షల కోట్లకు పెరిగేలా దీర్ఘకాల మ్యూచువల్ ఫండ్ పాలసీని సెబీ అమల్లోకి తేనుంది. అప్పుడు ఫండ్స్‌లో చేసే ఇన్వెస్టర్లు పెట్టుబడులకు భారీ పన్ను రాయితీలు లభిస్తాయి. -
పన్నెండేళ్లలో 98 మంది పిల్లలు!
కనీసం తాగుడు అలవాటు కూడా లేని హౌబెన్ స్పెర్మ్ కౌంట్ వంద మిలియన్లట. లెస్బియన్ కపుల్స్, చాలాకాలంగా పిల్లలు కలగని వారు... ఇలా సరైన కారణం ఉన్న వారికే ఆయన వీర్యదానం చేస్తారు. జీవితంలో ఎపుడైనా ఎక్కువ మంది పిల్లలున్న వ్యక్తి మీకు తారసపడ్డారా? ఎంత మంది ఉంటారు పిల్లలు వారికి ముగ్గురు, ఐదుగురు, ఏడుగురు, పదిమంది... మహా అయితే పదిహేను మంది! కానీ ఇపుడు మీకు చెప్పబోయే వివరాలు 98 మంది పిల్లలున్న తండ్రివి. అది కూడా ఈ 98 మందికి కేవలం 12 సంవత్సరాల్లో జన్మనిచ్చారు. మహాభారతంలో మాత్రమే ధృతరాష్ట్రుడికి వంద మంది ఉన్నట్టు విన్నాం. కానీ ఈ కాలంలో కూడా అంతమంది పిల్లలున్న వారున్నారా... మరీ మీ పిచ్చి కాకపోతేను అని అనుకుంటారేమో! డీఎన్ఏ రిపోర్టులు కూడా ఉన్నాయి. జాగ్రత్త! ఆయన పేరు ఎడ్ హౌబెన్. నెదర్లాండ్స్ దేశంలోని మాస్ట్రిక్ట్ పట్టణంలో ఉంటారు. టూర్ గైడ్‌గా పనిచేస్తారు. ఆయనకు ఇపుడు 46 సంవత్సరాలు. 2002 వరకు ఆయనకు ఏ స్త్రీతోను సంబంధాలు లేవు. పెళ్లి కాలేదు. అపుడు చాలామంది పిల్లల కోసం ఎంతో తాపత్రయ పడతారని కానీ వారికి పిల్లలు కలగరని తెలుసుకుని స్పెర్మ్ డోనర్ (వీర్య దాత) అయ్యాడు. ఓ లోకల్ బ్యాంకుకు వీర్యాన్ని దానం చేస్తే వారు భద్రపరిచి అమ్ముకునేవాళ్లు. కొంతకాలానికి జర్మనీలోని ఒక వెబ్సైట్ (టఞ్ఛటఝ్చటఞ్ఛఛ్ఛీట.ఛ్ఛీ) గురించి తెలుసుకుని అందులో వీర్యదాతగా పేరు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత అతడిని నేరుగా పిల్లలు కావాలనుకునే మహిళలు కలిసే వారు. ఈ మాట వింటేనే చాలామందికి వెంటనే అనేక అనుమానాలు కలుగుతాయి. అతను బాధ్యతలు తీసుకోనవసరం లేని శృంగారాన్ని అనుభవిస్తున్నాడని, కోరికలు తీర్చుకోవడానికే ఇలా చేస్తున్నాడని, ఇది లీగల్ అయి ఉండదని... ఇలాంటి అనుమానాలొస్తాయి కదా. వాటన్నింటికీ సమాధానాలున్నాయి. హౌబెన్ చేసే ఈ పని పూర్తిగా న్యాయబద్ధమైనది. ఆయన వద్దకు వచ్చేవారు పిల్లలు కలగకపోవడానికి దారితీసిన కారణాల హెల్త్ రిపోర్టులు తేవాలి. అలాగే వారి ఆరోగ్య సంబంధ రిపోర్టులు తీసుకురావాలి. అవన్నీ పరిశీలించిన తర్వాతే అతను వారితో శృంగారానికి అంగీకరిస్తారు. పలు దేశాల నుంచి ఆయన వద్దకు వస్తుంటారు. ఆయన పిల్లలు పలుదేశాల్లో ఉన్నారు. ఎడాపెడా వీర్యదానం చేస్తే రేప్పొద్దున్న ఆ చట్టాలు మెడకు చుట్టుకుంటాయి. అందుకే వారితో పిల్లల కోసం కలిసి గడపడానికి అవసరమైన వ్యవహారాలన్నీ చట్టబద్ధంగా పూర్తిచేస్తారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఆయన ఈపాటికి ఏనాడో అనారోగ్యం పాలయ్యేవాడు. కనీసం తాగుడు అలవాటు కూడా లేని హౌబెన్ స్పెర్మ్ కౌంట్ వంద మిలియన్లట. లెస్బియన్ కపుల్స్, చాలాకాలంగా పిల్లలు కలగని వారు... ఇలా సరైన కారణం ఉన్న వారికే ఆయన వీర్యదానం చేస్తారు. ఇపుడు 98వ బేబీ మాడిటతో పాటు అందరి ఫొటోలు, వారి వివరాలు, ఆ దంపతులు వివరాలు ఆయన వద్ద ఉంటాయి. ఎందుకంటే భవిష్యత్తులో ఎదురయ్యే ఏ న్యాయసమస్యనైనా ఎదుర్కోవాలి కదా! ఎడ్ హౌబెన్ను కొందరు ‘భార్యతో గడిపితే భర్త అంగీకరిస్తాడా?’ అని అడిగారట. కొందరు సంతానం కోసం లక్షలు పోసినా లాభం లేక దేశాలన్నీ తిరిగి ‘జీవితం శూన్యం’ అనుకుని నా వద్దకు వచ్చినపుడు వారికి కనిపించేది శృంగారం కాదు... బిడ్డ రూపంలో భవిష్యత్తు అని ఆయన తిరుగులేని సమాధానం ఇచ్చారు. -
దొంగ 'ముద్దు'.. జైలుకు పంపింది!
లండన్: ఫ్రాన్స్‌లో ఇద్దరు దొంగలు ఓ బంగారు నగల దుకాణం యజమానిని బెదిరించి డబ్బు, నగలు దోచుకున్నాడు. ఓ దొంగ అంతటితో ఆగకుండా ఆమెను ముద్దాడాడు. చివరకు ఈ ముద్దే దొంగలు పోలీసులకు దొరికేలా చేసింది. వివరాలిలా ఉన్నాయి. యజమాని ఒంటరిగా ఉన్న సమయంలో దొంగలు ఆమె ఇంట్లోకి ప్రవేశించారు. తాము చెప్పినట్టు వినకుంటే చంపేస్తామంటూ ఆమె తలపై పెట్రల్ పోసి బెదిరించారు. యజమాని నుంచి బంగారు నగల దుకాణం తాళం చెవి తీసుకుని ఓ దొంగ వెళ్లాడు. మరొకడు ఆమె దగ్గరే ఉన్నాడు. దొంగ వెళ్లి దుకాణంలో డబ్బు, నగలు అందినకాడికి దోచుకున్నాడు. పని పూర్తవగానే ఇంట్లో ఉన్న మరో దొంగ కక్కుర్తి పడి 56 ఏళ్ల యజమాని బుగ్గపై ముద్దుపెట్టుకుని వెళ్లాడు. బాధితురాలి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి జరిగిన విషయం చెప్పింది. ఫోరెన్సిక్ బృందం ఆమె బుగ్గపై దొంగ ముద్దుపెట్టుకున్న ఆనవాళ్లను సేకరించింది. డాటాబేస్‌లో దొంగ డీఎన్ఏను గుర్తించారు. ఇంకేముంది దొంగ ఎవర్నది తేలిపోయింది. పోలీసులు వలపన్ని దొంగలను జైలుకు పంపారు. -
యువకుల డీఎన్ఏలో మద్యం ఆనవాళ్లు!
వాషింగ్టన్: వారాంతాల్లో క్రమం తప్పకుండా మద్యం సేవించే యువకులు ఈ విషయంపై దష్టి సారించాల్సిందే. మద్యం వినియోగం ఆనవాళ్లు వారి డీఎన్ఏలో మిగిలి ఉంటున్నట్లు ఓ సరికొత్త అధ్యయనం హెచ్చరించింది. వారాంతాల్లో మద్య సేవనం యువకుల శరీరంలోని కణజాలంతో కూడిన కొవ్వు పదార్థాలు, జన్యు సంబంధ పదార్థాలపై (డీఎన్ఏ) చూపించే ప్రభావాన్ని ఈ అధ్యయనం విశ్లేషించింది. మద్యం సేవించే తొలినాళ్లలో అది కలిగించే నష్టం ఇంతకుముందు నిర్ధారణ కాలేదని పరిశోధకులు చెప్పారు. మెక్సికోలోని ఓ కళాశాలలో ఉపన్యాసం ఇస్తుండగా.. అడేలా రెండన్ అనే పరిశోధకుడికి వారాంతాల్లో మద్య సేవనం చూపించే మత్తు ప్రభావంపై అధ్యయనం చేయూలనే ఆలోచన వచ్చింది. సోమవారం ఉదయం జరిగిన ఈ తరగతికి హాజరైన అనేకమంది విద్యార్థులు.. వారాంతంలో మద్య సేవనం కారణంగా ఉపన్యాసంపై దష్టి కేంద్రీకరించలేక పోవడాన్ని రెండన్ గుర్తించారు. ఈ నేపథ్యంలో మద్యం సేవించిన వారిని, మద్యం తాగని వారిని (18-23 ఏళ్ల వయస్సు) రెండు గ్రూపులుగా విభజించి పరిశోధకులు పలు విడతలుగా ప్రయోగాలు కొనసాగించారు. ఈ నేపథ్యంలోనే యువకుల డీఎన్ఏపైనా మద్య సేవనం ప్రభావం చూపుతున్నట్టుగా గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా 25 లక్షల మరణాలకు మద్యం కారణం కాగా.. వీరిలో 19-25 మధ్య వయస్సు యువకులు 3.2 లక్షల మంది వరకు ఉంటున్నారని వారు వెల్లడించారు. ఆల్కహాల్ అనే పత్రికలో ఈ అధ్యయనం ప్రచురితమైంది. -
4 లక్షల ఏళ్లనాటి మనిషి డీఎన్ఏ సేకరణ!
బెర్లిన్: మానవ జీవ పరిణామ చరిత్రను కొత్త మలుపుతిప్పే అతి పురాతన డీఎన్ఏను శాస్త్రవేత్తలు సేకరించారు. స్పెయిన్‌లోని ఓ గుహలో లభించిన 4 లక్షల ఏళ్లనాటి మానవ శిలాజం తొడ ఎముక నుంచి వారు డీఎన్ఏను సేకరించగలిగారు. ఇప్పటిదాకా సేకరించిన మానవ డీఎన్ఏలలో ఇదే అతి పురాతనమైనది కావడం విశేషం. డీఎన్ఏ సేకరణలో వినూత్న టెక్నిక్‌లు ఉపయోగించి జర్మనీలోని మాక్స్‌ప్లాంక్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఈ డీఎన్ఏను సేకరించారు. ఉత్తర స్పెయిన్‌లోని సిమాడీలాస్ హ్యూసోస్ గుహలో తవ్వకాల్లో బయటపడిన ఈ శిలాజం హోమో జాతికి చెందినదిగా నిర్ధారించారు. అయితే 6 లక్షల ఏళ్లనాటి నియాండర్తల్ మానవులకు వారసులైన డెనిసోవన్ మానవుల డీఎన్ఏకు, తాజా డీఎన్ఏకు సంబంధం ఉండటంతో ఇప్పటిదాకా అంచనావేసిన మానవ పరిణామ చరిత్రలో పలు సందేహాలు మొదలయ్యాయి. ఆసియాలో డెనిసోవన్ మానవ జాతి 40 వేల ఏళ్ల క్రితమే అంతరించినట్లు ఆధారాలను బట్టి తెలుస్తోంది. అందువల్ల 4 లక్షల ఏళ్లనాటి ఆ డీఎన్ఏకు, 40 వేల ఏళ్లనాటి డెనిసోవన్ల డీఎన్ఏకు పోలిక ఉండటంతో మానవ పరిణామ వృక్షంలో మరిన్ని కొత్త శాఖలు, కలయికలు ఏర్పడి, అంతరించి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. -
చంద్రబాబుది కాంగ్రెస్ డీఎన్ఏ కాదా? : డి.శ్రీనివాస్
సాక్షి, హైదరాబాద్: చంద్రబాబుదీ కాంగ్రెస్ డీఎన్ఏనని పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ డీఎన్ఏ సంగతి గురించి ప్రత్యేకించి అడగాల్సిన అవసరమే లేదన్నారు. విభజనపై పార్టీ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటేనే నాయకులవుతారని, వారి పెద్దరికమూ నిలబడుతుందనే విషయాన్ని మర్చిపోవద్దని సీఎం కిరణ్నుద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. అలాగాక రాజకీయ జిమ్మిక్కులు చేస్తే.. హనుమంతుడిని చేయాలనుకుంటే కోతిగా మారిన చందంగా పరిస్థితి తయారవుతుందన్నారు. శుక్రవారం డీఎస్ 65వ జన్మదినం సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. కొందరు కార్యకర్తలు ‘కాబోయే తెలంగాణ సీఎం డీఎస్’ అని నినాదాలు చే స్తూ బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచారు. ఆయా నేతల సమక్షంలో డీఎస్ దంపతులు బర్త్‌డే కేక్ కట్‌చేశారు. అనంతరం డీఎస్ మాట్లాడుతూ వచ్చేఏడాది తెలంగాణ రాష్ట్రంలోనే తన జన్మదినోత్సవం జరుపుకుంటానన్న ధీమా వ్యక్తం చేశారు. హైకమాండ్ విభజన నిర్ణయం తీసుకున్నాక స్వాగతించి కొత్త రాజధానికోసం రూ.నాలుగైదు లక్షల కోట్లు కావాలని కేంద్రాన్ని కోరిన చంద్రబాబు ఇప్పుడు యూ టర్న్, పీ టర్న్, క్యూ టర్న్‌ల పేరుతో ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదని ఎద్దేవా చేశారు. ‘కాంగ్రెస్ డీఎన్ఏ జగన్ అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తున్నారు కదా!’ అన్న ఓ విలేకరి ప్రశ్నకు స్పందిస్తూ ‘‘చంద్రబాబు డీఎన్ఏ సంగతేంది? ఆయనదీ కాంగ్రెస్ డీఎన్ఏనే కదా! ఇక టీఆర్ఎస్ డీఎన్ఏ అంటారా? అసలు మీరా ప్రశ్న అడగాల్సిన అవసరమే లేదు’’ అని డీఎస్ బదులిచ్చారు. వైఎస్సార్సీపీ సమైక్యవాదం వినిపించటంపై అడిగిన ప్రశ్నకు స్పంది స్తూ.. ‘‘వాళ్లు ఏ పరిస్థితుల్లో సమైక్య ఆలోచన చేశారో! అయినా అది వాళ్ల ఇష్టం. మీరే అన్నారు కదా! నిర్ణయం మార్చుకున్నారని.. ప్రజాభిప్రాయం దృష్ట్యా మరోసారి నిర్ణయాన్ని మార్చుకుంటారేమో వేచి చూద్దాం’’ అని అన్నారు.