
డీఎన్‌ఏ ద్వారా నేరస్థుల మొహాన్నిసృష్టించవచ్చు
లండన్: నేరం జరిగిన చోట దొరికే డీఎన్‌ఏ అవశేషాల ద్వారా ఇప్పుడు నేరస్థులను పట్టుకుంటున్న విషయం తెల్సిందే. అనుమానిత నేరస్థులు లేదా పాత నేరస్థుల డీఎన్‌ఏతో నేరం జరిగిన చోట దొరికిన డీఎన్‌ఏ అవశేషాలను సరిపోల్చడం ద్వారా మాత్రమే నేరస్థులను పట్టుకోవడం సాధ్యమవుతుంది. ముక్కూ మొహం తెలియని కొత్త వాళ్లు నేరానికి పాల్పడితే వారిని డీఎన్‌ఏ ద్వారా పట్టుకోవడం కష్టమే. ఇక ముందు డీఎన్‌ఏ ద్వారా వారి ముఖాలను అచ్చుగుద్దినట్టు గుర్తించే అద్భుత సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది.
ఒక్కొక్కరి ముఖాలు ఒక్కోలాగా ఉండడానికి వారి వారి జన్యువులే కారణమని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కొనదేలిన ముక్కు, కుదురైన పెదవులు, విశాలమైన కళ్లతో కొందరి ముఖాలు అందంగా ఉంటాయి. బండ ముక్కు, మొద్దు పెదవులు, డొప్ప చెవులతో కొందరి ముఖాలు కాస్త వికారంగా ఉంటాయి. ఈ అవయవాల తీరు తెన్నులతోపాటు కళ్ల మధ్య ఎంత దూరం, కళ్లకు చెవులకు ఎంత దూరం, ముక్కుకు కళ్లుకు, ముక్కుకు చెవులకు, పెదాలకు ముక్కుకు ఎంత దూరం ఉందనే అంశంపై ముఖం తీరుతెన్నులు లేదా ముఖ కవలికలు ఆధారపడి ఉంటాయి. ముఖంపై నుండే ఈ అవయవాల తీరును మనిషిలోని కొన్ని జన్యువులు నిర్దేశిస్తున్నాయని ఇప్పుడు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
యూరప్‌కు చెందిన 3,118 మంది ఆరోగ్యవంతుల ముఖాలను 3డి ద్వారా చిత్రీకరించి, వారి వారి జన్యుక్రమంలో ఉన్న తేడాలపై పరిశోధనలు జరపడం ద్వారా ఈ విషయం కనుగొన్నామని ‘ప్లోస్ జెనటిక్స్’ జనరల్‌లో శాస్త్రవేత్తలు వివరించారు. డీఎన్‌ఏ ద్వారా ఒకరి జన్యుక్రమాన్ని కనిపెట్టి వాటి ఆధారంగా వారి మొఖం ఎలా ఉంటుందో గ్రాఫిక్ ద్వారా డిజైన్ చేయవచ్చని వారు తెలిపారు. నేరస్థుల డీఎన్‌ఏను సేకరించి వారి ముఖాలు ఎలా ఉంటాయో కనుక్కోవచ్చని వారు తేల్చారు. అయితే ఈ దిశగా మరింత లోతుగా దర్యాప్తు జరపాల్సి ఉందని వారు చెప్పారు.