పదమూడు రోజుల్లో...థేమ్స్ టు ఆల్ప్స్ | Thirteen days ... Thames to the Alps | Sakshi
Sakshi News home page

పదమూడు రోజుల్లో...థేమ్స్ టు ఆల్ప్స్

Published Thu, Sep 4 2014 11:27 PM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

పదమూడు రోజుల్లో...థేమ్స్ టు ఆల్ప్స్ - Sakshi

పదమూడు రోజుల్లో...థేమ్స్ టు ఆల్ప్స్

పాఠక పర్యటన
 
 విస్మయపరిచే ప్రపంచ వింతలు...  
 అబ్బురపరిచే ప్రకృతి సోయగాలు...
 లండన్‌లోని థేమ్స్ నది నుంచి  ఆల్ప్స్ పర్వతాల వరకు ఏ ఒక్కదానినీ మరచి పోలేక పోతున్నాం అంటున్నారు హైదరాబాద్ వాస్తవ్యురాలైన అనితా సమర్థ్. యూరప్‌లోని తొమ్మిది దేశాలలో 13 రోజుల పాటు జరిపిన పర్యటన తమ మదిలో పదిలంగా ఉండి పోయిందంటూ ఆ విశేషాల మాలికను ఇలా మన ముందు ఉంచుతున్నారు...

 
ప్రకృతి అందాలు, మానవుడు నిర్మించిన అద్భుత కట్టడాలు మన దేశంలోనే ఉన్నాయని నమ్మేదాన్ని. అలాంటి నేను, మా అక్కయ్యతో కలసి సెలవుల్లో యూరప్ యాత్రకు బయలుదేరాను. మొత్తం తొమ్మిది దేశాలు 13 రోజులు. ట్రావెల్ ఏజెన్సీ ద్వారా ముందుగా టికెట్ బుక్ చేసుకొని, బయల్దేరాం.
 
లండన్‌లో మన శిల్పకళ

రాజసం ఉట్టిపడే లండన్‌ని చేరేసరికి సాయంత్రం అయ్యింది. మరు సటి రోజు ఉదయాన్నే ముందుగా స్వామి నారాయణ్ దేవాలయానికి వెళ్లాం. లండన్ దేవాలయంపై మన శిల్పకళ అందాలను చూసి అమితాశ్చర్యం కలిగింది. స్వామి నారాయణ్ విగ్రహం, ఇతర దేవతా విగ్రహాలలో ప్రాణం ఉట్టిపడే తేజస్సు కళ్లకు కట్టింది. అక్కడి నుంచి అల్బర్ట్ మెమోరియల్ విగ్ర హం, ఎలిజబెత్ మహారాణి నివసించే బకింగ్‌హామ్ ప్యాలస్‌ని సందర్శించాం. ఆ తర్వాత బిగ్‌బెన్ లండన్, ఇంపీరియల్ యూనివర్సిటీ, పార్లమెంట్ హౌస్.. ఇలా ఒక్కొక్కటి చూసుకుంటూ థేమ్స్ నది చేరుకున్నాం. నదిపై లండన్ బ్రిడ్జ్ అందాలు మాటల్లో వర్ణించలేం. పెద్ద ఓడలు వచ్చినపుడు లండన్ బ్రిడ్జ్ తెరచుకునే విధానం చూసి ఆశ్చర్యపోవాల్సిందే! ఈ వంతెన నిర్మాణంలో ఇంజినీర్ల పనితనం అబ్బురపరుస్తుంది. అక్కడి నుంచి మేడమ్ టుస్సాడ్స్ వైపుగా కదిలాం. అది ఒక మైనపు ప్రపంచం. ఇక్కడ మైనపు శిల్పాలు నిజరూపాలకు పోటీ పడుతున్నట్టు ఉన్నాయి.
 
ఆమ్‌స్టర్‌లో బొమ్మల పార్క్
 
ఆ రోజు రాత్రే స్టెనా అనే పెద్ద నౌకలో సముద్ర ప్రయాణం చేశాం. అక్కడే రాత్రి భోజ నం విడిది. సముద్రపు అందాలలో మైమరచిపోతూ సైబీరియన్ పక్షుల కిలకిల రావాలతో ఆమ్‌స్టర్ డామ్ చేరుకున్నాం. ఇక్కడ ప్రపంచంలోని అద్భుత కట్టడాలన్నీ సూక్ష్మరూపంలో దర్శనమిచ్చే మినియేచర్‌పార్క్ అబ్బురపరిచిం ది. బొమ్మల కొలువు పెట్టినట్టు విశాలమైన మైదానంలో చిన్న చిన్న కట్టడాలు.. వాటికి తగ్గట్టు అదే పరిమాణంలో పెంచిన చిన్ని చెట్లు ముద్దుగా అనిపించాయి. పిల్లలైతే అక్కడి నుంచి బయటికి రావటానికే ఇష్టపడరు. అలా ఆమ్‌స్టర్ డామ్ మీదుగా బెల్జియమ్ చేరుకున్నాం. డామ్, రాయల్ ప్యాలస్ చూస్తూ మెక్సికన్ బాయ్ శిల్పానికి చేరుకున్నాం. అదే రోజు ‘సింబల్ ఆఫ్ బెల్జియమ్’గా పేరొందిన ప్రాంతాన్నీ సందర్శించి, స్విట్జర్లాండ్ చేరుకున్నాం.
 
భూతల స్వర్గం స్విట్జర్లాండ్

 
తర్వాతి రోజు రహదారికి ఇరువైపుల ఆకుపచ్చని తివాచీ పరచినట్టు, భూతలస్వర్గంలా అనిపించే దారి గుండా ప్యారిస్ నుండీ స్విట్జర్లాండ్ చేరుకున్నాం. ఆ తర్వాత రోజు జంగ్‌ఫ్రూ అనబడే యూరప్‌లోనే అతి ఎత్తై మంచు పర్వతానికి చేరుకున్నాం. అక్కడి మంచుకొండలు, ప్రకృతి అందాలు చూసి జీవితం ధన్యమైనదనే భావనలో ముందుకు సాగిపోయాం. అక్కడే మంచులోయలో మంచుపై చెక్కిన జంతువుల, మనషుల శిల్పాలు వింతగా తోచాయి. తర్వాతరోజు ‘తితిలీస్’ అనబడే పర్వతాలపైకి కేబుల్ కార్‌లో వెళ్లాం. ఆ తర్వాత ప్రపంచంలోనే మొదటిదైన ‘రివాల్వింగ్ కేబుల్‌కార్‌లో 3,020 మీటర్ల ఎత్తుపై ఉన్న ‘ఆల్ప్స్’ పర్వత శ్రేణులను చేరుకున్నాం. ఈ అత్యద్భుతాలు చూసే అవకాశం రావడం ఓ వరంగా భావించాం. మరుసటి రోజు రోమ్‌లోని కొలోజియం స్టేడియం సందర్శించాం. ప్రపంచంలోనే అతి ప్రాచీన, అతిపెద్ద స్టేడియం ఇది. ఇక్కడే గ్లాడియేటర్ ఫైట్స్ జరిగాయట.
 
పోప్ సందేశం.. వాటికన్...
 
ఆ తర్వాత  అతి చిన్న దేశమైన ‘వాటికన్ సిటీ’ చేరుకున్నాం. క్రిస్ట్‌మస్ రోజు పోప్ ఇచ్చే సందేశం వినటం కోసం వేలాది మంది ఇక్కడకు చేరుకుంటారు. అదే సెయింట్ పీటర్స్ చర్చ్ ఆఫ్ బ్యాసిలికా. ఈ చర్చి చూడటానికి రెండు కళ్ళు చాలవు. చర్చి లోపల అద్భుతమైన మేరిమాత విగ్రహం, మైకలాంజిలో చిత్రాలు, జీసస్ శిల్పాలు నాటి శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనాలు. ఆ తర్వాత రోజు అందమైన ద్వీపంగా పేరుగాంచిన వెన్నీస్‌కి పడవ ప్రయాణం ద్వారా చేరుకున్నాం. నగరమంతా నీటిలోనే ఉంటుంది. చిన్న చిన్న పడవలలో ప్రయాణిస్తూ వారు జీవనం కొనసాగిస్తారు. ఇక్కడే అతి ప్రాచీనమైన సెయింట్ మార్క్స్ చర్చి, గాజు కర్మాగారం సందర్శించాం. గాజుతో అందమైన బొమ్మలు, వివిధ రూపాలు ఎంతో అందంగా చేతితో మలచబడటం చూసి ఆశ్చర్యానికి లోనయ్యాం. అలా మా ప్రయాణం తర్వాతి రోజు ఆస్ట్రియాలోని క్రిస్టల్ షోరూమ్ సర్వోస్కి సందర్శనతో ముగిసింది.
 
ఇటలీలో పీసా టవర్...
 
ఆల్ప్స్ పర్వతాల నుంచి మా ప్రయాణం ఇటలీ వైపుగా సాగింది.  ప్రపంచపు అద్భుతాలలో ఒకటైన ‘లీనింగ్ టవర్ ఆఫ్ పీసా’ చూసి మంత్ర ముగ్ధులమైపోయాం. 1174 లో నిర్మించబడ్డ ఈ టవర్ మొదట మెత్తటి మట్టితో కట్టడం ఆరంభించడం వలన ఒక వైపుకి వంగి పోయిందని చెప్పారు. తర్వాత కట్టడం ఆపేసి, 1201లో మళ్ళీ దానిని పునర్మించారు. 1940లో 30 మిలియన్ డాలర్‌లతో దీనిని పటిష్టం చేశారట. దీనిని ‘స్క్వేర్ ఆఫ్ మిరాకిల్స్’ అని కూడా అంటారు. ఇక్కడ మైకలాంజిలో చెక్కిన డేవిడ్ శిల్పంతో పాటు ఇంకా ఎన్నో శిల్పాల ప్రదర్శన అబ్బురపరుస్తుంది.
 
అందానికి మారుపేరు ప్యారిస్
 
ప్రపంచ ఏడు అద్భుతాలలో ఒక్కటైన ఈఫిల్ టవర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అద్భుత కట్టడం 325 మీటర్ల ఎత్తుతో నాటి ఇంజినీర్ల పనితనపు గొప్పదనాన్ని చాటుతున్నట్టుగా ఉంది. ఆ తర్వాత  నెపోలియన్, అతని సైనికుల సమాధులతో పాటు 3,500 ఏళ్ల పురాతనమైన స్తంభాన్ని సందర్శించాం. అనంతరం రాత్రి ప్యారిస్‌లో ప్రఖ్యాతి గాంచిన ‘లిడో షో’ కి వెళ్లాం. అక్కడ నృత్యకారుల వస్త్రాలంకరణ, వేదిక అలంకరణ, అదీ క్షణాలలో మారిపోవడం.. సమయం కూడా గుర్తు రాలేదు. తర్వాత రోజు పిల్లల ప్రపంచమైన డిస్నీవరల్డ్‌ను చుట్టొచ్చాం. అక్కడ పూలతో చేసిన అలంకరణలు, బొమ్మలు, ఊయలలు చూసి పిల్లలు మైమరచి పోయారు. అదేరోజు సాయంత్రం ప్యారిస్‌లోని సెయింట్ నదిలో పడవ ప్రయాణం... ఒక బ్రిడ్జి మరొక బ్రిడ్జి ని పోలి ఉండకపోవడమే ఇక్కడి ప్రత్యేకత. ప్రేమ జంటలు ఇక్కడ ఒక బ్రిడ్జిపై తాళాలు కడతారు. అలా చేయడం వల్ల ఎప్పటికీ విడిపోరని వారి నమ్మకం.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement