ఐఎస్ఐఎస్ అణుదాడి చేయనుందా?
లండన్: కరుడు గట్టిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ శక్తవంతమైన అణుబాంబులతో యూరప్పై దాడి చేసేందుకు ప్రయత్నాలు జరుపుతోందని ఈ విషయాన్ని కొట్టిపారేయలేమని చెబుతున్నారు నిపుణులు. ఇప్పటికే సిరియాలో రసాయన ఆయుధాలతో పెను విధ్వంసం సృష్టిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు అణ్వాయుధాలకోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని.. గత సోవియట్ యూనియన్లో భాగస్వాములుగా ఉన్న పలుదేశాల్లోని న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్లలో ఉన్న తక్కువ భద్రత లాంటి అంశాలు ఐఎస్ఐఎస్కు అనుకూలించేలా ఉన్నాయని ఇంటర్నేషనల్ లగ్జెంబర్గ్ ఫోరం ప్రెసిడెంట్ మోషే కాంటుర్ తెలిపారు.
బ్రసెల్స్ ఎయిర్పోర్ట్లో దాడి జరిపిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు బెల్జియం న్యూక్లియర్ ప్లాంట్పై నిఘా ఉంచడంతో పాటు.. ప్లాంట్లోకి యాక్సెస్ పొందటానికి ప్రయత్నిచారన్నది విచారణలో తేలిందని ఈ సందర్భంగా కాంటుర్ గుర్తు చేశారు. అలాగే ఇరాక్లోని మొసూల్ ప్రాంతాన్ని ఐఎస్ఐఎస్ ఆధీనంలోకి తీసుకున్న తరువాత అక్కడ అణుబాంబు తయారీలో వాడే యురేనియంను ఐఎస్ఐఎస్ పొందగలిగింది అని నివేదికలున్నాయని మాజీ బ్రిటీష్ రక్షణ శాఖ సెక్రటరీ డెస్ బ్రౌన్ వెల్లడించారు. యురోపియన్ దేశాలకే ఈ ముప్పు ఎక్కువని అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.