ముంబై : నిన్నటి దాకా తనతో చనువుగా ఉన్న గర్ల్‌ఫ్రెండ్ తనకు దూరమైందన్న కసితో ఆమెకు బుద్ధి చెప్పాలని తనే ఇరకాటంలో పడిన ప్రబుద్ధుడి నిర్వాకం ముంబైలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే..ఉగ్ర సంస్ధ ఐఎస్ గురించి నగరంలోని ఓ షాపింగ్ మాల్‌లోని పోస్టర్‌పై రాసిన విఖ్రోలికి చెందిన కేత్ గోడ్కేను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు గోడ్కే ఐఎస్ సందేశంతో పాటు ఓ మహిళ, మరో వ్యక్తి ఫోన్ నెంబర్లను కూడా అందులో ప్రస్తావించాడు. ఐసిస్ స్లీపర్ సెల్ చురుకుగా పనిచేస్తోందంటూ ఆ పోస్టర్‌పై నిందితుడు రాశాడని డీసీపీ అవినాష్ అంబురే వెల్లడించారు. ముంబైలోని ప్రముఖ సిద్దివినాయక ఆలయం గురించి కూడా పోస్టర్‌లో ప్రస్తావించాడని చెప్పారు.
కాగా పోస్టర్‌లో పేర్కొన్న మహిళ పోన్ నెంబర్‌ను విచారించగా, నిందితుడితో ఆమెకు ఏడేళ్ల పాటు సన్నిహిత సంబంధం ఉందని, ఆమెను వేధించేందుకే ఆమె నెంబర్‌ను పోస్టర్‌లో రాసినట్టు వెల్లడైందని తెలిపారు. ఆమెకు గుణపాఠం చెప్పేందుకే మహిళతో పాటు ఆమె బాయ్‌ఫ్రెండ్ ఫోన్ నెంబర్ రాశానని నిందితుడు వెల్లడించాడని చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేసి తదుపరి దర్యాప్తును ముమ్మరం చేశామని డీసీపీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment