ఐఎస్పై ముంబై ముస్లింల ఉద్యమం
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు.. ఐఎస్ఐఎస్కు ఏమాత్రం సంబంధం లేదంటూ ఇప్పటికే ముస్లిం నాయకులు చెప్తున్నారు. ఐఎస్ఐఎస్ ఉగ్ర చర్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలు నగరాలు పట్టణాల్లో భారీ ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా కొత్త సంవత్సరం మొదటి రోజు... ముస్లింలకు ప్రీతిపాత్రమైన శుక్రవారంనాడు ముంబై ముస్లింలు ఏకంగా ఓ ప్రత్యేక ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. గత సంవత్సర కాలంగా ప్రపంచవ్యాప్త ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ ఆన్లైన్ నియామకాలను చేపట్టడమే కాక మతాన్ని అడ్డుపెట్టుకొని అనేక దారుణాలకు పాల్పడుతుండటంతో విసిగిపోయిన ముంబై ముస్లింలు... ఉగ్రవాదానికి, హింసకు వ్యతిరేకంగా 'ముస్లిం అగెనెస్ట్ ఐఎస్ఐఎస్' పేరిట అవగాహనా కార్యక్రమాలకు నాంది పలికారు.
ముస్లింలు తమ ఆరాధ్య దైవానికి ప్రార్థనలు జరిపే శుక్రవారంతోపాటు.. కొత్త సంవత్సరం మొదటిరోజున సరికొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు. ఉగ్రవాదానికి, హింసకు వ్యతిరేకంగా పోరాడటంతోపాటు... ముస్లిం యువత ఎటువంటి ఉగ్ర కార్యకలాపాలకు ప్రేరేపితం కాకుండా... ముందు జాగ్రత్త చర్యగా అవగాహన కార్యక్రమాలను ప్రారంభించారు. ముంబైకి చెందిన 'సాహస్ ఫౌండేషన్' , 'థింక్ టాంక్', 'ఉర్తు మర్కజ్' ఆర్గనైజేషన్ల ఆధ్వర్యంలో ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఐఎస్ఐఎస్... ఐఎస్ నియామకాలు, .. ఫేక్ జిహాదీలకు యువత లోబడకుండా ఉండేట్టు వాలంటీర్లు ఆన్ లైన్ తో పాటు పలు రకాలుగా ఈ అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ముఖ్యంగా 'ఐఎస్' ఆన్ లైన్ ప్రచారం ద్వారా రిక్రూట్ మెంట్ జరుపుతుండటం, చదువుకున్న యువతను లక్ష్యంగా చేయడంతో ఆ దిశగా అవగాహన కల్పించేందుకు 'ముస్లిం అగెనెస్ట్ ఐఎస్ఐఎస్' కృషి ప్రారంభించింది. అంతేకాక తీవ్రవాద సంస్థలు అమాయకులను చంపేందుకు ఇస్లాం మతం పేరును వాడుకోవడం అమానుషం అని, నిజానికి ఐఎస్ఐఎస్ చర్యలు ఇస్లాంకు వ్యతిరేకమని ఉర్దు మర్కజ్ అధ్యక్షుడు జుబైర్ అజ్మి తెలిపారు.
ఐఎస్ఐఎస్ రిక్రూటర్లు ఆన్లైన్ ద్వారా నియామకాలు చేపట్టడమే కాక, సాహసోపేతమైన జీవితమంటూ యువతతోపాటు, వారి తల్లిదండ్రులను కూడా నమ్మిస్తున్నారు. అందుకే పిల్లలు హఠాత్తుగా అతి మత తత్వ ధోరణిలో కనిపించినా, ఎక్కువ సమయం సామాజిక నెట్ వర్క్లలో కాలం గడుపుతున్నా వారిని గమనించి తల్లిదండ్రులు 'ముస్లిం అగెనెస్ట్ ఐఎస్ఐఎస్' వాలంటీర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు. అటువంటివారికి సరైన అవగాహన కల్పించి, తిరిగి వారిని మంచి మార్గంలో పెట్టేందుకు ప్రయత్నిస్తామని చెప్తున్నారు.