నాలుక్కరుచుకున్న గూగుల్
న్యూయార్క్: ప్రతిష్టాత్మక సెర్చ్ ఇంజిన్ ముస్లింలపై వివాదాస్పద వాక్యాన్ని చూపించి నాలుక్కరుచుకుంది. క్షణాల్లో తన తప్పును సరిదిద్దుకునే చర్యలకు దిగింది. ఎంతోమంది అలాంటి పదాల్నే ఎక్కువగా ఉపయోగించి రాయడంవల్ల ఆ పొరపాటు జరిగిందని తెలిపింది. ఏం జరిగిందంటే.. హింద్ మక్కీ అనే ఓ బ్లాగర్ ఉగ్రవాదానికి సంబంధించి ముస్లింలు సమర్పిస్తున్న నివేదికల కోసం 'అమెరికన్ ముస్లిమ్స్ రిపోర్ట్ టెర్రరిజం' అని సెర్చ్ చేసింది.
అయితే, దానికి తగిన ఫలితాలు చూపించని గూగుల్ ఆటోమెటిక్ కరెక్షన్ డ్రైవ్.. మీరు అడుగుతుంది 'అమెరికన్లు ఉగ్రవాదానికి సపోర్ట్ చేస్తారు' అనే వాక్యాన్నేనా అని చూపించింది. (డిడ్ యూ మీన్: అమెరికన్ ముస్లిమ్స్ సపోర్ట్ టెర్రరిజం). ఇది చూసి ఆమె అవాక్కయింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ప్రింట్ స్క్రీన్ తీసి తన బ్లాగ్లో పెట్టింది. అయితే, అది గూగుల్ తప్పు కాదని, ఉగ్రవాదానికి ముస్లింలకు సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో ఎంతోమంది ఆ ఫార్మాట్లో సెర్చ్ చేయడం వల్ల ఆ పదాలను గూగుల్ చూపించిందని ఆమె చెప్పింది. ఈ విషయం తెలిసిన గూగుల్ ప్రస్తుతం ఆ వాక్యం దిద్దుబాటు చర్యలకు దిగింది. ప్రస్తుతం ఎవరైనా అమెరికన్ ముస్లిమ్స్ సపోర్ట్ టెర్రరిజం అని సెర్చ్ చేస్తే దానిని డిడ్ యూ మీన్: అమెరికన్ ముస్లిమ్స్ రిపోర్ట్ టెర్రరిజం అని చూపించనుంది.