ఇతడో కురువృద్ధ జిహాది
బీజింగ్: ఇరాక్, సిరియాలో ఇస్లాం రాజ్యం కోసం పోరాడుతున్న ఐఎస్‌ఐఎస్ టెర్రరిస్టుల్లో ఏడెనిమిదేళ్ల బాలురతో పాటు 81 ఏళ్ల కురు వృద్ధుడు కూడా ఉన్నాడు. ఇరాక్‌లోని ఫల్లూజాలో తీవ్రంగా ఎదురు దెబ్బలు తింటున్న ఐఎస్‌ఐఎస్ టెర్రరిస్టుల్లో నైతిక స్థైర్యాన్ని నింపించేందుకు చైనాకు చెందిన ఈ వృద్ధుడు టెర్రరిస్టులతో కలసి పోరాడేందుకు కుటుంబ సభ్యుల సమేతంగా చైనా నుంచి ఇరాక్‌కు తరలి వచ్చాడు. ఇరాక్ సైనిక దాడులకు వెన్ను చూపిస్తున్న తోటి టెర్రరిస్టుల్లో నైతిక స్థైర్యాన్ని పెంచడం కోసం ఇప్పుడు ఈ వృద్ధుడిని ఐఎస్‌ఐఎస్ టెర్రరిస్టు నాయకులు ఉపయోగించుకుంటున్నారు. అందులో భాగంగా తాజాగా ఈ వృద్ధుడి ఫొటోను విడుదల చేశారు.
81 ఏళ్ల మహమ్మద్ అమిన్ చైనాలోని జింజియాంగ్ రాష్ట్రంలోని ఉయ్‌గర్ ప్రాంతానికి చెందిన వాడు. అక్కడి మైనారిటీ ముస్లిం గ్రూప్ నాయకుడిగా పనిచేశారు. ఈ ఉయ్‌గర్‌ను ఒకప్పుడు తుర్కిమిస్థాన్ అనే పిలిచేవారు. సిరియాలో తన కుమారుడు జిహాదీగా పోరాడుతూ మరణించడాన్ని వీడియోలో చూసిన ఈ వృద్ధుడు ఇప్పుడు తానే స్వయంగా ఇరాక్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఫల్లూజా వచ్చాడు. ఏడాది క్రితం కూడా ఈ వృద్ధుడిని జిహాదీలు తమ ప్రచారం కోసం వాడుకున్నారు.
ఓ చేతిలో ఏకే 47 తుపాకీని పట్టుకొని ఇస్లాం రాజ్య స్థాపన గురించి మాట్లాడుతున్న ఓ వీడియోను 2015లో ఐఎస్‌ఐఎస్ జిహాదీలు విడుదల చేశారు. ముస్లింల హక్కుల కోసం చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒకప్పుడు పోరాడిన తాను ఇప్పుడు జిహాదీల తరఫున పోరాడేందుకు సైనిక శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యానని, యువకులతోపాటు సమానంగా పోటీ పడి అన్ని పరీక్షల్లో పాసయ్యానని, ఇప్పుడు పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని ఆ వీడియోలో తెలిపారు. చైనా కూడా ముస్లింలను తీవ్రంగా అణచివేస్తోందని ఆయన ఆరోపించారు. ఆ వీడియో సిరియాలో షూట్ చేసినట్లుగా ఉంది.
తుర్కిమిస్థాన్ ప్రాంతం నుంచి కొంతమంది ముస్లింలు జిహాదీల తరఫున పోరాడేందుకు సిరియా వెళ్లారని అప్పట్లో చైనా కూడా అధికారికంగా ప్రకటించింది. జింజియాంగ్‌లోని తూర్పు తుర్కిమిస్థాన్‌ను స్వతంత్య్ర ముస్లిం దేశంగా ప్రకటించాలని అక్కడి ముస్లింలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు.