ముంబై: మహారాష్ట్ర ఎన్సీపీ ( అజిత్ పవార్ వర్గం) సీనియర్ నేత బాబా సిద్ధిఖీ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ హత్య కేసులో సిద్ధిఖీపై కాల్పులు జరిపిన ప్రధాన నిందితుడు శివకుమార్‌ను ఉత్తరప్రదేశ్‌లో అరెస్ట్ చేసినట్లు ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు.
బాబా సిద్ధిఖీ హత్య చేసినప్పటి నుంచి నిందితుడు శివకుమార్ పరారీలో ఉన్న విషయం తెలిసిందే. అతను నేపాల్‌కు పారిపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో.. ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), ముంబై క్రైమ్ బ్రాంచ్ చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌లో పట్టుబడ్డాడు.
శివకుమార్ బాబా సిద్ధిఖీపై కాల్పలు జరపడానికి 9.9 ఎంఎం పిస్టల్‌ను ఉపయోగించినటట్లు పోలీసులు తెలిపారు. అక్టోబర్ 12న బాంద్రా ఈస్ట్‌లోని తన కుమారుడు ఎమ్మెల్యే జీషన్ సిద్ధిక్ కార్యాలయ భవనం బయట ఉన్న సమయంలో సిద్ధిఖీపై మొత్తం ఆరు రౌండ్లు కాల్పులు జరిపాడు. శివకుమార్ అరెస్ట్‌తో.. సిద్ధిఖీ హత్యలో ప్రమేయమున్న ముగ్గురు షూటర్లు అరెస్టు అయ్యారని పోలీసులు తెలిపారు. ఇక.. శివకుమార్ అరెస్టుతో సిద్ధిఖీ హత్య కేసులో ఇప్పటి వరకు మొత్తం 23 మందిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అదేవిధంగా శివకుమార్‌కు ఆశ్రయం కల్పించి.. నేపాల్‌కు పారిపోవడానికి సహకరించినందుకు మరో నలుగురిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.
ఇక..విచారణలో శివ కుమార్ కీలక విషయాలు వెల్లడించారు. తనకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్నట్లు అంగీకరించాడు. లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ ఆదేశాల మేరకే ఈ హత్య జరిగిందని శివ కుమార్ వెల్లడించారు. అన్మోల్ బిష్ణోయ్‌తో తన పరిచయాన్ని లారెన్స్ బిష్ణోయ్ సన్నిహితుడుగా భావిస్తున్న శుభమ్ లోంకర్ పలుసార్లు సులభతరం చేశాడని పేర్కొన్నాడు.
బాబా సిద్ధిఖీపై కాల్పులు జరపడానికి ముందు తనతోపాటు మిగితా షూటర్లతో అన్మోల్ బిష్ణోయ్ టచ్‌లో ఉన్నాడని తెలిపాడు. నిందితులతో కమ్యూనికేట్ చేయడానికి అన్మోల్ బిష్ణోయ్ సోషల్ మీడియా అప్లికేషన్ స్నాప్‌చాట్‌ను ఉపయోగించినట్లు ఇప్పటికే ముంబై పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. అన్మోల్ బిష్ణోయ్.. బాబా సిద్ధిఖీ కుమారుడు జీషన్ సిద్ధిక్ ఫొటోను కూడా షూటర్లతో పంచుకున్నాడని పోలీసులు తెలిపారు. ‘భాను’ అని కూడా పిలువబడే అన్మోల్ బిష్ణోయ్ నకిలీ పాస్‌పోర్ట్‌తో భారతదేశం నుంచి పారిపోయాడు. గత సంవత్సరం కెన్యాలో, ఈ ఏడాది కెనడాలో కనిపించటం గమనార్హం.
మరోవైపు.. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం బయట కాల్పుల ఘటన, 2022లో పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసుకు సంబంధించి అన్మోల్ బిష్ణోయ్‌ను పోలీసులు వెతుకుతున్న విషయం తెలిసిందే. అదేవిధంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) తన మోస్ట్ వాంటెడ్ జాబితాలో అన్మోల్ బిష్ణోయ్ పేరును చేర్చింది. అతన్ని అరెస్టు చేయడానికి ఏదైనా సమాచారం ఇస్తే రూ. 10 లక్షల రివార్డు కూడా ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment