కాల్పుల సమయంలో తూటాలను తప్పించుకునేందుకు నేలపై పడుకున్న సైనికులు
టెహ్రాన్: ఇరాన్‌లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. వార్షిక సైనిక కవాతు జరుగుతుండగా నలుగురు దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 29 మంది చనిపోగా, 57 మంది గాయపడ్డారు. ఇరాక్‌కు సరిహద్దుగా ఉన్న కుజెస్తాన్ ప్రావిన్స్‌లోని ఆవాజ్ పట్టణంలో శనివారం ఈ ఘటన జరిగింది. మృతిచెందినవారిలో సైనికులతో పాటు కవాతు వీక్షించడానికి వచ్చిన ప్రజలు, అధికారులున్నారు.
ఈ దాడి చేసింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది. దాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదుల్లో ముగ్గురిని భద్రతా బలగాలు అక్కడే మట్టుబెట్టగా, ఒకరు గాయాలతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో చనిపోయాడు. అమెరికా మిత్ర దేశమే దాడికి బాధ్యత వహించాలని, ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ అధ్యక్షుడు రౌహానీ అన్నారు.
సౌదీ అరేబియా పాత్ర ఉంది..
1980–88 మధ్య ఇరాక్‌తో జరిగిన యుద్ధానికి స్మారకంగా ఇరాన్ ఏటా సైనిక కవాతు నిర్వహిస్తోంది. ప్రేక్షకులు కూర్చున్న స్టాండ్ వెనక వైపు నుంచి దుండగులు లోనికి చొరబడ్డారని స్థానిక మీడియా పేర్కొంది. సంఘటనా స్థలంలో సాయం కోసం అరుస్తున్న బాధితుల చిత్రాలను పలు టీవీ చానెళ్లు ప్రసారం చేశాయి. తమ శత్రువైన సౌదీ అరేబియా ఈ దాడికి నిధులు సమకూర్చిందని ఇరాన్ సైన్యం ఆరోపించింది.
Comments
Please login to add a commentAdd a comment