సాక్షి, హైదరాబాద్: ఉత్తరాదిలో అదృశ్యమైన ఓ వ్యక్తి నగరంలో శవంగా కనిపిస్తాడు... ఆ రాష్ట్రంలో మిస్సింగ్‌గా ఉన్న ఈ కేసు ఇక్కడ ఆన్‌నోన్ డెడ్‌బాడీగా ఉంటుంది... అనేక కారణాల నేపథ్యంలో ప్రత్యర్థుల్ని హత్య చేస్తున్న నేరగాళ్లు వారి శవాలను వేరే ప్రాంతానికి తరలించి రోడ్లపై పడేస్తున్నారు... రాజధానిలో ఏటా లభిస్తున్న గుర్తుతెలియని మృతదేహాల వెనుక ఇలాంటి కారణాలెన్నో ఉన్నాయి. ఈ కేసుల దర్యాప్తు దశ, దిశ లేకుండా సాగి చివరకు మూతపడుతున్నాయి.
దేశ వ్యాప్తంగా ఉన్న ఈ సమస్యను కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. మిస్సింగ్ కేసులు, గుర్తు తెలియని శవాలతో పాటు నేరగాళ్ల వివరాలతోనే డీఎన్‌ఏ బ్యాంకులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన బిల్లును కేంద్రమంత్రి హర్షవర్ధన్ గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఇది అమల్లోకి వస్తే కేసుల దర్యాప్తులో ఎంతో ఉపయుక్తమని పోలీసులు చెప్తున్నారు. వ్యాపార, ఆర్థిక లావాదేవీలతో పాటు సెక్సువల్ జెలసీ కారణంగా దారుణంగా హత్యలు చేస్తున్నవారు మృతదేహాలను బహిరంగ ప్రదేశాల్లో పడేస్తున్నారు. ఈ తరహా కేసులను కొలిక్కి తీసుకురావడానికి పోలీసులు ముప్పుతిప్పలు పడుతున్నా ఫలితం దక్కట్లేదు. ఇది మరికొందరు ఇదే బాటపట్టడానికి ‘ప్రోత్సాహం’ఇస్తోంది.
ఇదే ఆ దుండగుల ధైర్యం..
హత్య జరిగినప్పుడు పోలీసులు హతుడి చరిత్ర, వ్యాపార/వ్యక్తిగత లావాదేవీలు, ప్రవర్తన తెలుసుకోవడంపై దృష్టి పెడతారు. హత్యకు వీటిలో ఏదో ఒకటి కారణమై.. నిందితులు పట్టుబడే అవకాశం ఉంటుంది. ఘటనాస్థలి, హతుడు లేదా హంతకుడికి సంబంధించి స్థలంలో శవాన్ని వదిలేస్తే అది దర్యాప్తునకు ఆధారంగా మారే చాన్స్ ఉంది. దీంతోనే హంతకులు ఓ వ్యక్తిని చంపిన తరవాత వారిని గుర్తుపట్టే అవకాశం లేకుండా బహిరంగ ప్రదేశాల్లో పడేస్తున్నారు. ఒకవేళ సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు గుర్తించినా... ఈలోపు పరారవడమో, అజ్ఞాతంలోకి వెళ్లిపోవడమో చేస్తున్నారు. ఇలాంటి కేసులు కొలిక్కి వచ్చినా వాటిని న్యాయస్థానాల్లో నిరూపించడానికి ఆధారాలను సేకరించడం అంత తేలిక్కాదు.
‘లుక్‌ఔట్’తో సరిపెట్టాల్సిందే...
ఇలా మృతదేహాలుగా దొరుకుతున్న వారు ఎక్కడో ఒకచోట అదృశ్యం అవుతున్న వారే. ప్రస్తుతం అదృశ్యం కేసులు, గుర్తుతెలియని మృతదేహాల కేసుల దర్యాప్తు మొక్కుబడిగానే సాగుతోంది. వీరి ఫొటోలతో లుక్‌ఔట్ నోటీసులు జారీ చేస్తున్న పోలీసులు వాటిని అన్ని స్టేషన్లకు పంపిస్తున్నారు. ఈ మృతదేహాలు ఎక్కువగా చెడిపోయిన స్థితిలో లభిస్తున్నాయి. మిస్సింగ్ కేసు నమోదు చేసిన మరో ఠాణా అధికారులు ఈ ఫొటోలను చూసినా గుర్తించే స్థితిలో ఉండట్లేదు. ఫలితంగా అనేక అదృశ్యం కేసులు మిస్సింగ్స్ గానే, గుర్తు తెలియని మృతదేహాల కేసులు అలానే ఉండిపోతున్నాయి. దీంతో హత్యలు చేసిన నేరగాళ్లు స్వేచ్ఛగా సమాజంలో సంచరిస్తున్నారు.
‘సుప్రీం’ ఆదేశాలతో కదిలిన కేంద్రం...
గుర్తుతెలియని శవాలకు సంబంధించి ఓ కేసును విచారించిన సుప్రీం కోర్టు 2015, జనవరిలో కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసుల్ని కొలిక్కి తెచ్చేందుకు సమగ్ర విధానాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించింది. దీంతో కదిలిన కేంద్రం డీఎన్‌ఏ బ్యాంకులుగా సమాచార నిధి ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించింది. దీనికోసం తయారు చేసిన ముసాయిదా బిల్లు ప్రకారం దేశంలోని అన్ని జిల్లాలు, కమిషనరేట్లలో డీఎన్‌ఏ నమూనాల సేకరణ, పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. గుర్తుతెలియని మృతదేహాలు, మిస్సింగ్ కేసుల డీఎన్‌ఏను సేకరించి విశ్లేషించడంతో పాటు భద్రపరుస్తారు.
అన్నీ తేలతాయి..
ఈ బ్యాంకుల ఏర్పాటుతో ఓపక్క మిస్సింగ్ కేసులతో పాటు మరోపక్క అన్‌నోన్ డెడ్‌బాడీస్ గుట్టు రట్టవుతుందని అధికారులు చెప్తున్నారు. ఎవరైనా తమ వారు తప్పిపోయారని ఫిర్యాదు చేస్తే సంబంధీకుల డీఎన్‌ఏను సేకరిస్తారు. అలాగే గుర్తుతెలియని శవాల డీఎన్‌ఏను భద్రపరుస్తారు.
ఈ వివరాలతో దేశ వ్యాప్తంగా సెంట్రలైజ్డ్ డేటాబేస్ సిద్ధమవుతుంది. ఫలితంగా ఓ రాష్ట్రంలో తప్పిపోయి, మరో రాష్ట్రంలో శవంగా మారిన వారి వివరాలను తక్షణం గుర్తించే వీలుంటుంది. దీంతో పాటు మతిస్థిమితం లేక ఓ చోట తప్పిపోయి మరోచోట పోలీసుల చెంతకు చేరుతున్న వారి వివరాలూ తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. దీంతో దారుణహత్యలకు పాల్పడుతున్న నేరగాళ్లను జైలుకు పంపేందుకు ఆస్కారం ఉంటుందని నగర అధికారులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment