The Digital Personal Data Protection Bill 2023 Passed in Lok Sabha - Sakshi
Sakshi News home page

Data Protection Bill:డేటా పరిరక్షణ బిల్లు.. పౌరుల డిజిటల్‌హక్కుల బలోపేతం

Published Mon, Aug 7 2023 3:54 PM

The Digital Personal Data Protection Bill 2023 passed in Lok Sabha - Sakshi

ఢిల్లీ: దేశ పౌరుల డిజిటల్‌హక్కుల్ని బలోపేతం చేయడం కోసం కేంద్రం తీసుకొచ్చిన డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ బిల్లు.. లోక్‌సభలో ఎట్టకేలకు పాసైంది. కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం ఆగస్టు 3న లోక్‌సభలో ఈ బిల్లుని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ‘గోప్యత’ దెబ్బతింటుందన్న విపక్షాల అనుమాన ఆందోళనల నడుమే ఇవాళ బిల్లు పాస్‌ కావడం గమనార్హం. 

డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్-2023 బిల్లు ప్రకారం..  ఒక వ్యక్తి వ్యక్తిగత సమాచారాన్ని ఒక సంస్థ సేకరించాలనుకున్నప్పుడు, ఆ వ్యక్తి నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. డిజిటల్‌ యూజర్ల డేటా గోప్యతను కాపాడలేకపోయినా, సమాచార దుర్వినియోగానికి పాల్పడినా రూ.50 కోట్ల నుంచి గరిష్టంగా 250 కోట్ల రూపాయల జరిమానా విధిస్తారని కేంద్ర ఐటీశాఖ మంత్రి(సహాయ) రాజీవ్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. 

ఈ చట్టం అమలు కోసం డేటా ప్రొటెక్షన్‌ బోర్డు ఆఫ్‌ఇండియాను ఏర్పాటు చేస్తారు. ఈ బిల్లులోని నిబంధనం ప్రకారం.. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా బోర్డు రిఫరెన్స్‌తో కేంద్రం ఏదైనా సమాచారాన్ని బ్లాక్‌ చేసేందుకు పర్మిషన్‌ ఉంటుంది. 

ఆన్‌లైన్‌ వేదికల్లో.. వ్యక్తుల నుంచి సమాచార దుర్వినియోగం విపరీతంగా జరుగుతుంటుంది. ఈ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం గనుక పొందితే.. ప్రతి పౌరుడి డిజిటల్‌ హక్కులకు రక్షణ లభిస్తుంది అని కేంద్రం చెబుతోంది.  కొత్త డేటా ప్రొటెక్షన్ బిల్లుతో సోషల్ మీడియా కంపెనీల ఇష్టారాజ్యానికి ప్రభుత్వం అడ్డుకట్ట వేయనుంది. 

బిల్లులోని ముఖ్యాంశాలు
ఈ బిల్లు భారతదేశంలోని డిజిటల్ వ్యక్తిగత డేటాను ఆన్‌లైన్‌లో సేకరించిన.. ఆఫ్‌లైన్‌లో సేకరించి డిజిటలైజ్ చేయబడిన వాటి ప్రాసెసింగ్‌కు వర్తిస్తుంది.
► వ్యక్తిగత డేటా ఆ వ్యక్తి సమ్మతితో చట్టబద్ధమైన ప్రయోజనం కోసం మాత్రమే ప్రాసెస్ చేయబడుతుంది. వినియోగదారుల డేటాను ఉపయోగించడానికి కంపెనీలు ఇప్పుడు అనుమతి తీసుకోవాలి.
► డేటా విశ్వసనీయులు డేటా ఖచ్చితత్వాన్ని నిర్వహించడానికి, డేటాను సురక్షితంగా ఉంచడానికి, దాని ప్రయోజనం అందించిన తర్వాత డేటాను తొలగించడానికి బాధ్యత వహిస్తారు.
► సమాచారాన్ని స్వీకరించే, సరిదిద్దే, తొలగించే హక్కు, ఫిర్యాదులను పరిష్కరించే హక్కుతో సహా వ్యక్తులకు ఈ బిల్లు నిర్దిష్ట హక్కులను అందిస్తుంది.
► రాష్ట్ర భద్రత, పబ్లిక్ ఆర్డర్, నేరాల నిరోధం వంటి కారణాలతో బిల్లులోని నిబంధనలను అమలు చేయడం నుంచి ప్రభుత్వ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇవ్వవచ్చు.
 

ఇదీ చదవండి: కుటుంబ పాలన.. క్విట్‌ ఇండియా

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement