ప్రేమ, మానవత్వంతో కూడిన రాజకీయాలు కావాలి
వయనాడ్ ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యలు
వయనాడ్: దేశంలో నేడు ప్రధానమైన పోరాటం రాజ్యాంగ పరిరక్షణ కోసమే జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. ‘‘రాజ్యాంగాన్ని ఆగ్రహం, విద్వేషంతో కాకుండా ప్రేమ, ఆప్యాయత, వినయంతో రాశారు. అంతటి విశిష్టమైన రాజ్యాంగాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. పౌరులుగా మనం పొందుతున్న రక్షణ, దేశ ఔన్నత్యం తదితరాలకు రాజ్యాంగమే కారణభూతం’’ అన్నారు.
కేరళలో వయనాడ్ లోక్‌సభ స్థానం పరిధిలోని మనాంథావాడీలో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. వయనాడ్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి, తన సోదరి ప్రియాంకా గాంధీ కోసం ప్రచారం చేశారు. ‘‘ప్రేమకు, విద్వేషానికి ఆత్మవిశ్వాసానికి, అభద్రతకు మధ్య నేడు యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో నెగ్గాలంటే విద్వేషాన్ని, ఆగ్రహావేశాలను హృదయం నుంచి తొలగించుకోవాలి. ప్రేమ, అనురాగం, వినయాలను నింపుకోవాలి’’ అని సూచించారు. తన సోదరిని గెలిపించాలని ప్రజలను కోరారు.
ప్రియాంక కోసం తాను ఓట్లు అభ్యరి్థంచడం ఇదే తొలిసారని రాహుల్ గుర్తు చేశారు. తండ్రి రాజీవ్ గాంధీ హత్య కేసులోదోషి అయిన నళినిని ఆప్యాయంగా హత్తుకున్న మంచి మనస్సు తన చెల్లిదన్నారు. ప్రేమ, సానుభూతి, మానవత్వంతో కూడిన ఇలాంటి రాజకీయాలే మనకు కావాలని ఉద్ఘాటించారు. రాహుల్ తన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ పేరును ప్రస్తావించలేదు. ‘‘మోదీ గురించి చెప్పీ చెప్పీ బోరు కొట్టేసింది. అందుకే ఆయన ప్రస్తావన తేవడం లేదు’’ అన్నారు. అనంతరం రాహుల్ అరీకోడు పట్టణంలో ప్రచారంలో పాల్గొన్నారు. వయనాడ్‌లో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నట్టు చెప్పారు.
సంపన్న మిత్రుల కోసమే ఆరాటం
ప్రధాని మోదీపై ప్రియాంక మరోసారి నిప్పులు చెరిగారు. కొందరు బడా పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసమే మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు. సంపన్న మిత్రుల సేవలో ప్రధాని తరిస్తున్నారని ఎద్దేవా చేశారు. మనాంథావాడీలో సభలో ఆమె ప్రసంగించారు. ‘‘పేదలకు మంచి చేయాలన్న ఆలోచన మోదీకి అస్సలు లేదు. ప్రజలకు మంచి విద్య, వైద్యం, యువతకు ఉద్యోగాలివ్వాలన్న ఉద్దేశం లేదు. దేశ ప్రజల మధ్య మోదీ సర్కారు చిచ్చుపెడుతోంది. వారిని విభజిస్తోంది. హక్కులను కాలరాస్తోంది. ప్రజాస్వామిక సంస్థలను దెబ్బతీస్తోంది’’ అని ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment