కేరళలోని వయనాడ్ పార్లమెంట్ స్థానానికి రేపు (బుధవారం) పోలింగ్ జరగనుంది. నిన్న(సోమవారం) వయనాడ్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం చివరి రోజు మూడు ప్రధాన రాజకీయ కూటములు రోడ్‌షోలు నిర్వహించాయి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. సోదరి ప్రియాంకా గాంధీ ప్రచారం చేశారు. 14 లక్షల మంది ఓటర్ల మద్దతు కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రియాంక గాంధీ వాద్రా, సీపీఐకి చెందిన సత్యన్ మొకేరి, బీజేపీకి చెందిన నవ్య హరిదాస్‌లతో సహా మొత్తం 16 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
ఈ ఏడాది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేసి 3.5 లక్షల ఓట్ల ఆధిక్యతతో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే.. ఆయన మరో నియోజకవర్గం రాయ్‌బరేలి నుంచి కూడా విజయం సాధించడంతో.. నిబంధనల రిత్యా వయనాడ్‌ను వదులుకోవాల్సి వచ్చింది. దీంతో ఉప ఎన్నిక అనివార్యం కాగా.. కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబం నుంచే ప్రియాంకా గాంధీని ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దింపింది. రాహుల్ సోదరిని పోటీకి దింపడం ద్వారా యూడీఎఫ్ కంచుకోటగా భావించే సీటును నిలుపుకోవాలని కాంగ్రెస్ యోచిస్తోంది. మరోవైపు.. సీపీఐ, బీజేపీ సైతం ఈ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి కైవసం చేసుకోవాలని భావిస్తున్నాయి.
2019 నుంచి 2024 వరకు వయనాడ్ ఎంపీగా రాహుల్ పదవీకాలం, వయనాడ్ ప్రజల్లో ఆయనకున్న ఆదరణపై కాంగ్రెస్ దృష్టి సారించింది. మరోవైపు.. ప్రజాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడం కోసం రాహుల్ గాంధీ వయనాడ్ నియోజకవర్గాన్ని వదులుకున్నారని ఎల్‌డీఎఫ్, బీజేపీలు కాంగ్రెస్‌పై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ప్రియాంకా గాంధీ గెలిస్తే.. ఆమె కూడా తన సోదరుడిలాగా నియోజకవర్గంలో అందుబాటులో లేకుండా పోతారని బీజేపీ విమర్శలు గుప్పించింది. బీజేపీ విమర్శలకు చెక్ పెడుతూ ప్రియాంకా గాంధీ.. తను క్రమం తప్పకుండా వయనాడ్‌కు వస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.
వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గంలో మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉననా మనంతవాడి (ST), సుల్తాన్ బతేరి (ST), వయనాడ్ జిల్లాలోని కల్పెట్ట, కోజికోడ్ జిల్లాలోని తిరువంబాడి, మలప్పురం జిల్లాలోని ఎరనాడ్, నిలంబూర్, వండూర్. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికల విధుల కోసం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), సాయుధ పోలీసు బెటాలియన్‌కు చెందిన పలు కంపెనీల సిబ్బందితో భద్రత కల్పించినున్నారు. బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్‌కు ముందు 24 గంటల కంట్రోల్ రూమ్‌లు, పోలీస్ పెట్రోలింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక.. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది.
ప్రియాంకా గాంధీ నేపథ్యం..
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కుమార్తె, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ప్రియాంకా గాంధీ వాద్రా తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగారు. 1972, జనవరి 12న పుట్టింది ప్రియాంక గాంధీ. మనస్తత్వశాస్త్రంలో డిగ్రీని, బౌద్ధ స్టడీస్‌లో మాస్టర్స్ పూర్తి చేసింది. 2019లో ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. గత 80 ఏళ్లుగా కాంగ్రెస్ కంచుకోట అయిన రాయ్‌బరేలీలో ఆమె తన తల్లి స్థానంలో నిలబడతారనే అంచనాలు ఒక రేంజ్‌లో వ్యాపించాయి. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై పోటీ చేస్తారని చాలామంది ఊహించారు. కానీ అవి ఊహాగానాలుగానే మిగిలాయి. 2022లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేక పోయింది. దీంతో ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలంటూ పోస్టర్లు వెలిశాయి.
తనకు రూ.12 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా స్పష్టం చేశారు. ఆస్తులు, అప్పుల వివరాలను ఆమె తన అఫిడవిట్‌తో ప్రస్తావించారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో అద్దెలు, బ్యాంకు ఖాతాల్లోని నగదుపై వడ్డీ, ఇతర పెట్టుబడుల ద్వారా మొత్తం రూ.46.39 లక్షల ఆదాయం లభించినట్లు తెలిపారు. రూ.4.24 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయని, తన భర్త రాబర్ట్ వాద్రా బహుమతిగా ఇచ్చిన హోండా సీఆర్‌వీ కారు ఉందని తెలియజేశారు.భర్త రాబర్ట్ వాద్రా ఆస్తుల వివరాలను సైతం ప్రియాం తన అఫిడవిట్‌లో వెల్లడించారు. దీన్నిబట్టి రాబర్ట్‌కు రూ.37.9 కోట్ల విలువైన చరాస్తులు, రూ.27.64 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు స్పష్టమవుతోంది.
బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ నేపథ్యం..
నవ్య 2007లో కాలికట్ యూనివర్సిటీలోని కేఎంసీటీ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశారు. బీటెక్ తర్వాత మెకానికల్ ఇంజనీర్‌గా కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. పాలిటిక్స్‌పై ఆసక్తి ఉండటంతో రాజకీయాల్లోకి వచ్చారు. నవ్య హరిదాస్ కోజికోడ్ కార్పొరేషన్‌లో రెండుసార్లు కౌన్సిలర్‌గా పనిచేశారు. బీజేపీలో మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నవ్వ ఎన్డీఏ అభ్యర్థిగా కొజికోడ్ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ. కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ప్రకారం నవ్య హరిదాస్‌పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. నవ్యకు రూ.1,29,56,264 విలువైన ఆస్తులు ఉన్నాయని, మొత్తం రూ.1,64,978 అప్పులు ఉన్నాయని ఏడీఆర్ తెలిపింది.
సత్యన్ మొకేరి నేపథ్యం..
సత్యన్ మొకేరి సీపీఐకి చెందిన ప్రముఖ నాయకుడు. కోజికోడ్ జిల్లాలోని నాదపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే. 2014లో వయనాడ్ లోక్‌సభ స్థానంలో పోటీ చేసి ఓడిపోయారు. మొకేరి 1987 నుంచి 2001 వరకు కేరళ శాసనసభలో నాదాపురం నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2015లో ఆయన సీపీఐ కేరళ రాష్ట్ర కమిటీకి సహాయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. రైతు సంఘాలతో మొకేరికి మంచి అనుబంధం ఉంది. ఆయన సుదీర్ఘ అనుభవం, వ్యవసాయ సమస్యల పట్ల నిబద్ధత వయనాడ్ ఓటర్లకు ప్రతిధ్వనిస్తుందని ఎల్‌డీఎఫ్ భావిస్తోంది.
:::సాక్షి వెబ్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment