న్యూఢిల్లీ: కీలకమైన నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ) బిల్లును ప్రభుత్వం శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. వైద్య విద్యలో మరింత పారదర్శకత కోసం ఉద్దేశించిన ఈ బిల్లు చట్ట రూపం దాలిస్తే ప్రస్తుతం ఉన్న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్ వస్తుందని ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. వైద్య విద్య విభాగంలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయంటూ పలు ఫిర్యాదులు వస్తుండటంతో ఈ మేరకు సంస్కరణలను చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ బిల్లుపై మరింత అధ్యయనం చేసేందుకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపించాలంటూ కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. అయితే, స్పీకర్ సుమిత్రా మహాజన్ వారి డిమాండ్‌ను తిరస్కరిస్తూ.. సభ్యులు సభా నియమాలను తెలుసుకోవాలన్నారు.
సహకార బ్యాంకులకు పన్ను మినహాయింపు లేదు
వాణిజ్య బ్యాంకుల మాదిరిగా పనిచేస్తున్న సహకార బ్యాంకులకు ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వటం లేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. పరస్పర సహకార భావనను వదిలి లాభాలే లక్ష్యంగా అవి పనిచేస్తున్నందునే పన్ను మినహాయింపు ఇవ్వటం లేదన్నారు. దాదాపు 98 ప్రైవేట్ బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
రాజ్యసభలో...
శుక్రవారం రాజ్యసభ కార్యకలాపాలు ప్రశాంతంగా జరిగాయి. నేతాజీ జయంతిని దేశ్‌ప్రేమ్ దివస్(దేశభక్తి దినం)గా ప్రకటించాలని సీపీఎం బహిష్కృత నేత రితబ్రత బెనర్జీ జీరో అవర్‌లో కోరారు. ‘బెగ్’ అనే మాటను వాడవద్దని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు మరోసారి సభ్యులు, మంత్రులకు సూచించారు. బ్రిటిష్ కాలం నాటి భావజాలాన్ని విడనాడాలని సూచించారు.
పార్లమెంట్‌కు వరుస సెలవులు
శని, ఆదివారాలతోపాటు నూతన సంవత్సరాది సందర్భంగా సోమవారం జనవరి ఒకటో తేదీన సెలవు ప్రకటిస్తూ పార్లమెంట్ ఉభయసభలు నిర్ణయించాయి. జనవరి రెండో తేదీన తిరిగి సమావేశం అవుతాయి. ఈశాన్య రాష్ట్రాల సభ్యుల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
హోమియోపై మరో కమిషన్..
నేషనల్ మెడికల్ కమిషన్ మాదిరిగానే భారత జాతీయ వైద్యవిధానాలు, హోమియోపతి కమిషన్ ఏర్పాటుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్‌లు తాజాగా ప్రతిపాదించాయి.
బిల్లులోని ముఖ్యాంశాలు...
► నేషనల్ మెడికల్ కమిషన్‌కు ఛైర్మన్‌తోపాటు సభ్యులను ప్రభుత్వం నామినేట్ చేస్తుంది.
► ఈ బిల్లు ద్వారా గ్రాడ్యుయేషన్ వైద్య విద్యకు ఒక బోర్డు, పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యవిద్యకు మరో బోర్డు, వైద్య విద్యా సంస్థల గుర్తింపు, సమీక్షకు ఒక బోర్డు, వైద్యుల రిజిస్ట్రేషన్ బోర్డు ఏర్పాటవుతాయి.
► వైద్య కళాశాలలు పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులను ప్రారంభించుకునేందుకు, సీట్లను పెంచుకునేందుకు ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఇకపై ఉండదు.
► వైద్య విద్యలో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు.
► పీజీ చేసిన వారు ప్రాక్టీస్ చేసుకోవాలంటే ప్రత్యేక పరీక్ష రాయాల్సి ఉంటుంది.
లోక్‌సభకు మెడికల్ కమిషన్ బిల్లు
Published Sat, Dec 30 2017 5:47 AM | Last Updated on Tue, Oct 9 2018 7:39 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment