
న్యూఢిల్లీ: బీజేపీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా మరో విడత 2024 లోక్‌సభ ఎన్నికల వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కొనసాగింపు ద్వారా రానున్న రోజుల్లో వరుసగా జరగనున్న కీలక అసెంబ్లీ ఎన్నికలతోపాటు సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి సంస్థాగతంగా మేలు కలుగుతుందని అగ్ర నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. నడ్డా మూడేళ్ల పదవీ కాలం వచ్చే ఏడాది జనవరితో ముగియనుంది. బీజేపీ అత్యున్నత విభాగం పార్లమెంటరీ బోర్డ్ ఆయన పదవీ కాలం మరో విడత పొడిగిస్తూ ఈలోగానే ఒక తీర్మానం ఆమోదిస్తుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.
బీజేపీ రాష్ట్ర విభాగాల్లో సంస్థాగత ఎన్నికలు ఇంకా ప్రారంభం కానప్పటికీ, చీఫ్‌గా నడ్డా కొనసాగుతారని తెలిపాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు ముందు కనీసం సగం రాష్ట్రాల్లోనైనా సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాలనే నిబంధన ఉంది. నడ్డాకు ముందు పార్టీ చీఫ్‌గా ఉన్న అమిత్ షాకు కూడా ఇదే విధమైన కొనసాగింపునిచ్చారు. అప్పట్లో ఎన్నికలు ముగిసిన వెంటనే సంస్థాగత ఎన్నికలు జరిగాయి. అమిత్ షా కేంద్ర కేబినెట్‌లో జాయిన్ కావడంతో జేపీ నడ్డా బీజేపీ చీఫ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ప్రధాని మోదీకి విశ్వాస పాత్రుడిగా, ఆర్‌ఎస్‌ఎస్ నాయకత్వంతో సత్సంబంధాలున్న వ్యక్తిగా నడ్డాకు పేరుంది. పార్టీని విస్తరించి వ్యూహాలను అమలు చేయగల నేతగా నడ్డా పేరు తెచ్చుకున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు, బిహార్‌లో పార్టీ మంచి ఫలితాలను రాబట్టడం వంటివి నడ్డా హయాంలో బీజేపీ సాధించిన విజయాలుగా పేర్కొన్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయం పాలైనప్పటికీ తెలంగాణలో పార్టీ బలం గణనీయంగా పెరగడం వెనుక నడ్డా కృషి ఉందంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment