ఆ అవశేషాలు షీనా బోరావేనా ?
ముంబై: దాదాపు మూడేళ్ల క్రితం రాయ్‌గఢ్ జిల్లాలో దొరికిన గుర్తు తెలియని శవం అవశేషాలు షీనా బోరావేనా ? అయితే వాటిని ఎలా గుర్తించడం ? సాధారణంగా తల్లిదండ్రులు, వారి ఇతర సంతానం డీఎన్‌ఏలతో అవశేషాల నుంచి తీసిన డీఎన్‌ఏను పోల్చి గుర్తిస్తారు. సర్వ సాధారణంగా ముక్కలు ముక్కలుగా నరికిన శవం నుంచి డీఎన్‌ఏను గుర్తించడం దాదాపు అసాధ్యమని ఫోరెన్సిక్ నిపుణులు చెబుతున్నారు. అలాంటప్పుడు మరెలా ఆ అవశేషాలు షీనా బోరావేనా, కాదా ? అన్న అంశాన్ని ఎలా తేల్చాలి ? షీనా బోరా ఇప్పటికీ బతికే ఉందని, అమెరికాలో ఉంటోందని సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితురాలైన ఇంద్రాణి పోలీసు ఇంటరాగేషన్‌లో మాటమార్చిన నేపథ్యంలో ఈ ప్రశ్నకు మరింత బలం చేకూరింది.
ప్రతి మనిషికి ప్రత్యేకమైన పలు వరుస ఉంటుంది. ఆ పలు వరుస ద్వారాగానీ, 2డీ లేదా 3డీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ముఖాన్ని పునర్నిర్మించి కచ్చితంగా గుర్తించవచ్చని ఫోరెన్సిక్ నిపుణలు చెబుతున్నారు. అనుమానిత స్కల్‌పై ముఖం ఫైల్ ఫొటోను సూపర్ ఇంపోజ్ చేసి కూడా గుర్తించవచ్చని వారు అంటున్నారు. ఒకప్పుడు సంచలనం సృష్టించిన నిఠారి హత్య కేసుల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న 19 మంది పిల్లల కపాలాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించి అక్కడ ముఖ పునర్నిర్మాణం ద్వారా 16 మంది పిల్లలను కచ్చితంగా గుర్తించారు. అదే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇక్కడ కూడా ఉపయోగించవచ్చని నిపుణులు తెలియజేశారు. నోయిడా పోలీసులు 2006లో చండీగఢ్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించగా అక్కడి డాక్టర్లు డాక్టర్ సంజీవ్, డాక్టర్ రాజీవ్ గిరోటి (డీఎన్‌ఏ) నిపుణులు కంప్యూటర్ సూపరింపోజ్, 3డీ ద్వారా ముఖాలను పునర్నిర్మించి ఆ కపాలాలు ఎవరివో గుర్తించారు.
ప్రస్తుతం షీనా బోరాగా భావిస్తున్న అవశేషాలను 2012, మే 23వ తేదీన రాయ్‌గఢ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో స్కల్, ఎముకలు, పంటి శాంపిల్స్‌ను ముంబైలోని జేజే ఆస్పత్రికి పంపించారు. ఎలాంటి మిస్సింగ్ కేసు దాఖలు కాకపోవడం, దర్యాప్తు ముందుకు సాగకపోవడం ఆ అవశేషాలు చాలాకాలం జేజే ఆస్పత్రిలోనే ఉండిపోయాయి. అనంతరం వాటిని ఆస్పత్రి వర్గాలు తిరిగి ముంబై పోలీసులకు అప్పగించారు. అవి, ముఖ్యంగా స్కల్, పను వరుస ఇప్పటికీ భద్రంగా ఉన్నాయని షీరా బోరా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు తెలియజేస్తున్నారు.
పంటి వరుస ద్వారా ఆ అవశేషాలు షీనా బోరావేనా ? అన్న విషయాన్ని గుర్తించాలంటే ఆమె ఎప్పుడైన డెంటిస్ట్ దగ్గరికి వెళ్లారా? అన్న విషయం తేలాలి. వెళ్లినట్టయితే అక్కడ అందుకు సంబంధించిన రికార్డులు ఉండాలి. అలా లేనప్పుడు 2 డీ లేదా 3డీ లేదా కంప్యూటర్ సూపర్ ఇంపోజ్ ద్వారా స్కల్‌ను ముఖంగా మార్చి గుర్తించడమే ప్రత్యామ్నాయ మార్గాలు. ఆ సాంకేతిక పరిజ్ఞానం అన్ని ఆస్పత్రుల్లో అందుబాటులో లేదు. ముంబైలోని కెమ్ ఆస్పత్రి, చండీగఢ్‌లోని ఎఫ్‌ఎస్‌ఎల్ ఆస్పత్రిలో మాత్రమే ఉంది. -2డీ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ముఖాన్ని పునర్నిర్మించాలంటే: అనుమానిత వ్యక్తి ఫొటోలు కావాలి. స్కల్ కావాలి. ఒక చిత్రకారుడు, ఓ ఫోరిన్సెక్ ఆంత్రోపాలజిస్ట్ కలసి ముఖాన్ని పనర్నిర్మిస్తారు. కొన్ని సందర్భాల్లో స్కల్ రేడియో గ్రాఫ్‌లను కూడా వినియోగిస్తారు.
-3డీ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ముఖాన్ని పునర్నిర్మించాలంటే: బంకబట్టి, ఇతర పదార్థాలను ఉపయోగించి స్కల్‌ను ముఖ విగ్రహంగా మలుస్తారు. దీనికోసం హై రెసల్యూషన్‌గల త్రీ డెమైన్షనల్ కంప్యూటర్ చిత్రాలను ప్రాతిపదికగా తీసుకుంటారు. ఇందులోనూ చిత్రకారుడు, ఫోరెన్సిక్ ఆంత్రోపాలజిస్ట్ పరస్పర సహకారం అవసరం. ఇదివరకు 2డీ, కంప్యూటర్ చిత్రాల ద్వారా విడివిడిగా ముఖాలను పునర్నిర్మించేవారు. ఇప్పుడు 3డీ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో కంప్యూటర్ చిత్రాలను, 3డీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏకకాలంలో ఉపయోగించి ముఖాలను పునర్నిర్మిస్తున్నారు.