ప్రాచీన మమ్మీ నుంచి డీఎన్ఏ సేకరణ
పరిశోధకులు మొదటిసారి 300 ఏళ్ళనాటి ప్రాచీన డీఎన్ఏ అవశేషాలను కనుగొన్నారు. దక్షిణాఫ్రికాలోని ఓ మమ్మీనుంచి విజయవంతంగా ప్రాచీన డీఎన్ఏ ను వెలికి తీశారు. ముందుగా మమ్మీకి కంప్యూటరరైజ్జ్ టోమోగ్రఫీ (సీటీ స్కాన్) నిర్వహించి డీఎన్ఏ అవశేషాలను గుర్తించారు.
అనాటమికల్ సైన్సెస్ స్కూల్ ప్రొఫెసర్ మెరీనా స్టెయిన్... స్విట్జర్లాండ్ లోని జురిచ్, ప్రెటోరియా, బోట్స్వానా విశ్వవిద్యాలయాలనుంచి వచ్చిన ఇతర అధ్యయనకారుల బృందంతో కలసి ఈ తాజా అధ్యయనాలు నిర్వహించారు. తులిబ్లాక్ కు చెందిన ఇనుప యుగంనాటి మమ్మీపై జరిపిన జన్యు విశ్లేషణ పరిశోధనా ఫలితాలను సౌతాఫ్రికాలోని బోట్స్వానా సైన్స్ జర్నల్ లో ప్రచురించారు. తాజాగా కనుగొన్న ప్రాచీనకాలంనాటి మమ్మీ అవశేషాలు.. అప్పటి జనాభాకు సంబంధించిన విలువైన సమాచారాన్ని తెలిపేందుకు మంచి వనరుగా ఉపయోగిస్తాయని పరిశోధకులు అంటున్నారు. అయితే పరిశోధనలు జరిపిన మమ్మీ.. తులి ప్రాంతానికి చెందిన వ్యక్తిదిగా మొదట్లో భావించిన పరిశోధకులు... అనంతరం మమ్మీ అవశేషాలను బట్టి ఆఫ్రికన్ మాలాలు కలిగిన పురుషుడికి చెందినదిగా గుర్తించారు. అతడి మమ్మీ కదలసి స్థితిలో ఉండి, జంతు చర్మంతో చుట్టి, తాళ్ళతో గట్టిగా కట్టి ఉన్నట్లు పరిశోధనా ఫలితాల్లో ప్రచురించారు.
మమ్మీలోని అంతర్గత అవయవాలు ఏవీ సురక్షితంగా లేవని సీటీ స్కాన్ ద్వారా తెలుసుకున్న పరిశోధక బృదం... అనేక పోస్టు మార్టం లను కూడ నిర్వహించి వెన్నెముక కింది భాగంలో కొన్నిప్రమాదకర మార్పులు చోటు చేసుకున్నట్లు గుర్తించారు. అస్థిపంజరం మాత్రం చెక్కు చెదరకుండా ఉందని తెలుసుకున్నారు.
అయితే వెన్నెముకలో కనిపించిన మార్పులను బట్టి చూస్తే వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తిలా కనిపించిందని, అతడి మరణం ఎప్పుడు జరిగింది, ఏ కారణంగా జరిగింది అన్న వివరాలు ధృవీకరించడం సాధ్యం కాలేదని వెల్లడించారు. శరీరంలో ఎలాంటి గాయాలు ఉన్నట్లు కూడ కనిపించలేదని చెప్పారు. అయితే విజయవంతంగా తాము కనుగొన్న డీఎన్ ఏ విశ్లేషణను బట్టి ఆ వ్యక్తి సోతో సెటస్వానా లేదా ఖోయెసాన్ ప్రాంతానికి చెందిన వాడిగా నిర్థారించవచ్చని పరిశోధకులు చెప్తున్నారు.