
శరవేగంగా పుట్టుకొస్తోంది
టెక్టానిక్ ప్లేట్ల కదలికలే కారణం
విడిపోనున్న ఆఫ్రికా తూర్పు ప్రాంతం
నడుమ ఖాళీలోకి అపార జలరాశి
పలు దేశాలకు కొత్తగా తీర రేఖలు
మహాసముద్రాలు ఐదు అని చిన్నప్పుడు చదువుకున్నాం. కానీ ఆరు అని మార్చుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఆఫ్రికా ఖండాన్ని రెండుగా చీలుస్తూ శరవేగంగా ఆరో మహాసముద్రం పుట్టుకొస్తోంది. ఆ క్రమంలో అక్కడి పలు దేశాలను ఆఫ్రికా నుంచి విడదీయనుంది. మరికొన్నింటిని కొత్తగా సముద్ర తీర దేశాలుగా మార్చేయనుంది.
ఆఫ్రికా దిగువన జరుగుతున్న టెక్టానిక్ ప్లేట్ల కదలికల వల్ల ఇది తప్పదన్నది తెలిసిన విషయమే అయినా, అందుకు కోట్లాది ఏళ్లు పట్టవచ్చని ఇప్పటిదాకా భావించారు. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే ఆరో మహాసముద్రం ఆవిర్భావానికి మహా అయితే కొన్ని వేల ఏళ్ల కంటే ఎక్కువ సమయం పట్టకపోవచ్చని పరిశోధకులు బల్ల గుద్ది చెబుతున్నారు!
టెక్టానిక్ ఫలకాల కదలికల కారణంగా ఆఫ్రికా ఖండం నిలువునా చీలిపోతోంది. వేలాది ఏళ్లుగా స్థిరంగా జరుగుతూ వస్తున్న ఈ పరిణామం కొంతకాలంగా అనూహ్య రీతిలో వేగం పుంజుకుంది. ఆఫ్రికా ఖండం దిగువన నుబియన్, సోమాలీ, ఖండాంతర టెక్టానిక్ ప్లేట్లలో జరుగుతున్న కదలికలే దీనికి ప్రధాన కారణం. అవి ఏటా ఏకంగా దాదాపు ఒక సెంటీమీటర్ మేరకు దూరం జరుగుతున్నాయి!
ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ సిస్టం (ఈఏఆర్‌ఎస్)గా పిలిచే ఈ ప్రాంతం ఇది మొజాంబిక్ నుంచి ఇథియోపియా, కెన్యా, టాంజానియా మీదుగా ఎర్రసముద్రం దాకా వేలాది కిలోమీటర్ల మేర విస్తరించింది. దాని పొడవునా భూగర్భంలో వేలాది ఏళ్లుగా అతి నెమ్మదిగా సాగుతూ వస్తున్న నిరంతర టెక్టానిక్ కదలికల పరిణామం కొన్నాళ్లుగా స్పీడందుకుంది. తూర్పు ఆఫ్రికాను నిలువునా చీలుస్తోంది.
ఫలితంగా చివరికి తూర్పు ఆఫ్రికా క్రమంగా మిగతా ఖండం నుంచి పూర్తిగా విడిపోనుంది. వాటి మధ్య ఏర్పడే ఖాళీలో ఏకంగా 10 వేల బిలియన్ గ్యాలన్ల పై చిలుకు అపార జలరాశి నిండిపోయి సరికొత్త మహాసముద్రంగా రూపుదిద్దుకోనుంది. ఇందుకు సంబంధించిన నిదర్శనాలు ఇప్పటికే కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఇథియోపియాలో 2005 నాటికే ఏకంగా 60 మైళ్ల పొడవున లోతైన గుంత ఏర్పడింది. ఇది పలుచోట్ల ఏకంగా 20 మీటర్ల పై చిలుకు లోతుంది! 2018లో కెన్యాలో కూడా ఇలాంటి భారీ పగుళ్లు పుట్టుకొచ్చాయి.
కారణాలెన్నో...
టెక్టానిక్ కదలికలతో పాటు భూమి లోపలి పొరల్లోని శిలాజ ద్రవం తూర్పు ఆఫ్రికా చీలికను మరింత వేగవంతం చేస్తోంది. క్రమంగా లోపలి పొర పూర్తిగా పగుళ్లిచ్చి భారీ లోయల పుట్టుకకు దారితీస్తుంది. అగి్నప్రమాద కార్యకలాపాలను పెంచుతుంది. 2005లో ఇథియోపియాలో కేవలం కొన్ని వారాల వ్యవధిలోనే ఏకంగా 420కి పైగా భూకంపాలు నమోదయ్యాయి. ఈ పరిణామం సైంటిస్టులతో పాటు పరిశోధకులను కూడా ఎంతగానో ఆశ్చర్యపరిచింది. ఆఫ్రికా ఖండం దిగువ భూ ఫలకాల్లో మార్పులు శరవేగంగా జరుగుతున్నాయనేందుకు ఇది తిరుగులేని నిదర్శనమని వారంటున్నారు. ఇకపై ఆఫ్రికాలో మరిన్ని భూకంపాలు, అగి్నపర్వతాల పేలుళ్ల వంటి పరిణామాలను చూడనున్నామని తులానే వర్సిటీ జియో సైంటిస్టు సింథియా ఎబింగర్ చెప్పుకొచ్చారు.
అట్లాంటిక్ ఇలాగే పుట్టింది...
మహాసముద్రాల్లో వయసురీత్యా అట్లాంటిక్ అన్నింటికంటే చిన్నది. ప్రస్తుత ఆఫ్రికా ఖండం తరహా పగుళ్లే లక్షలాది ఏళ్ల క్రితం దాని పుట్టుకకు దారితీసినట్టు సైంటిస్టులు చెబుతారు. తర్వాత మళ్లీ ఇంతకాలానికి మరో మహాసముద్రం పుట్టుకకు దారి తీయగల స్థాయిలో ఓ ఖండం నిలువునా చీలుతోంది. మహాసముద్రాల ఆవిర్భావ క్రమాన్ని అర్థం చేసుకునేందుకు ఇది చాలా అరుదైన అవకాశమని సైంటిస్టులు అంటున్నారు.
కొత్త ఖండం కూడా...
ఆఫ్రికా చీలిక ఆరో మహాసముద్రంతో పాటు కొత్త ఖండం పుట్టుకకు కూడా దారితీయనుంది. ఎందుకంటే సోమాలియా, కెన్యా, టాంజానియా వంటి దేశాలు ఆఫ్రికా నుంచి పూర్తిగా విడిపోతాయి. ఆరో సముద్రం ఆ మధ్యలో విస్తరిస్తుంది.
లక్షల్లో నిర్వాసితులు...
వాతావరణ మార్పుల దెబ్బకు ఆఫ్రికా ఖండంలో ఇప్పటికే 1.5 కోట్ల మందికి పైగా నిర్వాసితులయ్యారు. ఆ ఖండంలో ఏర్పడుతున్న చీలిక వల్ల పలు దేశాల్లో జీవజాలం తీవ్రంగా ప్రభావితం అవుతుంది. దాంతో మొత్తంగా వాటి ఆర్థిక పరిస్థితులే తారుమారు కానున్నాయి. దాంతో పొట్ట చేత పట్టుకుని వలస వెళ్లే వారి సంఖ్య ఊహాతీతంగా పెరిగిపోనుంది. కొత్త మహాసముద్రం ఆఫ్రికా భౌగోళిక స్వరూపాన్నే సమూలంగా మార్చనుంది.
పలు దేశాల ఆర్థిక, పర్యావరణ, మౌలిక వ్యవస్థలనే తలకిందులు చేయనుంది. చుట్టూ భూభాగాలతో కూడిన జాంబియా, ఉగాండా వంటి దేశాలు కొత్త సముద్ర తీర ప్రాంతాలు మారిపోతాయి. దాంతో కొత్త వర్తక మార్గాలు, ఆ దేశాల్లో నౌకాశ్రయాల వంటివి పుట్టుకొస్తాయి. అలా ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలే సమూలంగా మారిపోతాయి. సరికొత్త సముద్ర వాతావరణ పరిస్థితులు కొత్త ఆవాస ప్రాంతాలుగా మారతాయి. ఈ పరిణామం జీవవైవిధ్యంలో చెప్పుకోదగ్గ మార్పులకు దారి తీస్తుంది. అదే సమయంలో సముద్రమట్టంలో పెరుగుదల మరింత వేగంపుంజుకుంటుంది.
భూభాగాల్లో మార్పుచేర్పులు చోటుచేసుకుంటాయి. అంతేగాక పలుచోట్ల తరచుగా తీవ్ర భూకంపాలు సంభవించవచ్చు. ఇలాంటి పరిణామాల వల్ల వచ్చిపడే తీవ్రమైన రిసు్కలను ఎదుర్కొనేందుకు పలు దేశాలు ఇప్పటినుంచే సిద్ధపడాల్సి ఉంటుంది. కొత్త మహాసముద్రం ఆవిర్భావం వేలాది ఏళ్ల తర్వాత జరిగినా ఆ క్రమంలో తలెత్తే పరిణామాలు ఆఫ్రికా ఖండంపై సమీప భవిష్యత్తు నుంచే కొట్టొచ్చినట్టుగా కన్పించడం మొదలవుతుంది. భూగోళం నిరంతరం పరిణామం చెందుతున్న తీరుకు ఈ పరిణామం మరో తాజా ఉదాహరణ.
దీని ప్రభావాలను పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నంలో భూభౌతిక శాస్త్రవేత్తలు ఇప్పటికే తలమునకలయ్యారు. ఎందుకంటే తూర్పు ఆఫ్రికాలో జరుగుతున్నది కేవలం భౌగోళికపరమైన మార్పు మాత్రమే కాదు. సుదూర భవిష్యత్తులో మరిన్ని ఖండాలు విడిపోయి కొత్త మహాసముద్రాల పుట్టుక వంటివి జరిగి చివరికి మనకిప్పుడు తెలిసిన ప్రపంచమే సమూలంగా, శాశ్వతంగా మారిపోతుందనడానికి తిరుగులేని నిదర్శనం. ఆరో మహాసముద్రం ఆవిర్భావంతో ప్రపంచ భౌగోళిక స్వరూపంతో పాటు పర్యావరణ వ్యవస్థలు కూడా సమూల మార్పులకు లోనవడం ఖాయమని భూ¿ౌతిక శాస్త్రవేత్తలు కుండబద్దలు కొడుతున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment