
ప్రాణాలతో బయటపడిన పెరూ మత్స్యకారుడు
పది రోజుల చేపల వేటకని ఆయన బయలుదేరాడు. తుఫాను దారిని మళ్లించింది. ప్రపంచంలోనే అతి పెద్దదైన పసిఫిక్ మహాసముద్రంలో కొట్టుకుపోయాడు. ఎటు చూసినా నీళ్లు. నెల.. రెండు నెలలు.. మూడు నెలలు.. సముద్రంలోనే జీవితం. సరైన ఆహారం లేదు. మంచి నీరు కూడా లేదు. అయినా బతకాలన్న ఆశ అతడిని ఒడ్డున చేర్చింది. 95 రోజుల తరువాత గస్తీ బృందానికి దొరికాడు. సినిమా స్టోరీని తలపిస్తున్న ఈ కథ.. పెరూవియన్ మాక్సిమో నాపా కాస్ట్రో నిజ జీవితం.
పెరూవియన్ తీరంలోని మార్కోనా పట్టణానికి చెందిన మాక్సిమో డిసెంబర్ 7న ఫిషింగ్ కోసం బయలుదేరాడు. రెండు వారాల ట్రిప్. అందుకు తగ్గట్టుగానే ఆహారాన్ని కూడా పఆయక్ చేసుకున్నాడు. పది రోజుల తరువాత వచి్చన తుఫాను అతని పడవను దారి మళ్లించింది. పసిఫిక్ మహాసముద్రంలో కొట్టుకుపోయాడు. అతని కుటుంబం, పెరూ సముద్ర గస్తీ దళాలు వెదకడం మొదలెట్టాయి. మరోవైపు నట్ట నడి సముద్రంలో తప్పిపోయిన మాక్సిమోకు ఎటు చూసినా నీళ్లు. కుటుంబంపైనే ధ్యాస. తన తల్లి గురించి, నెలల వయసున్న మనవరాలి గురించిన ఆలోచనలే.
అవే ఆయన జీవితంపై ఆశ.. ఎలాగైనా బతికి ఒడ్డుకు చేరాలన్న స్ఫూర్తిని ఇచ్చాయి. వర్షపు నీటిని ఒడిసి పట్టుకుని తాగాడు. బతకడం కోసం కీటకాలు, పక్షులు, తాబేలును తిన్నాడు. ఎవరో ఒకరు కనిపెట్టేవరకూ తాను బతికుండాలన్న ఆశ అతని ప్రాణాలను నిటబెట్టింది. నాపా కాస్ట్రో కుటుంబం, మత్స్యకారుల బృందాలు మూడు నెలలుగా గాలిస్తూనే ఉన్నాయి. మూడు నెలలైనా ఆచూకీ దొరకలేదు. అయినా అటు కుటుంబం ఆశలు వదులు కోలేదు. ‘‘నాన్న నీవు రాకపోవడం మాకు అంతులేని బాధ. ఈ పరిస్థితిని ఎదుర్కొంటామని మేము ఎప్పుడూ అనుకోలేదు. మిమ్మల్ని కనుగొంటామనే ఆశ ఉంది’అని అతని కుమార్తె మార్చి 3న ఫేస్‌బుక్‌లో రాసింది.
సరిగ్గా ఇది జరిగిన 8 రోజులకు మార్చి 11న ఈక్వడార్ గస్తీ బృందం ఫిషింగ్ బోటులో ఆయనను కనుగొన్నది తీరానికి 1,094 కి.మీ దూరంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న మాక్సిమోను రక్షించింది. వెంటనే ఈక్వెడార్, పెరూ సరిహద్దుకు సమీపంలోని పైటాలోని న్యూస్ట్రా సెనోరా డి లాస్ మెర్సిడెస్ ఆసుపత్రికి తరలించింది. గత 15 రోజులుగా ఏమీ తినకుండా ఉండటంతో తీవ్ర డీహడ్రేషన్‌కు గురయ్యారని వైద్యులు తెలిపారు. చికిత్స అనంతరం మాక్సిమో సోదరుడికి అప్పగించారు. తన తండ్రి ప్రాణాలను కాపాడిన కుమార్తె ఇనెస్ నాపా టొర్రెస్ కృతజ్ఞతలు తెలిపింది. ‘ఈక్వెడార్ సోదరులారా>, నా తండ్రి గాటన్‌ను రక్షించినందుకు ధన్యవాదాలు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు’అని ఆమె ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment