
ఎవరైనా సరే తమ ఇంటి లోపలికి అడుగు పెడితే అలంకారానికి ముగ్ధులైపోవాలని కోరుకుంటారు. ఇంటి గుమ్మం ఆహ్వానం పలికేలా ఎంత అందంగా అలంకరించుకోవచ్చో చూద్దాం..
భారతీయ హస్త కళలు లేదా ఎంబ్రాయిడరీ చేసిన క్లాత్స్‌తో ఉన్న వాల్ హ్యాంగింగ్స్ గుమ్మం ముందు వేలాడదీస్తే తక్షణమే ప్రవేశ ద్వారం అలంకరణ కళాత్మకంగా మారిపోతుంది. అంతేకాదు, మనదైన సాంస్కృతిక వారసత్వానికి అద్దం పడుతుంది.
గణేశుడు లేదా బుద్ధుని విగ్రహాలు గుమ్మం దగ్గర ఉంచడంతో ప్రవేశ ద్వారానికి ఆధ్యాత్మికత అలంకారంగా మారిపోతుంది. అంతేకాదు, ఈ విగ్రహాలు ప్రశాంతతను కలిగిస్తాయి.
మొక్కలు లేదా చిన్న నీటి సౌకర్యంతో మీ ప్రవేశ ద్వారంలోకి ప్రకృతిని తీసుకువచ్చి, ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించవచ్చు. తక్కువ కాంతిపడినా ఏపుగా పెరిగే ఇండోర్ మొక్కలను ఇందుకు ఎంచుకోవాలి.
చిన్నా పెద్ద గంటలున్న హ్యాంగింగ్‌ను వేలాడదీయడం వల్ల తలుపు తెరిచినప్పుడల్లా గంటలు శ్రావ్యంగా మోగుతూ, మనసుకు ఉల్లాసం కలిగిస్తాయి. గంటలు ప్రతికూల శక్తిని దూరం చేసి ఇంటికి సానుకూలతను తీసుకువస్తాయని మనలో చాలామందికి నమ్మకం.
బంతిపూలు లేదా మల్లెపూలు వంటి తాజా పువ్వులు మీ ప్రవేశ ద్వారానికి సువాసనను, అందాన్ని ఇనుమడింపజేస్తాయి. వాటిని కుండీలో అలంకరించినా, దండగా అల్లి ద్వారానికి వేలాడదీసినా చూసేవారిని ఇట్టే ఆకట్టుకుంటాయి.
డిజైన్లలో ఉన్న కుండలు, టెర్రకోట శిల్పాలు.. వంటి సాంçస్కృతిక కళాఖండాలతో ప్రవేశ ద్వారానికి ప్రత్యేకమైన అందాన్ని తీసుకురావచ్చు.