
భౌతిక శాస్త్ర సూత్రాలపై అవగాహన
వేటకు అనువైన కర్రపుల్లల ఎంపిక
చింపాంజీలను మన పూర్వీకులుగా చెబుతారు. అదెంత నిజమో గానీ మనిషిలాగే వాటికి కూడా భౌతిక శాస్త్ర సూత్రాలు బాగానే వంటబట్టాయని తాజా అధ్యయనంలో తేలింది. కడుపు నింపుకునేందుకు చెద పురుగులను తినడం చింపాంజీలకు అలవాటు. ఎర్రమట్టిలో, మెత్తటి నేలలు, మట్టి దిబ్బల్లో చెదపురుగులను చేత్తో ఏరకుండా, బొరియల్లో చెదలను ఒంపులు తిరిగిన కర్ర పుల్లలతో ఒడుపుగా పట్టుకోవడం వాటికి వెన్నతో పెట్టిన విద్య. అందుకోసం కనిపించిన కర్రపుల్లనల్లా వాడేయకుండా తమకు చక్కగా పనికొచ్చే పుల్లను మాత్రమే వేటకు వినియోగిస్తాయట.
దాంతో, ఏ పుల్ల బాగా అక్కరకొస్తుందన్నది చింపాంజీలు ఎలా కనిపెడతాయో తెల్సుకోవాలనే జిజ్ఞాస పరిశోధకుల్లో ఎక్కువైంది. భౌతికశాస్త్రంపై వాటికి పట్టు ఎలా చిక్కిందనే అంశంపై పరిశోధన మొదలెట్టారు. వాటిలోనూ అభిజ్ఞాన వికాసం ఎక్కువేనని అందులో తేలింది. ఈ వివరాలు ఐసైన్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. గట్టిగా ఉండే పుల్లలకు బదులు స్ప్రింగ్‌లాగా ఒంగిపోయే లక్షణమున్న కాస్తంత గట్టి పుల్లలతో వేట సులభమవుతుందని చింపాంజీలు గ్రహించాయని, ఇవి వాటిలోని సహజ సంగ్రహణ సామర్థ్యం వల్లే సాధ్యమైందని పరిశోధకులు చెబుతున్నారు.
మట్టిదిబ్బల్లో మహా ఒడుపుగా
మట్టిదిబ్బల్లో ఇబ్బడిముబ్బడిగా చెదపురుగులు ఉంటాయి. చైనా వాళ్లు నూడుల్స్‌ను ఎలాగైతే తెల్లని సన్నని చిన్న కర్రపుల్లతో తింటారో అచ్చం అలాగే చింపాంజీలు చెదపురుగులను పుల్లలకు అంటుకునేలా చేసి ఆబగా ఆరగిస్తాయి. అలాగే అలా తినాలంటే వాటికి సహజసిద్ధ పుల్లలు కావాలి. మట్టిదిబ్బ బురద బొరియలో ఒకసారి లోపలికి దూర్చాక బయటకు తీస్తే మట్టి బరువుకు పుల్ల విరిగిపోవచ్చు. మెత్తడి పుల్ల తీసుకుంటే మట్టి తడికి మెత్తబడిపోతుంది. అలాగని గట్టి పుల్ల తీసుకుంటే గట్టిగా లాగితే విరిగిపోతుంది. దీంతో మెత్తబడని, సులువుగా ఒంగిపోయే బలమైన పుల్ల అవసరం చింపాంజీలకు ఏర్పడింది.
బిరుసుగా ఉండే కర్రపుల్లకు బదులు బురద బొరియల్లో అలవోకగా ఒంగుతూ దూరిపోయే ఫ్లెక్సిబుల్ పుల్లతోనే పని సులువు అవుతుందని చింపాంజీలు కనిపెట్టాయని పరిశోధనల్లో ముఖ్య రచయిత అలెజాండ్రా పాస్కల్ గరిడో చెప్పారు. ‘‘ దగ్గర్లోని ప్రతి పుల్లను అవి మొదట సరిచూస్తాయి. మెత్తగా ఉందా, గట్టిగా ఉందా, వంచేస్తే విరుగుతుందా, ఎంత కోణం వరకు విరగకుండా వంగగలదు? ఇలాంటి టెస్ట్‌లన్నింటినీ పుల్లలపై చేస్తాయి. అన్ని టెస్టుల్లో పాసైన పుల్లనే చెదపురుగుల వేటకు వినియోగిస్తాయి. టాంజానియా దేశంలోని గాంబే నేషనల్ పార్క్‌లోని చింపాంజీల వేట విధానాలపై ఈ పరిశోధన చేశారు.
అడవిలో భిన్న రకాల చెట్ల నుంచి ఒకతరహా పుల్లలు వస్తున్నప్పటికీ కొత్త జాతుల చెట్ల పుల్లలనే చింపాంజీలు వినియోగిస్తుండటం విశేషం. చింపాంజీలు నివసించే ప్రదేశాల్లో వేర్వేరు రకాల పుల్లలు ఉన్నప్పటికీ ఏకంగా 175 శాతం ఎక్కువగా ఒంగిపోయే సామర్థ్యమున్న పుల్లలనే చింపాంజీలు ఎంపికచేసి వాడుతున్నాయి. ఒకే జాతి చెట్ల పుల్లల్లో ఒంగిపోయే గుణమున్నా, ఎక్కువ ఒంగే లక్షణమున్న ఉపజాతి చెట్ల పుల్లలనే అవి కనిపెట్టి వాడుతుండటం చూస్తుంటే వీటిని నిజంగా ఫిజిక్స్ మీద మంచి పట్టు ఉన్నట్లు చెప్పొచ్చు’’ అని పాస్కల్ వ్యాఖ్యానించారు.
‘‘ ఒంగే పుల్లల్లోనూ ఏది ప్రస్తుతం వాడేందుకు అనువుగా ఉంది అనే అంశాన్ని తీరా వేట మొదలెట్టేటప్పుడూ పరీక్షించి చూస్తున్నాయి. తోటి చింపాంజీ ఏ రకం పుల్లను వాడుతోంది? అది పుల్లను ఎలా వినియోగిస్తోంది? వేట ఫలితం బాగుందా? అనే వాటినీ పక్కక ఉన్న మరో చింపాంజీ గమనిస్తుంది. మానవుల పూర్వీకులు సైతం ఇలాగే సమష్టిగా వేటాడుతూ వనోత్పత్తులను తమ వేటకు ఉపకరణాలుగా వాడుకునేవారు.
ఇలాగే చెక్క సంబంధ వస్తువుల వినియోగంలో విప్లవాత్మక మార్పులు సాధ్యమయ్యాయి’’ అని పాస్కల్ వ్యాఖ్యానించారు. ‘‘ చింపాంజీలపై చేసిన ఈ పరిశోధన వాటికి ఏ పుల్ల అనువుగా ఉంది, అందుబాటులో ఉంది అనేది మాత్రమే కాదు వాటి అభిజ్ఞానవికాస స్థాయినీ తెలియజేస్తోంది. మన ఇంజనీరింగ్ సామర్థ్యాలు వేల సంవత్సరాల క్రితమే పరిణామ క్రమంలో మనలో ఇమిడిపోయాయనడానికి ఇదొక తార్కాణం. ఆదిమ మానవుల కాలం నుంచే అనాదిగా మనిషిలో ఇలా మేధాశక్తి పరంపరగా వస్తోంది’’ అని ఆయన అన్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్