
ఎడ్యుటెక్ యూనికార్న్ ఫిజిక్స్‌వాలా పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు ముందస్తు గోప్యతా దరఖాస్తు ద్వారా సెబీని ఆశ్రయించింది. దీంతో ప్రాస్పెక్టస్ వివరాలను పబ్లిక్‌కు వెల్లడించకుండా నిలువరించేందుకు కంపెనీకి వీలుంటుంది. కాగా.. స్టాక్ ఎక్స్ఛేంజీల మెయిన్‌బోర్డులో లిస్టయ్యేందుకు వీలుగా సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసినట్లు ఫిజిక్స్‌వాలా తాజాగా ప్రకటించింది. అయితే ముందస్తు ఫైలింగ్ ద్వారా ఐపీవోకు వెళ్లడంపై గ్యారంటీలేదని స్పష్టం చేసింది. వెరసి ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ, సూపర్‌మార్ట్ కంపెనీ విశాల్ మెగా మార్ట్ బాటలో ఐపీవోకు గోప్యతా దరఖాస్తును ఎంచుకుంది.
పలు కంపెనీలు..
ఇంతకుముందు 2023లోనూ ఆతిథ్య రంగ కంపెనీ ఓయో కాన్ఫిడెన్షియల్ మార్గంలో సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. అంతకంటే ముందు 2022 డిసెంబర్‌లో టాటా ప్లే(స్కై) రహస్య దరఖాస్తు చేసి 2023 ఏప్రిల్‌లో సెబీ అనుమతి పొందింది. అయితే ఈ రెండు సంస్థలూ పబ్లిక్ ఇష్యూ చేపట్టకపోవడం గమనార్హం! కాగా.. 2020లో ఏర్పాటైన ఫిజిక్స్‌వాలా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్, హైబ్రిడ్ విధానాల్లో దేశవ్యాప్తంగా విద్యార్ధులకు శిక్షణ ఇస్తోంది. గతేడాది సెప్టెంబర్‌లో హార్న్‌బిల్ క్యాపిటల్ ఆధ్వర్యంలో 21 కోట్ల డాలర్ల(రూ.1,800 కోట్లు) పెట్టుబడులు అందుకుంది. 2.8 బిలియన్ డాలర్ల విలువలో నిధులు సమకూర్చుకుంది. ముందస్తు ఫైలింగ్ ఎంచుకుంటే సెబీ తుది అనుమతి తదుపరి ఐపీవోకు 18 నెలల గడువు లభిస్తుంది. సాధారణ పద్ధతిలో అయితే 12 నెలల్లోగా పబ్లిక్ ఇష్యూ చేపట్టవలసి ఉంటుంది.
ఇదీ చదవండి: మున్సిపల్ బాండ్లకు వెబ్‌సైట్
రూ.550 కోట్లపై కన్ను
ప్యాకేజింగ్ సొల్యూషన్స్ కంపెనీ ఎస్‌ఎస్‌ఎఫ్ ప్లాస్టిక్స్ సెబీకి ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. వీటి ప్రకారం రూ. 550 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఐపీవోలో భాగంగా రూ.300 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 250 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, సంబంధిత సంస్థలు విక్రయానికి ఉంచనున్నాయి. ప్రస్తుతం ప్రమోటర్లు 100 శాతం వాటా కలిగి ఉన్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, ప్లాంటు, మెషీనరీ తదితర పెట్టుబడి వ్యయాలతోపాటు సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. కంపెనీ ప్రధానంగా బాటిళ్లు, కంటెయినర్లు, మూతలు, టబ్‌లు, ఇంజినీరింగ్ ప్లాస్టిక్ విడిభాగాలు తదితర ఉత్పత్తులను రూపొందిస్తోంది. వ్యక్తిగత సంరక్షణ, పానీయాలు, కన్జూమర్ ఎల్రక్టానిక్స్, లూబ్రికెంట్స్, ఫార్మాస్యూటికల్స్ రంగాలలో ప్రొడక్టులను వినియోగిస్తారు. 2024 సెప్టెంబర్‌తో ముగిసిన ఆరు నెలల్లో రూ.397 కోట్ల ఆదాయం, రూ.15 కోట్ల నికర లాభం ఆర్జించింది.
Comments
Please login to add a commentAdd a comment