Principles
-
ఈక్విటీల్లో విజయానికి.. బఫెట్ పంచ సూత్రాలు
2020 నుంచి రెండేళ్లపాటు తారాజువ్వలా సాగిన ఈక్విటీల ర్యాలీ చూసి మార్కెట్లోకి ఉత్సాహంగా అడుగుపెట్టిన యువ ఇన్వెస్టర్లు బోలెడు మంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితులు వారిని ఇప్పుడు అయోమయానికి గురిచేయవచ్చు. అంతెందుకు సుదీర్ఘకాలం నుంచి మార్కెట్లో ఉన్న వారు సైతం షేర్ల ధరలు పేకమేడల్లా రాలుతున్నప్పుడు స్థిరంగా చూస్తూ ఉండలేరు. నష్టానికైనా అమ్ముకుని బయటపడదామనుకుంటారు. కానీ, ఈక్విటీ మార్కెట్లకు సంక్షోభాలు కొత్త కాదు కదా! ఎన్నో స్కాములు, ఆర్థిక మాంద్యాలు, యుద్ధాలను చూసి పడిపోయాయి. అంతే బలంగా పైకి లేచి నిలబడ్డాయి. ఈక్విటీల్లో విజయానికి ముందుగా కావాల్సింది పెట్టుబడి కాదు. విజయ సూత్రాలు. వారెన్ బఫెట్ వంటి విఖ్యాత ఇన్వెస్టర్ల అనుభవాలు, సూత్రాలు లోతుగా పరిశీలిస్తే ఈక్విటీ తత్వం కొంతైనా బోధపడుతుంది. వారెన్ బఫెట్ పెట్టుబడుల కంపెనీ బెర్క్‌షైర్ హాతవే 1970 నుంచి ఏటా వాటాదారులకు వార్షిక నివేదిక పంపిస్తుంటుంది. ఇందులో వాటాదారులను ఉద్దేశించి బఫెట్ రాసే లేఖ ఇన్వెస్టర్లకు ఒక చుక్కానిలా పనిచేస్తుంది. బఫెట్ అనుసరించిన సూత్రాలు కాల పరీక్షకు నిలబడినవి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. కరోనా విపత్తు, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, రష్యాపై అమెరికా, ఐరోపా దేశాల ఆర్థిక ఆంక్షలు, చైనాలో మందగమనం, అమెరికాలో పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, చమురు ధరల శరాఘాతం, దీర్ఘకాలం పాటు ఆర్థిక స్తబ్దత, రూపాయి బలహీనత ఇలా చెప్పుకోవడానికి చాలానే ఉన్నాయి. ఒకవైపు వృద్ధికి ప్రోత్సాహం కావాలి. మరోవైపు ధరలకు కట్టడి వేయాలి. సెంట్రల్ బ్యాంకులకు ఇదొక సవాలుగా మారిపోయింది. ధరల పెరుగుదలకు సరఫరా వ్యవస్థలో సమస్యలూ తోడయ్యాయి. ఇలా ఒకటికి మించిన ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు ఈక్విటీ మార్కెట్లను మరోసారి ఆటుపోట్లకు గురిచేస్తున్నాయి. స్వల్పకాలంలో కనిపించే ఇలాంటి ప్రకంపనలకు కదిలిపోతే దీర్ఘకాలం పాటు మార్కెట్లో నిలిచి రాణించడం అసాధ్యం. ద్రవ్యోల్బణం ప్రభావం ద్రవ్యోల్బణం ఎగసిపడడం అన్నది తాత్కాలికమేనన్న వాదన గతేడాది నుంచి వినిపిస్తోంది. కానీ, ఇది నిజం కాదు. అభివృద్ధి చెందిన దేశాల్లో దీర్ఘకాలంగా తక్కువ ద్రవ్యోల్బణం ఉంది. ఫలితంగా దీర్ఘకాలం పాటు సరళతర విధానాలు కొనసాగడం వల్ల ఉండే రిస్క్‌ను ఇన్వెస్టర్లు, విశ్లేషకులు, ఆర్థికవేత్తలు సైతం సరిగ్గా అంచనా వేయలేకపోయారు. కానీ, ఇప్పుడు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అధిక ద్రవ్యోల్బణం నడుమ సెంట్రల్ బ్యాంకుల ముందున్న ఏకైక మార్గం ద్రవ్య పరపతి విధానాలను కఠినతరం చేయడమే. ఇన్నాళ్లూ తక్కువ వడ్డీ రేట్లు, మిక్కిలి ద్రవ్య లభ్యతతో లాభపడిన మార్కెట్లు.. పరిస్థితులకు తగ్గట్టు మార్పునకూ గురి కావాల్సిందే. వడ్డీ రేట్లు పెరగడం స్టాక్స్‌కు ప్రతికూలమే. ద్రవ్యోల్బణాన్ని బఫెట్ టేప్వార్మ్తో పోల్చారు. టేప్‌వార్మ్‌లు పేగుల లోపలి గోడల్లో ఉండి మనం తీసుకునే ఆహారంలోని శక్తిని గ్రహిస్తుంటాయి. అలాగే, ద్రవ్యోల్బణం కంపెనీల నిధుల శక్తిని హరిస్తుంటుంది. రుణాలను భారంగా మారుస్తుంది. అధిక ద్రవ్యోల్బణం తర్వాత కనిపించేది అధిక వడ్డీ రేట్లే. అందుకుని మార్కెట్లు ఖరీదుగా మారినప్పుడు, వడ్డీ రేట్లు పెరిగే తరుణంలో మిగులు నిధులను బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తానని బఫెట్ తన 1986 లేఖలో పేర్కొన్నారు. వడ్డీ రేట్లు పెరిగితే టేప్‌వార్మ్ మాదిరిగా ఏ స్టాక్స్ విలువలు హరించుకుపోతాయన్న విశ్లేషణ చేయాలి. కమోడిటీలు ఇన్‌పుట్‌గా (ముడి సరుకులుగా) వ్యాపారం చేసేవి, అధిక రుణభారంతో నడిచే కంపెనీలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 2008 ప్రపంచ ఆర్థిక మాంద్యం తర్వాత ఏం జరిగిందో గుర్తు చేసుకోవాలి. అప్పటి వరకు రుణాల అండతో ఇన్ఫ్రా, పవర్ కంపెనీలు దూకుడు ప్రదర్శించగా.. ఆ తర్వాత కుదేలయ్యాయి. రుణాలు తీర్చలేక ఎన్నో కనుమరుగయ్యాయి. పెన్నీ షేర్లుగా మారిపోయినవీ ఉన్నాయి. వడ్డీ రేట్ల సైకిల్ మారే దశలో ఇలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలి. అలాగే, నష్టాలతో వచ్చే న్యూఏజ్ కంపెనీలపైనా ఈ పరిణామాలు ప్రభావం చూపిస్తాయి. భద్రత పాళ్లు ఎంత? 1991, 1993 వార్షిక లేఖల్లో బఫెట్ ‘మార్జిన్ ఆఫ్ సేఫ్టీ’ (భద్రత) గురించి ప్రస్తావించారు. పెట్టుబడి విజయంలో దీని పాత్ర ఎంతో ఉంటుందన్నది ఆయన అనుభవ సారం. స్టాక్స్ విలువను మదింపు వేసే విషయంలో ఊహించిన, ఊహించని రిస్క్‌లను పరిగణనలోకి తీసుకోకపోవడం కూడా నష్టాలకు దారితీస్తుంది. వచ్చే పదేళ్ల పాటు మార్కెట్లలో సానుకూల పరిస్థితులు ఉంటాయని వినడా నికి బాగానే ఉంటుంది. కానీ వాస్తవంలో ఇది సాధ్యమేనా? ద్రవ్యోల్బణం, భౌగోళిక ఉద్రిక్తతలు, కంపెనీలకు సంబంధించి రిస్క్‌లు వీటన్నింటిని పరిగణనలోకి తీసుకోవాలి. లాభాల్లేకుండా ఏటా మార్కెట్ వాటా పెంపు కోసం నష్టాలను అధికం చేసుకుంటూ వెళ్లే కంపెనీలకు సంబంధించి భవిష్యత్తు అంచనాలు ఎంతో ఆకర్షణీయంగానే ఉంటాయి. కానీ, ఆర్జించే ఆదాయానికి 3,000 రెట్లు ధర పలుకుతున్న ఆయా కంపెనీల్లో మీరు పెట్టే పెట్టుబడికి భద్రత పాళ్లు ఎంత? ఎన్నో రేట్ల అధిక స్పందన అందుకున్న ఇటీవలి జొమాటో, పేటీఎం, నైకా, పీబీ ఫిన్‌టెక్, కార్‌ట్రేడ్ షేర్లు.. లిస్ట్ అయిన తర్వాత గరిష్టాల నుంచి చూస్తే 40–70 శాతం స్థాయిలో పడిపోయాయి. కానీ, ద్రవ్యోల్బణం ప్రభావం వీటిపై ఇంకా ప్రతిఫలించాల్సి ఉందన్నది విశ్లేషకుల అభిప్రాయం. జొమాటో రూ.76 ధరకు ఐపీవో తీసుకురాగా, ఆ తర్వాత రూ.179 వరకు వెళ్లింది. ఇప్పడు రూ.79 వద్ద ట్రేడవుతోంది. విలువను సరిగ్గా అంచనా కట్టకుండా రూ.150–179 మధ్య పెట్టుబడులు పెట్టిన వారి స్థితి ఏంటి? వారు మార్జిన్ ఆఫ్ సేఫ్టీని పట్టించుకోలేదన్నది స్పష్టం. స్పెక్యులేషన్‌కు దూరం దీర్ఘకాలంలో సంపదను సృష్టించుకోవాలంటే స్పెక్యులేటర్గా ఉండకూడదని బఫెట్ చెబుతారు. పెట్టుబడులు, స్పెక్యులేషన్ వేర్వేరు. ఈ రెండింటి మధ్య విభజన గీత స్పష్టంగా ఉంచుకోవాల్సిందే. ఫలానా షేరు ఎప్పుడూ అధిక వ్యాల్యూషన్లలో, ర్యాలీ చేస్తుండడమే మీ పెట్టుబడి వెనుక కారణం అయి ఉంటే, షేరు ధర కంపెనీ మూలాలను ప్రతిఫలించడం లేదంటే అది స్పెక్యులేషన్ అవుతుంది. అయినా కానీ, లాభాలు రావచ్చు. మన దేశంలో కొన్ని పాపులర్ స్టాక్స్ కొన్నేళ్ల పాటు అసాధారణ వ్యాల్యూషన్లతోనే ట్రేడవుతుంటాయి. కానీ, ఒక్కసారిగా ఆయా కంపెనీల్లో నిర్మాణాత్మక మార్పులు చోటు చేసుకుంటే ఈ వ్యాల్యూషన్లు శాశ్వతంగా దెబ్బతింటాయి. ఉదాహరణకు పెయింట్స్ స్టాక్స్ ఎప్పుడూ అధిక వ్యాల్యూషన్లలోనే, అంతర్గత విలువకుపైనే ట్రేడవుతుంటాయి. కానీ, చమురు ధరలు భారీగా పెరిగిపోవడంతో ఇప్పుడు వాటి ధరలు దిగొస్తున్నాయి. చమురు ధరలు దీర్ఘకాలం పాటు గరిష్ట స్థాయిల్లోనే కొనసాగితే పెయింట్స్ స్టాక్స్ మరింత తగ్గే అవకాశం ఉంటుంది. అదే సమయంలో వృద్ధి అవకాశాలూ సన్నగిల్లుతాయి. ఎందుకంటే ఆయా కంపెనీలు ధరలను పెంచితే విక్రయాలపై ప్రభావం పడుతుంది. అం దుకని పెట్టుబడికి స్పెక్యులేషన్ ధోరణి పనికిరాదు. అంతర్గత విలువ కంపెనీకి ఫలానా ధర పెట్టొచ్చా అన్నది ఎలా తెలుస్తుంది? దీనికి అంతర్గత విలువను (ఇంట్రిన్సిక్ వ్యాల్యూ) చూడడం బఫెట్ అనుసరించే సూత్రాల్లో మరొకటి. బెర్క్‌షైర్ వాటాదారులకు బఫెట్ తరచుగా దీన్ని సూచిస్తుంటారు కూడా. కంపెనీ వ్యాపారం నుంచి తీసుకోతగిన ‘డిస్కౌంటెడ్ క్యాష్ వ్యాల్యూ’ను అంతర్గత విలువగా బఫెట్ చెబుతారు. కానీ పెట్టుబడుల నిపుణులకు సైతం ఇది కొరుకుపడని అంశం. ఇందుకు సంబంధించి ఎవరికి వారు తమదైన లెక్కింపు విధానాలను అనుసరిస్తుంటారు. కంపెనీకి సంబంధించి నికర పుస్తక విలువను అంచనా వేసి, దానికి సమీప భవిష్యత్తులో వచ్చే క్యాష్ ఫ్లో, ప్రస్తుత లాభాలను కలిపితే అంతర్గత విలువ వస్తుంది. ఇవన్నీ కష్టంగా అనిపించిన వారు.. కంపెనీ లాభాలు ఆ కంపెనీ గత చరిత్ర సగటు స్థాయిలోనే ఉన్నాయా? అని చూడాలి. తర్వాత స్టాక్ ధర చారిత్రకంగా (గతంతో పోలిస్తే) సగటు వ్యాల్యూషన్ల స్థాయిలోనే ఉందా, అంతకంటే ఎక్కువ ఉందా? గమనించాలి. ఒకవేళ స్టాక్ ధర చారిత్రక సగటు వ్యాల్యూషన్లకు ఎగువన ట్రేడ్ అవుతుంటే అంతర్గత విలువకు మించి ట్రేడవుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. భారత్‌లో గడిచిన దశాబ్ద కాలంలో కంపెనీల లాభాల వృద్ధి కంటే వాటి స్టాక్స్ వ్యాల్యూషన్ల పెరుగుదల ఎక్కువగా ఉంది. దీంతో అవి అంతర్గత విలువను దాటిపోయి ట్రేడవుతున్నాయి. 2011 నుంచి 2021 వరకు నిఫ్టీ–50 ఇండెక్స్ 275 శాతం రాబడులను ఇచ్చింది. కానీ ఈ మొత్తంలో 170 శాతం రాబడులు పీఈ రేషియో పెరగడం రూపంలోనే వచ్చాయి. కానీ, ఫండమెంటల్స్ మెరుగుపడడం వల్ల కాదు. అదంతా బబుల్గానే భావించాల్సి ఉంటుంది. పెరుగుదల వెనుక వాస్తవ బలం 100 శాతంగానే భావించాలి. ఇలాంటప్పుడు అంతర్గత విలువకు లభించే స్టాక్స్ తక్కువగానే ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. సరైన ధర సరైన ధర వచ్చే వరకు వేచి చూడాలి.. ఇన్వెస్టర్లకు 1993 లేఖలో బఫెట్ ఇచ్చిన సూచన ఇది. పెట్టుబడులకు సంబంధించి ఎలా నడుచుకోవాలో తెలియని ఇన్వెస్టర్లను మార్కెట్ క్షమించదని ఆయన చెబుతారు. అత్యుత్తమమైన కంపెనీ అయినా సరే షేరు ధర సహేతుక స్థాయి వద్ద ఉన్నప్పుడే ఇన్వెస్ట్ చేయాలన్నది బఫెట్ అనుసరించే సూత్రం. ఒక కంపెనీకి సంబంధించి ఆయన అనుసరించే అంశాలను గమనిస్తే.. ఎంపిక చేసుకునే కంపెనీ చేస్తున్న వ్యాపారం అర్థం చేసుకోవడానికి వీలుగా ఉండాలి. దీర్ఘకాలం పాటు అనుకూలతలు ఆ కంపెనీకి ఉండాలి. సమర్థులైన, నిజాయతీపరులైన వ్యక్తులు నడిపిస్తుండాలి. ఆకర్షణీయమైన ధర వద్ద ఉండాలి. వీటిల్లో మొదటి మూడు అంశాలకు రైట్ మార్కులు పడే కంపెనీలను ఆయన ఎన్నో సందర్భాల్లో గుర్తిస్తూనే ఉంటారు. కానీ, నాలుగో అంశమైన ఆకర్షణీయమైన ధర వద్ద లేకపోవడంతో బఫెట్ పెట్టుబడులకు దూరంగా ఉన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మార్కెట్లో ప్రతి పతనం పెట్టుబడికి అవకాశం కావాలనేమీ లేదు. కొన్ని సందర్భాల్లో కంపెనీలో మార్పులు చోటు చేసుకోవచ్చు. ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కారణం కావచ్చు. పెట్టుబడులకు ముందు భిన్నమైన అంశాలను విశ్లేషించుకోవాలని, వేగంగా స్పందించకుండా ఓపిక పట్టాలన్నది బఫెట్ ఫిలాసఫీ. పెట్టే ధర విషయంలో రిస్క్ తీసుకోవడం బఫెట్‌కు నచ్చదు. అవకాశం వచ్చే వరకు ఓపిక పట్టడమే ఆయన అనుసరించే విధానం. చక్కని అవకాశాలన్నవి మళ్లీ మళ్లీ వస్తుంటాయని ఆయన నమ్ముతారు. అందుకనే అందరూ ఎగబడి కొంటున్న వేళ అప్రమత్తంగా వ్యవహరించాలని.. అందరూ విక్రయిస్తున్న వేళ కొనుగోళ్లకు మొగ్గు చూపాలన్నది బఫెట్‌కు ఫలితాలిచ్చిన సూత్రాల్లో ఒకటి. ఎగసిపడే కెరటాన్ని పట్టుకోకుండా.. అది నేలను తాకే వరకు ఆగాలంటారు. 100–150–200 పీఈ వ్యాల్యూషన్ల వద్ద ట్రేడవుతున్న స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టే ముందు అయినా బఫెట్ సూత్రాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. -
సముద్రప్రాంత సహకారానికి పంచ సూత్రాలు
ఐక్యరాజ్యసమితి: సముద్రప్రాంత రక్షణలో ప్రపంచ దేశాల మధ్య సహకారం పెరగాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దేశాల మధ్య సముద్ర జల వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నారు. సముద్ర జలాల్లో విద్రోహ శక్తులతో ఎదురయ్యే సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కోవాలన్నారు. సముద్ర ప్రాంత రక్షణ పెంపు–అంతర్జాతీయ సహకారం అంశంపై ఐరాస భద్రతామండలిలో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన చర్చకు మోదీ అధ్యక్షత వహించారు. సముద్ర ప్రాంత వివాదాలను పరిష్కరించుకునేందుకు ఐదు సూత్రాలతో కూడిన సముద్ర సమ్మిళిత రక్షణ వ్యూహాన్ని ప్రతిపాదించారు. ఆ పంచ సూత్రాలివే.. ► ప్రపంచ ప్రగతి సముద్ర ప్రాంత వాణిజ్యం క్రియాశీలతపైనే ఆధారపడి ఉంది. చట్టపరమైన సముద్ర వాణిజ్యానికి అవరోధాలను తొలగించాలి. ► సముద్ర జల వివాదాలను శాంతియుతంగా, అంతర్జాతీయ చట్టాల ప్రాతిపదికన పరిష్కరించుకోవాలి. ప్రపంచ శాంతి, సుస్థిరతలకు ఏకైక మార్గం ఇదే. ► ప్రకృతి వైపరీత్యాలు, విద్రోహ శక్తుల కారణంగా తలెత్తే సవాళ్లను అంతర్జాతీయ సమాజం కలిసికట్టుగా ఎదుర్కోవాలి. ఈ విషయంలో ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించుకునేందుకు భారత్ ఇప్పటికే పలు చర్యలు తీసుకుంది. ► సముద్ర పాంత పర్యావరణం, వనరులను కాపాడుకోవడం, జవాబుదారీతనంతో కూడిన సముద్ర ప్రాంత అనుసంధానితను ప్రోత్సహించడం. ఈ సందర్భంగా జరిగిన చర్చలో రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ..వివిధ ప్రాంతాల్లో జరిగే సముద్ర నేరాలపై ప్రత్యక్షంగా పోరాడేందుకు ఐరాస ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. సముద్ర జలాల్లో సముద్రపు దొంగలు, ఉగ్రవాదులపై కొన్ని దేశాలు సొంతంగా పోరాడలేకపోతున్నాయని ఆయన చెప్పారు. దక్షిణ చైనా సముద్ర జలాల్లో తలెత్తిన వివాదం భద్రత, వాణిజ్యం విషయంలో అంతర్జాతీయంగా తీవ్ర పర్యవసానాలకు దారి తీస్తుందని అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ తెలిపారు. నియమోల్లంఘన ప్రతి చోటా నష్టానికి, అస్థిరతకు ఆజ్యం పోస్తుందని చైనానుద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. -
కరోనా కట్టడికి 15 సూత్రాలు..
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా 15 జాగ్రత్తలతో కూడిన ఇలస్ట్రేటివ్ గైడ్ విడుదల చేసింది. ఈ సూత్రాల ఆధారం గా మనమంతా జాగ్రత్తగా ఉంటే కరోనాపై గెలుపు సాధిస్తామని సూచించింది. మరింత సులువుగా అర్థం చేసుకునేలా చిత్రాత్మక మార్గదర్శకాలను వైబ్సైట్లో ఉంచింది. దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నా యి. అత్యవసర పనులుంటే తప్ప బయటకు రావొద్దని, ముఖ్యంగా పదేళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్లు పైబడిన వాళ్లు ఇల్లు విడిచి రావొద్దని మార్గదర్శకాల్లో కేంద్రం సూచించింది. ఆ 15 సూత్రాలివే.. పలకరింపును భౌతిక స్పర్శతో కాకుండా దూరంగా నమస్కారం చేయాలి. వ్యక్తికి, వ్యక్తికి మధ్య కనీసం 2 గజాల (6 అడుగులు) దూరాన్ని పాటించాలి. ముఖానికి మాస్కు ధరించాలి. కళ్లను, నోరు, ముక్కును చేతితో తాకకూడదు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందుల్లేకుండా పరిశుభ్రత చర్యలు పాటించాలి. చేతులను శానిటైజర్ లేదా సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడం, పాన్‌మసాలా తిని ఉమ్మివేయొద్దు. తరచుగా తాకే ప్రదేశాలు, వస్తువులను డిస్ఇన్ఫెక్ట్ చేయాలి. అనవసర ప్రయాణాలు మానుకోవాలి. ఇతరుల పట్ల వివక్ష చూపకూడదు. సమూహాలుగా గుమిగూడటం మానుకోవాలి. అసత్య వార్తలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయొద్దు. కరోనా సమాచారాన్ని విశ్వసనీయత కలిగిన వ్యక్తులు, సంస్థల నుంచి తెలుసుకోవాలి. సందేహాలుంటే జాతీయ హెల్ప్‌లైన్ 1075, రాష్ట్ర హెల్ప్‌లైన్ 104కు ఫోన్ చేయాలి.. ఒత్తిడి, ఆత్రుతకు గురైతే నిపుణుల సహకారం తీసుకోవాలి. -
చర్చలు రగిలించిన మానవతామూర్తి
నివాళి సాగర్‌లో రెసిడెన్షియల్ వ్యవస్థ అంత గొప్పగా ఉండటానికి కారణం వై.వి. రెడ్డి లాంటి ప్రిన్సిపాళ్లు ఉండటమే. ఒక విద్యాసంస్థను తీర్చిదిద్దడంలో సఫలీకృతులయ్యారు. ఉపదేశాలకు బదులు విద్యార్థుల్లో ఆలోచనలు రేపే చర్చలు రగిలించేవారు. ప్రతి ప్రిన్సిపాల్ తనకన్నా ముందున్న ప్రిన్సిపాళ్లను పిల్లలు విమర్శిస్తే సంతోషపడతారు. దాని వలన తన గౌరవం పెరుగుతుంది అనుకుంటారు. కానీ వై.వి రెడ్డి (వై. వెంకటరెడ్డి) తనకన్నా ముందున్న ప్రిన్సిపాళ్లను పొగిడితే సంతోషపడతాడు. ఈనాడు తన కుర్చీని పటిష్టంగా చేసింది వారే కదా అంటాడు. తన కన్న ముందున్న ప్రిన్సిపాళ్లను ఎంతో గౌరవంగా చూసేవాడు. ఆయనను నేను ప్రిన్సిపాల్‌గా, పొలిటికల్ సైన్స్ లెక్చరర్‌గా చూశాను. తనతో ఏకీభవించనివాళ్లను వాళ్లముందే విమర్శిస్తాడు. కానీ వారు లేనప్పుడు వారి మంచితనాన్ని పొగుడుతాడు. ఇది చాలామందిలో ఉండదు. మానవత్వానికి ప్రతీక ఆయన. ఆయనే నాగార్జున సాగర్ ఎ.పి.రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీకి నా తర్వాత వచ్చిన ప్రిన్సిపాల్. అలాంటి మనిషి విద్యార్థులకే కాదు, నాలాంటి వారికి కూడా ఆదర్శనీయం. చనిపోయిన తర్వాత వచ్చే కీర్తి అది శాశ్వత కీర్తి. బతికున్నప్పుడు వచ్చే కీర్తి నీళ్ల మీద రాతలే. కొందరు వ్యక్తులు ఎక్కడికి వెళ్లినా ఏ ప్రాంతానికి వెళ్లినా, తమ పనిద్వారా, నడవడిక ద్వారా ప్రత్యేకముద్ర వేస్తారు. తరగతి గది అంటే అది సిలబస్‌కు, పరీక్షలు నిర్వహించటానికి మాత్రమే కేంద్రం కాదు. తరగతి గదిని పరీక్షలతో పాటుగా భవిష్యత్ సమాజంలో విద్యార్ధులు జీవితంలో ఎదుర్కోబోయే సమస్యలకు కూడా సన్నద్ధం చేస్తారు. వై.వి. రెడ్డి నల్గొండ ఎన్.జి. కాలేజీలో పనిచేస్తున్నప్పుడు నాకు సహ అధ్యాపకుడు. ఆయన ప్రతిరోజు దేశంలో, ప్రపంచంలో పత్రికల్లో వచ్చే వార్తలను విశ్లేషించి చెప్పేవాడు. వార్తల రూపం వెనుక ఏం జరిగి ఉంటుందని విశ్లేషించి చెప్పేవాడు. పలానా దేశంలో పరిస్థితులు ఏమిటి? అక్కడ ప్రజల చైతన్యస్థాయి ఏమిటి? ప్రజలు ఇలాంటి సమస్యలపై ఏ రకంగా ప్రతిస్పందిస్తారు అన్న అంశాలను నల్గొండ స్టాఫ్ రూమ్‌లో కూర్చున్నప్పుడు ఆయన చెప్పిన మాటలు మా మదిలో ఎప్పటికీ గుర్తుకు వస్తుంటాయి. వై.వి. రెడ్డి ప్రతిరోజు విద్యార్థుల అసెంబ్లీలో మాట్లాడే మాటల విశ్లేషణలు విన్నాను. విద్యార్థులకు ఆయన హితోపదేశాలు చేసేవాడు కాదు. విద్యార్థులు ఆలోచించుకోవటానికి అనుగుణమైన చర్చను మాత్రం వారిలో రగిలించేవాడు. సమస్యలకు పరిష్కారం చెప్పేవాడుకాదు. కానీ పిల్లలను పాత్రధారులను చేసేవారు. దాని వల్ల ఆ స్కూల్లో చదువుకున్న పిల్లలు ఈనాడు సైంటిస్టులుగా, పాలనా రంగంలో, వివిధ వృత్తుల్లో ఉన్నతమైన దశలో ఉన్నారు. ఏ సమస్యకైనా, ఏ సవాళ్లకైనా పరిష్కారాలు చెప్పే పాలనాదక్షులయ్యారు. అలా ఒక విద్యాసంస్థను తీర్చిదిద్దడంలో వై.వి. రెడ్డి సఫలీకృతులయ్యారు. ప్రిన్సిపాలే పరిష్కారం చెబితే అతని గొప్పతనం మాత్రమే బయటపడుతుంది. కానీ అందులో పిల్లలను నిమగ్నం చేస్తే వాళ్లు భవిష్యత్‌ను నిర్ణయిస్తారు. దాంతో భవిష్యత్ నిర్మాణం జరుగుతుంది. వై.వి. రెడ్డి దీర్ఘదృష్టి కలవాడు. కోదాడ డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న సమయంలో అక్కడి విద్యార్థులకు.. సమాజానికి కాలేజీకి మధ్య సంబంధం ఎలా ఉంటుందో ఆయన ఆచరణ ద్వారా చెప్పగలిగాడు. నాగార్జునసాగర్‌లో ప్రిన్సిపాల్‌గా ఉండి దేశానికి అవసరమైన పాలనాదక్షులను తయారుచేయటానికి దోహదపడ్డాడు. ఖమ్మంలో ఆయనపైన నక్సలైట్లకు ఆశ్రయం ఇచ్చిన వ్యక్తిగా ముద్ర పడింది. ఎమర్జెన్సీ కాలంలో అనేక సమస్యలను ఎదుర్కొన్నాడు. సాగర్‌లో డిగ్రీ చదువులో రెసిడెన్షియల్ వ్యవస్థ అంత గొప్పగా ఉండటానికి కారణం వై.వి. రెడ్డి లాంటి ప్రిన్సిపాళ్లు ఉండటమే. ఒక ప్రిన్సిపాల్‌ను అంచనా వేయాలంటే ఆయన పనిచేసిన కాలేజీలో లక్ష్యం ఏమేరకు చేరుకోగలిగారో అదే గీటురాయిగా చెప్పవచ్చు. పరిశోధన అంటే సబ్జెక్టుపై సంపూర్ణ అవగాహన ఉండాలి. అంటే ప్రస్తుతం ఉన్న విజ్ఞానం నుంచి పరిశోధనాత్మకమైన దృక్కోణం రావాలి. దానికి కావాల్సింది సబ్జెక్టుపైన అవగాహనే. పరిశోధనాత్మక దృక్కోణం ఉన్న టీచర్లను తీసుకోవాలి. అదే కోణంలో ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీకాలేజీల్లో అధ్యాపకుల నియామకం జరిగింది. అంతకుముందే డిగ్రీ కాలేజీల్లో పనిచేసిన అనుభవం ఉన్నవారిని తీసుకొన్నారు. ఇలాంటి మనుషులను తీసుకొన్నట్లయితే పరిశోధనకు అవసరమైన విద్యార్థులు తయారవుతారని దూరదృష్టితో ఈ రెసిడెన్షియల్ వ్యవస్థను నిర్మిం చారు. దీన్ని నిర్వహించే ప్రిన్సిపాళ్లకు కూడా ఈ లక్ష్యంవైపుకు తీసుకుపోయే శక్తిసామర్థ్యాలు ఉండాలి. ఆనాటి రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ వ్యవస్థ విద్యార్థులను ఆర్ఈసీలకు, పిల్లలను ఐఐటీలకు పంపి సాంకేతిక మానవ సంపదను తయారుచేసేది. అదే విధంగా డిగ్రీల్లో మానవీయశాస్త్రాలు, సైన్స్ సబ్జెక్టులలో రీసెర్చ్ చేసే మనుషులను తయారుచేసింది. ఆ దారిలో సంస్థను ముందుకు నడిపించే దీక్షాదక్షత, శక్తి వై.వి.రెడ్డికి ఉన్నాయి. ఆయనకు సామాజిక చింతన ఉంది. లక్ష్యంకోసం పట్టు వదలకుండా పనిచేసే ధైర్యం ఉంది. పిల్లలను తీర్చిదిద్దగల నైపుణ్యం ఉంది. కొత్తకోణాలను ఆవిష్కరించగల శక్తి వై.వి. రెడ్డికి ఉంది. అలాంటి ప్రిన్సిపాళ్లకోసం సమాజం ఎప్పుడూ ఎదురుచూస్తుంది. వై.వి. రెడ్డి వృత్తికి అంకితమైన మహామనిషి. ఆయనకు అధ్యాపకులందరి తరపున స్మృత్యంజలి ఘటిస్తున్నాను. (నేటి సాయంత్రం 4 గంటలకు సూర్యాపేట జిల్లా కోదాడలో, రేపు ఉదయం 10 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా యర్రంవారిపాలెంలో వై.వి. రెడ్డి సంతాపసభ, ఆయనపై ‘నిలువెత్తు పుస్తకం’ పుస్తకావిష్కరణ ఉంటాయి) - చుక్కా రామయ్య వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి మాజీ సభ్యులు -
మీకు తెలుసా?
అగ్రతాంబూలాన్ని సమర్పించారు. ఎవరైనా ఏదైనా కార్యక్రమం తలపెట్టినపుడు అది సంకల్పబలం చేతనే విజయవంతం అవుతుంది. బలమైన సంకల్పం లేనిదే మనం ఏమీ చేయలేము. అలాంటి సంకల్పానికి ప్రతీకగా ధరించేది రక్షాబంధన సూత్రం. ఆ సంకల్ప సూత్రానికి ప్రతీకే సూత్రావతీ దేవి. ఎవరైతే సంకల్పాన్ని స్వీకరించారో వారికి ఎలాంటి కష్టాలు, కార్యవిఘ్నాలు కలుగనీయకుండా వారికి విజయాన్ని అందించే మాత జయదేవి. ఎవరికైతే స్థిరమైన సంకల్పం ఉంటుందో వారికే విజయం సిద్ధిస్తుంది. సూత్రవతీదేవి, జయదేవి అనేవారిద్దరూ విష్ణుసైన్యానికి అధిపతి అయిన విష్వక్సేనుని భార్యలు. మంగళసూత్రాలకు పిన్నీసులు తదితరాలు పెట్టకూడదు ∙మంగళసూత్రం ఎప్పుడు హృదయం కింద వరకు ఉండాలి ∙మంగళ సూత్రాలకి పగడం, ముత్యం, నల్లపూసలు ఉండాలి. పొరపాటున మంగళ సుత్రాలు పెరిగిపోతే (తెగిపోతే) ఏమి చెయ్యాలంటే..? వెంటనే 5 వరసల దారం తీసుకుని దానికి పసుపు రాసి పసుపు కొమ్ము తీసుకుని దానిని ఆడపడుచు లేదా భర్త చేత కట్టించుకోవాలి. వారు అందుబాటులో లేకపోతే తమకు తామే వేసుకోవాలి. మంచి రోజు చూసి మధ్యాన్నం 12 గంటల లోపు బంగారు తాళిని వేసుకోవాలి. తాళి బొట్టు... గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు భార్య మెడలో మంగళసూత్రం, నుదుటి సింధూరం భర్త ఆయురారోగ్యాలకు బాసటగా నిలుస్తుంది. అలాగే వివిధ రకాల దుష్ట శక్తుల నుండి రక్షిస్తుంది. అయితే మంగళసూత్రాల విషయంలో స్త్రీలు కొన్ని నియమాలు పాటిస్తే ఆ ఇంట్లో సుమంగళి యోగం సిద్ధిస్తుంది. ప్రతి శుక్ర, మంగళవారాలలో అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజ చేసి ఆ పసుపుని మంగళసూత్రాలకు పూజ సమయంలో పెట్టుకోవాలి. ఇలా చేస్తే ఐదవతనాన్ని ఇచ్చే పార్వతీ దేవి కటాక్షిస్తుంది. -
ఈ డాన్‌బాబాతో జర భద్రం సుమా!
సోనూభాయ్‌కి టైం వేస్ట్ చేయడం అంటే ఎంతమాత్రం ఇష్టం ఉండదు. అందుకే.. ‘టైం వేస్టు చేయకుండా డైరెక్ట్‌గా పాయింట్లోకి వచ్చేస్తాను’ అంటుంటాడు. ‘వందేళ్లు బతకడం కాదు...అందరికీ ఉపయోగపడే పని చేసి...వారి మనసులో వేయేళ్లు బతకాలి’ అని కూడా అంటాడు. ఈ డైలాగ్ విని ‘ఆహా సోనూభాయిది ఎంత విశాల హృదయమో’ అనుకుంటే... చాలా వేగంగా పప్పులో కాలేసినట్లే! ఎందుకంటే సోనూభాయ్‌కి ఆ క్షణంలో పప్పు కావాలంటే పప్పు కావల్సిందే...ఉప్పు కావాలంటే ఉప్పు కావాల్సిందే...వేరొకరి గుండె కావాలంటే కావాల్సిందే... రాజీ పడే సమస్యే లేదు! ‘నా విషయంలో ప్రిన్సిపుల్స్ పక్కన పెట్టకపోతే ప్రాణాలు తీస్తాను’ అనగలగడమే కాదు...అన్నంత పనీ చేస్తాడు. సోనూభాయ్‌కి ఎవరో వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి వచ్చాడు. అటు చూడండి... ‘‘వచ్చే వారం మా తమ్ముడి పెళ్లిసార్’’ ‘‘తమ్ముడి పెళ్లి నెక్స్›్ట మంత్ అన్నావు కదరా’’ ‘‘అంటే మీరు కూడా రావాలని...’’ ‘‘అంటే... ఈలోపే నేను చనిపోతాననుకున్నావా? చనిపోతాననుకున్నావా??’’ చూశారు కదా... సోనుభాయికి ఎంత క్లారిటీ ఉందో! ‘ఒక్కడున్నాడు’ సినిమా ద్వారా సోనూభాయ్గా తెలుగు వెండితెరకు పరిచయం అయిన మహేష్ మంజ్రేకర్ ‘అదుర్స్’ సినిమాలో ‘డాన్బాబా’గా మరింత దగ్గరయ్యారు. ∙∙ మహేష్ మంజ్రేకర్‌లో నటుడు మాత్రమే కాదు, రచయిత మాత్రమే కాదు... మంచి దర్శకుడు కూడా ఉన్నాడు. ‘వాస్తవ్’ ‘అస్తిత్వా’ చిత్రాలు ఆయనకు దర్శకుడిగా మంచి పేరు తెచ్చాయి. ‘కాంటే’ సినిమాలో రాజు యాదవ్ బాలిగా కనిపించిన మంజ్రేకర్... ఆ పాత్ర ద్వారా ‘నెగెటివ్ రోల్స్’ బాగా చేయగలడు అని పేరు తెచ్చుకున్నారు. ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ‘స్లమ్ డాగ్ మిలియనీర్’లో ఆయన చేసిన గ్యాంగ్‌స్టర్ జావెద్ పాత్ర విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. నాటకాల్లో నటించే అలవాటు ఉన్నప్పటికీ సినిమాల్లో నటించాలనే ఎప్పుడూ అనుకోలేదు మంజ్రేకర్. బ్యాంకులో ఉద్యోగంలాంటి సెక్యూర్డ్ జాబ్ ఏదైనా చేయాలనుకునేవారు. అయితే తమ పొరుగింటి వ్యక్తి జయదేవ్, మంజ్రేకర్ దృక్పథంలో మార్పు తీసుకువచ్చారు. ‘వెండితెరకు నీలాంటి వాళ్ల అవసరం ఉంది’ అని చెప్పారు. మనసుకు నచ్చిన పాత్రలు రాకపోవడంతో... డైరెక్షన్ వైపు అడుగులు వేశారు మంజ్రేకర్. సంజయ్ దత్తో తీసిన ‘వాస్తవ్’ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి దర్శకుడిగా మంజ్రేకర్‌కు ఎంతో పేరు తీసుకువచ్చింది. టబు ప్రధాన పాత్రలో వచ్చిన ‘అస్తిత్వ’ సీరియస్ ఫిల్మ్ మేకర్‌గా మంజ్రేకర్‌కు గుర్తింపు తెచ్చింది. ‘‘నా పాత్రకు ఎంత ముడుతుంది. నాకు ఎంత గిట్టుబాటు అవుతుంది అనేది ఆలోచించను. దర్శకుడు చెప్పింది ఎంత వరకు చేస్తున్నాను. నా పాత్రకు వందశాతం న్యాయం చేస్తున్నానా లేదా? అని మాత్రమే ఆలోచిస్తాను’’ అంటారు మంజ్రేకర్. మంజ్రేకర్లోని ‘బహుముఖ ప్రజ్ఞ’ వల్లనేమో ఆయన నటనలో పరిణతి కనిపిస్తుంది. ఒక పాత్ర పండించడానికి... ఆయనలో ఉన్న నటుడు, దర్శకుడు, రచయిత ఒకసారి భేటీ అవుతారేమో. ‘ఇలా చేస్తే ఎలా ఉంటుంది’ అని ఒకరితో ఒకరు చర్చించుకుంటారేమో... అందుకే మహేష్ మంజ్రేకర్ నటనలో ఒక కిక్ ఉంటుంది! మరాఠీ సినిమా ‘దే దక్క’ను సంజయ్‌దత్‌తో రిమేక్ చేసి ‘వాస్తవ్’ మ్యాజిక్‌ను మరోసారి క్రియేట్ చేయాలనుకున్నారు మంజ్రేకర్. ఆ సంగతేమిటోగానీ... ఆయన విలనిజంలోని ‘మ్యాజిక్’ మాత్రం దక్షిణాది ప్రేక్షకులకు పరిచయం అయింది. ‘రాసి కన్నా వాసి ముఖ్యం’ అనే సిద్ధాంతాన్ని నమ్ముతారు మంజ్రేకర్. అందుకే ‘సంవత్సరానికి ఎన్ని సినిమాలు వచ్చాయనేది కాదు... ఎంత మంచి సినిమాలు వచ్చాయి అనేది ముఖ్యం’ అంటారు. పాత్రల ఎంపికలో కూడా ఇదే సిద్ధాంతాన్ని నమ్ముతారు. ఎన్ని పాత్రలు చేశామనేది కాకుండా...ఎంత మంచి పాత్రలు చేశామనేది ముఖ్యం అంటారు. ఆచితూచి పాత్రలు ఎంపిక చేసుకుంటారు. అందుకే... మహేష్ వామన్ మంజ్రేకర్ మన ‘ఉత్తమ విలన్’ అయ్యారు. -
ఇంటి రుణం.. ఇలా సులభం
ఇల్లు కొనుక్కోవడమనేది చాలా కీలకమైన నిర్ణయం. ఇందులో బోలెడన్ని అంశాలు ఇమిడి ఉంటాయి. ఎలాంటిది తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి మొదలుకుని డౌన్పేమెంట్లు, రుణం సమకూర్చుకోవడం దాకా అనేక విషయాల గురించి ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఇందులో అన్నింటికన్నా ముఖ్యమైనది గృహ రుణం పొందడం. ఇతరత్రా అన్నీ సిద్ధం చేసుకుని.. లోన్ కోసం దరఖాస్తు చేసుకున్నాక.. చివరికి చేతికొచ్చే దాకా సస్పెన్సే. ఎక్కడ కొర్రీ పడుతుందోనని వర్రీనే. ఇలాంటి పరిస్థితి ఎదురవకూడదంటే ఇంటి గురించి అనుకున్నాక.. ఒక అయిదారు నెలల ముందు నుంచే గృహ రుణం సమకూర్చుకోవడం కోసం సన్నాహాలు చేసుకోవాలి. ఇందుకోసం కొన్ని సూత్రాలు పాటించాలి.. క్రెడిట్ నివేదిక... ప్రస్తుతం బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణాలు మంజూరు చేసే ముందు క్రెడిట్ హిస్టరీ.. అంటే గతంలో తీసుకున్న రుణాలు, వాటిని తిరిగి చెల్లించిన తీరు గురించి చూస్తున్నాయి. గతంలో దేనికైనా బకాయిపడినా, ఎగ్గొట్టినా, లేటుగా చెల్లించినా అందుకు సంబంధించిన వివరాలన్నీ సిబిల్ వంటి సంస్థల దగ్గర ఉంటాయి. అవి ఇచ్చిన నివేదికలు, స్కోరును బట్టి లోన్ ఇవ్వొచ్చా లేదా అన్నది బ్యాంకులు నిర్ణయం తీసుకుంటున్నాయి. కాబట్టి, బాకీలు లాంటివేమైనా ఉంటే తీర్చి.. క్రెడిట్ రిపోర్టు, స్కోరు సరిగ్గా ఉండేలా చూసుకోవడం మంచిది. క్రెడిట్ హిస్టరీ స్వయంగా తెలుసుకోవాలంటే ఆన్లైన్లో కూడా సిబిల్ నివేదికను తీసుకోవచ్చు. ఇందుకు రూ. 470 కట్టాల్సి ఉంటుంది. అలాగే, ఇతరత్రా ఈఎంఐలు ఏమైనా ఇప్పటికే కడుతున్న పక్షంలో ముందుగా వాటిని పూర్తి చేసుకోవడం కూడా ముఖ్యం. ఎందుకంటే.. మనకి ఎంత రుణం ఇవ్వాలనేది మనం ఎంత ఈఎంఐల భారం మోస్తున్నామన్నదానిపైనే ఆధారపడి ఉంటుంది. ఇతర ఈఎంఐలు ఎక్కువైన కొద్దీ మంజూరయ్యే రుణం పరిమాణం తగ్గిపోతుంది. సాధారణంగా జీతంలో ఈఎంఐల భారం 40 శాతం మించకూడదు. బ్యాంకులు ఈ అంశాన్ని కూడా పరిగణించి రుణ మొత్తంపై నిర్ణయం తీసుకుంటాయి. బ్యాంకింగ్ అలవాట్లు మెరుగుపర్చుకోవాలి.. లోన్ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు ఇతర పత్రాలతో పాటు మన బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సాధారణంగా గడిచిన ఆరు నెలలు లేదా ఏడాది కాలానికి సంబంధించిన స్టేట్మెంట్ను బ్యాంకులు అడుగుతుంటాయి.మన బ్యాంకింగ్ అలవాట్లు, ఖాతాలో బ్యాలెన్స్ ఎంత ఉంచుతున్నారు మొదలైన వాటి గురించి ఈ స్టేట్మెంట్ ద్వారా తెలుస్తుంది. ఉద్యోగ స్థిరత్వం.. ఉద్యోగంలో స్థిరంగా కొనసాగుతుండటం కూడా రుణ మంజూరీలో కీలక పాత్ర పోషిస్తుంది. స్థిరం గా ఉద్యోగం చేస్తున్నారా లేక తరచూ మారిపోతున్నారా.. అలాగే కొన్నాళ్లపాటైనా ఒకే ఇంటిలో ఉంటున్నారా లేక అది కూడా మారిపోతున్నారా.. ఇలాంటివి సైతం బ్యాంకర్లు పరిశీ లిస్తారు. ఒకవేళ అలాంటేదేమైనా ఉంటే.. లోన్ విషయంలో పునరాలోచించే అవకాశం ఉంటుంది. ఇక, బ్యాంకుకు ఇవ్వాల్సిన పత్రాల విషయానికొస్తే.. సాధారణంగా వేతన జీవులైతే దరఖాస్తుతో పాటు గుర్తింపు, చిరునామా ధ్రువీకరణ పత్రాలు, తాజా పే స్లిప్, ఫారం 16, ఆరు నెలల బ్యాంకు స్టేట్మెంట్ లాంటివి ఇవ్వాల్సి ఉంటుంది. వీటితో పాటు ప్రాపర్టీకి సంబంధించిన పత్రాలు కూడా సమర్పించాల్సి ఉంటుంది. అధ్యయనం చేయండి .. సాధారణంగా ఒక్కో బ్యాంకు ఒక్కో రకంగా వడ్డీ రేటు వసూలు చేస్తుంటుంది. కనుక ఏ బ్యాంకు ఎంత వడ్డీపై ఇస్తోంది, ప్రత్యేక ఆఫర్లేమైనా ఉన్నాయా వంటి వాటిపై కాస్త అధ్యయనం చేయాలి. అప్పుడే మెరుగైన డీల్ దక్కించుకోవచ్చు. అలాగే, రుణం మంజూరు ప్రక్రియ ఎలా ఉంటుందో బ్యాంకులో తెలుసుకోవాలి. ప్రీ-అప్రూవ్డ్కి ప్రయత్నించండి.. ఇంకా ఏ ప్రాపర్టీ కొనాలన్నదీ ఇదమిత్థంగా నిర్ణయం తీసుకోకపోయినా... ప్రీ-అప్రూవ్డ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు ఇచ్చే వివరాలను బట్టి మీకు మంజూరు చేయబోయే రుణ మొత్తానికి బ్యాంకులు ముందస్తుగానే ఆమోదముద్ర వేస్తుంటాయి. దీంతో ఎంత మొత్తం లభిస్తుందనేది ఐడియా వస్తుంది కనుక మరికాస్త ధీమాగా ఇళ్ల వేట చేయొచ్చు. ప్రీ-అప్రూవ్డ్ను చూపించి రేటు విషయంలో బిల్డరుతో బేరమాడవచ్చు. అయితే, ప్రీ-అప్రూవ్ చేసినంత మాత్రాన అంత మొత్తాన్నీ బ్యాంకులు ఇచ్చేసే అవకాశాలూ లేవు. ఎందుకంటే.. మీరు ఎంచుకున్న ప్రాపర్టీ లేదా అది ఉన్న ప్రాంతం విషయంలో ఏవైనా సందేహాలుంటే బ్యాంకు తుది నిర్ణయం మారవచ్చు. ఇందుకే హెచ్డీఎఫ్సీ వంటి కొన్ని బ్యాంకులు తాము రుణం ఇచ్చే హౌసింగ్ ప్రాజెక్టుల వివరాలను తమ వెబ్సైట్లలో ఉంచుతున్నాయి. వాటిల్లో నుంచి నచ్చినది ఎంపిక చేసుకుంటే .. బ్యాంక్ ఎలాగూ ఆమోదించినదే కాబట్టి.. లోన్ ప్రక్రియ మరింత సులువుగా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. -
ఝున్ఝున్వాలాఆర్థిక సూత్రాలు...
ఇన్వెస్ట్ చేయడం అన్నది ఒక కళ. అంతర్జాతీయంగా ఇన్వెస్ట్మెంట్ గురుగా పేరొందిన వారెన్ బఫెట్, దేశీయంగా రాకేశ్ ఝున్ ఝున్‌వాలా ఈ కళను ఔపోశన పట్టిన వారిలో అగ్రగణ్యులు. ఝున్‌ఝున్‌వాలాను దేశీ వారెన్ బఫెట్ అని కూడా అంటారు. అత్యధిక లాభాలు అందించగలిగే స్టాక్స్‌ను ఒడిసిపట్టుకోగలిగే నేర్పు ఆయన సొంతం. ఆయన ప్రస్తుత సంపద విలువ రూ. 6,000 కోట్ల పైచిలుకు ఉంటుంది. ఇన్వెస్టరుగా విజయాలు సాధించేందుకు ఆయన పాటించే సూత్రాలు ఇవి.. 1.ఆశావహంగా ఉండాలి. ఇన్వెస్టరుకి ఉండాల్సిన అత్యంత ముఖ్యమైన గుణం ఇదే. 2.వాస్తవిక రాబడులనే ఆశించాలి. అత్యాశకు పోవద్దు.. అలాగని అతిగా భయపడనూ కూడదు. 3.నాలుగు అక్షరాల ఇంగ్లిష్ పదం రిస్క్‌ను గుర్తుంచుకోవాలి. పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ఇన్వెస్ట్ చేయాలి. 4.క్రమశిక్షణ ఉండాలి. ప్రణాళికంటూ ఉండాలి. 5.సందర్భాన్ని బట్టి ఊసరవెల్లిలాగా వ్యూహాన్ని మార్చుకోగలగాలి. 6.భిన్నంగా ఆలోచించి ఇన్వెస్ట్ చేయగలగాలి. 7.ఏది కొంటున్నామన్నది ముఖ్యం. ఎంతకు కొంటున్నాం అన్నది అంతకన్నా ముఖ్యం. 8.ప్రతికూల పరిస్థితులు ఎదురైనా నమ్మకం, ఓపిక ఉండాలి. అప్పుడే ప్రతిఫలం దక్కుతుంది. 9.సందర్భాన్ని బట్టి లాభనష్టాలు, సెంటిమెంటు నిమిత్తం లేకుండా వైదొలగాలి. 10.ఉచిత సలహాలపై ఆధారపడొద్దు. అరువు జ్ఞానంతో లాభాలు రావు. స్వయంగా అధ్యయనం చేసి ముందడుగు వేయాలి. -
అక్కినేని ఆశయాలు భావితరాలకు ఆదర్శం
హైదరాబాద్: నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (ఏఎఫ్ఏ) చైర్మన్ తోటకూర ప్రసాద్ అన్నారు. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, సామాజిక సేవ, దృక్పథం, కష్టపడే స్వభావం వంటి సులక్షణాలకు అక్కినేని మారుపేరని కొనియాడారు. అక్కినేని పేరు మీద అవార్డు నెలకొల్పి సమాజానికి సేవ చేస్తున్న వివిధ రంగాల ప్రముఖులకు అందజేస్తామని ప్రసాద్ ఓ ప్రకటనలో తెలియజేశారు. మెరుగైన సమాజం కోసం విద్య, ఆరోగ్యం, సామాజిక సేవ వంటి రంగాల్లో అక్కినేని ఆశయాలను భావి తరాల వారికి తెలియజేసేందుకు ఏఎఫ్ఏ తరపున పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రసాద్ చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. ప్రసాద్‌తో పాటు ఏఎఫ్ఏ వైస్ చైర్మన్ రవి కొండబోలు, డైరెక్టర్ భక్తవత్సలు ఇటీవల అక్కినేని స్వస్థలం కృష్ణా జిల్లా వెంకట రాఘవపురం గ్రామాన్ని సందర్శించారు. ఏఎన్ఆర్ కాలేజీకి వెళ్లి, వచ్చే డిసెంబర్లో అక్కడ అక్కినేని అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించే విషయంపై చర్చించారు. హైదరాబాద్‌లో అక్కినేని కుటుంబ సభ్యుల్ని కూడా వారు పరామర్శించారు. ఏఎన్ఆర్ నివాసంలో నాగ సుశీల, సుమంత్, సుప్రియ తదితరుల్నికలిశారు.