ఈ డాన్‌బాబాతో జర భద్రం సుమా! | mahesh manjrekar special story | Sakshi
Sakshi News home page

ఈ డాన్‌బాబాతో జర భద్రం సుమా!

Published Sun, Feb 5 2017 1:10 AM | Last Updated on Tue, Sep 5 2017 2:54 AM

ఈ డాన్‌బాబాతో జర భద్రం సుమా!

ఈ డాన్‌బాబాతో జర భద్రం సుమా!

సోనూభాయ్‌కి టైం వేస్ట్‌ చేయడం అంటే ఎంతమాత్రం ఇష్టం ఉండదు. అందుకే..
‘టైం వేస్టు చేయకుండా డైరెక్ట్‌గా పాయింట్‌లోకి వచ్చేస్తాను’ అంటుంటాడు.

‘వందేళ్లు బతకడం కాదు...అందరికీ ఉపయోగపడే పని చేసి...వారి మనసులో వేయేళ్లు బతకాలి’ అని కూడా అంటాడు. ఈ  డైలాగ్‌ విని ‘ఆహా సోనూభాయిది ఎంత విశాల హృదయమో’ అనుకుంటే... చాలా వేగంగా పప్పులో కాలేసినట్లే! ఎందుకంటే సోనూభాయ్‌కి ఆ క్షణంలో పప్పు కావాలంటే పప్పు కావల్సిందే...ఉప్పు కావాలంటే ఉప్పు కావాల్సిందే...వేరొకరి గుండె కావాలంటే కావాల్సిందే... రాజీ పడే సమస్యే లేదు!
‘నా విషయంలో ప్రిన్సిపుల్స్‌ పక్కన పెట్టకపోతే ప్రాణాలు తీస్తాను’ అనగలగడమే కాదు...అన్నంత పనీ చేస్తాడు.

సోనూభాయ్‌కి ఎవరో వెడ్డింగ్‌ కార్డు ఇవ్వడానికి వచ్చాడు. అటు చూడండి...
‘‘వచ్చే వారం మా తమ్ముడి పెళ్లిసార్‌’’
‘‘తమ్ముడి పెళ్లి నెక్స్‌›్ట మంత్‌ అన్నావు కదరా’’
‘‘అంటే మీరు కూడా రావాలని...’’
‘‘అంటే... ఈలోపే నేను చనిపోతాననుకున్నావా? చనిపోతాననుకున్నావా??’’
చూశారు కదా... సోనుభాయికి ఎంత క్లారిటీ ఉందో! ‘ఒక్కడున్నాడు’ సినిమా ద్వారా సోనూభాయ్‌గా తెలుగు వెండితెరకు పరిచయం అయిన మహేష్‌ మంజ్రేకర్‌ ‘అదుర్స్‌’ సినిమాలో ‘డాన్‌బాబా’గా మరింత దగ్గరయ్యారు.
∙∙
మహేష్‌ మంజ్రేకర్‌లో నటుడు మాత్రమే కాదు, రచయిత మాత్రమే కాదు... మంచి దర్శకుడు కూడా ఉన్నాడు. ‘వాస్తవ్‌’ ‘అస్తిత్వా’ చిత్రాలు ఆయనకు దర్శకుడిగా మంచి పేరు తెచ్చాయి.
‘కాంటే’ సినిమాలో రాజు యాదవ్‌ బాలిగా కనిపించిన మంజ్రేకర్‌... ఆ పాత్ర ద్వారా  ‘నెగెటివ్‌ రోల్స్‌’ బాగా చేయగలడు అని పేరు తెచ్చుకున్నారు. ఆస్కార్‌ విన్నింగ్‌ ఫిల్మ్‌  ‘స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌’లో ఆయన చేసిన గ్యాంగ్‌స్టర్‌ జావెద్‌ పాత్ర విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది.

నాటకాల్లో నటించే అలవాటు ఉన్నప్పటికీ  సినిమాల్లో నటించాలనే  ఎప్పుడూ అనుకోలేదు మంజ్రేకర్‌. బ్యాంకులో ఉద్యోగంలాంటి సెక్యూర్డ్‌  జాబ్‌ ఏదైనా చేయాలనుకునేవారు. అయితే తమ పొరుగింటి వ్యక్తి జయదేవ్, మంజ్రేకర్‌ దృక్పథంలో మార్పు తీసుకువచ్చారు.

‘వెండితెరకు నీలాంటి వాళ్ల అవసరం ఉంది’ అని చెప్పారు.

మనసుకు నచ్చిన పాత్రలు రాకపోవడంతో... డైరెక్షన్‌ వైపు అడుగులు వేశారు మంజ్రేకర్‌. సంజయ్‌ దత్‌తో తీసిన ‘వాస్తవ్‌’  బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచి దర్శకుడిగా మంజ్రేకర్‌కు ఎంతో పేరు తీసుకువచ్చింది. టబు ప్రధాన పాత్రలో వచ్చిన ‘అస్తిత్వ’ సీరియస్‌ ఫిల్మ్‌ మేకర్‌గా మంజ్రేకర్‌కు  గుర్తింపు తెచ్చింది.

‘‘నా పాత్రకు ఎంత ముడుతుంది. నాకు ఎంత గిట్టుబాటు అవుతుంది అనేది ఆలోచించను. దర్శకుడు చెప్పింది ఎంత వరకు చేస్తున్నాను. నా పాత్రకు వందశాతం న్యాయం చేస్తున్నానా లేదా? అని మాత్రమే  ఆలోచిస్తాను’’ అంటారు మంజ్రేకర్‌.

మంజ్రేకర్‌లోని ‘బహుముఖ ప్రజ్ఞ’ వల్లనేమో ఆయన నటనలో పరిణతి కనిపిస్తుంది.

ఒక పాత్ర పండించడానికి...
ఆయనలో ఉన్న నటుడు, దర్శకుడు, రచయిత ఒకసారి భేటీ అవుతారేమో.
‘ఇలా చేస్తే ఎలా ఉంటుంది’ అని ఒకరితో ఒకరు చర్చించుకుంటారేమో... అందుకే మహేష్‌ మంజ్రేకర్‌ నటనలో ఒక కిక్‌ ఉంటుంది!
మరాఠీ సినిమా ‘దే దక్క’ను సంజయ్‌దత్‌తో రిమేక్‌ చేసి ‘వాస్తవ్‌’ మ్యాజిక్‌ను మరోసారి క్రియేట్‌ చేయాలనుకున్నారు మంజ్రేకర్‌. ఆ సంగతేమిటోగానీ... ఆయన  విలనిజంలోని ‘మ్యాజిక్‌’ మాత్రం దక్షిణాది ప్రేక్షకులకు పరిచయం అయింది.

‘రాసి కన్నా వాసి ముఖ్యం’ అనే సిద్ధాంతాన్ని నమ్ముతారు మంజ్రేకర్‌.
అందుకే ‘సంవత్సరానికి ఎన్ని సినిమాలు వచ్చాయనేది కాదు... ఎంత మంచి సినిమాలు వచ్చాయి అనేది ముఖ్యం’ అంటారు. పాత్రల  ఎంపికలో కూడా ఇదే సిద్ధాంతాన్ని నమ్ముతారు. ఎన్ని పాత్రలు చేశామనేది కాకుండా...ఎంత మంచి పాత్రలు చేశామనేది ముఖ్యం అంటారు. ఆచితూచి పాత్రలు ఎంపిక చేసుకుంటారు.
అందుకే... మహేష్‌ వామన్‌  మంజ్రేకర్‌ మన ‘ఉత్తమ విలన్‌’ అయ్యారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement