ఐక్యరాజ్యసమితి: సముద్రప్రాంత రక్షణలో ప్రపంచ దేశాల మధ్య సహకారం పెరగాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దేశాల మధ్య సముద్ర జల వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నారు. సముద్ర జలాల్లో విద్రోహ శక్తులతో ఎదురయ్యే సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కోవాలన్నారు. సముద్ర ప్రాంత రక్షణ పెంపు–అంతర్జాతీయ సహకారం అంశంపై ఐరాస భద్రతామండలిలో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన చర్చకు మోదీ అధ్యక్షత వహించారు. సముద్ర ప్రాంత వివాదాలను పరిష్కరించుకునేందుకు ఐదు సూత్రాలతో కూడిన సముద్ర సమ్మిళిత రక్షణ వ్యూహాన్ని ప్రతిపాదించారు. ఆ పంచ సూత్రాలివే..
► ప్రపంచ ప్రగతి సముద్ర ప్రాంత వాణిజ్యం క్రియాశీలతపైనే ఆధారపడి ఉంది. చట్టపరమైన సముద్ర వాణిజ్యానికి అవరోధాలను తొలగించాలి.
► సముద్ర జల వివాదాలను శాంతియుతంగా, అంతర్జాతీయ చట్టాల ప్రాతిపదికన పరిష్కరించుకోవాలి. ప్రపంచ శాంతి, సుస్థిరతలకు ఏకైక మార్గం ఇదే.
► ప్రకృతి వైపరీత్యాలు, విద్రోహ శక్తుల కారణంగా తలెత్తే సవాళ్లను అంతర్జాతీయ సమాజం కలిసికట్టుగా ఎదుర్కోవాలి. ఈ విషయంలో ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించుకునేందుకు భారత్ ఇప్పటికే పలు చర్యలు తీసుకుంది.
► సముద్ర పాంత పర్యావరణం, వనరులను కాపాడుకోవడం, జవాబుదారీతనంతో కూడిన సముద్ర ప్రాంత అనుసంధానితను ప్రోత్సహించడం.
ఈ సందర్భంగా జరిగిన చర్చలో రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ..వివిధ ప్రాంతాల్లో జరిగే సముద్ర నేరాలపై ప్రత్యక్షంగా పోరాడేందుకు ఐరాస ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. సముద్ర జలాల్లో సముద్రపు దొంగలు, ఉగ్రవాదులపై కొన్ని దేశాలు సొంతంగా పోరాడలేకపోతున్నాయని ఆయన చెప్పారు. దక్షిణ చైనా సముద్ర జలాల్లో తలెత్తిన వివాదం భద్రత, వాణిజ్యం విషయంలో అంతర్జాతీయంగా తీవ్ర పర్యవసానాలకు దారి తీస్తుందని అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ తెలిపారు. నియమోల్లంఘన ప్రతి చోటా నష్టానికి, అస్థిరతకు ఆజ్యం పోస్తుందని చైనానుద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు.
సముద్రప్రాంత సహకారానికి పంచ సూత్రాలు
Published Tue, Aug 10 2021 3:52 AM | Last Updated on Tue, Aug 10 2021 3:52 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment