న్యూఢిల్లీ: పేదలు, రైతులు, మహిళలు, యువత సాధికారత సాధిస్తే దేశం శక్తివంతంగా మారుతుందని, బలమైన భారత్ ఆవిర్భవిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర కేవలం ప్రభుత్వ యాత్రగానే కాదు, దేశ యాత్రగా మారిందని చెప్పారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రలో భాగంగా ప్రధాని మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
గత ప్రభుత్వాల హయాంలో రైతన్నలు నిర్లక్ష్యానికి గురయ్యారని, అప్పట్లో ప్రభుత్వ వ్యవసాయ విధానాలు కేవలం ఉత్పత్తి, అమ్మకానికే పరిమితం అయ్యాయని విమర్శించారు. తమ ప్రభుత్వం వచ్చాక అన్నదాతల సమస్యల పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని చెప్పారు. పీఎం–కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ప్రతి రైతుకు ఇప్పటిదాకా రూ.30,000 బదిలీ చేశామని తెలిపారు. వ్యవసాయ సహకార సంఘాలను, వ్యవసాయ ఉత్పత్తి సంస్థలను బలోపేతం చేశామని అన్నారు.
గోదాములు నిర్మించామని, పంటల నిల్వ సామర్థ్యాలను పెంచామని, ఆహార శుద్ధి పరిశ్రమను ఎంతగానో ప్రోత్సహించామని గుర్తుచేశారు. ‘‘కంది పప్పును ఆన్‌లైన్ ద్వారా నేరుగా ప్రభుత్వానికి విక్రయించే సదుపాయాన్ని కలి్పంచాం. వారికి మార్కెట్ రేటు కంటే మెరుగైన ధర చెల్లిస్తున్నాం. పప్పుల కొనుగోలు కోసం విదేశాలకు చెల్లించే సొమ్ము మన రైతుల చేతికే అందాలన్నది మా ఉద్దేశం’’ అన్నారు. గిరిజన ప్రాంతాల్లో నివసించే ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.
ప్రతి మూలకూ ‘మోదీ గ్యారంటీ’
అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించాలన్నదే వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర లక్ష్యమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అర్హుల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరగకూడదన్నారు. అర్హులకు సక్రమంగా, సంతృప్త స్థాయిలో పథకాలు అందితేనే ‘అభివృద్ధి చెందిన భారత్’ సాధ్యమని చెప్పారు. ప్రభుత్వ పథకాల లబి్ధదారులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ యాత్ర ఇటీవలే 50 రోజులు పూర్తి చేసుకుందని, దేశమంతటా 11 కోట్ల మంది ప్రజలతో నేరుగా అనుసంధానమైందని హర్షం వ్యక్తం చేశారు. ‘మోదీ కీ గ్యారంటీవాలీ గాడీ’ దేశంలో ప్రతి మూలకూ వెళ్తోందని తెలిపారు. ప్రభుత్వ పథకాల కింద లబ్ధి కోసం సుదీర్ఘకాలం ఎదురు చూసే పేదలు ఇప్పుడు ఒక అర్థవంతమైన మార్పును చూస్తున్నారని పేర్కొన్నారు. పథకాలు అర్హుల గడప వద్దకే వెళ్తున్నాయన్నారు. ప్రస్తుత, భావి తరాల యువత గత తరాల కంటే మెరుగైన జీవితం గడపాలని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment