ఇంటి రుణం.. ఇలా సులభం
ఇల్లు కొనుక్కోవడమనేది చాలా కీలకమైన నిర్ణయం. ఇందులో బోలెడన్ని అంశాలు ఇమిడి ఉంటాయి. ఎలాంటిది తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి మొదలుకుని డౌన్‌పేమెంట్లు, రుణం సమకూర్చుకోవడం దాకా అనేక విషయాల గురించి ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఇందులో అన్నింటికన్నా ముఖ్యమైనది గృహ రుణం పొందడం. ఇతరత్రా అన్నీ సిద్ధం చేసుకుని.. లోన్ కోసం దరఖాస్తు చేసుకున్నాక.. చివరికి చేతికొచ్చే దాకా సస్పెన్సే. ఎక్కడ కొర్రీ పడుతుందోనని వర్రీనే. ఇలాంటి పరిస్థితి ఎదురవకూడదంటే ఇంటి గురించి అనుకున్నాక.. ఒక అయిదారు నెలల ముందు నుంచే గృహ రుణం సమకూర్చుకోవడం కోసం సన్నాహాలు చేసుకోవాలి. ఇందుకోసం కొన్ని సూత్రాలు పాటించాలి..
క్రెడిట్ నివేదిక...
ప్రస్తుతం బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణాలు మంజూరు చేసే ముందు క్రెడిట్ హిస్టరీ.. అంటే గతంలో తీసుకున్న రుణాలు, వాటిని తిరిగి చెల్లించిన తీరు గురించి చూస్తున్నాయి. గతంలో దేనికైనా బకాయిపడినా, ఎగ్గొట్టినా, లేటుగా చెల్లించినా అందుకు సంబంధించిన వివరాలన్నీ సిబిల్ వంటి సంస్థల దగ్గర ఉంటాయి. అవి ఇచ్చిన నివేదికలు, స్కోరును బట్టి లోన్ ఇవ్వొచ్చా లేదా అన్నది బ్యాంకులు నిర్ణయం తీసుకుంటున్నాయి. కాబట్టి, బాకీలు లాంటివేమైనా ఉంటే తీర్చి.. క్రెడిట్ రిపోర్టు, స్కోరు సరిగ్గా ఉండేలా చూసుకోవడం మంచిది. క్రెడిట్ హిస్టరీ స్వయంగా తెలుసుకోవాలంటే ఆన్‌లైన్‌లో కూడా సిబిల్ నివేదికను తీసుకోవచ్చు. ఇందుకు రూ. 470 కట్టాల్సి ఉంటుంది. అలాగే, ఇతరత్రా ఈఎంఐలు ఏమైనా ఇప్పటికే కడుతున్న పక్షంలో ముందుగా వాటిని పూర్తి చేసుకోవడం కూడా ముఖ్యం. ఎందుకంటే.. మనకి ఎంత రుణం ఇవ్వాలనేది మనం ఎంత ఈఎంఐల భారం మోస్తున్నామన్నదానిపైనే ఆధారపడి ఉంటుంది. ఇతర ఈఎంఐలు ఎక్కువైన కొద్దీ మంజూరయ్యే రుణం పరిమాణం తగ్గిపోతుంది. సాధారణంగా జీతంలో ఈఎంఐల భారం 40 శాతం మించకూడదు. బ్యాంకులు ఈ అంశాన్ని కూడా పరిగణించి రుణ మొత్తంపై నిర్ణయం తీసుకుంటాయి.
బ్యాంకింగ్ అలవాట్లు మెరుగుపర్చుకోవాలి..
లోన్ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు ఇతర పత్రాలతో పాటు మన బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సాధారణంగా గడిచిన ఆరు నెలలు లేదా ఏడాది కాలానికి సంబంధించిన స్టేట్‌మెంట్‌ను బ్యాంకులు అడుగుతుంటాయి.మన బ్యాంకింగ్ అలవాట్లు, ఖాతాలో బ్యాలెన్స్ ఎంత ఉంచుతున్నారు మొదలైన వాటి గురించి ఈ స్టేట్‌మెంట్ ద్వారా తెలుస్తుంది.
ఉద్యోగ స్థిరత్వం..
ఉద్యోగంలో స్థిరంగా కొనసాగుతుండటం కూడా రుణ మంజూరీలో కీలక పాత్ర పోషిస్తుంది. స్థిరం గా ఉద్యోగం చేస్తున్నారా లేక తరచూ మారిపోతున్నారా.. అలాగే కొన్నాళ్లపాటైనా ఒకే ఇంటిలో ఉంటున్నారా లేక అది కూడా మారిపోతున్నారా.. ఇలాంటివి సైతం బ్యాంకర్లు పరిశీ లిస్తారు. ఒకవేళ అలాంటేదేమైనా ఉంటే.. లోన్ విషయంలో పునరాలోచించే అవకాశం ఉంటుంది. ఇక, బ్యాంకుకు ఇవ్వాల్సిన పత్రాల విషయానికొస్తే.. సాధారణంగా వేతన జీవులైతే దరఖాస్తుతో పాటు గుర్తింపు, చిరునామా ధ్రువీకరణ పత్రాలు, తాజా పే స్లిప్, ఫారం 16, ఆరు నెలల బ్యాంకు స్టేట్‌మెంట్ లాంటివి ఇవ్వాల్సి ఉంటుంది. వీటితో పాటు ప్రాపర్టీకి సంబంధించిన పత్రాలు కూడా సమర్పించాల్సి ఉంటుంది.
అధ్యయనం చేయండి ..
సాధారణంగా ఒక్కో బ్యాంకు ఒక్కో రకంగా వడ్డీ రేటు వసూలు చేస్తుంటుంది. కనుక ఏ బ్యాంకు ఎంత వడ్డీపై ఇస్తోంది, ప్రత్యేక ఆఫర్లేమైనా ఉన్నాయా వంటి వాటిపై కాస్త అధ్యయనం చేయాలి. అప్పుడే మెరుగైన డీల్ దక్కించుకోవచ్చు. అలాగే, రుణం మంజూరు ప్రక్రియ ఎలా ఉంటుందో బ్యాంకులో తెలుసుకోవాలి.
ప్రీ-అప్రూవ్డ్‌కి ప్రయత్నించండి..
ఇంకా ఏ ప్రాపర్టీ కొనాలన్నదీ ఇదమిత్థంగా నిర్ణయం తీసుకోకపోయినా... ప్రీ-అప్రూవ్డ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు ఇచ్చే వివరాలను బట్టి మీకు మంజూరు చేయబోయే రుణ మొత్తానికి బ్యాంకులు ముందస్తుగానే ఆమోదముద్ర వేస్తుంటాయి. దీంతో ఎంత మొత్తం లభిస్తుందనేది ఐడియా వస్తుంది కనుక మరికాస్త ధీమాగా ఇళ్ల వేట చేయొచ్చు. ప్రీ-అప్రూవ్డ్‌ను చూపించి రేటు విషయంలో బిల్డరుతో బేరమాడవచ్చు. అయితే, ప్రీ-అప్రూవ్ చేసినంత మాత్రాన అంత మొత్తాన్నీ బ్యాంకులు ఇచ్చేసే అవకాశాలూ లేవు. ఎందుకంటే.. మీరు ఎంచుకున్న ప్రాపర్టీ లేదా అది ఉన్న ప్రాంతం విషయంలో ఏవైనా సందేహాలుంటే బ్యాంకు తుది నిర్ణయం మారవచ్చు. ఇందుకే హెచ్‌డీఎఫ్‌సీ వంటి కొన్ని బ్యాంకులు తాము రుణం ఇచ్చే హౌసింగ్ ప్రాజెక్టుల వివరాలను తమ వెబ్‌సైట్లలో ఉంచుతున్నాయి. వాటిల్లో నుంచి నచ్చినది ఎంపిక చేసుకుంటే .. బ్యాంక్ ఎలాగూ ఆమోదించినదే కాబట్టి.. లోన్ ప్రక్రియ మరింత సులువుగా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి.