అక్కినేని ఆశయాలు భావితరాలకు ఆదర్శం
హైదరాబాద్: నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (ఏఎఫ్ఏ) చైర్మన్ తోటకూర ప్రసాద్ అన్నారు. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, సామాజిక సేవ, దృక్పథం, కష్టపడే స్వభావం వంటి సులక్షణాలకు అక్కినేని మారుపేరని కొనియాడారు. అక్కినేని పేరు మీద అవార్డు నెలకొల్పి సమాజానికి సేవ చేస్తున్న వివిధ రంగాల ప్రముఖులకు అందజేస్తామని ప్రసాద్ ఓ ప్రకటనలో తెలియజేశారు.
మెరుగైన సమాజం కోసం విద్య, ఆరోగ్యం, సామాజిక సేవ వంటి రంగాల్లో అక్కినేని ఆశయాలను భావి తరాల వారికి తెలియజేసేందుకు ఏఎఫ్ఏ తరపున పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రసాద్ చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. ప్రసాద్తో పాటు ఏఎఫ్ఏ వైస్ చైర్మన్ రవి కొండబోలు, డైరెక్టర్ భక్తవత్సలు ఇటీవల అక్కినేని స్వస్థలం కృష్ణా జిల్లా వెంకట రాఘవపురం గ్రామాన్ని సందర్శించారు. ఏఎన్ఆర్ కాలేజీకి వెళ్లి, వచ్చే డిసెంబర్లో అక్కడ అక్కినేని అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించే విషయంపై చర్చించారు. హైదరాబాద్లో అక్కినేని కుటుంబ సభ్యుల్ని కూడా వారు పరామర్శించారు. ఏఎన్ఆర్ నివాసంలో నాగ సుశీల, సుమంత్, సుప్రియ తదితరుల్నికలిశారు.