Prasad Thotakura
-
'తానా ప్రపంచ సాహిత్యవేదిక' గా 64 వ సాహిత్య సమావేశం
డాలస్, టెక్సాస్: తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశంలో భాగంగా ఆదివారం నిర్వహించిన 64 వ సాహిత్య సమావేశం మన సినారె “విశ్వంభర” సంబురం ఘనంగా జరిగింది. తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు అతిథులందరినీ ఆహ్వానించి తన స్వాగతోపన్యాసంతో సభను ప్రారంభించారు. సభాప్రారంభకులుగా హాజరైన తెలంగాణా సారస్వత పరిషత్తు, సుశీలా నారాయణ రెడ్డి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి అయిన డా. జుర్రు చెన్నయ్య పద్మభూషణ్ ఆచార్య డా. సింగిరెడ్డి నారాయణ రెడ్డి జీవనరేఖలను ఆయన విద్యార్ధి దశ, సాహిత్య ప్రయాణం, నిర్వహించిన పదవులు, సాధించిన విజయాలు, చేసిన రచనలు, అందుకున్న సన్మాన సత్కారాలను సోదాహరణంగా ఒక విహంగ వీక్షణంలా నారాయణ రెడ్డి గారి ప్రతిభను గొప్పగా ఆవిష్కరించారు. తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “ప్రముఖ కవి, పూర్వ రాజ్యసభ సభ్యులు, పూర్వ ఉపకులపతి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, ప్రముఖ సినీగీత రచయిత, పద్మభూషణ్, ఆచార్య డా. సి. నారాయణ రెడ్డి గారు తన జీవితకాలంలో అలంకరించిన పదవులు, సమవర్ధవంతంగా నిర్వహించిన బాధ్యతలు, సాధించిన విజయాలు ఏ సాహితీవేత్తకు దక్కని గౌరవాలు అన్నారు. ఆయన కలం నుండి జాలువారిన దీర్ఘ కావ్యం ‘విశ్వంభర’ కు సాహిత్యంలో అత్యున్నత జ్ఞానపీఠ పురస్కారం దక్కడం ప్రతీ తెలుగువాడు గర్వించదగ్గ విషయం అన్నారు. ప్రస్తుతం అదే విశ్వంభర కావ్యాన్ని ఇప్పుడు ప్రముఖ సినీ కథారచయిత జే.కే భారవి అత్యున్నత ప్రమాణాలతో శ్రవణరూపంలో ముద్రించడం హర్షదాయకం” అన్నారు. తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు మాట్లాడుతూ “తెలుగు భాషాసాహిత్య వికాసాలకోసం తానా ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుందని, ప్రముఖ కవి డా. సినారె రాసిన విశ్వంభర కావ్యాన్ని ప్రముఖ సినీ కథారచయిత జే.కే భారవి తన విశిష్టగళంలో ఆడియో రూపంలో ముద్రించడం ముదావహమని, ఇప్పుడు దానిని సాహితీలోకానికి తానా ప్రపంచ సాహిత్యవేదికగా విడుదలజేయడం ఆనందదాయకం అన్నారు.” సుప్రసిద్ధ సినీ కథారచయిత చిన్నికృష్ణ మాట్లాడుతూ.. తాను పలుమార్లు జే.కే భారవి రూపొందించిన విశ్వంభర ఆడియో విన్నానని, చాలా శ్రవణానందకరంగా ఉన్నదని, దీన్నే వీడియో రూపంలో తన స్వంత ఖర్చులతో దృశ్యమాలికగా తీసుకువచ్చే ఆసక్తి ఉన్నదని, త్వరలోనే ఈ విషయంలో సినారె కుటుంబసభ్యులను సంప్రదిస్తానన్నారు. సుప్రసిద్ధ కథారచయిత జే.కే భారవి మాట్లాడుతూ.. డా. సినారె విరచిత విశ్వంభర కావ్యాన్ని ఒక పిచ్చి వ్యామోహంతో ఎన్నో సార్లు చదివానని, ఎంతో ఆసక్తితో ఎన్నో వ్యవ ప్రయాసలకోర్చి దీన్ని అత్యున్నత ప్రమాణాలతో నేను రూపొందించిన ఆడియోని ఇప్పుడు తానా ప్రపంచ సాహిత్యవేదికగా విడుదలజేయడం చాల సంతోషంగా ఉన్నదని చెప్పారు. అలాగే దీనికి కారకులైన తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు, తానా పూర్వధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూరకు ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. ప్రముఖ ప్రేరణాత్మక ప్రసంగకర్త ఆకెళ్ళ రాఘవేంద్ర విశ్వంభర కావ్యంలోని అనేక విషయాలను ఉటంకించి, ఆ కావ్య లోతుపాతుల్ని, కావ్య వైభవాన్ని ప్రతిభావంతంగా విశ్లేషించి సినారె సాహిత్య ప్రతిభను గొప్పగా ఆవిష్కరించారు. పద్మభూషణ్ డా. సినారె కలం నుండి వెలువడిన “విశ్వంభర” కావ్యం మొత్తాన్ని ప్రముఖ సినీ కథా రచయిత జే.కే భారవి గళంలో మీకోసం ప్రత్యేక కానుకగా ఈ క్రింది లింక్‌ను క్లిక్ చేసి వినవచ్చు. https://youtube.com/playlist?list=PL0GYHgMt2OQyx6qWv-kWt2bCxAl6GB5XO&si=D4SS-jzDXYhmqFQX -
డాలస్ లో ఘనంగా 75 వ గణతంత్ర వేడుకలు!
డాలస్, టెక్సాస్: టెక్సాస్ రాష్ట్రంలో, డాలస్ నగరంలో నెలకొనిఉన్న అమెరికా దేశంలోనే అతి పెద్దదైన మహాత్మా గాంధీ మెమోరియల్ వద్ద భారతదేశ 75వ గణతంత్ర వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “డా. బీఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఎందరో మేధావులు ఎంతో సమయం వెచ్చించి, శ్రమకోర్చి భారత రాజ్యాంగాన్ని తయారుచేసి మనకు అందించారని, ఆ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ తప్పకుండా పాటించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిమీద ఉంది” అన్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగాన్ని రూపొందించిన నేతలకు, మన భారతదేశ స్వాతంత్య్రసిద్ధికి పాటుపడిన మహాత్మాగాంధీ, జవహార్‌లాల్ నెహ్రూ, సర్ధార్ వల్లభాయి పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ మొదలైన నాయకులకు, దేశ స్వాతంత్య్రం కోసం అశువులు బాసిన స్వాతంత్య్ర సమరయోధులకు ప్రవాసభారతీయులు ఘన నివాళులర్పించారు. మహాత్మాగాంధీ మెమోరియల్ బోర్డు సభ్యులు డా. ప్రసాద్ తోటకూర, రావు కల్వాల, రాజీవ్, బీ.ఎన్ జగదీష్, నవాజ్, జస్టిన్, షబ్నం మోడ్గిల్, వివిధ భారతీయసంస్థల నాయకులతో పాటు ఎంతోమంది ప్రవాస భారతీయులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని తమ దేశభక్తిని చాటుకున్నారు. ఇవి చదవండి: అల్లదివో.. ‘మూన్ స్నైపర్’ ఫోటోలు తీసిన ‘నాసా’ ఉపగ్రహం -
అమెరికాలో తెలుగు భాషకున్న స్థానం అంత ఇంత కాదు!
అంతర్జాతీయ సంబంధాల కేంద్రం, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం,తిరుపతి వారు తానా పూర్వాధ్యక్షులు డా ప్రసాద్ తోటకూర గారితో విద్యార్థినుల ముఖాముఖి కార్యక్రమాన్ని సావేరి సెమినార్ హాల్ లో 2023 సెప్టెంబర్ 4న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య దేపూరు భారతిగారు విచ్చేశారు. ఆమె మాట్లాడుతూ తానా సంస్థ ముఖ్య లక్ష్యాన్ని, వారు నిర్వహిస్తున్న కార్యకలాపాలను కొనియాడారు. అమెరికాలో నివసిస్తున్న భారతీయులకోసం పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని సంగీత, నృత్య విభాగం వాళ్ళు అధునాతన డిప్లొమా కోర్సులను నడుపుతున్నారని తెలియజేశారు. పదుల సంఖ్యల్లో నుంచి వందల సంఖ్యల్లోకి అడ్మిషన్లు పెరిగాయని తెలుపుతూ భవిష్యత్ కార్యాచరణను డా ప్రసాద్ తోటకూర గారి ముందుంచారు. గౌరవ అతిథి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య నల్లనాగుల రజినీగారు మాట్లాడుతూ అమెరికా నుంచి డా ప్రసాద్ గారు మన విశ్వవిద్యాలయానికి రావడం సంతోషదాయకం అన్నారు. కార్యనిర్వాహకులు అంతర్జాతీయ సంబంధాల కేంద్రం డీన్ ఆచార్య పి విజయలక్ష్మి గారు మాట్లాడుతూ కార్యక్రమ ముఖ్య ఉద్దేశాన్ని, కోర్సులు ప్రారంభంకావడానికి నాంది పలికిన వారు పూర్వ ఉపాధ్యక్షులు ఆచార్య వీరమాచినేని దుర్గాభవాని గారు, డా తోటకూర ప్రసాద్ గారని తెలిపారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన డా ప్రసాద్ తోటకూర గారు మాట్లాడుతూ.. అగ్రరాజ్యం అమెరికాలో ఉండే ఉద్యోగ అవకాశాల్ని, అక్కడి జీవన విధానాన్ని వివరించారు. అమెరికా గురించి చాలామంది విద్యార్థినులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. తెలుగు భాషకు అక్కడున్న స్థాయిని, స్థానాన్ని తానా సంస్థ ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేశారు. సత్య నాదెండ్ల, సుందర్ పిచాయ్, ఇంద్రనూయి కార్పోరేట్ దిగ్గజాలుగా ఎదిగిన ప్రస్తానాన్ని, పారిశ్రామిక దిగ్గజాలు వారెన్ బఫెట్, బిల్ గేట్స్ లాంటివారు చేస్తున్న ధార్మిక కార్యక్రమాలను సోదాహరణంగా వివరించారు. సిరివెన్నెల కుటుంబ సభ్యులతో కలిసి తానా ప్రపంచ సాహిత్య వేదిక "సిరివెన్నెల సీతారామశాస్త్రి" గారు సృష్టించిన సాహిత్యం మొత్తాన్ని ఆరు సంపుటాల్లో ముద్రించిన గ్రంథాలను శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం గ్రంథాలయనికి ప్రసాద్ గారు బహూకరించారు. ఈ కార్యక్రమానికి డా. హిమబిందు ఆహ్వానం పలుకగా, డా. యువశ్రీ వందన సమర్పణ చేశారు. డా శిరీష ప్రార్థనా గీతాన్ని ఆలపించారు. అంతర్జాతీయ సంబంధాల కేంద్రం ఆచార్యులు, వివిధ విభాగాల ఆచార్యులు, విద్యార్థినులు, బోధనేతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. కార్యక్రమానంతరం డా ప్రసాద్ తోటకూర గారు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి 2016వ సంవత్సరంలో కానుకగా బహూకరించిన మహాత్మా గాంధీ విగ్రహానికి ఆచార్యదేపూరు భారతి గారు, ఆచార్య వీరమాచినేని దుర్గాభవాని గారు, డా ప్రసాద్ తోటకూర గారు, ఆచార్య పి విజయలక్ష్మి గారు పుష్పాంజలి ఘటించారు. (చదవండి: అమెరికాలోని ఓ రహదారికి భారత సంతతి పోలీస్ పేరు!) -
ప్రపంచ సాహిత్యంలో అరుదైన ప్రక్రియ తెలుగు పద్యం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ సాహిత్యంలో ఏ భాషలోనూ లేని అరుదైన ప్రక్రియ పద్యమని.. తెలుగు వారి సొత్తైన ఈ ప్రక్రియ కాపాడి ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహిత్య విభాగం ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర అన్నారు. తానా సాహిత్య విభాగం తానా ప్రపంచ సాహిత్య వేదిక, ప్రభుత్వ సిటీ కళాశాల తెలుగు విభాగం సంయుంక్తాధ్వర్యంలో సిటీ కళాశాలలో జరిగిన మహోన్నతం మన పద్యం విద్యార్థి పద్యగాన సభలో అతిథిగా పాల్గొన్న డాక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ... ప్రాచీన పద్యాలలో ఉన్న మానవీయ విలువలు, వ్యక్తిత్వ వికాసం వంటిని నేటితరం విద్యార్థులకు అందించడం, అలాగే పద్య పఠనం ద్వారా వారిలో ఏకాగ్రత, ధారణశక్తి, జ్ఞాపకశక్తి వంటిని పెంపొందించడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. పౌరాణిక నాటక పద్యాలలో గొప్ప జీవన విలువలున్నాయి. పౌరాణిక నాటకాల ప్రదర్శనతో తెలుగు పద్యానికి విస్తృతి పెరిగిందని రంగస్థల కళాకారుడు గుమ్మడి గోపాలకృష్ణ అన్నారు. సత్య హరిశ్చంద్ర, శ్రీకృష్ణ రాయబారం, శ్రీకృష్ణ పాండవీయం తదితర పద్య నాటకాలు తెలుగు ప్రజానీకానికి గొప్ప సంస్కృతి సంతృప్తిని కలిగించాయన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.బాల భాస్కర్ మాట్లాడుతూ... సిటీ కళాశాల విద్యార్థులలో చైతన్యం కోసం ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. ఈ సందర్భంగా ఘట్టి బాల చైతన్యం, పద్య పరిమళం వంటి సంస్థలలో శిక్షణ పొందిన 25 మంది ప్రాథమిక, ఉన్నత పాఠశాలల చిన్నారులు ప్రాచీన కావ్యాలు, ప్రబంధాలు, శతకాలలోని పద్యాలను రాగయుక్తంగా, భావ గర్భితంగా ఆలపించి ఆధ్యాపకులను, సభికులను మంత్ర ముగ్ధులను చేశారు. (క్లిక్ చేయండి: తానా ఆధ్వర్యంలో సినీ ప్రముఖులకు పురస్కారాలు) -
‘తానా’ అంతర్జాతీయ కార్టూన్ పోటీ.. విజేతలకు రూ. లక్ష నగదు
సాక్షి, అమరావతి: తెలుగు భాష, తెలుగు కార్టూన్ కీర్తిని విశ్వవ్యాప్తం చేసేందుకు అంతర్జాతీయ కార్టూన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకుడు ప్రసాద్ తోటకూర తెలిపారు. మంగళవారం విజయవాడలోని సర్వోత్తమ గ్రంథాలయం ఆడిటోరియంలో కార్టూన్ పోటీల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తొలిసారిగా తానా అంతర్జాతీయ తెలుగు కార్టూన్ పోటీలు–2023ను ఏర్పాటు చేసిందన్నారు. వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ, తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటేలా కార్టూన్లు పంపాలని తెలిపారు. పోటీల్లోని ఎంట్రీల నుంచి 12 అత్యుత్తమ కార్టూన్లను ఎంపిక చేసి ఒక్కొక్కరికి రూ.5,000, మరో 13 ఉత్తమ కార్టూన్లకు గాను ఒక్కొక్కరికీ రూ.3,000 చొప్పున మొత్తం 25 మందికి నగదు బహుమతులు అందజేస్తామని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగు కార్టూనిస్టులు పోటీల్లో పాల్గొనవచ్చని, ఒక్కొక్కరి నుంచి మూడు కార్టూన్లను స్వీకరిస్తామని తెలిపారు. ఎంట్రీలను 300 రిజల్యూషన్ జేపీఈజీ ఫార్మేట్లో tanacartooncontest23@gmail.comకు ఈ నెల 26లోగా పంపాలన్నారు. ఫలితాలను జనవరి 15న సంక్రాంతి రోజు ప్రకటిస్తామని చెప్పారు. వివరాల కోసం 9154555675, 9885289995 నంబర్లను సంప్రదించాలని కోరారు. కార్యనిర్వాహక సభ్యులు కళాసాగర్, కలిమిశ్రీ, జాకీర్ పాల్గొన్నారు. (క్లిక్: బెజవాడను కప్పేసిన మంచు దుప్పటి) -
వెన్నెలకంటికి తానా అశ్రు నివాళి
పాటల రచయిత వెన్నలకంటి మృతి పట్ల తానా ప్రపంచ సాహిత్య వేదిక ఘన నివాళి అర్పించింది. ఈ సందర్భంగా వెన్నెలకంటి కుటుంబ సభ్యులకు తానా ప్రగాడ సానుభూతిని తెలుపుతూ భగవంతుడు అయన ఆత్మకు శాంతి చేకూరాలని తానా అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర, సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ ప్రకటించారు. డా.ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ తానా ప్రపంచ సాహిత్య వేదిక ప్రతి నెలా ఆఖరి ఆదివారం జరుపుతున్న అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశాలలో గత వారం డిసెంబర్ 27 న జరిగిన “సినిమా పాటల్లో సాహిత్యం” అనే 8వ సమావేశంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి, భువనచంద్ర, డా. సుద్దాల అశోక్ తేజ, రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్‌తో పాటు అతిధిగా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న వెన్నెలకంటి తనకు అత్యంత సన్నిహిత మిత్రుడని, తరచూ సంభాషించే ఒక మంచి రచయిత అకస్మాత్తుగా కనుమరుగై పోవడం అత్యంత విషాదకరం అన్నారు. తెలుగు సినిమా పాటకు కేంద్ర స్థాయిలో అన్యాయం జరుగుతోందని, ఎంతోమంది సినీగీత రచయితలు అద్భుతమైన పాటలు రాసినప్పటికీ వాటిని జాతీయ స్థాయిలో గుర్తించకపోవడం శోచనీయమని.. ఈ పరిస్థితి మారాలని అన్నారు. -
గాంధీ మునిమనవడు మృతికి నివాళులు
టెక్సాస్: కరోనా కారణంగా చనిపోయిన మహాత్మా గాంధీ మునిమనవడు సతీష్ ధుపేలియా మృతి పట్ల మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్(ఎమ్జీఎమ్ఎన్టీ) వ్యవస్థాపక ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూర విచారం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. జాతిపిత మహాత్మా గాంధీ రెండో కుమారుడు మణిలాల్, సుశీలాబెన్ల కుమార్తె సీతా, శశికాంత్‌ల తనయుడు సతీష్ ధుపేలియా దక్షిణాఫ్రికాలో మృతి చెందారని తెలిపారు. గత నెల రోజులగా న్యూమోనియాతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఈ క్రమంలోనే ఆస్పత్రిలో కరోనాసోకి నవంబర్ 22న మృతి చెందడం విచారకరమన్నారు. మూడు రోజులక్రితమే సతీష్ ఆస్పత్రిలో తన 66 వ జన్మదినాన్ని జరుపుకున్నారన్నారు. 2014 లో అక్టోబర్ 2 వ తేదిన అమెరికాలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ మెమోరియల్‌ను డల్లాస్‌లో సతీష్ చేతులమీదుగా ఆవిష్కరణ జరుపుకోవడం ఒక మధురానుభూతని పేర్కొన్నారు. విజయవాడకు చెందిన శిల్పి బుర్రా శివ వరప్రసాద్ తయారుచేసిన ఆ మహాత్మాగాంధీ విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతోందని సతీష్ ప్రశంసించారని గుర్తు చేసుకున్నారు. ఆయన ఉన్న నాలుగు రోజులు డల్లాస్‌లో అనేక కార్యక్రమాల్లో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారని చెప్పుకొచ్చారు. (చదవండి: సియాటిల్‌లో ప్రవాస భారతీయుల వర్చువల్ భేటీ) గాంధీ మునిమనవడు సతీష్ ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ ఎమ్జీఎమ్ఎన్టీ వ్యవస్థాపక ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూరతో పాటు బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ రావు కల్వల, మురళి వెన్నం, జాన్ హేమండ్, రన్నా జాని, అభిజిత్ రాయల్కర్, స్వాతి షా, శైలేష్ షా, లోక్ నాథ్ పాత్రో వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దక్షిణాఫ్రికాలో స్థిరపడిన సతీష్ వృత్తి పరంగా మీడియా ఫోటోగ్రాఫర్‌గా, వీడియో గ్రాఫర్‌గా పని చేశారు. ప్రవృత్తి పరంగా మహాత్మాగాంధీ 1904లో స్థాపించిన ఫేనెక్ష్ సెటిల్మెంట్లో, డర్బాన్ దగ్గరలో ఉన్న సంస్థలోను, గాంధీ డెవలప్మెంట్ ట్రస్ట్‌లోనూ అనేక సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ ఉండేవారు. సతీష్‌కు ఉమ, కీర్తి అనే ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. (చదవండి:అమెరికా చదువులకు మన ఖర్చెంతో తెలుసా?) -
అక్కినేని అంతర్జాతీయ అవార్డులు ప్రకటన
డాలస్, టెక్సాస్: పద్మవిభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు 96వ జయంతి (సెప్టెంబర్ 20) సందర్భంగా అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (ఏఎఫ్ఏ) బోర్డు సమావేశం డాలస్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఏఎఫ్ఏ అధ్యక్షురాలు శారద ఆకునూరి మాట్లాడుతూ.. అనేక దశాబ్దాలుగా అక్కినేని నాగేశ్వరరావు గారితో సన్నిహితంగా మెలిగి ఆయనను 1997లోను, 2012లోను టెక్సాస్‌కు తీసుకురావడంలో ముఖ్య కారకులైన డా.తోటకూర ప్రసాద్ నాయకత్వంలో 2014లో ఈ ఏఎఫ్ఏ సంస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటికి వరకు ఐదు అక్కినేని అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవాలు జరుపుకున్నామని అన్నారు. 2019 సంవత్సరానికి గానూ డిసెంబర్ 21న సాయంత్రం 5 గంటలకు విశాఖపట్నంలో వీఎమ్ఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో ఆరవ అక్కినేని అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవాన్ని నిర్వహిస్తున్నామని శారద ఆకునూరి వెల్లడించారు. ఈ కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని ఆమె కోరారు. ఈ సమావేశంలో బోర్డ్ అఫ్ డైరెక్టర్స్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి ఆళ్ల, మురళి వెన్నం, రావు కల్వల, డా. సి.ఆర్ రావులు అక్కినేని గారితో తమకున్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వ్యవస్థాపక అధ్యక్షుడు డా.ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ అక్కినేని నాగేశ్వరరావు ఒక ప్రముఖ సినిమా నటుడిగా మాత్రమే గాక, గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనిషని కొనియాడారు. అక్కినేని అంతిమ శ్వాస వరకు అత్యంత సన్నిహితంగా మెలిగిన అమెరికాలోని మిత్రులం కొంతమంది ‘అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా’ సంస్థను ఏర్పాటుజేశామని తెలిపారు. డా.అక్కినేని ఒక చిన్న కుగ్రామంలో, అతిసాధారణ కుటుంబంలో జన్మించి కేవలం కృషి, పట్టుదల, ఆత్మ స్థైర్యం, దూరదృష్టితో అద్భుత విజయాలు సాధించడం అనన్య సామాన్యమని, ఈ అంశాలనే ముఖ్యంగా యువతలో ప్రేరేపించాలనే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం డిసెంబర్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అక్కినేని అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవాలను జరుపుతున్నామని ప్రసాద్ తోటకూర పేర్కొన్నారు. 2014లో గుడివాడ, 2015లో హైదరాబాద్, 2016లో చెన్నై, 2017లో ఏలూరు, 2018లో కరీంనగర్లో అక్కినేని అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవాలు జరిగాయని తెలిపారు. 2019 అక్కినేని అంతర్జాతీయ పురస్కార గ్రహీతలు “జీవిత సాఫల్య పురస్కారం”– శ్రీమాగంటి మురళీమోహన్, సినీ, వ్యాపార, రాజకీయ రంగాలలో ప్రముఖులు "విద్యా రత్న” – ప్రొఫెసర్. పద్మశ్రీ కొలకలూరి ఇనాక్, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఛైర్మన్ "సినీ రత్న"– “మహానటి” చిత్రబృందం, జాతీయ స్థాయిలో ఎన్నో పురస్కారాలు అందుకున్న చిత్రం "వ్యాపార రత్న"- డా. సూరపనేని విజయకుమార్, నిర్మాణ రంగంలో అగ్రగ్రామి, కళాపోషకులు "రంగస్థలరత్న"– పద్మశ్రీ డాక్టర్. శోభానాయుడు, కూచిపూడి నృత్యంలో అగ్రశ్రేణి నర్తకి, నాట్యాచారులు "వైద్య రత్న"- డాక్టర్. ముళ్ళపూడి వెంకటరత్నం, సామాన్య ప్రజల పాలిట పెన్నిధి "సేవా రత్న" – “మన కోసం మనం ట్రస్ట్”– చల్లపల్లి, పరిశుభ్రత, పచ్చదనంలో సమిష్టి కృషి "వినూత్న రత్న"– శ్రీసత్తిరాజు శంకరనారాయణ, పెరేన్నికగన్న పెన్సిల్ డ్రాయింగ్ ఆర్టిస్ట్ "యువ రత్న” – శ్రీ ఫణికెర క్రాంతికుమార్, సాహసవీరుడు కాగా, అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంస్థకు డాక్టర్.ప్రసాద్ తోటకూర(వ్యవస్థాపక అధ్యక్షులు), శారద ఆకునూరి(అధ్యక్షులు), చలపతి రావు కొండ్రకుంట(ఉపాధ్యక్షులు), డాక్టర్.సి.ఆర్.రావు( కార్యదర్శి), రవి కొండబోలు(కోశాధికారి), రావు కల్వల, ధామా భక్తవత్సలు, డాక్టర్ శ్రీనివాసరెడ్డి ఆళ్ల, మురళి వెన్నం బోర్డు అఫ్ డైరెక్టర్స్‌గా వ్యవహరిస్తున్నారు. మరిన్ని వివరాలకు www.akkinenifoundationofamerica.org ను సందర్శించండి. -
ఐఏఎఫ్‌సీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
డల్లాస్ : ‘సామాజిక భద్రతా సమాచారం’ పై భారతీయ అమెరికన్లకు అవగాహన కల్పించేందుకు ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్(ఐఏఎఫ్‌సీ) డల్లాస్‌లో ఓ సదస్సు నిర్వహించింది. ఐఏఎఫ్‌సీ అధ్యక్షుడు డాక్టర్ ప్రసాద్ తోటకూర ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అవగాహన సదస్సుకు ప్రజా వ్యవహారాల నిపుణుడు ఆంజీ హోక్వాంగ్ విచ్చేసి తన విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారు. పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ అవగాహన సదస్సుల్లో దాదాపు 100 మంది పాల్గొని తమ సందేహాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రేక్షకులు అడిగిన ప్రతి ప్రశ్నకు హోక్వాంగ్ సమాధానం చెప్పారు. వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఈ అవగాహన సదస్సుకు ప్రత్యేక అతిథిగా హాజరైన మిచిగాన్ రాష్ట్ర పతినిధి పద్మ కుప్ప మాట్లాడుతూ.. సామాజిక భద్రత గురించి తప్పుడు సమాచారం, అపార్థాలను తొలగించడానికి ఇలాంటి సెమినార్లు చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. ఇలాంటి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్న ఐఏఎఫ్‌సీ బృంధాన్ని అభినందించారు. సెమినార్ అనంతరం అమె నగరంలోని మహాత్మా గాంధీ స్మారక చిహ్నాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి పూల మాలవేసి నివాళర్పించారు. ఈ కర్యాక్రమంలో ఐఏఎఫ్‌సీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ తైయాబ్ కుండవాలా, వైస్ ప్రెసిడెంట్ రావు కాల్వల తదితరులు పాల్గొన్నారు. -
డాలస్‌లో 'అంతర్జాతీయ యోగా దినోత్సవం'
డాలస్ : మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో ఇర్వింగ్‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్ వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం జరిగింది. దాదాపు 300 మంది ప్రవాస భారతీయులు ఉత్సాహంగా 5వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఇర్వింగ్ నగర మేయర్ రిక్ స్టొఫర్ ముఖ్య అతిథిగాను, కాన్సుల్ రాకేష్ బనాటి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. సంస్థ కార్యదర్శి రావు కల్వల అతిథులకు స్వాగతం పలికి, యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. సంస్థ ఉపాధ్యక్షుడు బి.ఎన్ రావుమాట్లాడుతూ అందరూ ఒక చోట చేరి ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి మహాత్మా గాంధీ మెమోరియల్ ప్రధాన వేధిక కావడం సంతోషంగా ఉందన్నారు. మహాత్మా గాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ఎన్నో వేల సంవత్సరాల క్రితమే యోగా అనే ప్రక్రియను భారతదేశం ప్రపంచానికి అందించిన ఒక గొప్ప కానుక అన్నారు. యోగా చేయడానికి వయస్సు, జాతి, మతం, కులం అడ్డు కావని అందుకే 170 దేశాలకు పైగా కోట్లాది ప్రజలు జూన్21న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొంటున్నారని అన్నారు. యోగా సంవత్సరానికి ఒక సారి వచ్చే పండుగలా కాకుండా దైనందిన జీవితంలో ఒక భాగం కావాలని అన్నారు. ఈ యోగాను ఇర్వింగ్ నగరంలో ఉన్న అన్ని పాఠశాలల్లో ప్రవేశపెట్టాలని ఇర్వింగ్ మేయర్‌కు సూచించగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఇర్వింగ్ నగర మేయర్ రిక్ స్టొఫర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని, ఎన్నో దేశాల ప్రజలు యోగాను తమ జీవితాలలో ఒక ముఖ్య భాగంగా చేసుకోవడం విశేషమని, యోగాను ఆవిష్కరించిన భారతదేశానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కాన్సుల్ రాకేష్ బనాటి మాట్లాడుతూ ఐదు సంవత్సరాల క్రితం భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును అనుసరించి ఐక్యరాజసమితి జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించటంతో ప్రపంచవ్యాప్తంగా యోగా జరువుకోవడం భారతదేశానికి గర్వకారణం అన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్, డాలస్ విద్యార్థులకు మహాత్మా గాంధీ మెమోరియల్ సంస్థ 2,000 డాల్లర్ల స్కాలర్షిప్ను యూనివర్సిటీ ఏషియా సెంటర్ డైరెక్టర్ మోనిక్ వేడేర్బర్న్ కు మేయర్ చేతుల మీదుగా అందజేశారు. “92వ స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీలలో” విజేతలుగా నిలిచిన అభిజాయ్ కొడాలి, సోహుమ్ సుఖతన్కర్, రోహన్ రాజాలను, వారి తల్లిదండ్రులను డా. ప్రసాద్ తోటకూర, బోర్డు సభ్యులు, మేయర్ రిక్ స్టొఫర్, కాన్సుల్ రాకేష్ బనాటిలు ఘనంగా సత్కరించారు. దాదాపు రెండు గంటల పాటు యోగా గురువులు విజయ్, పెగ్గీ నేతృత్వంలో యోగాలోని మెళకువలను ఉత్సాహంగా ప్రవాస భారతీయులు నేర్చుకొని సాధన చేశారు. సంస్థ కోశాధికారి అభిజిత్ రాయిల్కర్ ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడానికి తోడ్పడిన స్వచ్చంద సేవకులకు, విచ్చేసిన అతిధులకు, మీడియా మిత్రులకు, ఫోటోగ్రఫీ, సౌండ్ సిస్టమ్స్ ఏర్పాటు చేసిన వారికి, వాటర్ బాటిల్స్ ఉచితంగా అందజేసిన సరిగమ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమం అనంతరం విచ్చేసిన వారందరికీ గాంధీ మెమోరియల్ సంస్థ వారు యోగ్యతా పత్రాలను, అల్పాహారం అందజేశారు. -
డాలస్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
డాలస్ : మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ సంస్థ ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూర ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలు జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కాన్సులేట్ ఆఫ్ ఇండియా హౌస్టన్ వారి సహకారంతో 5వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను జూన్ 22న ఉదయం 7:30 నుండి 9:30 వరకు మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజా, ఇర్వింగ్ నగరంలో నిర్వహిస్తున్నట్టు ప్రసాద్ తోటకూర తెలిపారు. ఈ కార్యక్రమానికి ఇర్వింగ్ నగర మేయర్ రిక్ స్టొఫర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కాన్సుల్ జనరల్ ఆఫ్ హ్యూస్టన్ డా. అనుపమ్ రే ప్రత్యేక అతిథిగా పాల్గోనున్నారు. ఈ సంవత్సరం ప్రతిష్టాత్మకమైన 92వ స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ ఛాంపియన్స్ గా ఎనిమిది మంది గెలిస్తే, అందులో ఏడుగురు భారతీయ సంతతికి చెందిన వారు కావడం ఎంతో గర్వకారణంగా ఉందని ప్రసాద్ తోటకూర అన్నారు. వారిలో డల్లాస్ నుంచి గెలిచిన అభిజాయ్ కొడాలి, సోహుమ్ సుఖతన్కర్, రోహన్ రాజాలను సత్కరించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి యోగా చేయడానికి యోగా మాట్స్, అల్పాహారంను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. డా. ప్రసాద్ తోటకూర నేతృత్వంలోని ఈ మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ సంస్థకు బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ గా జాన్ హేమండ్, బి.ఎన్. రావు, రావు కాల్వల, అభిజిత్ రాయిల్కర్, తాయబ్ కుండవాలా, అక్రమ్ సయ్యద్, పీయూష్ పటేల్, కమల్ కౌషల్ భాధ్యతలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలకు www.mgmnt.org ను సంప్రదించాలని, ఈ యోగా దినోత్సవ వేడుకల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
ఐఏఎఫ్‌సీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రవాస భారతీయోత్సవం
డాలస్ : ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ (ఐఏఎఫ్‌సీ)ఆధ్వర్యంలో ప్రవాస భారతీయోత్సవం ఘనంగా జరిగింది. డాలస్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి 3000 మందికి పైగా ఎన్ఆర్ఐలు హాజరయ్యారు. వందలాది మంది పిల్లలు కేరింతలు కొడుతూ ‘పెట్టింగ్ జూ’, ‘పోనీ రైడ్స్’, ‘స్టిల్ట్ వాకర్స్’, ‘ఫేస్ పెయింటింగ్’, ‘మెహంది’, ‘బౌన్సు హౌస్’ దగ్గర కోలాహలం చేశారు. దాదాపు 500 మందికి పైగా యువతీయువకులు భారత సంగీత సాహిత్య అంశాల ప్రధానంగా భరతనాట్యం, కూచిపూడి, కథక్, ఒడిస్సి, జానపద నృత్య రీతులలో వారు చేసిన నాట్య విన్యాసాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పాశ్చాత్య సంగీత రీతులతో కూడిన కాప్పెల్ పాఠశాల అమెరికన్ విద్యార్థినీవిద్యార్థులు 20 నిమిషాలకు పైగా జరిపిన సంగీత విభావరి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న వారందరికి టెక్సాస్ రాష్ట్రానికి చెందిన అమెరికా సెనెటర్ టెడ్ క్రూజ్ స్వయంగా యోగితా పత్రాలను అందజేశారు. అమెరికా గాట్ టాలెంట్‌లో స్థానం సంపాదించిన, స్పానిష్ గాట్ టాలెంట్‌లో సెమీఫైనలిస్ట్‌గా నిలిచిన హైదరాబాద్‌కు చెందిన యువకుడు క్రాంతి కుమార్ చేసిన చూపుడు వేలుతో కొబ్బరికాయకు రంధ్రం చేసి కొబ్బరి నీళ్ళు త్రాగడం, రక్తస్రావం లేకుండా ముక్కులో డ్రిల్ బిట్ ఆన్ చేసి పెట్టుకోవడం, సల సలా మరిగే నూనెను చేతులతో త్రాగడం, 32 పొడవాటి కత్తులను గొంతులో దించుకోవడం, చెక్క ముక్కపై నుదిటితో మేకు కొట్టడం లాంటి అద్భుత విన్యాసాలు ప్రేక్షకులందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. ఐఏఎఫ్‌సీ అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర, బోర్డు సభ్యులు ఈ ఉత్సవాలలో క్రాంతి కుమార్‌కు "సాహసవీర" అవార్డు ప్రదానం చేశారు. తన్వీర్ అరోరా స్టాండప్ కమెడియన్‌గా అందరినీ నవ్వించారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని రన్నా జానీ ఆధ్వర్యంలో రాజేశ్వరి ఉదయగిరి, అంజనా జయంతి, అపర్ణ వంశీలు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో టెక్సస్ రాష్ట్రానికి చెందిన సీనియర్ డెమొక్రాట్, యూఎస్ కాంగ్రెస్ మెంబెర్ ఎడ్డీ బెర్నీ జాన్సన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అమెరికా దేశం వివిధ సంస్కృతుల విభిన్న ఆచారాల ప్రవాసీయుల నిలయమని, ఈ దేశంలో వివక్షతకు తావు లేదని పేర్కొన్నారు. అమెరికా దేశ ప్రగతిలో వివిధ రంగాలలో ప్రవాస భారతీయుల పాత్ర ఎంతగానో ఉందని కొనియాడారు. టెక్సాస్ రాష్ట్ర సెనెటర్ జేన్ నెల్సన్ ఈ ప్రవాస భారతీయ ఉత్సవాన్ని గుర్తిస్తూ టెక్సాస్ రాష్ట్ర సెనేట్ నుండి ఒక ప్రశంసా పత్రాన్ని, అలాగే టెక్సాస్ రాష్ట్ర కాంగ్రెస్ నుండి కాంగ్రెస్ మెంబెర్ టెర్రీ మీజా ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ పాత్రను ప్రశంసిస్తూ టెక్సాస్ చట్ట సభ నుండి ఒక ప్రత్యేక అభినందన పత్రాన్ని తీసుకువచ్చి చదివి వినిపించారు. వీరితో పాటు టెక్సాస్ రాష్ట్ర కాంగ్రెస్ ప్రతినిధులు జూలీ జాన్సన్, మ్యాట్ షహీన్‌లు పాల్గొని అమెరికా జన జీవన స్రవంతిలో ప్రవాస భారతీయుల పాత్ర ఇంకా పెరగవలసిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఇటీవలే నార్త్ కరోలినా రాష్ట్ర సెనెటర్‌గా ఎన్నికైన భారత సంతతికి చెందిన జై చౌదరి మాట్లాడుతూ ప్రవాస భారతీయులందరు ఐక్యతతో మెలుగుతూ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనాలని అన్నారు. భారత సంతతికి చెందిన వాషింగ్టన్ రాష్ట్ర సెనెటర్ మాంకా డింగ్ర తాను ఎన్నికల్లో గెలవడానికి అనేక ఆటుపోట్లను ఎదుర్కొని అందరి సహకారంతో గెలవగలిగానని అన్నారు. వాషింగ్టన్ డీసీలోని భారత ఎంబసీ నుండి కమ్యూనిటీ అఫైర్స్ మినిస్టర్ అనురాగ్ కుమార్, కాప్పెల్ నగర్ పోలీస్ చీఫ్ డానీ బార్టన్, కాప్పెల్ స్కూల్ డిస్ట్రిక్ట్ సూపరిండేంట్ బ్రాడ్ హంట్, నగర కౌన్సిల్ మెంబర్ బిజూ మాత్యూ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ మిలియన్ల సంఖ్యలో ఉన్న ప్రవాస భారతీయులందరు అమెరికా జన జీవన స్రవంతిలో భాగమవుతూ స్థానిక సమస్యలన్నీ తమ సమస్యలుగా భావించి అర్హత ఉన్న వారందరూ ఎన్నికల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. తమ వాణిని ఐకమత్యంగా బలంగా వినిపించకపోతే ప్రవాస భారతీయులకు సరైన గుర్తింపు లభించదు అన్నారు. ఆ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమంలో ఓటరు నమోదు కార్యక్రమంలో బోర్డు సభ్యులు రావు కల్వల పర్యవేక్షణలో నిర్వహించామన్నారు. ఈ ఉత్సవంలో పాలుపంచుకోలేకపోయిన యూఎస్ కాంగ్రెస్ మెంబెర్ రాజా కృష్ణమూర్తి, మిచిగాన్ రాష్ట్ర కాంగ్రెస్ మెంబెర్ పద్మ కుప్ప, టెక్సాస్ రాష్ట్రం నుంచి అమెరికా సెనెట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్న సెనెటర్ జాన్ కార్నిన్, సెనెటర్ టెడ్ క్రూజ్ లు ఐఏఎఫ్‌సీ తలపెట్టిన ఈ ప్రవాస భారతీయోత్సవాన్ని ప్రశంసిస్తూ వీడియో మెసేజ్ ద్వారా ప్రేక్షకులకు సందేశం పంపారు. తమ కార్యక్రమం చివరిలో రంగురంగుల కాంతులతో అత్యంత వైభవంగా జరిగిన ఫైర్ వర్క్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సంస్థ అధ్యక్షుడు డాక్టర్. ప్రసాద్ తోటకూర నేతృత్వంతో కూడిన ఈ ‘ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్’ లో బోర్డు అఫ్ డైరెక్టర్స్- జాన్ హేమండ్, రావు కల్వల, తైయబ్ కుండావాల, డా. చెన్నుపాటి రావు, పియూష్ పటేల్, మురళి వెన్నం, డా.సత్ గుప్తా, రన్నా జానీ, రామ్ కీ చేబ్రోలు, ప్రొఫెసర్. నిరంజన్ త్రిపాఠిలు ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో తమ వంతు కృషి చేశారు. -
మే4న డాలస్‌లో ప్రవాస భారతీయోత్సవం
డాలస్ : ‘ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్’ ఆధ్వర్యంలో డాలస్‌లో ప్రవాస భారతీయోత్సవ కార్యక్రమం జరగనుంది. “భారతీయులందరూ అమెరికా జనజీవన స్రవంతిలో భాగం కావాలి” అనే పిలుపునిస్తూ కాప్పెల్‌లోని సైప్రేస్‌లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ అధ్యక్షుడు డాక్టర్. ప్రసాద్ తోటకూర ఓ ప్రకటన విడుదల చేశారు. మే4న మధ్యాహ్నం 3 నుండి రాత్రి 10 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని, పార్కింగ్తో సహా ప్రవేశం ఉచితమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లల వినోదం కోసం ‘పెట్టింగ్ జూ’, ‘పోనీ రైడ్స్’, ‘స్టిల్ట్ వాకర్స్’, ‘ఫేస్ పెయింటింగ్’, ‘మెహంది’, ‘బౌన్సు హౌస్’, ‘రంగు రంగుల బెలూన్స్ పంపకం’ మొదలైనవెన్నో ఏర్పాట్లు చేస్తున్నారు. అతిథుల కోసం వివిధ రకాల వంటకాలతో కూడిన ఫుడ్ స్టాల్స్, ఇతర బిజినెస్ స్టాల్స్ అందుబాటులో ఉండనున్నాయి. 500 మందికిపైగా భారత సంతతికి చెందిన వారితో పాటు అమెరికన్ యువతీయువకులు కూడా అనేక సంగీత, నృత్య కార్యక్రమాల్లో పాల్గోనున్నారు. 80 మందితో కూడిన విద్యార్ధినీ విద్యార్ధులు “కాప్పెల్ స్కూల్ బ్యాండ్”లో అలరించనున్నారు. “అమెరికా గాట్ టాలెంట్” షో కు సెలెక్ట్ అయిన హైదరాబాద్‌కు చెందిన క్రాంతి కుమార్ అనే యువకుడు చూపుడు వేలుతో కొబ్బరికాయకు రంధ్రం చేసి కొబ్బరి నీళ్ళు త్రాగడం, రక్తస్రావం లేకుండా ముక్కులో డ్రిల్ బిట్ ఆన్ చేసి పెట్టుకోవడం, సల సలా మరిగే నూనెను చేతులతో త్రాగడం, 32 పొడవాటి కత్తులను గొంతులో దించుకోవడం, చెక్క ముక్కపై నుదిటితో మేకు కొట్టడం లాంటి అనేక సాహస కృత్యాలను ప్రదర్శించనున్నారు. పాటలను రివర్స్‌లో పాడే ప్రక్రియతో కొన్ని వందల కార్యక్రమాలుచేసి ఎన్నో ప్రశంసలు పొందిన “రివర్స్ గేర్ గురుస్వామి” అందర్నీ అలరించడానికి ప్రత్యేకంగా వస్తున్నారు. భారత సంతతికి చెందిన యూ.ఎస్ కాంగ్రెస్ మెంబర్ రాజా కృష్ణమూర్తి, నార్త్ కరోలిన స్టేట్ సెనెటర్ జై చౌదరి, వాషింగ్టన్ స్టేట్ సెనెటర్ మాంకా డింగ్ర, ఒహాయో స్టేట్ రిప్రెసెంటేటివ్ నీరజ్ అంటాని, మేరీలాండ్ స్టేట్ రిప్రెసెంటేటివ్ జై జలిసి, ఆరిజోనా స్టేట్ రిప్రెసెంటేటివ్ డా. అమిష్ షాతో పాటు టెక్సస్ స్టేట్ రిప్రెజెంటేటివ్స్ మిషల్ బెక్లీ, జూలీ జాక్సన్, టెర్రీ మిజా, మ్యాట్ షాహీన్ హాజరుకానున్నారు. ఇండియన్ ఎంబసీ నుండి కమ్యూనిటీ అఫైర్స్ మినిస్టర్ అనురాగ్ కుమార్, కాన్సులేట్ జనరల్ అఫ్ ఇండియా, హ్యుస్టన్ నుండి కాన్సల్ రాకేష్ బనాటి, విప్రో సంస్థ సీఈఓ అబిద్ ఆలి నీముచ్వాలా, కాప్పెల్ నగర పోలీస్ చీఫ్ డానీ బార్టన్, కాప్పెల్ స్కూల్ డిస్ట్రిక్ట్ సూపరిండేంట్ బ్రాడ్ హంట్, నగర కౌన్సిల్ మెంబర్ బిజూ మాత్యూ ప్రత్యేక అతిథులుగా హాజరవుతున్నారు. అర్హత కల్గిన ప్రవాస భారతీయులందరూ అమెరికా దేశ ఎన్నికల్లో పాల్గొనేందుకు వీలుగా ఓటు హక్కును నమోదు చేసుకోవడానికి ఈ ఉత్సవంలో అవకాశం కల్పిస్తున్నాము. రాత్రి 9 గంటలకు కనుల విందు కల్గించే అత్యంత వైభవంగా ఫైర్ వర్క్స్ ఉంటాయి. సంస్థ అధ్యక్షుడు డాక్టర్. ప్రసాద్ తోటకూర నేతృత్వంతో కూడిన బోర్డు అఫ్ డైరెక్టర్స్ జాన్ హేమండ్, రావు కల్వల, తైయబ్ కుండావాల, డా. చెన్నుపాటి రావు, పియూష్ పటేల్, మురళి వెన్నం, డా. సత్ గుప్తా, రన్నా జానీ, రామ్ కీ చేబ్రోలు, ప్రొఫెసర్. నిరంజన్ త్రిపాఠి వివిధ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. -
డల్లాస్‌లో ఘనంగా 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
డల్లాస్ : భారత 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అమెరికాలోని డల్లాస్‌లో ఘనంగా జరిగాయి. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (ఎమ్జీఎమ్ఎన్టీ) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో అమెరికాలోనే అతి పెద్ద గాంధీ స్మారకంగా గుర్తింపు పొందిన మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజాలో ఈ వేడుకలు జరిగాయి. మువ్వన్నెల జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి డల్లాస్‌లోని భారతీయులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వేడుకకు విచ్చేసిన ప్రతి ఒక్కరిని సంస్థ కార్యదర్శి కాల్వల రావు సాదరంగా ఆహ్వానించారు. సంస్థ చైర్మన్ డా.తోటకూర ప్రసాద్ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడిన ఆయన భారత రాజ్యాంగ విశిష్టత గురించి వివరించారు. స్వాతంత్ర్య సమరయోధుల సేవలను గుర్తుచేశారు. రాజ్యాంగాన్ని రూపోందించిన డాక్టర్ అంబేడ్కర్, జవహార్‌లాల్ నెహ్రూ, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, శ్యాం ప్రసాద్ ముఖర్జీలను గుర్తించుకోవాలన్నారు. వీరంతా మూడేళ్లపాటు ఎంతో కష్టపడి రాజ్యాంగాన్ని రూపోందించారని తెలిపారు. ఇప్పటికే ఎంతో అభివృద్ధి సాధించామని.. చేయాల్సింది ఇంకా ఉందని గుర్తుచేశారు. భారతీయ అమెరికన్లుగా రెండు దేశాల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.సంస్థ కోచైర్మన్ బీఎన్.రావు మాట్లాడుతూ.. స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీ చేసిన కృషి మరవలేదన్నారు. వేడుకలను ముఖ్యఅతిథిగా ఇర్వింగ్ పట్టణ డిప్యూటీ మేయర్ ఆస్కార్ వార్డ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆస్కార్ వార్డు మాట్లాడుతూ..ఉన్నత సమాజ నిర్మాణంలో భారతీయులు చేస్తున్న కృషి మరువలేనిదన్నారు. ప్రత్యేక అతిథిగా విచ్చేసిన ఇర్వింగ్ కౌన్సిల్ సభ్యుడు ఆలన్ మేగర్ మాట్లాడుతూ.. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన భారత్, అతి పురాతన ప్రజాస్వామ్య దేశమైన అమెరికా కలిసి పనిచేయాల్సిన అవసరముందన్నారు. ఈ వేడుకల్లో ఎమ్జీఎమ్ఎన్టీ కోశాధికారి అభిజిత్ రాయ్‌కర్‌తో పాటు దాదాపు 150 మంది ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. -
డల్లాస్‌లో యోగా డే దినోత్సవ వేడుకలు
డల్లాస్ : మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (ఎంజీఎంఎన్టీ) ఆధ్వర్యంలో డల్లాస్(ఇర్వింగ్)లో ఆదివారం జూన్ 17న జరిగిన 4వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో 300 మందికి పైగా యువతీ, యువకులు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కాన్సుల్ అశోక్ కుమార్, ఇర్వింగ్ సిటీ మేయర్ ప్రోటెం ఆలన్ మీఘర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎంజీఎంఎన్టీ కార్యదర్శి రావు కల్వల అందరికీ స్వాగతం పలుకుతూ ఈ గాంధీ మెమోరియల్ దగ్గర యోగ దినోత్సవం జరుపుకోవడం ఇది నాల్గవ పర్యాయమని, ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల సంఖ్యలో అందరూ ఉత్సాహంగా యోగ చేస్తున్నారని, ఈ కార్యక్రమానికి సహకరించిన భారత కాన్సులేట్ అధికారులకు, ఇర్వింగ్ సిటీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంజీఎంఎన్టీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ షబ్నమ్ మోద్గిల్ కార్యవర్గ సభ్యులను అందరికీ పరిచయం చేశారు. ఎంజీఎంఎన్టీ ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ 5,000 సంవత్సరాల క్రితం రిషికేష్ యోగాకు జన్మస్థలం అయ్యిందని, 2014 లో ఐక్యరాజసమితి జూన్ 21 ని యోగా దినోత్సవంగా ప్రకటించడంతో ఆ రోజున ప్రపంచవ్యాప్తంగా 175 దేశాలు యోగా దినోత్సవాన్ని పాటిస్తున్నాయని తెలిపారు. గాంధీ మహాత్ముడు కూడా యోగాకు, ధ్యానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారని, ఈ రోజు అదే గాంధీ స్మారక స్థలంలో యోగా దినోత్సవం జరుపుకోవడం సముచితంగా ఉందని అభిప్రాయపడ్డారు. కాన్సుల్ అశోక్ కుమార్ మాట్లాడుతూ కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా హ్యూస్టన్, మహాత్మా గాంధీ మెమోరియల్ డల్లాస్‌తో కలిపి యోగా దినోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును అనుసరించి ఐక్యరాజ్య సమితి జూన్ 21న యోగా దినోత్సవాన్ని పాటించడం చారిత్రాత్మక విషయమని, నిత్యం అందరూ యోగా అభ్యసించాలని కోరారు. విశాలమైన థామస్ జెఫెర్సన్ పార్కులో సుందరమైన మహాత్మా గాంధీ మెమోరియల్ ను ఏర్పాటు చేసిన సభ్యులందరకీ ఇర్వింగ్ సిటీ మేయర్ ప్రోటెం ఆలన్ మీఘర్ కృతజ్ఞతలు తెలిపారు. పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా యోగాలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. సిటీ తరపున ఏ సహాయం చేయడానికైనా తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. ఎంజీఎంఎన్టీ కో-చైర్మన్ కమల్ కౌషల్ యోగా ప్రాముఖ్యాన్ని వివరించారు. యోగా శిక్షకుడు విజయ్, వారి బృందంతో యోగా శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించ వలసినదిగా ఆహ్వానించారు. దాదాపు గంటకు పైగా జరిగిన ఈ యోగా శిక్షణలో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇదే వేదిక పై ప్రతిష్ఠాత్మకమైన ‘స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీలలో’ ప్రథమ స్థానం సాధించిన కార్తీక్ నెమ్మాని, ద్వితీయ స్థానం పొందిన నైన మోడీ, తృతీయ స్థానంలో వచ్చిన అభిజయ్ కొడాలి, వారి తల్లిదండ్రులను, పిల్లలకు శిక్షణ ఇచ్చిన ‘జియోస్పెల్ అకాడమీ’ నిర్వాహకులు విజయ్ రెడ్డి, గీత మంకులను ఎంజీఎంఎన్టీ ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూర, ఇతర బోర్డు సభ్యులతో కలసి ఘనంగా సన్మానించారు. ఎంజీఎంఎన్టీ కోశాధికారి బి. ఎన్. రావు ఈ కార్యక్రమ విజయానికి సహకరించిన అధికారులకు, కార్యకర్తలకు, మీడియా వారికి, బాంబే ఫోటోగ్రఫీ వారికి, మ్యూజిక్ మస్తీ వారికి, హర్యానా సంఘానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. -
జాతిపితకు తెలుగు రాష్ట్రాల నాయకుల ఘననివాళి
డల్లాస్, టెక్సాస్ : తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన రాజకీయ ప్రముఖులు అమెరికాలోనే అతి పెద్దదైన డల్లాస్‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజాను సందర్శించి జాతిపితకు పుష్పగుచ్చాలతో నివాళులర్పించారు. గతంలో ఓసారి డల్లాస్‌లోని గాంధీ మెమోరియల్‌ను సందర్శించానని ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ప్రతి ఏటా ఈ గాంధీ మెమోరియల్ ప్లాజా మెరుగులు దిద్దుకుంటూ అత్యంత సుందర ప్రదేశంగా వెలుగొందడం సంతోషదాయకమని తెలిపారు. ఖండాంతరాలల్లో జాతిపిత సిద్ధాంతాలను, ఆశయాలను సజీవంగా ఉట్టిపడేటట్లుగా ఇంతటి మహత్తర కార్యాన్ని సాధించడంలో కృషి చేసిన ప్రవాస భారతీయ నాయకులు, ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్ షిప్ కౌన్సిల్ సంస్థ అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర, వారి బృంద సభ్యులకు, సిటీ అధికారులకు, స్థానిక ప్రజలకు అభినందలు తెలియజేశారు. తొలిసారిగా ఈ గాంధీ మెమోరియల్ ను సందర్శిస్తున్నానని, ఇక్కడికి రాగానే శాంతిదూత గాంధీజీ ఆశయాలు, త్యాగ నిరతి, ప్రపంచంలో అనేకమంది యువకులకు స్ఫూర్తినిచ్చిన తీరు గుర్తుకొస్తున్నాయని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పెద్ది రెడ్డి పేర్కొన్నారు. భావితరాలకు తప్పనిసరిగా ఇదొక స్ఫూర్తిదాయక ప్రాంతమౌతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఈ పార్కును అభివృద్ధి చేయడంలో సంస్థ ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూర, వారి బృంద సభ్యులు చేసిన కృషి ప్రశంసనీయం అన్నారు. మహాత్మా గాంధీ మన భారతదేశంలో జన్మించినా, శాంతి స్నేహం, సుహృద్భావం, అహింస అనే అంశాలే ఆశయాలుగా తన జీవితాన్ని దేశం కోసం త్యాగం చేసి ప్రపంచంలో ఒక ఆదర్శ పురుషుడిగా నిలిచిపోయారని గుంటూరు జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ పాత్తూరి నాగభూషణం అన్నారు. ఉత్తర అమెరికాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం మాట్లాడుతూ పచ్చని చెట్లతో, చక్కని నీటి వనరులతో శాంతికి ప్రతిరూపంగా ఈ గాంధీ మెమోరియల్ ను అత్యంత సుందర పర్యాటక కేంద్రం గా తీర్చిదిద్దిన తీరు ను చూసి ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమన్నారు. తీరికలేని పనులతో బిజీ గా ఉన్నప్పటికీ ప్రత్యేక శ్రద్ధతో ఈ గాంధీ మెమోరియల్ ను సందర్శించి జాతిపితకు నివాళులర్పించిన ఉభయ తెలుగు రాష్ట్రాల నేతలకు, స్థానిక ప్రముఖులైన వెంకట్ అబ్బూరు, మురళి వెన్నం, వినోద్ ఉప్పు తదితరులందరికీ సంస్థ అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. -
నిక్కీ హేలీకి డల్లాస్‌లో ఘన సన్మానం
డల్లాస్ : ఐరాసలో అమెరికా రాయబారిగా ఉన్న భారత సంతతికి చెందిన నిక్కీ హేలీకి మే 23న ఇర్వింగ్‌లోని ఫోర్ సీసన్స్ హోటల్లో ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్ షిప్ కౌన్సిల్ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఈ సన్మాన సభలో విప్రో సంస్థ సీఈఓ అభిదాలి నీమచ్ వాల, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ అర్లింగ్టన్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ విస్తాస్ప్ కర్భరి, టోమ్స్ ఆటో గ్రూప్ అధినేత బాబ్ టోమ్స్ లతో పాటూ స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్ షిప్ కౌన్సిల్ సంస్థ అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ తమ సంస్థ ఆహ్వానం పై నిక్కీ హేలీ డల్లాస్‌కి విచ్చేయడం ఇది ఆరవ సారని గతంలో సౌత్ కరోలినా రాష్ట్ర ప్రతినిధిగాను, గవర్నర్ అభ్యర్థి గాను, గవర్నర్ గాను, మహాత్మా గాంధీ మెమోరియల్ శంకుస్థాపనకు ముఖ్య అతిథిగాను, ప్రస్థుతం అమెరికా రాయబారిగాను విచ్చేసిన విషయాన్ని గుర్తుచేశారు. నిక్కీ హేలీ రాష్ట్ర ప్రతినిధి గాను, గవర్నర్ గాను, సౌత్ కరోలినా రాష్ట్ర అభివృద్ధికి ఎనలేని కృషి చేసి, రాష్ట్ర చరిత్ర లో మునుపెన్నడూ లేని విధంగా వేలాది ఉద్యోగాలను సృష్టించారని కొనియాడారు. అమెరికాలో ఉన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో పార్టీలకు అతీతంగా ఇరువర్గాలను కలుపుకుపోయే రాజకీయ నాయకులు అవసరమని, అందులోనూ ముఖ్యంగా నేర్పరితనంతో పాటు ధైర్యం, ఓర్పుతో ఉన్న దేశభక్తి, దయాగుణం ఉన్నా అవసరమైనప్పుడు అత్యంత కఠినంగా వ్యవహరించే నాయకులు కావాలని ఆ లక్షణాలన్నీ నిక్కీ హేలీ లో ఇమిడి ఉన్నాయని ప్రసాద్ తోటకూర ప్రశంసించారు. డా. ప్రసాద్ తోటకూర తన ఉపన్యాసాన్ని కొనసాగిస్తూ అమెరికా దేశాభివృద్ధి లో ప్రవాస భారతీయుల పాత్ర ఎంతో కీలకమైనదని పేర్కొన్నారు. భారత సంతతికి చెందిన టెక్నాలజీ కంపెనీ అధినేతలు అమెరికా దేశంలో నాలుగు లక్షలకు పైగా ఉద్యోగాలను కల్పించారన్నారు. 20 బిలియన్ డాలర్లను పన్ను రూపంలో అమెరికా ప్రభుత్వానికి చెల్లించారని, అంతేకాకుండా వివిధ అమెరికా విశ్వవిద్యాలయాలలో సుమారు రెండు లక్షలకు పైగా ఉన్న భారతీయ విద్యార్థులు చెల్లించే ఫీజులు అమెరికా విద్యా వ్యవస్థ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతోందని తెలిపారు. 2015-16 ఆర్ధిక సంవత్సరంలో ప్రవాస భారతీయులందరూ కలిపి అమెరికా ఆర్ధిక వ్యవస్థకు 2 ట్రిలియన్ డాలర్లకు పైగా సమకూర్చారని, ప్రస్తుతం భారత అమెరికా దేశాల మధ్య వాణిజ్యం 140 బిల్లియన్ డాలర్లకు చేరుకుందన్నారు. నిక్కీ హేలీ మాట్లాడుతూ తాను అమెరికా దేశంలో పుట్టినా, తన తల్లిదండ్రులు 50 సంవత్సరాల క్రితం పంజాబ్ రాష్ట్రం నుంచి వలస వచ్చి అమెరికా దేశంలో స్థిరపడ్డారన్నారు. భారత సంతతికి చెందిన వ్యక్తినని చెప్పుకోవడానికి తానూ ఎంతో గర్వపడతానన్నారు. అమెరికాలో ప్రవాస భారతీయుల పాత్ర ఎంతో ఘనమైనదని, విద్యాధికులుగా, సాంకేతిక పరిజ్ఞాన రంగ నిపుణులుగా అన్ని రంగాలలోను ప్రముఖ స్థానాల్లో ఉన్నారని ప్రశంసించారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే భారత్, అమెరికాల మధ్య ఆర్ధిక, వాణిజ్య, సాంకేతిక, రక్షణ విభాగాలలో అనేక కీలక ఒప్పందాలు ఇరుదేశాల బంధాన్ని మరింత దృఢతరం చేస్తున్నాయని చెప్పారు. అంతేకాకుండా ఇరుదేశాలు ఉగ్రవాద దాడులను చవిచూసినవే కనుక ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో తమ వంతు కృషిని కలసి కొనసాగిస్తాయని తెలియజేశారు. దక్షిణ ఆసియా దేశాలలో శాంతి, సుహృద్భావ వాతావరణానికై అమెరికా ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని, ఉగ్రవాదులకు స్థావరం కల్పిస్తున్న పాకిస్తాన్ లాంటి దేశాలను ఉపేక్షించే సమస్యే లేదని హెచ్చరించారు. నిక్కీ హేలీ ప్రసంగానంతరం ప్రేక్షకులు అడిగిన - "అమెరికా నార్త్ కొరియా అధ్యక్షుల సమావేశం జరుగుతుందా?", "అమెరికా దేశ అభివృద్ధిలో దక్షిణ ఆసియా వాసుల పాత్ర?", "ప్రస్తుత అమెరికా ఇరాన్ దేశ సంబంధాలు?", "హెచ్-4 వీసాల రద్దు, హెచ్-1 బి వీసాల పై నియంత్రణ?", "జెరూసలేం లో అమెరికా దౌత్య కార్యాలయం ప్రారంభించటంతో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులు?" మొదలైన ప్రశ్నలకు అనర్గళంగా, చమత్కారంగా నిక్కి హేలీ సమాధానమిచ్చారు. చివరిగా మీరు త్వరలో అమెరికా అధ్యక్ష పదవి బరిలోకి దిగపోతున్నారా? అని డాక్టర్ ప్రసాద్ తోటకూర అడిగినప్పుడు ఇప్పుడు తన ధ్యాసంతా ప్రస్తుత ఉద్యోగ బాధ్యతల పైనే అని చిరునవ్వుతో సమాధానం చెప్పారు. ఎంతో తీరికలేని సమయంలో కూడా తమ ఆహ్వానాన్ని మన్నించి ఈ సమావేశానికి విచ్చేసినందుకు నిక్కీ హేలీకి, అత్యధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేసిన అతిథులందరికీ డా. ప్రసాద్ తోటకూర ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్ షిప్ కౌన్సిల్ బోర్డు సభ్యులు రావు కల్వల, డా. సి.ఆర్. రావు, పీయూష్ పటేల్, మురళి వెన్నం, రాంకీ చేబ్రోలు, డా. సత్ గుప్త, తాయబ్ కుండావాలాలు నిక్కీ హేలీకి పుష్పగుచ్ఛం అందజేసి, దుశ్శాలువాతో ఘనంగా సత్కరించగా, డా. ప్రసాద్ తోటకూర ఆమెకు ప్రత్యేక మెమెంటోను బహుకరించారు. -
గాంధీ తత్వాలు అజరామరం : నిక్కి హేలీ
డల్లాస్ : ఉత్తర టెక్సాస్‌లో ఇర్వింగ్‌లోని మహాత్మాగాంధీ స్మారక స్థూపాన్ని ఐక్యరాజ్యసమతిలో అమెరికా రాయబారి నిక్కి హేలీ సందర్శించారు. మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (ఎమ్జీఎమ్ఎన్టీ) ఛైర్మన్ డాక్టర్ ప్రసాద్ తోట కూర నిక్కి హేలీని సాదరంగా ఆహ్వానించారు. మహాత్మా గాంధీ తత్వాలు, ఆయన ఆచరించిన నియమాలు అజరామరమని నిక్కి హేలీ కొనియాడారు. ఎమ్జీఎమ్ఎన్టీలో గాంధీ విగ్రహానికి పూలతో నివాళులు అర్పించారు. ఎమ్జీఎమ్ఎన్టీకి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. మే 2014 లో సౌత్ కరోలినా గవర్నర్‌గా ఉన్న సమయంలో ఎమ్జీఎమ్ఎన్టీ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. 2014, అక్టోబర్ 2న అమెరికాలోనే అత్యంత ఎత్తైన గాంధీ మెమోరియల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని గాంధీజీ మునిమనవడు సతీష్ దుపెలియా వచ్చారు. ఎమ్జీఎమ్ఎన్టీ ప్రాజెక్టు సాకారంలో ముఖ్యపాత్ర వహించిన డాక్టర్ ప్రసాద్ తోట కూర, ఎమ్జీఎమ్ఎన్టీ టీం, కమ్యునిటీ సభ్యులు, ఇర్వింగ్ నగర అధికారులను నిక్కి హేలీ అభినందించారు. ఎమ్జీఎమ్ఎన్టీ బోర్డ్ డైరెక్టర్స్ రావు కల్వల, కమల్ కౌషల్, జాన్ హమ్మాండ్, తయ్యబ్ కుందావాలా, పియూష్ పటేల్, నరసింహ భక్తుల, కుంతేష్ చాక్సి, శబ్నమ్ మాడ్గిల్, జాక్ గోద్వానీ, ఇర్వింగ్ నగర మేయర్ రిక్ స్టాఫర్, అలెన్ మీగర్, క్రిస్ హిల్మన్, పార్క్స్, జొసెఫ్ మోసెస్‌లు ఈ కార్యక్రమానికి హాజరయిన వారిలో ఉన్నారు. -
డల్లాస్‌లో ‘ఘన’తంత్ర వేడుకలు
డల్లాస్ : భారత 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అమెరికాలోని డల్లాస్‌లో ఘనంగా జరిగాయి. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (ఎమ్జీఎమ్ఎన్టీ) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో ఉత్తర టెక్సాస్‌లోని ఇర్వింగ్‌లోని మహాత్మాగాంధీ స్మారక స్థూపం వద్ద ఈ వేడుకలు జరిగాయి. మువ్వన్నెల జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి డల్లాస్‌లోని భారతీయులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా నగరం నడిబొడ్డున గాంధీ మెమోరియల్ స్వప్నం సాకారానికి కృషి చేసిన వారందరిని ఎమ్జీఎమ్ఎన్టీ సెక్రటరీ రావు కల్వల కొనియాడారు. గణతంత్ర వేడుకకు వచ్చిన వారందరికీ స్వాగతం పలికి, ఎమ్జీఎమ్ఎన్టీ నిర్వహించే కార్యక్రమాలకు మద్దతు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్జీఎమ్ఎన్టీ ఛైర్మన్ డాక్టర్ ప్రసాద్ తోట కూర భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందువులకు భగవద్గీత, ముస్లింలకు ఖురాన్, క్రైస్తవులకు బైబిల్ అంటూ ప్రతి మతానికి ఓ గ్రంథం ఉందని, కానీ భారత పౌరులందరికి కలిపి ఒకే గ్రంథం ఉందని అది రాజ్యాంగమని తెలిపారు. ఈ పవిత్ర గంథం పౌరుల సూత్రాలు, విధానాలు, అధికారాలు, విధులు, బాధ్యతలు మరియు ప్రాథమిక హక్కులను నిర్వచిస్తుందన్నారు. రాజ్యాంగమే సుప్రీమని, ప్రతి పౌరుడు రాజ్యాంగం యొక్క విలువలను అర్ధం చేసుకోని అనుసరించాలన్నారు. రాజ్యాంగాన్ని రూపోందించిన డాక్టర్ అంబేడ్కర్, జవహార్‌లాల్ నెహ్రూ, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, శ్యాం ప్రసాద్ ముఖర్జీలను గుర్తించుకోవాలన్నారు. వీరంతా మూడేళ్లపాటు ఎంతో కష్టపడి రాజ్యాంగాన్ని రూపోందించారని తెలిపారు. గాంధీ విగ్రహానికి ఎమ్జీఎమ్ఎన్టీ డైరెక్టర్ కమల్ కౌశల్ పూల మాల వేసి నివాళులు అర్పించారు. మరో డైరెక్టర్ షబ్నమ్ మోడ్గిల్ గాంధీ వర్థంతిని పురస్కరించుకొని జనవరి 30న అందరం మళ్లీ కలుసుకుని మహాత్ముడికి నివాళులు అర్పిద్దామని పేర్కొన్నారు. ఈ వేడుకలకు అమెరికాలోని భారత పౌరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
అక్కినేని ఫౌండేషన్ నూతన కార్యవర్గం ఎంపిక
అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా(ఏఎఫ్ఏ) నూతన కార్యవర్గ సభ్యుల పేర్లను వెల్లడించింది. ఏఎఫ్ఏ బోర్డ్ అఫ్ డైరెక్టర్స్ సమావేశంలో 2018 సంవత్సరానికి కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు అక్కినేని ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్. ప్రసాద్ తోటకూర తెలిపారు. నూతన కార్యవర్గం : వ్యవస్థాపక అధ్యక్షులు : డా. ప్రసాద్ తోటకూర అధ్యక్షులు : రావు కల్వల ఉపాధ్యక్షులు : శారద ఆకునూరి కార్యదర్శి : చలపతి రావు కొండ్రకుంట బోర్డు సభ్యులు : రవి కొండబోలు, ధామ భక్తవత్సలు, డా. సి. ఆర్. రావు, మురళి వెన్నం, డా. ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి. ఈ సమావేశంలో డా. ఏ. ఎన్. ఆర్ తో వ్యక్తిగతంగా తమకున్న అనుబంధాల్ని, అనుభవాల్ని బోర్డు సభ్యులు నెమరవేసుకున్నారు. ముఖ్యంగా 2012 లో డా. అక్కినేని నాగేశ్వర రావు అమెరికాలో జరిపిన చివరి పర్యటన, డాలస్ నగరంలో అత్యంత వైభవంగా 89వ జన్మదిన వేడుకలను, ఆయన పట్ల ప్రజలు చూపిన అభిమానాన్ని గుర్తుచేసుకున్నారు. ఆక్కినేని నాల్గవ అంతర్జాతీయ పురస్కార వేడుకలు గత నెల డిసెంబర్ 16న ఏలూరులో ఎంతో ఘనంగా జరగడానికి సహకరించిన వారందరకీ ఏ.ఎఫ్.ఏ సంస్థ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. అక్కినేని 5వ అంతర్జాతీయ పురస్కార వేడుక”లను ఈ సంవత్సరం డిసెంబర్ 22న కరీంనగర్లో జరుపనున్నట్లు అక్కినేని ఫౌండేషన్ అఫ్ అమెరికా వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, కొత్తగా ఎన్నికైన అధ్యక్షులు రావు కల్వల వెల్లడించారు. -
డల్లాస్‌లో ఘనంగా కరుణశ్రీ జయంతి వేడుకలు
సాక్షి, డల్లాస్: కరుణశ్రీ డా. జంధ్యాల పాపయ్య శాస్త్రి 105వ జయంతి ఉత్సవాలని కరుణశ్రీ అభిమాన సంఘం, డల్లాస్‌లో ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలకు కరుణశ్రీ పెద్ద కుమారుడు జంధ్యాల జయకృష్ణ బాపూజీ, ప్రముఖ ప్రవాస భారతీయ నాయకుడు ప్రసాద్ తోటకూర ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ముందు గా చిన్నారులు కరుణశ్రీ పద్యాలను శ్రావ్యంగా ఆలపించి అందరినీ ఆకట్టుకున్నారు. కరుణశ్రీ మనువడు శ్రీనాథ్ జంధ్యాల కరుణశ్రీ రాసిన “కవితా వైజయంతి” అన్న పద్యమాలికను సభకు తెలియజేశారు. ఈసందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న కరుణశ్రీ పెద్ద కుమారుడు జంధ్యాల జయకృష్ణ బాపూజీ మాట్లాడుతూ కరుణశ్రీతో ఉన్న విడదీయరాని అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కరుణశ్రీ, ఉదయశ్రీ, విజయశ్రీ, తెలుగు బాల, పాకి పిల్ల, అమర ఖయ్యాం లోని పద్యాలను ఆయన ఆలపించారు. ప్రముఖ సాహితీవేత్తలైన విశ్వనాథ సత్య నారాయణ, దేవులపల్లి కృష్ణ శాస్త్రి, సి. నారాయణ రెడ్డి, శ్రీ శ్రీ లాంటి వారితో కరుణశ్రీకున్న సాహిత్యానుభందాన్ని తెలియచేశారు. అమర గాయకుడు ఘంటసాలతో కరుణశ్రీకి మంచి స్నేహం ఉండేదని, వాలిద్దరూ తరచూ కలుసుకొనేవారని చెప్పారు. ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో కరుణశ్రీ తెలుగు అథ్యాపకుడిగా పని చేస్తున్నపుడు కొంగర జగ్గయ్య ఆయన దగ్గర చదువుకోవడాన్ని, ఆ తర్వాత జగ్గయ్య మంచి నటుడి గానే గాక, గొప్ప సాహితీపిపాసకుడుగా ఎదిగిన వైనాన్ని గుర్తు చేశారు. అనంతరం ప్రత్యేక అతిధిగా హాజరైన డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ కరుణశ్రీతో ఉన్న అనుబంధాన్నిఆయన గుర్తుచేసుకున్నారు. కరుణశ్రీ సాహిత్యం అన్ని రకాల ప్రజలను ఆకర్షించేవి అన్నారు. కరుణశ్రీ వాస్తవిక సంఘటనలు నేపథ్యంగా అద్భుతమైన కావ్యాలు సృష్టించారని పేర్కొన్నారు, కరుణశ్రీ లాంటి తెలుగు సాహితీవేత్తల చరిత్రను భావితరాలకు తెలియజేయాలంటే ప్రభుత్వం అధికార భవనాలు, విజ్ఞాన కేంద్రాలకు, విశ్వవిద్యాలయాల్లో భాషా పరిశోధనా కేంద్రాలకు వీరి పేర్లు పెట్టాలని డా. ప్రసాద్ తోటకూర సూచించారు. తెలుగు కు ప్రాచీన భాషా హోదా లభించినప్పటికీ కేంద్రం నుంచి ఏటా వచ్చే 10-15 కోట్ల రూపాయలను తెచ్చుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం జాగు చేస్తోందని, తెలుగు భాషను, విధిగా ఒకటి నుంచి పదవ తరగతి వరకు భోదించాలనే ప్రభుత్వ ఉత్తర్వు ఉన్నప్పటికీ, అమలు పరచిన దాఖలాలు లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మద్దుకూరి చంద్రహాస్, సురేష్ కాజాలు కరుణశ్రీ సాహిత్యా విశేషాలను పంచుకున్నారు. కరుణశ్రీ చిత్రపటానికి సాహిత్యాభిమానులు పుష్పాంజలి ఘటించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కరుణశ్రీ అభిమాన సంఘం తరపున బుయ్యనప్రగడ శ్రీనివాస రావు (బీఎస్ఆర్) వ్యాఖ్యాతగా వ్యహరించారు. -
డల్లాస్‌లో త్రివర్ణ పతాకం రెపరెపలు
డల్లాస్: అమెరికాలోని డల్లాస్‌లో అతిపెద్ద మహాత్మాగాంధీ స్మారక విగ్రహం వద్ద 71వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇర్వింగ్‌లోని గాంధీ ప్లాజా వద్ద వేలాది మంది ప్రవాస భారతీయులు, వందలాదిగా చిన్నారులు ఈ వేడుకలో పాల్గొన్నారు. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (ఎంజీఎంఎన్టీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను బోర్డు డైరెక్టర్ షబ్నమ్ మోడ్గిల్ ప్రారంభించారు. జాతిపిత బాపూజీ విగ్రహం వద్ద నివాళులర్పించారు. ఎంజీఎంఎన్టీ చైర్మన్ ప్రసాద్ తోటకూర త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. భారత జాతీయ పతాకానికి సెల్యూట్ చేసిన ఆయన మాట్లాడుతూ.. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం నిండుగా ఉండే అమెరికాలో 71 భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. బ్రిటీష్ బానిస సంకెళ్లనుంచి దేశానికి విముక్తి కల్పించిన గాంధీజీ పోరాటాన్ని గుర్తుచేసుకున్నారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధులైన సుభాష్ చంద్రబోస్, లాలా లజపత్ రాయ్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లబాయ్ పటేల్ ల సేవలను కొనియాడారు. అమెరికా, భారత్ ల మధ్య బంధం బలపడాలని ఆకాంక్షించారు. ఎంజీఎంఎన్టీ సెక్రటరీ రావు కల్వల మాట్లాడుతూ.. గాంధీ మెమోరియల్ వద్ద ఈ వేడుకలను జరుపుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. గాంధీ సిద్ధాంతాలైన శాంతి, అహింస మార్గాలను అనుసరించాలన్నారు. అక్టోబర్ 1న ఇదే వేదిక వద్ద జరగనున్న గాంధీ శాంతి పాదయాత్రలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరైన ఎన్ఆర్ఐలకు, వారి పిల్లలకు, వాలంటీర్లకు ఎంజీఎంఎన్టీ కో చైర్మన్ సల్మాన్ ఫర్షోరి ధన్యవాదాలు తెలిపారు. భారత నేవీ మాజీ కమాండర్ గవి కుమార్, భారత ఆర్మీ మేజర్ రాజ్ దీప్‌లను స్పెషల్ గెస్ట్లుగా ఆహ్వానించారు. ఎన్ఆర్ఐలు ముఖ్యంగా చిన్నారులు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న తీరును గవి కుమార్ ప్రశంసించారు. ఎంజీఎంఎన్టీ బృందం రెండు పార్కు బెంచీలను ఆవిష్కరించి కందూరి ఫ్యామిలీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంజీఎంఎన్టీ బృందం సభ్యులు ఎంవీఎల్ ప్రసాద్, మన్హర్ మేఘని, తాయిబ్ కుందావాలా, పీయుష్ పటేల్, బీఎన్, బినజీర్ అర్ఫీ, రెహమన్, సూరి త్యాగరాజన్, జాక్ గోధ్వానిలు పాల్గొన్నారు. -
మహాత్మగాంధీకి డల్లాస్‌లో ఘన నివాళి
- డాల్లస్‌లో జాతిపితకు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ఘన నివాళి టెక్సాస్: అమెరికా దేశ సంరక్షణ కోసం అసువులు బాసిన అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా మంగళవారం దేశవ్యాప్తంగా వారికి నివాళులు అర్పించారు. ఈ తరుణంలో డాల్లస్‌లో ఉన్న మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద విశ్వశాంతికై కృషి చేసిన జాతి పిత మహాత్మా గాంధీకి.. మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ చైర్మన్ డాక్టర్. ప్రసాద్ తోటకూర నివాళులు అర్పించారు. వేదాలు, ఉపనిషత్తులు, భాగవత పురాణం, భగవద్గీత, బ్రహ్మ సూత్రాల్లాంటి అనేక ఆధ్యాత్మిక విషయాలపై వ్యాఖ్యానాత్మక ప్రవచనా పరంపరలతో కోట్లాది హృదయాల్లో భక్తి ప్రపత్తులు నింపిన బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ మహాత్మాగాంధీకి శ్రద్ధాంజలి ఘటించడానికి విచ్చేయడం సంతోషమని డాక్టర్. ప్రసాద్ పేర్కొన్నారు. మహాత్మా గాంధీ తాను చెప్పిందే స్వయంగా ఆచరించేవారని, తాను ఆచరించిందే చెప్పేవారని, అను నిత్యం సమాజ శ్రేయస్సే శ్వాసగా తన జీవితాన్ని అంకితం చేశారని డాక్టర్. తోటకూర అన్నారు. కేవలం సనాతన ధర్మ విలువలను, వైశిష్ట్యాలను చాటి చెప్పడం, ఆధ్యాత్మిక ప్రభోధనలే గాక, ఆర్ధికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించడం, వివిధ భారతీయ కళలలో నిష్ణాతులైన వారికి పురస్కారాలు అందజేయడం, ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం, గో సంరక్షణా బాధ్యతలు చేపట్టడం అనే విషయాలే ధ్యేయంగా ఋషి పీఠం అనే ధార్మిక సంస్థ ద్వారా సామాజిక సేవ చేస్తున్న బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి కృషి అభినందనీయమని డాక్టర్. ప్రసాద్ తోటకూర కొనియాడారు. డాక్టర్.సామవేదం షణ్ముఖ శర్మ గారు మాట్లాడుతూ.. డాల్లస్ నగరంలో ప్రజలందరూ కలిసికట్టుగా ముందుకు వచ్చి విశ్వశాంతికై శ్రమపడిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడంలో ప్రధాన పాత్ర వహించిన చైర్మన్ డాక్టర్. ప్రసాద్ తోటకూర, కార్యదర్శి రావు కాల్వల కృషి ప్రశంసనీయమని అన్నారు. “గాంధీ సిద్ధాంతాలలో ప్రముఖమైనవి సామరస్యం, శాంతి, భిన్నత్వంలో ఏకత్వం. భగవద్గీత లాంటి సనాతన ధర్మాలలో కూడా ఇవే ఉన్నాయి. ఇక్కడి విగ్రహ విశేషం ఏమిటంటే గాంధీ చేతిలో భగవద్గీత ఉండటం. భారతదేశపు హృదయమే భగవద్గీత, దాన్ని తన చేతిలో పట్టుకొని చేతలో చూపించారు. గాంధీ స్వచ్ఛ భారతానికై కలలు గన్నారని, ప్రజల్లో శుభ్రత పట్ల ఒక అవగాహన కలిగించడానికి తానే స్వయంగా పారిశుధ్య కార్యక్రమాలు చేసేవారని, ఇప్పుడు మన భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా అదే బాటలో పయనించడం విశేషo. మహాత్మాగాంధీ గో సంరక్షణ జరగాలని, గో సంరక్షణ అనేది ఒక మతానికి సంబంధించినది కాదని, అది భారతీయతకు సంబంధించినదని, స్వతంత్రం వచ్చిన తర్వాత తొలి సంతకం గోవధ నిషేధంపై జరగాలని ఆశించారు' అని అన్నారు. ప్రస్తుత గోవధ నిషేధ ఆశయ సాధనలో ప్రభుత్వం అడుగులు వేయడం సంతోషదాయకమని ఆనందం వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీ అన్ని మతాలను సమంగా గౌరవించాలి గాని మత మార్పిడులను ప్రోత్సహించకూడదని స్పష్టంగా చెప్పారని అన్నారు. గాంధీ విశ్వ మానవుడని, ఆయన చెప్పిన ప్రతి మాట మనం అమలుపరుచుకోగల్గితే, భారతదేశం ప్రపంచంలో అగ్ర స్థానంలో నిలుస్తుందని అన్నారు. విశ్వశాంతికై పాటు పడిన మహనీయుడు మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఈ రోజు ఆయనకు నివాళులు అర్పించడం తన పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఎన్నో తీరిక లేని కార్యక్రమాలతో బిజీగా ఉండి కూడా మహాత్మాగాంధీకి నివాళులు అర్పించడానికి విచ్చేసిన డాక్టర్. బ్రహ్మ శ్రీ సామవేదం షణ్ముఖ శర్మకు కృతజ్ఞతలు తెలుపుతూ అయన ఇచ్చిన సందేశం అమూల్యమైనదని, అలాగే ప్రవాస భారతీయులుగా మేము చేస్తున్న సామజిక సేవను ఆయన ప్రశంసించడం తమకు నూతనోత్తేజాన్ని కలిగిస్తుందని మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ కార్యదర్శి రావు కల్వల వందన సమర్పణలో తెలిపారు. ఈ కార్యక్రమంలో రవి పట్టిసం, లక్ష్మి గుంటూరి, శర్మ గుంటూరి, సాంబు మంథా, డాక్టర్. నరసింహారావు వేముల, ఎంవిఎల్ ప్రసాద్, కర్రా వెంకట్రావు, వెంకట్ ములుకుట్ల తదితరులు పాల్గొని జాతిపితకు నివాళులు అర్పించారు. -
డల్లాస్‌లో కృష్ణమూర్తికి సన్మానం
యూఎస్ కాంగ్రెస్ మెంబర్‌గా రాజా కృష్ణమూర్తి ఎన్నికైన సందర్భంగా డాల్లస్‌లో శనివారం విజయోత్సవ సభ నిర్వహించారు. డాల్లస్‌లోని టచ్నైట్ క్లబ్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రవాస భారతీయ మిత్రులు పాల్ పాండియన్, డాక్టర్ ప్రసాద్ తోటకూర, ఎంవీఎల్ థియోఫిన్, శ్రీధర్ తుమ్మలలు రాజ కృష్ణమూర్తి విజయానికి కృషి చేశారు. కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర రాజా కృష్ణమూర్తిని సభకు పరిచయం చేస్తూ ఆయన చాలా భాద్యత గల సభ్యుడని, అవసరమైన అన్ని సందర్భాల్లోనూ కాంగ్రెస్ లో తన గళాన్ని వినిపిస్తూ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంలో ముందంజలో ఉంటారని తెలిపారు. ఇప్పటివరకు మొత్తం జరిగిన 236 రోల్ కాల్స్ లో 235కి హాజరవడం రాజా చిత్తశుద్ధిని తెలుపుతుందన్నారు. రాజా ఎన్నికల ప్రచారంలో పేర్కొన్న అంశాలు: 1. ఉద్యోగాలను సృష్టించడం ద్వారా మన ఆర్ధికవ్యవస్థను వృద్ధి చేయడం 2. వర్కింగ్ ఫ్యామిలీస్ కోసం అండగా నిలబడడం 3. మహిళలకు సహాయ పడటం 4. ఒబామా “ఎఫోర్డ్బెల్ కేర్ యాక్ట్” ను సమర్ధించడం 5. సీనియర్స్ కు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టడం 6. దేశ భద్రతను కాపాడటం 7. యుద్ధాల్లో పోరాడిన సైనికులను గౌరవించడం పలు అంశాలను కేంద్రీకరిస్తూ ఆశించిన ఫలితాల కోసం త్రీవ్రంగా కృషి చేస్తున్నారని అన్నారు. రాజా కృష్ణమూర్తి ప్రస్తుతం యూఎస్ కాంగ్రెస్ సభ్యుడిగా విద్య మరియు ఉద్యోగుల కమిటీ, పర్యవేక్షణ మరియు ప్రభుత్వ సంస్కరణల కమిటీల్లో కీలక సభ్యుడిగా పని చేస్తున్నారని చెప్పారు. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఒబామా కేర్ యాక్ట్ ను తొలగించాలని ప్రయత్నాలు చేసినప్పుడు, దాన్ని వ్యతిరేకిస్తూ రాజా ధృడంగా నిలబడ్డారని తెలిపారు. ఏడు ముస్లిం దేశాలపై నిషేధం విధించినప్పుడు కూడా రాజా తీవ్రంగా వ్యతిరేకించారని వివరించారు. చికాగోలోని ఓహారే అంతర్జాతీయ విమానాశ్రయంలో కొంతమంది ముస్లిం దేశస్తులను ఇమిగ్రేషన్ అధికారులు ప్రవేశాన్ని అడ్డుకున్నారనే విషయాన్ని తెలుసుకుని, హుటాహుటిన అక్కడికి చేరుకొని నిరసనలు తెలుపుతున్న ప్రజలకు మద్దతు తెలుపడం ద్వారా రాజా ప్రజల మనిషిగా నిరూపించుకున్నారని అన్నారు. భారత సంతతికి చెందిన రాజా కృష్ణమూర్తి కాంగ్రెస్ కు ఎన్నిక కావడానికి సహకరించిన డాలస్ మిత్రులందరికీ తన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మున్ముందు అమెరికా రాజకీయాల్లో రాజా ఒక తిరుగులేని శక్తిగా ఎదగాలని డాక్టర్ తోటకూర ఆకాంక్షించారు. రాజా కృష్ణమూర్తి తన ప్రసంగంలో భారతీయ అమెరికన్లకు చాలా ఓర్పు గల వారని, వాళ్ళు అవసరమైనప్పుడు హక్కులను కాపాడుకోవటం కోసం గళాన్ని ఐకమత్యంగా వినిపించాలని చెప్పారు. లేకుంటే అమెరికా జనజీవన స్రవంతిలో వెనుక బడిపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. సభకు హాజరైన సభ్యులు ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇస్తూ.. మనమందరం కొంత సమయం కేటాయించి అమెరికా పార్లమెంట్ ను సందర్శించాలని, అక్కడి కార్యకలాపాలు, కాంగ్రెస్ ఎలా పని చేస్తుందో తెలుసుకోవడం ఎంతో అవసరం అని తెలిపారు. ప్రవాస భారతీయులు అన్ని రంగాల్లోనూ అగ్రపథంలో ఉన్నపటికీ రాజకీయ రంగంలో ఇంకా ఎంతో పురోగతి సాధించాలని ముఖ్యంగా ఆసక్తి గల యువతరం రాజకీయాల్లోకి రావాలని రాజా కోరారు. రాజా చివరిగా డాలస్ లోని ప్రజలు తన విజయానికి ఎంతో కృషి చేశారని అందుకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. అనంతరం డాల్లస్ ఆహ్వాన సంఘం, మద్దతుదారులు రాజా కృష్ణమూర్తిని ఘనంగా సత్కరించారు. నిర్వాహకులలో ఒకరైన ఎంవీఎల్ ప్రసాద్ రాజా కృష్ణమూర్తికి పూల దండ వేయగా, డాక్టర్ ప్రసాద్ తోటకూర, సి.సి. థియోఫిన్ రాజాకు శాలువా కప్పి, జ్ఞాపికను బహుకరించారు. రాజా కేక్ కట్ చేసి తన సంతోషాన్ని అందరితో పంచుకున్నారు. సి.సి. థియోఫిన్ తన వందన సమర్పణలో ఎంతో ఆప్యాయంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని డాలస్ నగరాన్ని విచ్చేసి, తన మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలియజేసిన రాజా కృష్ణమూర్తికి, ఎంతో ప్రోత్సాహం ఇస్తున్న డాల్లస్ మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. -
డల్లాస్‌లో 'ధిరుక్ ధిరుక్ తిల్లాన' ఆల్బమ్ విడుదల
డల్లాస్ : 'ధిరుక్ ధిరుక్ తిల్లాన' మ్యూజిక్ ఆల్బమ్ విడుదల వేడుకని డల్లాస్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి 250 మందికి పైగా సంగీత అభిమానులు హాజరయ్యారు. భారతీయ సంగీతాన్ని ఎంతగానో అభిమానించే రాజశేఖర్ సూరిబోట్ల ఈ ఆల్బమ్‌కు మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. మొత్తం ఆరుపాటలున్న ఈ ఆల్బమ్‌లో ఒక్కో పాటకు విభిన్నశైలిలో బాణీలను సమకూర్చారు. ఈ ఆల్బమ్ కు లక్ష్మీనాగ్ సూరిబొట్ల, చంద్రబోస్, డా.వడ్డెపల్లి క్రిష్ణ, శ్రీనివాస మౌళీలు పాటలు రాయగా, సంతోష్ కమ్మంకర్, రమ్య బెహర, సుమంగళి, ప్రణవి ఆచార్య, సాయి శివాణిలు తమ గాత్రాన్ని అందించారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పద్మా కమ్మంకర్ వ్యవహరించారు. ఈ ఆల్బమ్ రూపొందించడంలో నవీన్, రాజ్‌శేఖర్, రాజా, కళ్యాణ్, కిరణ్, సిరిల్‌లు వివిధ విభాగాల్లో పని చేశారు. ఈ సందర్భంగా ఆల్బమ్‌ను ఆవిష్కరించిన ప్రసాద్ తోటకూర సంగీత అభిమానుల కోసం రాజశేఖర్ సూరిబోట్ల చేస్తున్న కృషిని కొనియాడారు. అంతేకాకుండా లోకల్ టాలెంట్‌ను గుర్తించి వారికి అవకాశాలు ఇస్తున్నందుకు సూరి బోట్లను అభినందించారు. అనంతరం సూరిబోట్ల మాట్లాడుతూ.. ఈ ఆల్బమ్‌ను తయారు చేయడానికి సహకరించివారందరికి కృతజ్ఞతలు తెలిపారు. డా. నరసింహారెడ్డి ఉరిమిడి, సుబ్రమణ్యం జొన్నలగడ్డ, శారద సింగిరెడ్డి, శ్రీనివాస్ ప్రబల, నాగలక్ష్మీ సంతానగోపాలన్, లక్ష్మీ నాగ్ సూరిబోట్లలు ఆల్బమ్‌లోని ఒక్కో పాటను విడుదల చేశారు. కాగా, ఆర్పీ పట్నాయక్, సురేష్ మాధవపెద్ది, చంద్రబోస్, వడ్డెపల్లి క్రిష్ణ, శ్రీనివాస్ మౌళి, శ్రీ కృష్ణలు వీడియో ద్వారా ధిరుక్ ధిరుక్ తిల్లాన టీంకు శుభాకాంక్షలు తెలిపారు.