
డాలస్, టెక్సాస్: టెక్సాస్ రాష్ట్రంలో, డాలస్ నగరంలో నెలకొనిఉన్న అమెరికా దేశంలోనే అతి పెద్దదైన మహాత్మా గాంధీ మెమోరియల్ వద్ద భారతదేశ 75వ గణతంత్ర వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “డా. బీఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఎందరో మేధావులు ఎంతో సమయం వెచ్చించి, శ్రమకోర్చి భారత రాజ్యాంగాన్ని తయారుచేసి మనకు అందించారని, ఆ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ తప్పకుండా పాటించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిమీద ఉంది” అన్నారు.
ఈ సందర్భంగా రాజ్యాంగాన్ని రూపొందించిన నేతలకు, మన భారతదేశ స్వాతంత్య్రసిద్ధికి పాటుపడిన మహాత్మాగాంధీ, జవహార్‌లాల్ నెహ్రూ, సర్ధార్ వల్లభాయి పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ మొదలైన నాయకులకు, దేశ స్వాతంత్య్రం కోసం అశువులు బాసిన స్వాతంత్య్ర సమరయోధులకు ప్రవాసభారతీయులు ఘన నివాళులర్పించారు. మహాత్మాగాంధీ మెమోరియల్ బోర్డు సభ్యులు డా. ప్రసాద్ తోటకూర, రావు కల్వాల, రాజీవ్, బీ.ఎన్ జగదీష్, నవాజ్, జస్టిన్, షబ్నం మోడ్గిల్, వివిధ భారతీయసంస్థల నాయకులతో పాటు ఎంతోమంది ప్రవాస భారతీయులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని తమ దేశభక్తిని చాటుకున్నారు.
ఇవి చదవండి: అల్లదివో.. ‘మూన్ స్నైపర్’ ఫోటోలు తీసిన ‘నాసా’ ఉపగ్రహం
Comments
Please login to add a commentAdd a comment