
డల్లాస్ : ‘సామాజిక భద్రతా సమాచారం’ పై భారతీయ అమెరికన్లకు అవగాహన కల్పించేందుకు ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్‌షిప్ కౌన్సిల్(ఐఏఎఫ్‌సీ) డల్లాస్‌లో ఓ సదస్సు నిర్వహించింది. ఐఏఎఫ్‌సీ అధ్యక్షుడు డాక్టర్ ప్రసాద్ తోటకూర ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అవగాహన సదస్సుకు ప్రజా వ్యవహారాల నిపుణుడు ఆంజీ హోక్వాంగ్ విచ్చేసి తన విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారు. పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ అవగాహన సదస్సుల్లో దాదాపు 100 మంది పాల్గొని తమ సందేహాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రేక్షకులు అడిగిన ప్రతి ప్రశ్నకు హోక్వాంగ్ సమాధానం చెప్పారు. వివిధ అంశాలపై అవగాహన కల్పించారు.
అనంతరం ఈ అవగాహన సదస్సుకు ప్రత్యేక అతిథిగా హాజరైన మిచిగాన్ రాష్ట్ర పతినిధి పద్మ కుప్ప మాట్లాడుతూ.. సామాజిక భద్రత గురించి తప్పుడు సమాచారం, అపార్థాలను తొలగించడానికి ఇలాంటి సెమినార్లు చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. ఇలాంటి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్న ఐఏఎఫ్‌సీ బృంధాన్ని అభినందించారు. సెమినార్ అనంతరం అమె నగరంలోని మహాత్మా గాంధీ స్మారక చిహ్నాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి పూల మాలవేసి నివాళర్పించారు. ఈ కర్యాక్రమంలో ఐఏఎఫ్‌సీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ తైయాబ్ కుండవాలా, వైస్ ప్రెసిడెంట్ రావు కాల్వల తదితరులు పాల్గొన్నారు.