IAFC
-
ఐఏఎఫ్‌సీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
డల్లాస్ : ‘సామాజిక భద్రతా సమాచారం’ పై భారతీయ అమెరికన్లకు అవగాహన కల్పించేందుకు ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్(ఐఏఎఫ్‌సీ) డల్లాస్‌లో ఓ సదస్సు నిర్వహించింది. ఐఏఎఫ్‌సీ అధ్యక్షుడు డాక్టర్ ప్రసాద్ తోటకూర ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అవగాహన సదస్సుకు ప్రజా వ్యవహారాల నిపుణుడు ఆంజీ హోక్వాంగ్ విచ్చేసి తన విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారు. పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ అవగాహన సదస్సుల్లో దాదాపు 100 మంది పాల్గొని తమ సందేహాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రేక్షకులు అడిగిన ప్రతి ప్రశ్నకు హోక్వాంగ్ సమాధానం చెప్పారు. వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఈ అవగాహన సదస్సుకు ప్రత్యేక అతిథిగా హాజరైన మిచిగాన్ రాష్ట్ర పతినిధి పద్మ కుప్ప మాట్లాడుతూ.. సామాజిక భద్రత గురించి తప్పుడు సమాచారం, అపార్థాలను తొలగించడానికి ఇలాంటి సెమినార్లు చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. ఇలాంటి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్న ఐఏఎఫ్‌సీ బృంధాన్ని అభినందించారు. సెమినార్ అనంతరం అమె నగరంలోని మహాత్మా గాంధీ స్మారక చిహ్నాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి పూల మాలవేసి నివాళర్పించారు. ఈ కర్యాక్రమంలో ఐఏఎఫ్‌సీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ తైయాబ్ కుండవాలా, వైస్ ప్రెసిడెంట్ రావు కాల్వల తదితరులు పాల్గొన్నారు. -
ఐఏఎఫ్‌సీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రవాస భారతీయోత్సవం
డాలస్ : ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ (ఐఏఎఫ్‌సీ)ఆధ్వర్యంలో ప్రవాస భారతీయోత్సవం ఘనంగా జరిగింది. డాలస్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి 3000 మందికి పైగా ఎన్ఆర్ఐలు హాజరయ్యారు. వందలాది మంది పిల్లలు కేరింతలు కొడుతూ ‘పెట్టింగ్ జూ’, ‘పోనీ రైడ్స్’, ‘స్టిల్ట్ వాకర్స్’, ‘ఫేస్ పెయింటింగ్’, ‘మెహంది’, ‘బౌన్సు హౌస్’ దగ్గర కోలాహలం చేశారు. దాదాపు 500 మందికి పైగా యువతీయువకులు భారత సంగీత సాహిత్య అంశాల ప్రధానంగా భరతనాట్యం, కూచిపూడి, కథక్, ఒడిస్సి, జానపద నృత్య రీతులలో వారు చేసిన నాట్య విన్యాసాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పాశ్చాత్య సంగీత రీతులతో కూడిన కాప్పెల్ పాఠశాల అమెరికన్ విద్యార్థినీవిద్యార్థులు 20 నిమిషాలకు పైగా జరిపిన సంగీత విభావరి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న వారందరికి టెక్సాస్ రాష్ట్రానికి చెందిన అమెరికా సెనెటర్ టెడ్ క్రూజ్ స్వయంగా యోగితా పత్రాలను అందజేశారు. అమెరికా గాట్ టాలెంట్‌లో స్థానం సంపాదించిన, స్పానిష్ గాట్ టాలెంట్‌లో సెమీఫైనలిస్ట్‌గా నిలిచిన హైదరాబాద్‌కు చెందిన యువకుడు క్రాంతి కుమార్ చేసిన చూపుడు వేలుతో కొబ్బరికాయకు రంధ్రం చేసి కొబ్బరి నీళ్ళు త్రాగడం, రక్తస్రావం లేకుండా ముక్కులో డ్రిల్ బిట్ ఆన్ చేసి పెట్టుకోవడం, సల సలా మరిగే నూనెను చేతులతో త్రాగడం, 32 పొడవాటి కత్తులను గొంతులో దించుకోవడం, చెక్క ముక్కపై నుదిటితో మేకు కొట్టడం లాంటి అద్భుత విన్యాసాలు ప్రేక్షకులందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. ఐఏఎఫ్‌సీ అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర, బోర్డు సభ్యులు ఈ ఉత్సవాలలో క్రాంతి కుమార్‌కు "సాహసవీర" అవార్డు ప్రదానం చేశారు. తన్వీర్ అరోరా స్టాండప్ కమెడియన్‌గా అందరినీ నవ్వించారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని రన్నా జానీ ఆధ్వర్యంలో రాజేశ్వరి ఉదయగిరి, అంజనా జయంతి, అపర్ణ వంశీలు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో టెక్సస్ రాష్ట్రానికి చెందిన సీనియర్ డెమొక్రాట్, యూఎస్ కాంగ్రెస్ మెంబెర్ ఎడ్డీ బెర్నీ జాన్సన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అమెరికా దేశం వివిధ సంస్కృతుల విభిన్న ఆచారాల ప్రవాసీయుల నిలయమని, ఈ దేశంలో వివక్షతకు తావు లేదని పేర్కొన్నారు. అమెరికా దేశ ప్రగతిలో వివిధ రంగాలలో ప్రవాస భారతీయుల పాత్ర ఎంతగానో ఉందని కొనియాడారు. టెక్సాస్ రాష్ట్ర సెనెటర్ జేన్ నెల్సన్ ఈ ప్రవాస భారతీయ ఉత్సవాన్ని గుర్తిస్తూ టెక్సాస్ రాష్ట్ర సెనేట్ నుండి ఒక ప్రశంసా పత్రాన్ని, అలాగే టెక్సాస్ రాష్ట్ర కాంగ్రెస్ నుండి కాంగ్రెస్ మెంబెర్ టెర్రీ మీజా ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ పాత్రను ప్రశంసిస్తూ టెక్సాస్ చట్ట సభ నుండి ఒక ప్రత్యేక అభినందన పత్రాన్ని తీసుకువచ్చి చదివి వినిపించారు. వీరితో పాటు టెక్సాస్ రాష్ట్ర కాంగ్రెస్ ప్రతినిధులు జూలీ జాన్సన్, మ్యాట్ షహీన్‌లు పాల్గొని అమెరికా జన జీవన స్రవంతిలో ప్రవాస భారతీయుల పాత్ర ఇంకా పెరగవలసిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఇటీవలే నార్త్ కరోలినా రాష్ట్ర సెనెటర్‌గా ఎన్నికైన భారత సంతతికి చెందిన జై చౌదరి మాట్లాడుతూ ప్రవాస భారతీయులందరు ఐక్యతతో మెలుగుతూ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనాలని అన్నారు. భారత సంతతికి చెందిన వాషింగ్టన్ రాష్ట్ర సెనెటర్ మాంకా డింగ్ర తాను ఎన్నికల్లో గెలవడానికి అనేక ఆటుపోట్లను ఎదుర్కొని అందరి సహకారంతో గెలవగలిగానని అన్నారు. వాషింగ్టన్ డీసీలోని భారత ఎంబసీ నుండి కమ్యూనిటీ అఫైర్స్ మినిస్టర్ అనురాగ్ కుమార్, కాప్పెల్ నగర్ పోలీస్ చీఫ్ డానీ బార్టన్, కాప్పెల్ స్కూల్ డిస్ట్రిక్ట్ సూపరిండేంట్ బ్రాడ్ హంట్, నగర కౌన్సిల్ మెంబర్ బిజూ మాత్యూ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ మిలియన్ల సంఖ్యలో ఉన్న ప్రవాస భారతీయులందరు అమెరికా జన జీవన స్రవంతిలో భాగమవుతూ స్థానిక సమస్యలన్నీ తమ సమస్యలుగా భావించి అర్హత ఉన్న వారందరూ ఎన్నికల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. తమ వాణిని ఐకమత్యంగా బలంగా వినిపించకపోతే ప్రవాస భారతీయులకు సరైన గుర్తింపు లభించదు అన్నారు. ఆ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమంలో ఓటరు నమోదు కార్యక్రమంలో బోర్డు సభ్యులు రావు కల్వల పర్యవేక్షణలో నిర్వహించామన్నారు. ఈ ఉత్సవంలో పాలుపంచుకోలేకపోయిన యూఎస్ కాంగ్రెస్ మెంబెర్ రాజా కృష్ణమూర్తి, మిచిగాన్ రాష్ట్ర కాంగ్రెస్ మెంబెర్ పద్మ కుప్ప, టెక్సాస్ రాష్ట్రం నుంచి అమెరికా సెనెట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్న సెనెటర్ జాన్ కార్నిన్, సెనెటర్ టెడ్ క్రూజ్ లు ఐఏఎఫ్‌సీ తలపెట్టిన ఈ ప్రవాస భారతీయోత్సవాన్ని ప్రశంసిస్తూ వీడియో మెసేజ్ ద్వారా ప్రేక్షకులకు సందేశం పంపారు. తమ కార్యక్రమం చివరిలో రంగురంగుల కాంతులతో అత్యంత వైభవంగా జరిగిన ఫైర్ వర్క్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సంస్థ అధ్యక్షుడు డాక్టర్. ప్రసాద్ తోటకూర నేతృత్వంతో కూడిన ఈ ‘ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్’ లో బోర్డు అఫ్ డైరెక్టర్స్- జాన్ హేమండ్, రావు కల్వల, తైయబ్ కుండావాల, డా. చెన్నుపాటి రావు, పియూష్ పటేల్, మురళి వెన్నం, డా.సత్ గుప్తా, రన్నా జానీ, రామ్ కీ చేబ్రోలు, ప్రొఫెసర్. నిరంజన్ త్రిపాఠిలు ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో తమ వంతు కృషి చేశారు. -
మే4న డాలస్‌లో ప్రవాస భారతీయోత్సవం
డాలస్ : ‘ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్’ ఆధ్వర్యంలో డాలస్‌లో ప్రవాస భారతీయోత్సవ కార్యక్రమం జరగనుంది. “భారతీయులందరూ అమెరికా జనజీవన స్రవంతిలో భాగం కావాలి” అనే పిలుపునిస్తూ కాప్పెల్‌లోని సైప్రేస్‌లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ అధ్యక్షుడు డాక్టర్. ప్రసాద్ తోటకూర ఓ ప్రకటన విడుదల చేశారు. మే4న మధ్యాహ్నం 3 నుండి రాత్రి 10 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని, పార్కింగ్తో సహా ప్రవేశం ఉచితమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లల వినోదం కోసం ‘పెట్టింగ్ జూ’, ‘పోనీ రైడ్స్’, ‘స్టిల్ట్ వాకర్స్’, ‘ఫేస్ పెయింటింగ్’, ‘మెహంది’, ‘బౌన్సు హౌస్’, ‘రంగు రంగుల బెలూన్స్ పంపకం’ మొదలైనవెన్నో ఏర్పాట్లు చేస్తున్నారు. అతిథుల కోసం వివిధ రకాల వంటకాలతో కూడిన ఫుడ్ స్టాల్స్, ఇతర బిజినెస్ స్టాల్స్ అందుబాటులో ఉండనున్నాయి. 500 మందికిపైగా భారత సంతతికి చెందిన వారితో పాటు అమెరికన్ యువతీయువకులు కూడా అనేక సంగీత, నృత్య కార్యక్రమాల్లో పాల్గోనున్నారు. 80 మందితో కూడిన విద్యార్ధినీ విద్యార్ధులు “కాప్పెల్ స్కూల్ బ్యాండ్”లో అలరించనున్నారు. “అమెరికా గాట్ టాలెంట్” షో కు సెలెక్ట్ అయిన హైదరాబాద్‌కు చెందిన క్రాంతి కుమార్ అనే యువకుడు చూపుడు వేలుతో కొబ్బరికాయకు రంధ్రం చేసి కొబ్బరి నీళ్ళు త్రాగడం, రక్తస్రావం లేకుండా ముక్కులో డ్రిల్ బిట్ ఆన్ చేసి పెట్టుకోవడం, సల సలా మరిగే నూనెను చేతులతో త్రాగడం, 32 పొడవాటి కత్తులను గొంతులో దించుకోవడం, చెక్క ముక్కపై నుదిటితో మేకు కొట్టడం లాంటి అనేక సాహస కృత్యాలను ప్రదర్శించనున్నారు. పాటలను రివర్స్‌లో పాడే ప్రక్రియతో కొన్ని వందల కార్యక్రమాలుచేసి ఎన్నో ప్రశంసలు పొందిన “రివర్స్ గేర్ గురుస్వామి” అందర్నీ అలరించడానికి ప్రత్యేకంగా వస్తున్నారు. భారత సంతతికి చెందిన యూ.ఎస్ కాంగ్రెస్ మెంబర్ రాజా కృష్ణమూర్తి, నార్త్ కరోలిన స్టేట్ సెనెటర్ జై చౌదరి, వాషింగ్టన్ స్టేట్ సెనెటర్ మాంకా డింగ్ర, ఒహాయో స్టేట్ రిప్రెసెంటేటివ్ నీరజ్ అంటాని, మేరీలాండ్ స్టేట్ రిప్రెసెంటేటివ్ జై జలిసి, ఆరిజోనా స్టేట్ రిప్రెసెంటేటివ్ డా. అమిష్ షాతో పాటు టెక్సస్ స్టేట్ రిప్రెజెంటేటివ్స్ మిషల్ బెక్లీ, జూలీ జాక్సన్, టెర్రీ మిజా, మ్యాట్ షాహీన్ హాజరుకానున్నారు. ఇండియన్ ఎంబసీ నుండి కమ్యూనిటీ అఫైర్స్ మినిస్టర్ అనురాగ్ కుమార్, కాన్సులేట్ జనరల్ అఫ్ ఇండియా, హ్యుస్టన్ నుండి కాన్సల్ రాకేష్ బనాటి, విప్రో సంస్థ సీఈఓ అబిద్ ఆలి నీముచ్వాలా, కాప్పెల్ నగర పోలీస్ చీఫ్ డానీ బార్టన్, కాప్పెల్ స్కూల్ డిస్ట్రిక్ట్ సూపరిండేంట్ బ్రాడ్ హంట్, నగర కౌన్సిల్ మెంబర్ బిజూ మాత్యూ ప్రత్యేక అతిథులుగా హాజరవుతున్నారు. అర్హత కల్గిన ప్రవాస భారతీయులందరూ అమెరికా దేశ ఎన్నికల్లో పాల్గొనేందుకు వీలుగా ఓటు హక్కును నమోదు చేసుకోవడానికి ఈ ఉత్సవంలో అవకాశం కల్పిస్తున్నాము. రాత్రి 9 గంటలకు కనుల విందు కల్గించే అత్యంత వైభవంగా ఫైర్ వర్క్స్ ఉంటాయి. సంస్థ అధ్యక్షుడు డాక్టర్. ప్రసాద్ తోటకూర నేతృత్వంతో కూడిన బోర్డు అఫ్ డైరెక్టర్స్ జాన్ హేమండ్, రావు కల్వల, తైయబ్ కుండావాల, డా. చెన్నుపాటి రావు, పియూష్ పటేల్, మురళి వెన్నం, డా. సత్ గుప్తా, రన్నా జానీ, రామ్ కీ చేబ్రోలు, ప్రొఫెసర్. నిరంజన్ త్రిపాఠి వివిధ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. -
జాతిపితకు తెలుగు రాష్ట్రాల నాయకుల ఘననివాళి
డల్లాస్, టెక్సాస్ : తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన రాజకీయ ప్రముఖులు అమెరికాలోనే అతి పెద్దదైన డల్లాస్‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజాను సందర్శించి జాతిపితకు పుష్పగుచ్చాలతో నివాళులర్పించారు. గతంలో ఓసారి డల్లాస్‌లోని గాంధీ మెమోరియల్‌ను సందర్శించానని ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ప్రతి ఏటా ఈ గాంధీ మెమోరియల్ ప్లాజా మెరుగులు దిద్దుకుంటూ అత్యంత సుందర ప్రదేశంగా వెలుగొందడం సంతోషదాయకమని తెలిపారు. ఖండాంతరాలల్లో జాతిపిత సిద్ధాంతాలను, ఆశయాలను సజీవంగా ఉట్టిపడేటట్లుగా ఇంతటి మహత్తర కార్యాన్ని సాధించడంలో కృషి చేసిన ప్రవాస భారతీయ నాయకులు, ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్ షిప్ కౌన్సిల్ సంస్థ అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర, వారి బృంద సభ్యులకు, సిటీ అధికారులకు, స్థానిక ప్రజలకు అభినందలు తెలియజేశారు. తొలిసారిగా ఈ గాంధీ మెమోరియల్ ను సందర్శిస్తున్నానని, ఇక్కడికి రాగానే శాంతిదూత గాంధీజీ ఆశయాలు, త్యాగ నిరతి, ప్రపంచంలో అనేకమంది యువకులకు స్ఫూర్తినిచ్చిన తీరు గుర్తుకొస్తున్నాయని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పెద్ది రెడ్డి పేర్కొన్నారు. భావితరాలకు తప్పనిసరిగా ఇదొక స్ఫూర్తిదాయక ప్రాంతమౌతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఈ పార్కును అభివృద్ధి చేయడంలో సంస్థ ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూర, వారి బృంద సభ్యులు చేసిన కృషి ప్రశంసనీయం అన్నారు. మహాత్మా గాంధీ మన భారతదేశంలో జన్మించినా, శాంతి స్నేహం, సుహృద్భావం, అహింస అనే అంశాలే ఆశయాలుగా తన జీవితాన్ని దేశం కోసం త్యాగం చేసి ప్రపంచంలో ఒక ఆదర్శ పురుషుడిగా నిలిచిపోయారని గుంటూరు జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ పాత్తూరి నాగభూషణం అన్నారు. ఉత్తర అమెరికాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం మాట్లాడుతూ పచ్చని చెట్లతో, చక్కని నీటి వనరులతో శాంతికి ప్రతిరూపంగా ఈ గాంధీ మెమోరియల్ ను అత్యంత సుందర పర్యాటక కేంద్రం గా తీర్చిదిద్దిన తీరు ను చూసి ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమన్నారు. తీరికలేని పనులతో బిజీ గా ఉన్నప్పటికీ ప్రత్యేక శ్రద్ధతో ఈ గాంధీ మెమోరియల్ ను సందర్శించి జాతిపితకు నివాళులర్పించిన ఉభయ తెలుగు రాష్ట్రాల నేతలకు, స్థానిక ప్రముఖులైన వెంకట్ అబ్బూరు, మురళి వెన్నం, వినోద్ ఉప్పు తదితరులందరికీ సంస్థ అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. -
నిక్కీ హేలీకి డల్లాస్‌లో ఘన సన్మానం
డల్లాస్ : ఐరాసలో అమెరికా రాయబారిగా ఉన్న భారత సంతతికి చెందిన నిక్కీ హేలీకి మే 23న ఇర్వింగ్‌లోని ఫోర్ సీసన్స్ హోటల్లో ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్ షిప్ కౌన్సిల్ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఈ సన్మాన సభలో విప్రో సంస్థ సీఈఓ అభిదాలి నీమచ్ వాల, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ అర్లింగ్టన్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ విస్తాస్ప్ కర్భరి, టోమ్స్ ఆటో గ్రూప్ అధినేత బాబ్ టోమ్స్ లతో పాటూ స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్ షిప్ కౌన్సిల్ సంస్థ అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ తమ సంస్థ ఆహ్వానం పై నిక్కీ హేలీ డల్లాస్‌కి విచ్చేయడం ఇది ఆరవ సారని గతంలో సౌత్ కరోలినా రాష్ట్ర ప్రతినిధిగాను, గవర్నర్ అభ్యర్థి గాను, గవర్నర్ గాను, మహాత్మా గాంధీ మెమోరియల్ శంకుస్థాపనకు ముఖ్య అతిథిగాను, ప్రస్థుతం అమెరికా రాయబారిగాను విచ్చేసిన విషయాన్ని గుర్తుచేశారు. నిక్కీ హేలీ రాష్ట్ర ప్రతినిధి గాను, గవర్నర్ గాను, సౌత్ కరోలినా రాష్ట్ర అభివృద్ధికి ఎనలేని కృషి చేసి, రాష్ట్ర చరిత్ర లో మునుపెన్నడూ లేని విధంగా వేలాది ఉద్యోగాలను సృష్టించారని కొనియాడారు. అమెరికాలో ఉన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో పార్టీలకు అతీతంగా ఇరువర్గాలను కలుపుకుపోయే రాజకీయ నాయకులు అవసరమని, అందులోనూ ముఖ్యంగా నేర్పరితనంతో పాటు ధైర్యం, ఓర్పుతో ఉన్న దేశభక్తి, దయాగుణం ఉన్నా అవసరమైనప్పుడు అత్యంత కఠినంగా వ్యవహరించే నాయకులు కావాలని ఆ లక్షణాలన్నీ నిక్కీ హేలీ లో ఇమిడి ఉన్నాయని ప్రసాద్ తోటకూర ప్రశంసించారు. డా. ప్రసాద్ తోటకూర తన ఉపన్యాసాన్ని కొనసాగిస్తూ అమెరికా దేశాభివృద్ధి లో ప్రవాస భారతీయుల పాత్ర ఎంతో కీలకమైనదని పేర్కొన్నారు. భారత సంతతికి చెందిన టెక్నాలజీ కంపెనీ అధినేతలు అమెరికా దేశంలో నాలుగు లక్షలకు పైగా ఉద్యోగాలను కల్పించారన్నారు. 20 బిలియన్ డాలర్లను పన్ను రూపంలో అమెరికా ప్రభుత్వానికి చెల్లించారని, అంతేకాకుండా వివిధ అమెరికా విశ్వవిద్యాలయాలలో సుమారు రెండు లక్షలకు పైగా ఉన్న భారతీయ విద్యార్థులు చెల్లించే ఫీజులు అమెరికా విద్యా వ్యవస్థ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతోందని తెలిపారు. 2015-16 ఆర్ధిక సంవత్సరంలో ప్రవాస భారతీయులందరూ కలిపి అమెరికా ఆర్ధిక వ్యవస్థకు 2 ట్రిలియన్ డాలర్లకు పైగా సమకూర్చారని, ప్రస్తుతం భారత అమెరికా దేశాల మధ్య వాణిజ్యం 140 బిల్లియన్ డాలర్లకు చేరుకుందన్నారు. నిక్కీ హేలీ మాట్లాడుతూ తాను అమెరికా దేశంలో పుట్టినా, తన తల్లిదండ్రులు 50 సంవత్సరాల క్రితం పంజాబ్ రాష్ట్రం నుంచి వలస వచ్చి అమెరికా దేశంలో స్థిరపడ్డారన్నారు. భారత సంతతికి చెందిన వ్యక్తినని చెప్పుకోవడానికి తానూ ఎంతో గర్వపడతానన్నారు. అమెరికాలో ప్రవాస భారతీయుల పాత్ర ఎంతో ఘనమైనదని, విద్యాధికులుగా, సాంకేతిక పరిజ్ఞాన రంగ నిపుణులుగా అన్ని రంగాలలోను ప్రముఖ స్థానాల్లో ఉన్నారని ప్రశంసించారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే భారత్, అమెరికాల మధ్య ఆర్ధిక, వాణిజ్య, సాంకేతిక, రక్షణ విభాగాలలో అనేక కీలక ఒప్పందాలు ఇరుదేశాల బంధాన్ని మరింత దృఢతరం చేస్తున్నాయని చెప్పారు. అంతేకాకుండా ఇరుదేశాలు ఉగ్రవాద దాడులను చవిచూసినవే కనుక ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో తమ వంతు కృషిని కలసి కొనసాగిస్తాయని తెలియజేశారు. దక్షిణ ఆసియా దేశాలలో శాంతి, సుహృద్భావ వాతావరణానికై అమెరికా ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని, ఉగ్రవాదులకు స్థావరం కల్పిస్తున్న పాకిస్తాన్ లాంటి దేశాలను ఉపేక్షించే సమస్యే లేదని హెచ్చరించారు. నిక్కీ హేలీ ప్రసంగానంతరం ప్రేక్షకులు అడిగిన - "అమెరికా నార్త్ కొరియా అధ్యక్షుల సమావేశం జరుగుతుందా?", "అమెరికా దేశ అభివృద్ధిలో దక్షిణ ఆసియా వాసుల పాత్ర?", "ప్రస్తుత అమెరికా ఇరాన్ దేశ సంబంధాలు?", "హెచ్-4 వీసాల రద్దు, హెచ్-1 బి వీసాల పై నియంత్రణ?", "జెరూసలేం లో అమెరికా దౌత్య కార్యాలయం ప్రారంభించటంతో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులు?" మొదలైన ప్రశ్నలకు అనర్గళంగా, చమత్కారంగా నిక్కి హేలీ సమాధానమిచ్చారు. చివరిగా మీరు త్వరలో అమెరికా అధ్యక్ష పదవి బరిలోకి దిగపోతున్నారా? అని డాక్టర్ ప్రసాద్ తోటకూర అడిగినప్పుడు ఇప్పుడు తన ధ్యాసంతా ప్రస్తుత ఉద్యోగ బాధ్యతల పైనే అని చిరునవ్వుతో సమాధానం చెప్పారు. ఎంతో తీరికలేని సమయంలో కూడా తమ ఆహ్వానాన్ని మన్నించి ఈ సమావేశానికి విచ్చేసినందుకు నిక్కీ హేలీకి, అత్యధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేసిన అతిథులందరికీ డా. ప్రసాద్ తోటకూర ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్ షిప్ కౌన్సిల్ బోర్డు సభ్యులు రావు కల్వల, డా. సి.ఆర్. రావు, పీయూష్ పటేల్, మురళి వెన్నం, రాంకీ చేబ్రోలు, డా. సత్ గుప్త, తాయబ్ కుండావాలాలు నిక్కీ హేలీకి పుష్పగుచ్ఛం అందజేసి, దుశ్శాలువాతో ఘనంగా సత్కరించగా, డా. ప్రసాద్ తోటకూర ఆమెకు ప్రత్యేక మెమెంటోను బహుకరించారు. -
అమెరికాలో భారతీయులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
డల్లాస్ (టెక్సాస్) : ఇటీవల కాన్సాస్ లో జరిగిన కాల్పుల సంఘటన దురదృష్టకరమని 'ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్ షిప్ కౌన్సిల్' జాతీయ సంఘానికి అధ్యక్షులు, తానా మాజీ అధ్యక్షులు డాక్టర్. ప్రసాద్ తోటకూర పేర్కొన్నారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలను కోల్పోయిన శ్రీనివాస్ కూచిబొట్ల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఇదే సంఘటనలో గాయపడిన అలోక్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తన ప్రాణాలు సైతం పణంగా పెట్టి ఎంతో సాహసోపేతంగా అలోక్ రెడ్డి ప్రాణాన్ని కాపాడిన ఇయాన్ గ్రిల్లాట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్ షిప్ కౌన్సిల్ తరపున అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తోపాటూ ఇటీవల యూఎస్ కాంగ్రెస్ కు ఎన్నికైన భారత సంతతికి చెందిన కమల హారిస్, ప్రమీల జయపాల్, రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, డాక్టర్. అమీ బెరాలకు ఈ దాడులను తీవ్రంగా పరిగణించి, మున్ముందు ఇలాంటివి జరగకుండా కఠిన చట్టాలను అమలు చేయాలని లేఖ రాశారు. ఇటీవలి కాలంలో ఇలాంటి దాడులు పెరుగుతున్న నేపథ్యంలో భారతీయ అమెరికన్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 1. ఇరుగు పొరుగు వారితో పరిచయం: ► కనీసం మీ ఇంటి చుట్టుపక్కల నివసిస్తున్న వారి పేర్లు , వివరాలు తెలుసుకోండి. ► వారిని మీరు జరుపుకొనే కొన్ని భారతీయ సంప్రదాయ వేడుకులకు ఆహ్వానించి మన సంస్కృతితో అనుబంధం ఏర్పాటు చేయండి. ► వీకెండ్ పార్టీలు, విందులు, వినోదాలు చేసుకుంటున్నప్పుడు లౌడ్ మ్యూజిక్ పాటలతో మీ ఇరుగు పొరుగు వారికి అసౌకర్యం కలిగించకండి. ► తెల్లవారకముందే శబ్దంతో మీ గార్డెన్ , లాన్ మొయింగ్ పరికరాలతో ఇతరుల నిద్రకు భంగం కలిగించకండి. ► మీ కార్లు, మీ అతిథుల కార్లను మీ ఇరుగు పొరుగు వాళ్ల ఇంటి రాకపోకలకు ఇబ్బంది కలగకుండా పార్కింగ్ చేయండి. 2. అమెరికా జాతీయ జెండాను ఎల్లప్పుడు గౌరవించడం: ► ఎప్పుడూ భారతదేశపు జెండాను ఒంటరిగా ఎగరవేయకండి. దాని పక్కనే అమెరికన్ జాతీయ జెండాను కూడా ఎగరవేయండి. ► ఇరు దేశాల జెండాలను ఎగరవేసేటప్పుడు, జాతీయ గీతాలను ఆలాపించేటప్పుడు నిర్దిష్టమైన నియమావళిని పాటించండి. ► ఎల్లప్పుడూ అమెరికా రాజ్యాంగానికి, చట్టాలకు కట్టుబడి ఉండండి. 3. దుస్తులను ధరించే విధానం: ► మనం ధరించే దుస్తులు బహిరంగ ప్రదేశాల్లో ఇతరులకు వింతగా, ఇబ్బంది కలిగించే విధంగా ఉండనివ్వకండి. 4. ఇతరుల శాంతికు భంగం కలిగించకండి: ► కొన్ని సందర్భాలలో ప్రముఖ రాజకీయ నాయకులు, సినిమా నటీనటులు వచ్చినప్పుడు అత్యుత్సాహముతో కేరింతలు, నినాదాలు, బ్యానర్లు, ర్యాలీలతో వందల కొద్దీ సమూహంగా చేరి వారు బస చేస్తున్న హోటళ్లలోనూ, సినిమా హాళ్లలోనూ, ప్రధాన బహిరంగ వేదికల వద్ద నినాదాలతో హోరెత్తించడం తగని చర్య. ఇలాంటి కొన్ని సందర్భాలలో పోలీసులు వచ్చి అందరిని చెల్లాచెదురు చేసిన సంఘటనలు మన గౌరవ ప్రతిష్టను దెబ్బ తీశాయి. 5. భారత దేశం నుంచి వచ్చే సందర్శకులు: తమ కుటుంబసభ్యులను చూడటానికి వచ్చే తల్లిదండ్రులకు, అతిథులకు ముందు గానే ఆమెరికా సంస్కృతీ సంప్రదాయాల పట్ల ఒక రకమైన అవగాహన కల్పించడం విధిగా చేయవలసిన పని. ఉదాహరణకు: ► అమెరికన్ల వైపు ముఖ్యంగా వారు స్విమ్ దుస్తుల్లో ఉన్నప్పుడు తదేకంగా వారి వైపు చూడటం గాని, వారిపై అపహాస్యంగా నవ్వడంగాని, పరాయి భాషలో మాట్లాడటం గాని తగని పని. ► అలవాటు ప్రకారం పిల్లలు ముద్దుగా ఉన్నారు కదా అని అమెరికన్ చిన్న పిల్లలను పట్టుకోవడం, ముద్దాడటం, మన తినుబండారాలు పెట్టడం చేయకూడదు. ► భారతదేశం నుంచి వచ్చిన తల్లిదండ్రులు / అతిథులు ను మన చుట్టూ ఉన్న పరిసరాలకు అలవాటు పడేవరకు ఒంటరిగా వదలకండి. 6. గుర్తింపు కార్డు: ► ఎల్లప్పుడూ మీ చట్టపరమైన పాస్ పోర్ట్ లేదా ఐడి కాపీలను , సెల్ ఫోన్‌ను అందుబాటులో మీ దగ్గరే ఉంచుకోండి. ► ఎల్లప్పుడూ పోలీసు, భద్రతాధికారుల సూచనలను అనుసరించండి. 7. వికలాంగ సంబంధిత: ► వికలాంగులకు కేటాయించిన స్థానాలను వారికే వదిలేయండి. ► కొన్ని నిముషాలకైనా వారి పార్కింగ్ స్థానాలను ఉపయోగించకండి. ► వాహనాలను నడిపేటప్పుడు పాదచారులకు ఎప్పుడు దారి ఇవ్వండి. ► పాఠశాల దగ్గర వేగ పరిమితుల ను అనుసరించండి. ► అడ్డదిడ్డంగా రోడ్లను దాట రాదు. 8. సామాజిక ప్రవర్తన: ► ఎల్లప్పుడూ వాస్తవాలను మాత్రమే చెప్పండి. ► సంబంధిత అధికారుల తో వ్యవహరించేటప్పుడు వారికి చాలా గౌరవ మర్యాదలు ఇవ్వండి. న్యాయం మీ పక్షాన ఉన్నప్పటికీ మీరు చెప్పే విషయం సరైనది అయినప్పటికీ అవతల వారితో ఎటువంటి వాదనకు, ఘర్షణకు దిగకండి. ► విమానాశ్రయాలు, రెస్టారెంట్లు, బార్లు, పార్కులు తదితర ప్రాంతాల్లోఎప్పుడూ జోక్స్, తమాషాలు చేయకండి. ► బహిరంగ ప్రదేశాల్లో మందు తాగడం, గట్టిగా అరవడం, మాట్లాడటం చేయడం చట్ట విరుద్ధం. ► మనకున్న మత / ఆధ్యాత్మిక స్వేచ్ఛను సద్వినియోగ పరచుకుంటూనే ఇతరుల మనోభిప్రాయాలకు విఘాతం కలగకుండా చూడండి. ► అర్థరాత్రుల వరకు బార్లు, రెస్టారెంట్లు, పబ్బులలో ఉండడం నివారించండి. 9. సాంఘిక ప్రసార మాధ్యమం ► సాంఘిక ప్రసార మాధ్యమాలైన వాట్సాప్ , ఫేస్ బుక్ , ట్విట్టర్ లలో ఈమెయిల్స్ , మెసేజెస్ ద్వారా పుకార్లను సరదాకు అయినా వ్యాప్తి చేయరాదు. ► అశ్లీల వెబ్ సైట్లలలో చాట్ చేయరాదు. అలా చేసిన వారిని రహస్యంగా అధికారులు పట్టుకొని వెంటనే దేశమునుండి బహిష్కరించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. 10. చట్టపరమైన హక్కులు: ► మీ ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతున్నదని భావించినప్పుడు చట్టాలను ఆశ్రయించండి. ► మిమ్మల్ని మీరు రక్షించు కొనే పరిస్థితిలో లేకపోతే వాటిని ఎదుర్కొనేందుకు ఎటువంటి వాదనకు, ఘర్షణలకు, సాహసాలకు పోకండి. ► మీ దగ్గర ఉన్న నగదు, విలువైన వస్తువులు కన్నా ఎల్లప్పుడూ మీ ప్రాణం అత్యంత విలువైనదని భావించండి. 11. చట్ట వ్యతిరేకపు ప్రవర్తన: ► వైద్య, ఆరోగ్య, న్యాయ, ఆర్ధిక, ఐటి రంగాలలో ఉన్న ప్రముఖులు కొంత మంది దురాశకు పోయి చట్ట వ్యతిరేక పనులకు పాల్పడి, ఆర్ధిక నేరాల్లో ఇరుక్కొని జైళ్లలో మగ్గుతున్న వారు ఎందరో ఉన్నారు. ► అమెరికా లో అక్రమంగా నివసించే వారికి ఎటువంటి ఆశ్రయం ఇవ్వడం కానీ, ఉద్యోగంలో పెట్టడం కానీ చేయకూడదు. ఇలాంటి ఘటనలకు పాల్పడితే దేశం నుంచి వెనువెంటనే వారిని బయటకు పంపుతారు/బహిష్కరిస్తారు. 12. వ్యక్తిగత భద్రత: ► ఎల్లప్పుడూ ఇంటి తలుపులు వేసుకొని ఉండండి. ► ఎవరైనా తెలియనివారు, క్రొత్త వారు వచ్చినప్పుడు తలుపు తీయకండి. ► అతి తక్కువ సమయానికి ఇంటి నుండి బయటకు వెళ్ళవలసివచ్చినప్పుడు ఇంటికి సంబంధించిన భద్రత అలారం ను ఆన్ చేయాలి. ► పార్టీలకు, శుభ కార్యాలకు వెళ్ళినప్పుడు మనకు బంగారం బాగా ధరించడం అలవాటు. ఇది మన భద్రతకు చాలా ముప్పు. అమెరికాలో ప్రస్తుతం కొనసాగుతున్న ఎన్నో వేలాది దొంగతనాలు జరగడానికి ఇదొక కారణం. కాబట్టి, మన విలువైన వస్తువులను, బంగారు నగలను బ్యాంకు లాకర్ లలో సంరక్షించుకోవాలి. ► ఇంటి బయటకు కానీ, లోపలకు కాని వచ్చేటప్పుడు మన పరిసర ప్రాంతాలను జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. 13. పిల్లల సంరక్షణ: ► మన కోపాన్ని, విసుగును, నిరాశ ను మన పిల్లల మీద చూపించకండి. ► పిల్లలను ఏనాడూ కొట్టడం లాంటివి చేయకండి. ► పిల్లలను ఒంటరిగా ఏనాడూ ఇంట్లో వదలరాదు. అలాగే బయటకు వెళ్ళినప్పుడు మన వాహనాలలో కొన్ని నిముషాలకైనా సరే, వాళ్ళని ఒంటరిగా వదిలేయకండి. ► పిల్లల పై దురుసుగా ప్రవర్తిస్తే, పిల్లల రక్షిత సేవా సంస్థ (చైల్డ్ ప్రొటెక్టీవ్ సర్వీసెస్) వారు పిల్లలను తీసుకొని వెళ్లి పోతారు. పేరెంట్స్ ను కూడా శిక్షిస్తారు. 14. పౌరులుగా మన భాద్యత: ► మనం అమెరికాలోనే స్థిరపడటానికి నిర్ణయం తీసుకున్నాం కాబట్టి, ఈ దేశపు జన జీవన స్రవంతిలో మనము కలిసిపోవాలి. ►మన దేశపు సంప్రదాయ విలువలను కాపాడుతూ, వాటిని పాటిస్తూనే, ఇక్కడి సమాజంలో ఇమడగలగాలి. ►స్థానిక అధికారులు, రాజకీయ నాయకులతో పరిచయం కలిగి ఉండండి. ►అలాగే మనము కొంత సమయాన్ని స్వచ్ఛందంగా సామజిక సేవ కోసం కేటాయించగలగాలి. ఉదాహరణకు వివిధ పాఠశాలలో, గ్రంథాలయాల్లో, ఆసుపత్రుల్లో, ప్రభుత్వ కార్యకలాపాలలో పాలుపంచుకోవడానికి స్వచ్ఛదంగా కృషి చేయాలి. సంబంధిత వార్తా కథనాలకై చదవండి.. రక్షించేందుకు కాల్పులకు ఎదురెళ్లిన హీరో ఇతడే ‘కాలుస్తుంటే ఏదో ఒకటి చేయాలనిపించింది’ శ్రీనివాస్ మృతిపట్ల యూఎస్ కంపెనీ తీవ్ర దిగ్భ్రాంతి అమెరికాలో జాతి విద్వేష కాల్పులు శ్రీనివాస్ కుటుంబానికి ఎన్ఆర్ఐల బాసట అమెరికాలో ప్రమాదం ఇలా తప్పించుకోండి -
అమెరికా ఎన్నికల్లో మనోళ్ల హవా
అమెరికా రాజకీయ చరిత్రలోనే ఇప్పటివరకు ఎన్నడూ లేనంతగా.. ఆరుగురు భారత సంతతివారు ఎన్నికయ్యారు. విజేతలకు ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ (ఐఏఎఫ్‌సీ) అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ అభినందనలు తెలిపారు. రాజా కృష్ణమూర్తి, పరిమళా జయపాల్, రో ఖన్నా, అమి బెరా, తులసీ గబ్బర్డ్, కమలా హ్యారిస్ ఈసారి ఎన్నికయ్యారు. అమెరికా రాజకీయాలలో ఉన్న భారత సంతతి అమెరికన్లు రెండు దేశౄల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో భాగంగా ఐఏఎఫ్‌సీ వారితో కలిసి కృషిచేస్తుంది. పార్టీలతో సంబంధం లేకుండా భారతీయ అమెరికన్లు ఎన్నికల్లో గెలిచేందుకు కూడా కృషిచేస్తుంది. విజేతల వివరాలు ఇలా ఉన్నాయి. రాజా కృష్ణమూర్తి (43) : ఢిల్లీలో పుట్టిన ఈయన.. ప్రిన్స్టన్ యూనివర్సిటీతో పాటు హార్వర్డ్ లా స్కూల్లో చదివారు. శివానందన్ ల్యాబొరేటరీస్, ఎపిసోలార్ ఇన్కార్పొరేటెడ్ సంస్థలకు ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఇల్లినాయిస్ ఎనిమిదో కాంగ్రెషనల్ జిల్లా నుంచి ఎన్నికయ్యారు. అమెరికా కాంగ్రెస్‌కు ఈయన ఎన్నిక కావడం ఇదే మొదటిసారి. డెమొక్రాటిక్ పార్టీ తరఫున పోటీచేసిన ఈయనకు 58 శాతం మెజారిటీ వచ్చింది. పరిమళా జయపాల్ (51) : చెన్నైలో పుట్టిన ఈయన.. నార్త్‌వెస్ట్రన్ యూనివర్సిటీలో చదివారు. ఫైనాన్షియల్ అనలిస్టు అయిన ఈయన.. వాషింగ్టన్ ఏడో కాంగ్రెషనల్ జిల్లా నుంచి పోటీచేసి తొలిసారి గెలిచారు. ఈయనకు తన రిపబ్లికన్ ప్రత్యర్థిపై 57 శాతం మెజారిటీ వచ్చింది. రో ఖన్నా (40) : ఫిలడెల్ఫియాలో పుట్టిన ఈయన.. యేల్ లా స్కూలు నుంచి పట్టభద్రులయ్యారు. వృత్తిరీత్యా న్యాయవాది అయన ఖన్నా, కాలిఫోర్నియా 17వ కాంగ్రెషనల్ జిల్లా నుంచి డెమొక్రాటిక్ పార్టీ తరఫున 60 శాతం మెజారిటీతో నెగ్గారు. డాక్టర్ అమి బెరా (61) : లాస్ ఏంజెలిస్‌లో పుట్టిన బెరా కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి పట్టభద్రులయ్యారు. వృత్తిరీత్యా వైద్యుడు. ఈయన కాలిఫోర్నియా ఏడో కాంగ్రెషనల్ జిల్లా నుంచి పోటీ చేసి, మూడోసారి డెమొక్రాటిక్ అభ్యర్థిగా 51 శాతం మెజారిటీతో నెగ్గారు. తులసీ గబ్బర్డ్ (35) : అమెరికాలోని లెలోవాలోవాలో పుట్టిన ఈమె.. హవాయి పసిఫిక్ యూనివర్సిటీ నుంచి పట్టభద్రురాలయ్యారు. తులసికి భారతీయ మూలాలు లేకపోయినా.. అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన మొదటి హిందువు ఈమె. కమలా హ్యారిస్ (52) : కాలిఫోర్నియాలోని ఓక్లాండ్లో పుట్టిన ఈమె యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి పట్టభద్రురాలయ్యారు. ప్రస్తుతం కాలిఫోర్నియా రాష్ట్ర అటార్నీ జనరల్ అయిన ఈమె.. కాలిఫోర్నియా సెనేటర్‌గా తొలిసారి పోటీచేసి 63 శాతం మెజారిటీతో నెగ్గారు. ఈమె తల్లి డాక్టర్ శ్యామలా గోపాలన్ భారతీయురాలు. ఆమె రొమ్ము కేన్సర్ నిపుణురాలు. తండ్రి డోనాల్డ్ హ్యారిస్ జమైకన్ అమెరికన్ పౌరుడు. ఆయన స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్ -
అధ్యక్ష ఎన్నికలపై ఐఏఎఫ్‌సీ ప్యానల్ డిస్కషన్
డల్లాస్: ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్(ఐఏఎఫ్‌సీ) ఆధ్వర్యంలో 'యూఎస్ పాలిటిక్స్ అండ్ రోల్ ఆఫ్ ఇండియన్ అమెరికన్స్' అనే అంశంపై చర్చ జరిగింది. అమెరికా అధ్యక్ష పదవికి త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇర్వింగ్‌లోని టచ్ నైన్ రెస్టారెంట్లో ఐఏఎఫ్‌సీ నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలు అంశాలను లోతుగా చర్చించారు. ఐఏఎఫ్‌సీ ప్రెసిడెంట్ డాక్టర్. ప్రసాద్ తోటకూర సమన్వయ కర్తగా వ్యవహరించిన 14 మంది సభ్యుల ప్యానల్ డిస్కషన్లో కొందరు డెమోక్రటిక్ పార్టీని, మరికొందరు రిపబ్లికన్ పార్టీని సపోర్ట్ చేస్తూ చర్చలో పాల్గొనగా.. ఇంకొందరు తటస్థంగా వ్యవహరిస్తూ చర్చను ముందుకు తీసుకెళ్లారు. ముందుగా ఐఏఎఫ్‌సీ టెక్సాస్ స్టేట్ చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ రావు కాల్వల డిస్కషన్‌ను ప్రారంభిస్తూ.. ఎకానమి, హెల్త్ కేర్, ఐటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్ఆర్ఐ లాంటి చర్చలోని ప్రధాన అంశాలను గూర్చి వివరించారు. అనంతరం ఐఏఎఫ్‌సీ ప్రెసిడెంట్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. ఇప్పటివరకూ ఎన్నికైన 44 మంది అమెరికా అధ్యక్షుల్లో.. 18 మంది రిపబ్లికన్ పార్టీ తరఫున, 15 మంది డెమోక్రటిక్ పార్టీ తరఫున ఎన్నికవగా.. 11 మంది ఇతర పార్టీల నుంచి ఎన్నికయ్యారని తెలిపారు. నవంబర్ 8న జరగనున్న ఎన్నికల్లో ఈ సారి అమెరికా అధ్యక్షుడు ఎవరా అనే దానిపై ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుందన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ఇండో- అమెరికా సంబంధాల బలోపేతానికి కృషిచేసే అభ్యర్థులకు ఐఏఎఫ్‌సీ సపోర్ట్ ఉంటుందని ఆయన తెలిపారు. ఎన్ఆర్ఐ ఓటర్లు నవంబర్ 8న తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రసాద్ తోటకూర సూచించారు. -
ఓసీఐ వర్క్ షాప్ సక్సెస్
టెక్సాస్: డల్లాస్‌లో డీఎఫ్డబ్ల్యూలో ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్(ఐఏఎఫ్‌సీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓవర్సీస్ సిటిజెన్స్ ఆఫ్ ఇండియా(ఓసీఐ) వర్క్ షాప్ విజయవంతమైంది. ఇండియన్ అసోసియేషన్ నార్త్ టెక్సాస్(ఐఏఎన్టీ), డీఎఫ్డబ్ల్యూలోని ప్రవాసభారతీయుల కమ్యునిటీల సహకారంతో కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా(సీజీఐ) (హూస్టన్)లో ఆగష్టు20న(శనివారం) ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. భారీ ఎత్తున ప్రవాస భారతీయులు ఈ వర్క్ షాప్‌కు హాజరయ్యారు. కాన్సుల్ ఆర్.డీ. జోషీ, రాకేష్ శర్మ, చంద్రసేన్లు తమ అమూల్యమైన సలహాలను అందించారు. ఈ కార్యక్రమానికి కావల్సిన అన్ని ఏర్పాట్లను తయ్యబ్ కుందావాలా- ఎక్సిగ్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఏఎఫ్‌సీ చూసుకున్నారు. ప్రసాద్ తోటకూర-ఐఏఎఫ్‌సీ ప్రెసిడెంట్, నరసింహ భక్తుల-ఐఏఎన్టీ సెక్రటరీ, శైలేష్ షా-ఐఏఎన్టీ బోర్డు ఆఫ్ డైరెక్టర్, ముజీబ్ సయ్యద్- నజీం బోర్డు ఆఫ్ డైరెక్టర్, అబిద్ అబేడీ, ఇందు మందాడి, సల్మాన్ ఫర్షోరీ, షబ్నమ్ మోడ్గిల్, సుధీర్ పరీక్, జాక్ గోద్వానీలు ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి తమ వంతు కృషి చేశారు. -
అనుపమ్ రేకు ఐఏఎఫ్‌సీ స్వాగతం
హూస్టన్:అమెరికాలో భారత కౌన్సిల్ జనరల్ ఆఫ్ ఇండియా(సీజీఐ)గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన డాక్టర్. అనుపమ్ రే ను ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్ షిప్ కౌన్సిల్(ఐఎఎఫ్ సీ) ఘనంగా స్వాగతించింది. ఐఏఎఫ్‌సీ అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర ఈ సందర్భంగా ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్ షిప్ కౌన్సిల్ గురించి అనుపమ్ రే కు వివరించారు. భారతీయ అమెరికన్లు మాతృభూమి అభివృద్ధికి తోడ్పడడానికి కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. త్వరలో కౌన్సిల్ ఆధ్వర్యంలో డాల్లస్ లో నిర్వహించబోతున్న కార్యక్రమానికి అనుపమ్ రే ను ఆహ్వానించారు.