డల్లాస్ : ఐరాసలో అమెరికా రాయబారిగా ఉన్న భారత సంతతికి చెందిన నిక్కీ హేలీకి మే 23న ఇర్వింగ్లోని ఫోర్ సీసన్స్ హోటల్లో ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్ షిప్ కౌన్సిల్ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఈ సన్మాన సభలో విప్రో సంస్థ సీఈఓ అభిదాలి నీమచ్ వాల, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ అర్లింగ్టన్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ విస్తాస్ప్ కర్భరి, టోమ్స్ ఆటో గ్రూప్ అధినేత బాబ్ టోమ్స్ లతో పాటూ స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.
ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్ షిప్ కౌన్సిల్ సంస్థ అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ తమ సంస్థ ఆహ్వానం పై నిక్కీ హేలీ డల్లాస్‌కి విచ్చేయడం ఇది ఆరవ సారని గతంలో సౌత్ కరోలినా రాష్ట్ర ప్రతినిధిగాను, గవర్నర్ అభ్యర్థి గాను, గవర్నర్ గాను, మహాత్మా గాంధీ మెమోరియల్ శంకుస్థాపనకు ముఖ్య అతిథిగాను, ప్రస్థుతం అమెరికా రాయబారిగాను విచ్చేసిన విషయాన్ని గుర్తుచేశారు. నిక్కీ హేలీ రాష్ట్ర ప్రతినిధి గాను, గవర్నర్ గాను, సౌత్ కరోలినా రాష్ట్ర అభివృద్ధికి ఎనలేని కృషి చేసి, రాష్ట్ర చరిత్ర లో మునుపెన్నడూ లేని విధంగా వేలాది ఉద్యోగాలను సృష్టించారని కొనియాడారు. అమెరికాలో ఉన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో పార్టీలకు అతీతంగా ఇరువర్గాలను కలుపుకుపోయే రాజకీయ నాయకులు అవసరమని, అందులోనూ ముఖ్యంగా నేర్పరితనంతో పాటు ధైర్యం, ఓర్పుతో ఉన్న దేశభక్తి, దయాగుణం ఉన్నా అవసరమైనప్పుడు అత్యంత కఠినంగా వ్యవహరించే నాయకులు కావాలని ఆ లక్షణాలన్నీ నిక్కీ హేలీ లో ఇమిడి ఉన్నాయని ప్రసాద్ తోటకూర ప్రశంసించారు.
డా. ప్రసాద్ తోటకూర తన ఉపన్యాసాన్ని కొనసాగిస్తూ అమెరికా దేశాభివృద్ధి లో ప్రవాస భారతీయుల పాత్ర ఎంతో కీలకమైనదని పేర్కొన్నారు. భారత సంతతికి చెందిన టెక్నాలజీ కంపెనీ అధినేతలు అమెరికా దేశంలో నాలుగు లక్షలకు పైగా ఉద్యోగాలను కల్పించారన్నారు. 20 బిలియన్ డాలర్లను పన్ను రూపంలో అమెరికా ప్రభుత్వానికి చెల్లించారని, అంతేకాకుండా వివిధ అమెరికా విశ్వవిద్యాలయాలలో సుమారు రెండు లక్షలకు పైగా ఉన్న భారతీయ విద్యార్థులు చెల్లించే ఫీజులు అమెరికా విద్యా వ్యవస్థ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతోందని తెలిపారు. 2015-16 ఆర్ధిక సంవత్సరంలో ప్రవాస భారతీయులందరూ కలిపి అమెరికా ఆర్ధిక వ్యవస్థకు 2 ట్రిలియన్ డాలర్లకు పైగా సమకూర్చారని, ప్రస్తుతం భారత అమెరికా దేశాల మధ్య వాణిజ్యం 140 బిల్లియన్ డాలర్లకు చేరుకుందన్నారు.
నిక్కీ హేలీ మాట్లాడుతూ తాను అమెరికా దేశంలో పుట్టినా, తన తల్లిదండ్రులు 50 సంవత్సరాల క్రితం పంజాబ్ రాష్ట్రం నుంచి వలస వచ్చి అమెరికా దేశంలో స్థిరపడ్డారన్నారు. భారత సంతతికి చెందిన వ్యక్తినని చెప్పుకోవడానికి తానూ ఎంతో గర్వపడతానన్నారు. అమెరికాలో ప్రవాస భారతీయుల పాత్ర ఎంతో ఘనమైనదని, విద్యాధికులుగా, సాంకేతిక పరిజ్ఞాన రంగ నిపుణులుగా అన్ని రంగాలలోను ప్రముఖ స్థానాల్లో ఉన్నారని ప్రశంసించారు.
ప్రజాస్వామ్యాన్ని గౌరవించే భారత్, అమెరికాల మధ్య ఆర్ధిక, వాణిజ్య, సాంకేతిక, రక్షణ విభాగాలలో అనేక కీలక ఒప్పందాలు ఇరుదేశాల బంధాన్ని మరింత దృఢతరం చేస్తున్నాయని చెప్పారు. అంతేకాకుండా ఇరుదేశాలు ఉగ్రవాద దాడులను చవిచూసినవే కనుక ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో తమ వంతు కృషిని కలసి కొనసాగిస్తాయని తెలియజేశారు. దక్షిణ ఆసియా దేశాలలో శాంతి, సుహృద్భావ వాతావరణానికై అమెరికా ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని, ఉగ్రవాదులకు స్థావరం కల్పిస్తున్న పాకిస్తాన్ లాంటి దేశాలను ఉపేక్షించే సమస్యే లేదని హెచ్చరించారు.
నిక్కీ హేలీ ప్రసంగానంతరం ప్రేక్షకులు అడిగిన - "అమెరికా నార్త్ కొరియా అధ్యక్షుల సమావేశం జరుగుతుందా?", "అమెరికా దేశ అభివృద్ధిలో దక్షిణ ఆసియా వాసుల పాత్ర?", "ప్రస్తుత అమెరికా ఇరాన్ దేశ సంబంధాలు?", "హెచ్-4 వీసాల రద్దు, హెచ్-1 బి వీసాల పై నియంత్రణ?", "జెరూసలేం లో అమెరికా దౌత్య కార్యాలయం ప్రారంభించటంతో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులు?" మొదలైన ప్రశ్నలకు అనర్గళంగా, చమత్కారంగా నిక్కి హేలీ సమాధానమిచ్చారు. చివరిగా మీరు త్వరలో అమెరికా అధ్యక్ష పదవి బరిలోకి దిగపోతున్నారా? అని డాక్టర్ ప్రసాద్ తోటకూర అడిగినప్పుడు ఇప్పుడు తన ధ్యాసంతా ప్రస్తుత ఉద్యోగ బాధ్యతల పైనే అని చిరునవ్వుతో సమాధానం చెప్పారు.
ఎంతో తీరికలేని సమయంలో కూడా తమ ఆహ్వానాన్ని మన్నించి ఈ సమావేశానికి విచ్చేసినందుకు నిక్కీ హేలీకి, అత్యధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేసిన అతిథులందరికీ డా. ప్రసాద్ తోటకూర ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్ షిప్ కౌన్సిల్ బోర్డు సభ్యులు రావు కల్వల, డా. సి.ఆర్. రావు, పీయూష్ పటేల్, మురళి వెన్నం, రాంకీ చేబ్రోలు, డా. సత్ గుప్త, తాయబ్ కుండావాలాలు నిక్కీ హేలీకి పుష్పగుచ్ఛం అందజేసి, దుశ్శాలువాతో ఘనంగా సత్కరించగా, డా. ప్రసాద్ తోటకూర ఆమెకు ప్రత్యేక మెమెంటోను బహుకరించారు.
Comments
Please login to add a commentAdd a comment